బెల్ట్ షాపుల జోలికి వెళ్లొద్దు.. ఎక్సైజ్ శాఖకు ఎమ్మెల్యే వార్నింగ్
posted on Mar 30, 2021 @ 3:28PM
బెల్ట్ షాపులన్నీ మా కార్యకర్తలవే. వాటిని చూసీ చూడనట్టు వదిలేయండి. ఎక్సైజ్ సీఐ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలని హుకూం. బెల్టు షాపుల జోలికి ఎక్సైజ్ సిబ్బంది వెళ్లొద్దని ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రికి కూడా పంపుతాం. ఈ మాటలన్నీ అన్నది ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అది కూడా ఓ ఓపెన్ మీటింగ్‌లో. ఆ ఎమ్మెల్యే గారు చేసి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
బెల్ట్ షాపులను వదిలేయమంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేసింది ఖమ్మం జిల్లా వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్. మండలంలోని బెల్ట్ షాపులన్నీ టీఆర్ఎస్ కార్యకర్తలవేనని.. కాస్త చూసీ చూడనట్లు ఉండాలని అధికారులను ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ సీఐ క్యాంపు కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు. ఒక తీర్మానం చేసి సీఎం కేసీఆర్‌కు కూడా పంపుతామని రాములు నాయక్ అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే మెసేజ్‌కి మందుబాబులంతా చప్పట్లు కొడుతుంటే.. మహిళలు మాత్రం మండిపడుతున్నారు.