ప్రగతి భవన్ లో కేటీఆర్ సన్మానాలు.. ఏ హోదాలో చేశారో సారూ?
posted on Apr 2, 2021 @ 5:01PM
ప్రగతి భవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం.. ప్రస్తుతం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి నివాసంలో ఉంటూ కేటీఆర్ చేస్తున్న కార్యక్రమాలే వివాదంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. పార్టీ కార్యక్రమాలకు ప్రగతి భవన్ ను వేదిక చేసుకున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా ప్రగతి భవన్ లో మరో మంత్రితో పాటు ఉన్నతాధికారులకు ఆయన సన్మానం చేయడం దుమారం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కారాలు ఇస్తుంది. ఈ ఏడాది అత్యుత్తమ స్థానిక సంస్థలుగా 12 పురస్కారాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి శుభాకాంక్షలు తెలిపి, సత్కరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావులని సన్మానించారు. ఈ కార్యక్రమం ప్రగతి భవన్ లో జరగడం ఇప్పుడు కాక రేపుతోంది.
ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం. అక్కడ కేసీఆర్ తనయుడిగానే కేటీఆర్ ఉంటున్నారు తప్ప మంత్రిగా కాదు. ప్రగతి భవన్ లో ఏ అధికారిక కార్యక్రమైనా ముఖ్యమంత్రే చేయాలి. కేటీఆర్ చేయడానికి వీలుండదు. అలాంటిది ప్రగతి భవన్ లో మంత్రితో పాటు ఉన్నతాధికారులను కేటీఆర్ సన్మానించడంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఏ హోదాలో కేటీఆర్.. మంత్రి ఎర్రబల్లితో పాటు ఉన్నతాధికారులను సన్మానించారన్నది రచ్చగా మారింది. రాజకీయంగా కేటీఆర్ కంటే ఎర్రబెల్లి చాలా సీనియర్. పదవి పరంగా చూసినా ప్రస్తుతం ఇద్దరూ మంత్రులే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి కేంద్రం అవార్డులు వస్తే.. ఆ శాఖ మంత్రిని సత్కరిస్తే ముఖ్యమంత్రి సత్కరించాలి. అధికారులను కూడా సీఎం లేదా సీఎస్ సత్కరించాలి. కాని ఎర్రబెల్లి నిర్వహిస్తున్న మంత్రి పదవికి సమాన హోదాలోనే ఉన్న కేటీఆర్.. ఎర్రబెల్లిని సత్కరించడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. అది కూడా ప్రగతి భవన్ లో చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. అసలు తన కన్నా సీనియర్ అయిన రాజకీయ నేతను కేటీఆర్ సన్మానించడమే విడ్డూరమంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా... పాలనంతా కేటీఆర్ డైరెక్షన్ లోనే సాగుతుందని కొంత కాలంగా ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలు కూడా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మంత్రులు, ఉన్నతాధికారులంతా ప్రగతిభవన్ లో కేటీఆర్ ను కలుస్తుండటం విపక్షాలకు ఆరోపణలు బలాన్నిస్తున్నాయి. అయినా తన తీరు మార్చుకోవడం లేదు కేటీఆర్. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావును కేటీఆర్ సన్మానించడంపై కాక రేపుతోంది. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లిని సన్మానించారా లేక మంత్రిగా చేశారా చెప్పాలంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే పార్టీ ఆఫీసులో చేసుకోవాలి కాని ప్రగతిభవన్ వేదిక కాదంటున్నారు. మంత్రిగా చేస్తే..ఏ హోదాలో చేశారో చెప్పాలంటున్నారు. కేటీఆర్ తనకు తానే సీఎంగా భావిస్తున్నట్లుగా ఆయన వ్యవహారం ఉందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.