తెలుగు దేశం పార్టీ @40
'శ్రామికుడి చమట చుక్కల్లో నుంచి.. కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి.. రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటి చుక్కల నుంచి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నార్ధుల ఆక్రందనలోనుంచి పుట్టింది ఈ తెలుగు దేశం'
- ఇదీ నందమూరి తారక రామా రావు తొలిప్రసంగం
తెలుగుదేశం పార్టీ మరో మైలురాయిని దాటింది. తెలుగింటి ఇలవేలుపు నందమూరి తారకరామా రావు, తెలుగు వారి ఆత్మగౌరవ జెండాను ఎత్తిపట్టి, తెలుగు దేశం పార్టీని ప్రకటించి నేటికి (మార్చి 29) 39 ఏళ్ళు నిండాయి. 1982 మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్టీఆర్ పార్టీ పేరును ప్రకటించారు. టీడీపీ 40వ ఏట అడుగు పెట్టింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో టీడీపీఎన్నో ఎన్నెన్నో చారిత్రక పరిణామాలకు సాక్షీభూతంగా నిలిచింది.
నిజానికి ఒక చారిత్రిక అవసరంగా ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ చరిత్రనే సృష్టించింది.పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలలోనే,అధికారాన్ని కైవసం చేసుకుని ఓ చరిత్రను తిరగ రాసింది. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇంత తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన పార్టీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.
అలాగని నాలుగు పదులకు చేరుకున్న చరిత్రలో టీడీపీ ప్రస్థానం సాఫీగా సాగిందా అంటే, లేదు.ఎన్నోవిజయాలను సొంత చేసుకున్న పార్టీ మరెన్నో సంక్షోభాలను దాటుకుని ముందుకు సాగుతోంది. తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినపార్టీ, రెండు సంవత్సరాలు తిరగకుండానే తొలి సంక్షోభాన్ని ఎదుర్కుంది. ఆ తర్వతా ఎన్నో అటుపోట్లను ఎదుర్కుంది. అయినా,లేచి నిలబడింది.నిలతొక్కుకుంది.మళ్ళీ మళ్ళీ జైత్ర యాత్రను కొనసాగించింది. పార్టీ ప్రస్థానంలో సగానికంటే ఎక్కువ కాలం,సుమారు 22 సంవత్సరాలు అధికారంలో కొనసాగింది.అందులో ఏడేళ్ళు ఎన్టీఅర్ ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు, అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా మరో మారు, మొత్తం కొంచెం అటూ ఇటుగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఇదొక రికార్డ్,ఇంతవరకు ఇంత సుదీర్ఘకాలం మరెవ్వరూ పాలించలేదు.
రాష్ట్రంలోసుదీర్ఘకాలం అధికారంలో ఉండడమే కాదు, కేంద్రంలోనూ టీడీపీ చక్రం తిప్పింది. 13వ లోక్ సభలో 29లోక్ సభ స్థానాలు సాధించి, లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపింది. ఇక చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు.
ఎన్టీఅర్,’సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు’ అని ప్రకటించి ‘కిలో రెండు రూపాయలు బియ్యం’ వంటి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు, అంతవరకు, ‘రాజకీయ అంటరానితనానికి’ గురైన బడుగు బలహీన వర్గాలను చేరదీసి, వారికి రాజకీయ బిక్షను ప్రసాదించారు. ఈరోజు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కీలక పదవులలో ఉన్న అనేక మంది ఎన్టీఅర్ పుణ్యానే రాజకీయంగా ఎదిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది ఎన్టీఅర్ , తెలుగుదేశం పార్టీ, ఇది దేశం ప్రత్యర్ధులు, కూడా నేటికీ కాదనలేని నిజం.అప్పుడే కాదు ఇప్పడు కూడా, 'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు' అన్న పార్టీ మూల సిద్ధాంతాన్ని మరువకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలతో మమైకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది, తెలుగు దేశం పార్టీ ఒక్కటే.
మరోవైపు చద్రబాబు నాయుడు, ఎన్టీఅర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతూనే, తమ దార్శనికతతో రాష్ట్రాభి వృద్ధికి బాటలు వేశారు.పరిపాలనా,ఆర్థిక సంస్కరణలతో సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా, చేశారు. ఇటు ఐటీ రంగంలో అటు విద్యుత్, పరిశ్రమలు, చేతి వృత్తులు, ఇలా న్నిరంగాలలో సంస్కరణలు తెచ్చారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ సావీ’గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు, వ్యసాయ రంగాన్ని ఉపేక్షించారనే అపవాదు నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు. నిజానికి,చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని ఉపేక్షించారు అన్నదినిజం కాదు. ‘వ్యవసాయం దండగ’ అని ఆయన ఏనాడూ అనలేదు. అయినా ప్రత్యర్ధులు ఆయన అనని ఆ మాటను ఆయన నోట్లో పెట్టి దుష్ప్రచారం చేశారు.అలా చంద్రబాబు రైతు వ్యతిరేకి అనే ముద్ర వేశారు.
నిజానికి ఎన్టీఅర్ సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇస్తే, చంద్రబాబు అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించారు. ఐటీ సహా అనేక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి గుర్తింపు మాత్రమే కాదు గౌరవం ఖ్యాతి కూడా తెచ్చారు. అనేక ప్రపంచ సంస్థలు హైదరాబాద్’లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి అంటే అందుకు చంద్రబాబు వేసిన విత్తే కారణం. హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్’గ పెట్టుబడుల డెస్టినేషన్’గా అభివృద్ధి చేసిన క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుంది. ఇదే విషయాన్ని, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామ రావు పలు సందర్భాల్లో అంగీకరించారు.
అదలా ఉంటే మరోవంక తెలుగు దేశం ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారి పోయింది. అంతవరకు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి, ఎన్టీఅర్ చరిష్మా చెక్ పెట్టింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పతనానికి తెలుగు దేశం పార్టీనే బీజం వేసింది.కాంగ్రెస్’కు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీఅర్ కీలక భూమికను పోషించారు.ఇందులో భాగంగా, 1989 (?)లో వివిధ జాతీయప్రాతీయ పార్టీల నాయకుల,తొలి కాంక్లావే/సమావేశం హైదరాబాద్’లో ఎన్టీఅర్ అధ్యక్షతన జరిగింది. అలాగే, చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ... కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఇక ఆ తర్వత ఏమి జరిగింది అనేది చరిత్ర.