సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థికి వర్మ సపోర్ట్
posted on Apr 3, 2021 @ 11:29AM
సంచనాలకు కేరాఫ్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి కేక పుట్టించారు. సినిమాలపై కాకుండా ఓ ఎన్నికపై ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణలో రాజకీయ రచ్చగా మారింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్ కు మద్దతుగా ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్అభ్యర్థి నోముల భగత్... ఓ చిరుత పులితో వాకింగ్ చేస్తూ వెళ్తున్న చిన్న వీడియోను వర్మ ట్వీట్ చేశారు. "వామ్మో... కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్, సింహాలు అని మనకు తెలుసు. కానీ, అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని’’ అని వర్మ ట్వీట్ చేశారు. ‘
ఈ అభ్యర్థి నోముల భగత్... "మాకు ఓటు వేయండి. నాగార్జునసాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలబడలేదు" అంటున్నారు. చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’’అని మరో ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.
రాంగోపాల్ వర్మ ట్వీట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్వీట్‌కి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలా మంది రిప్లైలు ఇస్తున్నారు. చిరుతపులితో నోముల భగత్ నిజంగానే వెళ్లారా... వెళ్తే... ఎక్కడ వెళ్లారు... ఎప్పుడు వెళ్లారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీడియోని గమనించిన చాలా మంది నెటిజన్లు అది గ్రాఫిక్ కాదనీ... నిజమైన వీడియోనే అని అంటున్నారు. చిరుతపులి, నోముల భగత్ నీడలను బట్టీ... నిజంగానే చిరుతపులి తో వాకింగ్ చేశారని అంటున్నారు. ఇది నిజమే అయితే... ఇండియాలో ఇలా చెయ్యడానికి అనుమతి ఇవ్వరు. చుట్టూ ఉన్న గడ్డిని బట్టీ... అది ఆఫ్రికా సహారా ఎడారి లాంటిది కావచ్చని కొందరు అంటున్నారు. అక్కడి సఫారీల్లో ఇలా చిరుతలతో ప్రజలు దగ్గరగా ఉండేలా వాటికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు కాబట్టే... ఇది అక్కడిదే అంటున్నారు కొందరు.