రబ్బరు స్టాంప్ గా ఎస్‌ఈసీ! ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ
posted on Apr 2, 2021 @ 5:18PM
ఏపీలో స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలంటే టీడీపీకి భయంలేదన్నారు. ప్రజా కోర్టులో అధికార పార్టీని దోషిగా నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు. కొత్త ఎస్‌ఈసీ వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆక్షేపించారు. పరిషత్ ఎన్నికల్లో ఎస్‌ఈసీ రబ్బర్‌స్టాంపుగా మారారని ఆరోపించారు. 2014లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే తాజా ఎన్నికల్లో 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. 2014లో 1శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవమైతే ఈసారి 19శాతం అయ్యాయని గుర్తు చేశారు. అధికార వైకాపా దౌర్జన్యాలు, అక్రమాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని మండిపడ్డారు.
బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోకపోడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ స్థాయిలోనూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమాలు జరిగిన ఎన్నికలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కరోనా కారణంగా ఎన్నికలు వద్దని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెబితే తప్పుపట్టారని, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉందని, ఎన్నికలు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. కొత్త నోటిఫికేషన్ ఇస్తే పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు.