పవన్ కు షాకిచ్చిన రత్నప్రభ.. సోము వీర్రాజు పరువు గోవిందా!
posted on Apr 3, 2021 8:17AM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి రిటైర్జ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ పై కీలక ప్రకటన చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. తమ కూటమి తరపున పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. సోము వీర్రాజు ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం బీజేపీలో ప్రకంపనలు రేపుతుండగా.. సీఎంలను ముందే ప్రకటింతే సాంప్రదాయం లేని బీజేపీ.. ఎలాగూ గెలిచే అవకాశం లేదని భావించే ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
తాజాగా తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ .. పవన్ కల్యాణ్ కు షాకిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓ మీడియా ఛానల్ డిబేట్ లో మాట్లాడిన రత్నప్రభ.. పలు అసక్తికర విషయాలు వెల్లడించారు. ఏపీకి కాబోయే సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పిన విషయం తనకు తెలియదన్నారు. పవనే సీఎం అభ్యర్థి అంటూ మీడియాలో ఎలా వచ్చిందన్న విషయం కూడా తెలియదని వ్యాఖ్యానించారు. పవన్ పై రత్నప్రభ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే పవన్ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించినా.. రత్నప్రభ తెలియదు అన్ని పేర్కొనడం చర్చనీయాంశమైంది. రత్నప్రభ వ్యాఖ్యలతో సోము వీర్రాజు పరువు పోయిందనే ప్రచారం సాగుతోంది.
తిరుపతి ఉపఎన్నికలో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు రత్నప్రభ. బీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారం సరికాదన్నారు. . తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంతృప్తిగా ఉన్నారన్నారు.తిరుపతిలో ప్రచారం కూడా చేస్తారని చెప్పారు. తిరుపతిలో ఉన్న సమస్యలు తనకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో పరిశ్రమలు లేవని, తనను గెలిపిస్తే తిరుపతిలో పరిశ్రమలకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని రత్నప్రభ అన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. తిరుపతిలో మతమార్పిడి జరుగుతున్నాయని ఆరోపించిన రత్నప్రభ.. హిందువులపై దాడులు కూడా పెరిగాయన్నారు. తిరపతిలో హిందూ ధర్మాన్ని కాపాడతామన్నారు. దుబ్బాక ఫలితమే తిరుపతిలోనూ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తిరుపతిలో తాను గెలుస్తానని, ప్రజల మద్దతు తమకే ఉందని రత్నప్రభ విశ్వాసం వ్యక్తం చేశారు.