సమీక్షల ప్రహసనం.. జగన్ మాటలపై నమ్మకం కోల్పోయిన క్యాడర్!?
posted on Nov 16, 2022 @ 10:32AM
రాజుగారి దేవతా వస్త్రాల కథలా తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. ఎంత రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ.. భుజ కీర్తులతో తమ అధినేతను ఆకాశానికి ఎత్తేసే వంది మాగధులు ఉన్నా.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి పై సమీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితి. అందుకే అనివార్యంగా నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
గుర్తుకు వచ్చినప్పుడు నచ్చిన నియోజకవర్గం నుంచి తను మెచ్చిన ఓ 50 మందిని తాడేపల్లికి పిలిపించుకుని ప్రసంగాలిచ్చేసి పంపించేస్తున్నారు. అయితే ఎన్నికల కసరత్తులంటూ జగన్ చేస్తున్న నియోజకవర్గాల సమీక్షలపై పార్టీ కేడర్ ఆసక్తి కోల్పోయింది. ఆయన మాటలు వారిలో విశ్వాసం నింపడం లేదా? అసలు సమీక్ష అంటేనా.. వారు ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుంటున్నారా? అయినా వైసీపీ అధినేత జగన్ దృష్టిలో నియోజకవర్గ సమీక్ష అంటే ఆ నియోజకవర్గం మొత్తం నుంచి తనకు నచ్చిన, తనకు సమస్యల చిట్టా విప్పరన్న నమ్మకం ఉన్న ఓ 50 మందిని ఎంపిక చేసి తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడమే. సమీక్షలో మరో కండీషన్ కూడా ఉంది. ఎవరూ మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. చెప్పింది వినాలి అంతే.
అందుకే వైసీపీ శ్రేణులే జగన్ నిర్వహిస్తున్న సమీక్షలపై జోకులు వేసుకునే పరిస్థితి. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాం.. మరొక్క చాన్స్ అంటూ జనంలోకి వెళ్లండి. ఈ సారి అధికారం అందుకుంటే.. ఇక అంతే మనల్ని ఎవరూ కదపలేరు. మూడు దశాబ్దాల పాటు మనదే అధికారం అంటే ఆ వచ్చిన వారిలో ఉత్సాహం నింపడానికి జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. బటన్ నొక్కి కోట్లకు కోట్ల రూపాయలు పందేరం చేస్తున్నా.. మనకు ఓట్లు ఎందుకు రావు.. 175కు 175 అసెంబ్లీ స్థానాల్లోనే మనం ఎందుకు గెలవం.. మీరు నియోజకవర్గంలో పని చేయండి చాలు మిగతాదంతా (బటన్ నొక్కడం) నేను చూసుకుంటాను అంటూ భరోసా నింపేస్తున్నారు. అయితే ఈ ప్రసంగాలేవీ క్యాడర్ లో అసంతృప్తిని చల్లార్చడం లేదు.
నియోజకవర్గ సమీక్షలకు వచ్చిన వారంతా జగన్ కు వీర విధేయులే అయినా.. వారు కూడా మధ్య మధ్యలో జగన్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలను ఏకరవు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే జగన్ కు నచ్చడం లేదు. నేను చెబుతున్నాను కదా అన్నట్లు ఓ లుక్కేసి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించడం అంటూ సీఎంవో అధికారులను ఆదేశించేస్తున్నారే తప్ప ఆ సమస్య ఏమిటన్నది కూడా వినిపించుకోవడం లేదు. ఎన్నో ఫిల్టర్ల తరువాతే జగన్ నియోజకవర్గ సమీక్షలకు వచ్చే క్యాడర్ ను ఎంపిక చేస్తున్నారు.
వారెవరూ కచ్చితంగా నోరెత్తరని నిర్ధారణ చేసుకునే.. అందుకు అనుగుణంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి మరీ వారిని జగన్ సుముఖానికి అంటే సమీక్షకు పిలుస్తున్నారు. అయినా కూడా ఈ సమీక్షల్లో అంత ఫిల్టరై వచ్చిన వారు కూడా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే విజయం కష్టం అన్నసూచనలూ ఇస్తున్నారు. అయితే జగన్ మాత్రం అవన్నీ మీరు పట్టించుకోవద్దు.. సమస్యలు పరిష్కారమౌతాయి.. పందేరాలు కొనసాగుతాయి.. మనదే విజయం.. అందుకు మీరు చేయాల్సింది ఐక్యంగా పని చేయడం అంటూ వారి నోరు మూయిస్తున్నారు. జగన్ ఈ వైఖరి కారణంగానే క్యాడర్ లో కూడా పని చేసే ఉత్సాహం అడుగంటి పోయిందంటున్నారు.
ఆయన ఎలాగూ బటన్ నొక్కుతున్నారుగా.. ఇక మనం పని చేసేదేముంది అంటూ సరదా వ్యాఖ్యలు చేసుకుంటున్న పరిస్థితి దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ నెలకొని ఉందని వైసీపీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పగటి కలో, ఆత్మ విశ్వాసమో తెలియదు కానీ విజయంపై తనకున్న ధీమాను క్యాడర్ లోనూ కలిగించేందుకు సమీక్షల పేర ఉద్బోధలు మాత్రం నిరాటంకంగా చేసుకుంటూ పోతున్నారు.
కానీ పార్టీలో మాత్రం సమీక్షల తీరు మారాలనీ, పెద్ద సంఖ్యలో క్యాడర్ ను సమీక్షలకు పిలిచి వారి అభిప్రాయాలను తీసుకోవాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే పిల్ల మెడలో గంట ఎవరు కడతారు? జగన్ మాటలు దేవతావస్త్రాల్లా ఉన్నాయని ఎవరు చెబుతారు? ఈ ప్రశ్నకు పార్టీ నేతలు ఎవరి నుంచీ సమాధానం ఉండదు. అంతా గప్ చిప్