అమ్మాయిలూ.. రాహుల్ తో జాగ్రత్త!
posted on Mar 30, 2021 @ 3:28PM
కేరళలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. వ్యక్తిగత దూషణలతో కాక పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ యువరాజు, ఎంపీ రాహుల్ గాంధీపై కేరళకు చెందిన మాజీ స్వతంత్ర ఎంపీ జాయ్స్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీపీఎం అభ్యర్థి, మంత్రి ఎంఎం మణికి మద్దుతుగా నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీ పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆయన ముందు వంగకూడదని అన్నారు.
‘‘రాహుల్ గాంధీ ఎప్పుడూ అమ్మాయిల కాలేజీలకే వెళుతుంటారు. అక్కడికి పోయి వంగాల్సిందిగా అమ్మాయిలకు చెబుతుంటారు. అమ్మాయిలూ.. దయచేసి రాహుల్ ముందు వంగకండి. ఆయన ముందు అసలు నిలబడకండి. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు’’ అంటూ రాహుల్ ను ఉద్దేశించి.. ఇడుక్కీ మాజీ ఎంపీ కామెంట్ చేశారు. జార్జ్ మాటలకు పక్కనే ఉన్న మంత్రి ఎంఎం మణి నవ్వుతూ కనిపించారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో జార్జ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. జార్జ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. కేరళలో సీపీఎంకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించింది.