పేరుకు ఖర్గే.. పెత్తనం అంతా గాంధీ కుటుంబానిదే!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తయ్యింది. కొత్త అధ్యక్షుడు పగ్గాలు చేపట్టి నెల రోజులు దాటిపోయింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎన్నిక అన్నారు కనుక ఎన్నిక అంతే.. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లు ఇరువురు పోటీ చేశారు అని చెప్పుకోవడానికే. కానీ మల్లికార్జన్ కర్గే పేరు సోనియా ప్రతిపాదించిన క్షణంలోనే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఆయనేనని ఎన్నిక అయ్యి, ఫలితం వచ్చే వరకూ ఆగకుండానే పార్టీ శ్రేణులూ, రాజకీయ వర్గాలూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి. ఫలితాల్లోనూ అదే తేలింది. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి బయటి వ్యక్త పార్టీ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ లో ఏమైనా మార్పు కనిపించిందా అంటే ఏం లేదనే చెప్పాలి.   వాస్తవానికి సోనియా గాంధీ తొలుత పార్టీ అధ్యక్ష పదవికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ఎంపిక చేశారు.   అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. ఆయన్ని ఒప్పించారు. కానీ ఆయన అంగీకరించినట్లే అంగీకరించి చివరిక్షణంలో చెయ్యిచ్చారు. ఆ తరువాత పలు ఆప్షన్లను పరిశీలించి చివరకు సోనియా మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు.  ఎనిమిది పదుల ఖర్గేను  ఎంపిక చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన శశి థరూర్ గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. దీంతో సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేకుండానే తేలిపోయింది. ఆ విషయం అద్యక్ష ఎన్నికకు ముందే..  శశి థరూర్ కు విషయం అర్థమైపోయింది. అందుకే ఆయన తీరిగ్గా,అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని, అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని, అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించేసి చేతులు దులుపుకున్నారు. అవును మరి నాడా దొరికిందని, గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుందని అప్పట్లో భాష్యాలు కూడా చెప్పారు.   జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది  అన్నట్లుగానే అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయసంగా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఆయన పగ్గాలు చేపట్టి కూడా నెల రోజులు దాటిపోయింది.    శశి థరూర్ తాను అధ్యక్షుడినైతే పార్టీలో సమూల మార్పులు తెస్తానని ప్రచార సమయంలో చెప్పుకున్నారు.అయితే ఖర్గే మాత్రం  సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా నే కొనసాగుతారని చెప్పకనే చెప్పారు. అంటే తాను అధ్యక్షుడినైనా గాంధీ కుటుంబం పెత్తనం ఇసుమంతైనా మారదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది.   కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని అప్పట్లోనే పరిశీలకులు చెప్పారు. అందులో ఇసుమంతైనా మార్పు ఉండదని కొత్త అధ్యక్షుడి నెల రోజుల హయాంలో ప్రస్ఫుటంగా తేలిపోయింది. ఇక పోతే   శశి థరూర్ ను  స్టార్ క్యాంపెయినర్స్ జాబితా నుంచి తాజాగా తొలగించడం ద్వారా గాంధీ కుటుంబాన్ని ధిక్కరించిన వారికి కాంగ్రెస్ లో స్థానం ఏమిటో మరోసారి స్పష్టంగా చూపినట్లైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో శశి పేరు లేకపోవటం అందుకే పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. థరూర్ ను తాము పక్కన పెట్టలేదని, శశి థరూర్ పేరు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్  జాబితాలో గతంలో ఎప్పుడూ చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ 2011,2016 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా  బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై, కోల్ కతా, చెన్నై నగరాల్లో శశి థరూర్ విస్తృతంగా ప్రచారం చేశారు.  ఇటీవలే నోయిడా లో జరిగిన బై పోల్స్ లోనూ ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో   పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ గా గుర్తించకపోవటమంటే పొమ్మనలేక పొగబెట్టడమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదొక్కటే కాదు ధిక్కారాన్ని గాంధీ కుటుంబం సహించదనడానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జీ-23లో ఒకరైన ఆనంద్ శర్మ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాను కోల్పోయారు. అలాగే మనీష్ తివారి, రణదీప్ సింగ్ సూర్జేవాలాకు కూడా అదే మర్యాద దక్కింది. తొలుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బదులుగా రూపొందిన కొత్తగా వచ్చిన కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయన్ను దూరం పెట్టడంతో శశి థరూర్ రాజకీయ భవితవ్యంపై మబ్బులు కమ్ముకున్నాయి. తాజా విషయాలపై స్పందించిన ఆయన తాను కేవలం మేధావినేనని భారత వ్యతిరేకిని, మోడీ వ్యతిరేకిని కానేకాననటం విశేషం. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీఎన్నికల్లో ప్రచారం చేయాలని తాను వ్యక్తిగతంగా భావించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తనకు చోటు లేకుండా చేశారని, బహుశా పార్టీకి తన సేవలు అక్కర్లేదేమోనని ఆయన వ్యాఖ్యానించటం విశేషం. 

మద్యం షాపుల్లో ఇక డిజిటల్ చెల్లింపులకూ ఓకే.. మర్మమేమి తిరుమలేశా?!

 ఇంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోని వైసీపీ సర్కార్ ఎట్టకేలకు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు ఓకే చెప్పింది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాకా.. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ వ్యాపారంగా మార్చేశారు. ప్రజలలో మద్యం అలవాటు మాన్నించడానికే అంటూ మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్యను కూడా క్రమంగా తగ్గించుకుంటూ వస్తానంటూ కొత్త విధానాన్ని ప్రకటించారు. కొత్త కొత్త బ్రాండ్లను తీసుకువచ్చారు. దీంతో ధర ఎక్కువ, నాణ్యత తక్కువ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ధరలు పెంచేశారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి అన్ని చోట్ల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరగడానికి లేని అభ్యంతరం ఒక్క మద్యం దుకాణాల్లోనే ఎందుకన్న ప్రశ్నలూ తలెత్తాయి. మద్యం దుకాణాల్లో డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్లకు వీల్లేదన్న ఆంక్షలపై విమర్శలే కాదు అనుమానాలూ వ్యక్తమయ్యాయి.  నిత్యం కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగే మద్యం వ్యాపారంలో డిజిటల్ చెల్లింపుకు ఎందుకు అనుమతించడం లేదన్న ప్రశ్నలూ వెల్లువెత్తాయి. ఎందుకంటే    మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వానివే అయినా..సరఫరా.. తయారీ..   మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లో ఉంది. దీంతో మద్యం దుకాణాల్లో నగదు లావాదేవాలకు మాత్రమే అనుమతి అంటూ ప్రభుత్వం చెబుతుండటంతో.. ఆ సొమ్మంతా ఎక్కడకు పోతోందన్న అనుమానాలు పొడసూపాయి. ఈ సొమ్మ బ్లాక్ మనీగా  తరలిపోతోందని విమర్శలూ ఉన్నాయి. ఇక బేగం పేట విమానాశ్రయం నుంచి  ప్రైవేట్ చార్టర్డ్ విమానాల్లో పెద్ద మొత్తంలో సొమ్ము తరలించారని ఢిల్లీ మద్యం స్కాం దర్యాప్తు చేస్తున్న ఈడీ దర్యాప్తులో తేలడంతో ఏపీలో మద్యం సొమ్మును కూడా అలాగే తరలిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్, విశాఖ పాత విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించిన చార్టర్ట్ ఫ్లైట్ల గుట్టు కూడా బయట పెట్టాలంటూ తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సొమ్ము తరలింపునకు ఉపయోగించిన చార్టర్డ్ విమానాలు ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య అనికా టేక్రీవాల్ రెడ్డికి చెందిన జెట్ సెట్ గో సంస్థకు చెందినవని ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పై విమర్శల దాడి జరిగింది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి అల్లుడి అన్న కావడం.. అంతకంటే ముందే.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు కావడంతో జగన్ సర్కార్ డిఫెన్స్ లో పడింది. దీంతో గత్యంతరం లేకనే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ కు కూడా అనుమతి ఇస్తామని ప్రకటించింది. సోమవారం (నవంబర్ 21) నుంచే ఏపీలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను అనుమతిస్తామని ప్రకటించింది. ఇప్పటి దాకా అనుమతించని డిజిటల్ పేమెంట్లకు ఇప్పుడెందుకు అనుమతిస్తున్నారన్న ప్రశ్నకు షాపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తేలిందనీ, దానిని అరికట్టేందుకేననీ బదులిస్తోంది. ఇంత కాలం ఆ విషయాన్ని గుర్తించలేదా అన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. పోనీ సిబ్బంది చేతివాటానికి అవకాశం లేకుండా మద్యం దుకాణాల్లో పూర్తిగా డిజిటల్ పేమెంట్పే అంటున్నారా అంటే అదీ లేదు. నగదు చెల్లింపులకూ చాన్స్ ఉంటుందంటున్నారు. అంటే సిబ్బంది చేతి వాటానికి భయపడే డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి ఇస్తున్నామన్న మాట పూర్తిగా వాస్తవం కాదన్న మాట. విమర్శలకు తలొగ్గే ఆ నిర్ణయం తీసుకున్నారని అర్ధమౌతోంది. కానీ డిజిటల్ పేమెంట్స్ అని బయటకు చెప్పినా అది నామ్ కే వాస్తే అమలు చేస్తారనీ, సాంకేతిక సమస్య సహా పలు రకాల సాకులతో మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులకే పట్టుబట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియమితులయ్యారు. 1985 పంజాబ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి గోయల్ ను నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. మూడో పదవి ఖాళీగా ఉండడంతో అరుణ్‌ గోయల్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌, కమిషనర్‌గా అనూప్‌ చంద్ర పాండే ఉన్నారు.దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న మూడో కమిషనర్ పదవిని కేంద్రం అరుణ్ గోయల్‌తో భర్తీ చేసింది. 1985 క్యాడర్‌కు చెందిన అరుణ్ గోయల్ సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. 34 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన అరుణ్ గోయెల్ జీఎస్‌టీ కౌన్సిల్‌ అడిష‌న‌ల్ సెక్రెట‌రీగా కూడా ప‌నిచేశారు. ఢిల్లీలో ఇంజినీరింగ్ చ‌దివిన అరుణ్ గోయ‌ల్ ఆ త‌ర్వాత అహ్మ‌దాబాద్‌లోని ఐఐఎంలో పీజీ పూర్తి చేశారు.  వచ్చే నెల మొదటి వారంలో గుజ‌రాత్ ఎన్నిక‌లు జరగనున్నాయి, అలాగే, ఇక వరుసగా మ‌రిన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ, ఆ తరువాత  2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాంతో  గత ఆరునెలలుగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా మూడో ఎన్నిక‌ల అధికారి పోస్ట్‌ను కేంద్రం భర్తీ చేసింది.

ఆహా ఏం భోగం.. ఇంటి కన్నా జైలే నయం!

తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. ఆప్ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ కు జైళ్లో సకల మర్యాదలూ జరుగుతున్నాయని చాటే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి ఆప్ పరువును గంగలో కలిపింది. వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా ఫరవాలేదు అన్న సామెతలా అధికారంలో మన పార్టీ ఉంటే జైళ్లో కూడా రాజభోగాలు అనుభవించవచ్చని ఆప్ మంత్రికి జైళ్లో అందుతున్న సౌకర్యాలను చూస్తే అర్ధమౌతుంది. కర్యాలను చూస్తే ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా దొరకవేమో అనిపిస్తుంటుంది. గతంలో జైలులో కూడా రాజభోగాలు అనుభవించిన కొందరు రాజకీయ నేతలను మనం చూడగా.. ఇప్పుడు అదే కోవలో ఢిల్లీ మంత్రి కూడా చేరారు. డిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీగా సామాన్యుల కోసమే పని చేస్తామనే ఆ పార్టీ మంత్రి   సత్యేంద్రకుమార్ జైన్ మనీలాండరింగ్ కేసులో మే 30న  అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సత్యేంద్రకుమార్ కు అక్కడ సకల సేవలూ జరుగుతున్నాయని తెలియజేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.  ఈ వీడియోలో మంచం మీద దర్జాగా పడుకున్న మంత్రికి మరో వ్యక్తికి మసాజ్ చేస్తున్నాడు. మంత్రి పడుకున్న బెడ్ మీద టీవీ రిమోట్, తాగేందుకు మినరల్ వాటర్ బాటిల్ వంటివి కనిపిస్తుండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు.. ఇది జైలా స్టార్ హోటలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదు సెప్టెంబర్ నెల నాటి వీడియో అని ఆప్ నేతల వివరణ ఇస్తున్నా.. ఆ తర్వాత కూడా అదే జైలులో ఉన్న ఈ మంత్రికి అవే మర్యాదలు దక్కుతున్నాయని విమర్శలు వినవస్తున్నాయి. మొత్తం మీద ఈ వీడియో దెబ్బకు పదిమంది జైలు అధికారుల మీద వేటు పడింది. ఆప్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది.  

పబ్లిసిటీ మోజు తెచ్చిన చేటు

పబ్లిసిటీ మోజు   పెచ్చుమీరితే ఏమౌతుందో ఆ ఐఏఎస్ అధికారికి బాగా తెలిసి వచ్చింది.  ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ సోషల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే పబ్లిక్ సర్వెంట్, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్, యాక్టర్ అంటూ తనకు తానే భుజకీర్తులు ఇచ్చుకుంటూ  తన వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అంతే కాదండోయ్ ఈయనను సామాజిక మాధ్యమంలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆయనకు 3 మిలియన్ల ఫాలోయర్స్ ఉండగా ,ట్విట్టర్ లో 31,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.వారందరి కోసం ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ పోస్టు చేస్తూ ఉంటారాయన. వ్యక్తిగత వివరాలు, తన టాలెంట్స్ గురించి, అభిరుచుల గురించి పోస్టు చేసి ఊరుకుంటే బాగుండేది. కానీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కు వెళ్లడంతో.. తన స్పెషల్ డ్యూటీ గురించి ఫోటోతో సహా   సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.  ఎన్నికల విధుల్లో తలమునకలవ్వాల్సిన ఆ ఆఫీసర్  ఇన్స్టాలో రెండు పిక్స్ పోస్ట్ చేసి,  తాను గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నట్టు రైటప్స్ పెట్టారు.  సీన్ కట్ చేస్తే ఆయనపై ఎలక్షన్ కమిషన్ ఆయనపై చర్యలు తీసుకుని షాక్ ఇచ్చింది. అభిషేక్ సింగ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.ఇదంతా పక్కన పెడితే తన ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి అభిషేక్ సింగ్ చేసిన పోస్టుకు విశేషం ఏమిటంటే అభిషేక్ చేసిన  22 గంటల్లో 28, 597 లైక్స్ వచ్చాయి. ఫలం దక్కింది కానీ వ్రతమే చెడింది.  

ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాల కలకలం

బెంగళూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాలు కలకలం రేపాయి. ఆ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు జై పాకిస్థాన్ నినాదాలు చేశారు. ఈ సంఘటనను మరో విద్యార్థి సెల్ ఫోన్ లో షూట్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో ఇది వైరల్ అయ్యింది. నెటిజన్లు కాలేజీలో ఈ నినాదాలేంటంటూ ఫైర్ అవుతున్నారు. న్యూ హరిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 25 నుంచి రెండు రోజుల పాటు ఫెస్ట్ జరగనుంది.  అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్సాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య ఐపీఎల్ ఫేవరెట్ జట్ల ప్రస్తావన వచ్చింది. ఐపీఎల్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు స్థానం లేకపోవడంపై చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ఇద్దరు విద్యార్థులు జై పాకిస్థాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇతర విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. జై పాకిస్థాన్ నినాదాలు చేసిన విద్యార్థుల చేత క్షమాపణ చెప్పించి వారి చేత జై భారత్, జై కర్నాటక అనిపించారు. అయితే ఈ మొత్తం సన్నివేశాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. జై పాకిస్థాన్ నినాదాలు చేసిన విద్యార్థులపై కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజీలో జై పాకిస్థాన్ నినాదాలు కలకలం సృష్టించాయి. 

బాబోయ్ మళ్లీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందన వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో శనివారం (నవంబర్ 19)తమిళనాడు, పుదుచ్చేరిలలో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ  చెదురుమదురు వర్షాలు కురిశాయి. అల్పపీడనం బలపడి ఆదివారం నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదనీ హెచ్చరించింది. కాగా వాతావరణ తాజా హెచ్చరికతో రైతులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. సాగు సమయంలో వర్షం పడితే చేతికి వచ్చే పంట నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులలో వరి కోతలు ప్రారంభం కానున్న తరుణంలో వాయుగుండం హెచ్చరికతో వారి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి.  

కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి సస్పెన్షన్

మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. మాజీ మంత్రి, కేంద్ర   విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.   కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రిమర్రి శశిథర్ రెడ్డి హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకున్న సంగతి విదితమే.   బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణల తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రిశశిధర్ రెడ్డి నేడో రేపో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. అంతకు ముందు మర్రి శశిధర్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.  కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన, ఢిల్లీ వెళ్లినంత మాత్రానా హోంమంత్రిని కలిసినంత మాత్రానా పార్టీ మారుతున్నట్లేనా? అని ప్రశ్నించారు. అయితే జరుగుతున్న పరిణామాలను గమనించి ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్.. ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి ముందే సస్పెన్ష్ వేటు వేసింది. కాగా తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పరిణామం దుమారాన్ని లేపింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ పరిణామాలపై స్పందించారు. మర్రి శశిధర్ రెడ్డిపై వేటుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే అందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  బాధ్యత వహించాలన్నారు.  మునుగోడు ఓటమిపై పీసీసీ ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ లు పెట్టి కులాసా కబుర్లు చేప్పుకోవడమేమిటని మండి పడ్డారు.  కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న మాట వాస్తవమేనన్నారు.  అందుకే మర్రి శశిధర్ రెడ్డి ఇబ్బంది పడి ఉంటారని చెప్పారు. ఆయనతో పార్టీ నాయకత్వం మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బీసీసీఐ ప్రక్షాళన.. సెలక్టర్లకు ఉద్వాసన.. ఆటగాళ్ల వంతెప్పుడు?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ సెమీఫైనల్ లో టీమ్ఇండియా ఘోర పరాజయం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళన మొదలెట్టింది. ముందుగా సెలక్టర్లపై వేటేసింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఘోరంగా పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో చేసిన పరుగులను ఇంగ్లాండ్ అలవోకగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించేసింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్కవికెట్ కూడా నష్టపోకుండానే  ఇంగ్లాండ్ ఉఫ్ మని ఊదేసింది.  ఈ ఓటమితో టీమ్ ఇండియా బలహీనతలపై మళ్లీ చర్చ మొదలైంది. ఆటగాళ్ల సెలక్షన్ అధ్వానంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ను జట్టులోకి తీసుకుని ఎవరినీ సరిగ్గా ఉపయోగించుకోని పరిస్థితిని క్రీడాభిమానులే కాదు.. మాజీలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ పోవడంపై కూడా విరమ్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మొదటిగా సెల‌క్ట‌ర్ల‌పై వేటు వేసింది. టి20 వరల్డ్ కప్ కు   జ‌ట్టును ఎంపిక చేసిన చేత‌న్ శ‌ర్మ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీనీ ఇంటికి పంపించింది. అంతేకాకుండా కొత్త సెల‌క్ష‌న్ కమిటీ ఎంపిక కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. సీనియ‌ర్ పురుషుల క్రికెట్ జ‌ట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెల‌క్ట‌ర్లు కావాలంటూ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌ను చేసింది. కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు, లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన వారు సెలక్టర్ పదవికి అర్హులనీ, అలాగే సెలక్షన్ బోర్డుకు ఎంపిక అవ్వాలంటే.. ఐదు సంవ‌త్స‌రాల క్రిత‌మే క్రికెట్ ఆట‌కు వీడ్కోలు ప‌లికి ఉండాల‌ని, అంతేకాకుండా ఐదేళ్ల పాటు ఏ క్రికెట్ క‌మిటీలోనూ స‌భ్యుడిగా లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామనీ ఆ ప్రకటనలో పేర్కొంది.   ఆస‌క్తి ఉన్న వారు ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని ఆ ప్రకటనలో పేర్కొంది.  ఈ ప్రక్షాళనలో భాగంగా తరువాతి వంతు వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లదేనని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. గతమెంత ఘనకీర్తి ఉన్నా.. ప్రస్తుత పెర్ఫార్మెన్స్ ఆధారంగానే జట్టులో స్థానం ఉంటుందన్నది బీసీసీఐ స్పష్టంగా చెబుతోందంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్, దినేష్ కార్తిక్, పృధ్వీషా, భువనేశ్వర్ కుమార్ తదితర ఆటగాళ్ల భవిష్యత్ పై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం మీద టి20 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమితో టీమ్ ఇండియా లోటుపాట్లను సరిదిద్దే దిశగా బీసీసీఐ చర్యలు చేపట్టడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లు.. జగన్ కు షాక్ తప్పదా?

ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 7వ తేదీన శీతాకాల సమావేశాలు ప్రారంభమై 29వ తేదీ వరకు 23 రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 30 బిల్లుల దాకా ప్రవేశపెడుతుందని తెలుస్తోంది. వాటిలో విద్యుత్ సవరణ బిల్లు, వ్యక్తిగత సమాచారం భద్రత బిల్లు, వన్యప్రాణుల సంరక్షణ సవరణ బిల్లు, న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సవరణ బిల్లు లాంటివి ఉన్నాయని సమాచారం. పార్లమెంటులో ప్రవేశపెట్టే మిగతా బిల్లుల సంగతి పక్కన పెడితే.. విద్యుత్ సవరణ బిల్లు అటు వైసీపీని ఇటు జగన్ ను అడకత్తెరలో పోకచెక్క మాదిరి ఇరుకున పడేయడం తప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. వ్యవసాయ బోర్ల మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తారు. దాంతో ఇప్పటి దాకా ఉచితంగా విద్యుత్ సరఫరా పొందుతున్న రైతులు విద్యుత్ ఇక బిల్లులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు అన్నదాత వాత తప్పదని అంటున్నారు బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో వైసీపీ లేదు. అయినాసరే పార్లమెంటులో ఎప్పుడు ఏ బిల్లు ప్రవేశపెట్టినా.. జగన్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తోంది. గడిచిన మూడున్నరేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. నిజానికి లోక్ సభలో గానీ, రాజ్యసభలో గానీ వైసీపీ మద్దతు లేకపోయినా బిల్లులను ఆమోదించుకోగల బలం ఎన్డీయే సర్కార్ కు ఉంది. అయినాసరే.. జానపదాల్లో ఉన్న ఓ క్యారెక్టర్ ‘జుట్టుపోలిగాడు’ మాదిరి జగన్ పార్టీ ఎంపీలు ప్రతిసారీ తగుదునమ్మా అంటూ అడగక ముందే మద్దతు ఇచ్చేస్తుండడం గమనార్హం. మోడీ సర్కార్ కు వైసీపీ ఇలా బేషరతుగా మద్దతు ఇవ్వడం వెనుక జగన్   అక్రమాస్తుల కేసుల భయం కారణమంటారు. ఈడీ, క్విడ్ ప్రోకో, బెయిల్ రద్దు లాంటి 11 కేసుల కత్తి  నిత్యం జగన్ మెడ మీద వేలాడుతున్న క్రమంలో మద్దతు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ ఉన్నాడనీ,  అందుకే బీజేపీ ప్రభుత్వం ఆడమన్నట్లు జగన్ ప్రభుత్వం ఆడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి.  కేసుల భయంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ రాజీ పడుతున్నారని, ప్రత్యేక హోదా విషయంలో, వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ ,, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలలో పట్టుబట్టకుండా జగన్ కేంద్రం మాటకు, చేతకు తందానా అంటూ వస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరిశీలకులు కూడా కేంద్రం ప్రతి మాటకూ డూడూబసవన్నలా తలూపడానికి కేసుల భయమే కారణమని విశ్లేషిస్తున్నారు. బిల్లులు ఆమోదించుకోగల స్థాయిలో సభ్యుల బలం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎన్డీయే ప్రభుత్వానికి ఉంది. లోక్ సభలో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది. పెద్దలసభ రాజ్యసభలో మాత్రం మిత్ర పక్షాలతో కలిపి బీజేపీకి బొటాబొటి మెజారిటీ ఉంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయిన ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ అంశాల ప్రాతిపదికగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండడం గమనార్హం. అయితే.. బీజేపీ అడగడమే ఆలస్యం అనే తీరులో తన అవసరం ఉన్నా లేకపోయినా జగన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సభ్యులు మాత్రం ఎన్డీయే సర్కార్ కు  ముందే బేషరతుగా మద్దతు ఇచ్చేస్తున్నారు. అయితే.. ఈసారి విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంటులో వచ్చినప్పుడు ఏపీలో వైసీపీ సర్కార్ కు, జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందం అవుతుందంటున్నారు.  విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పుల కోసమే ఈ బిల్లును తెస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ బిల్లుతో రైతులకు నష్టం వస్తుందని, వ్యవసాయ  మోటార్లకు స్మార్ట్ విత్యుత్ మీటర్లు పెడతారని, దాంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదనే భయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ మీటర్లు అమర్చడం ద్వారా అన్నదాతల నడ్డి విరగ్గొట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఇప్పటికే విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మీటర్లకు మోటార్లు బిగించడానికి జగన్ అంగీకారం, ఆమోదం తెలిపేసీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లుకు జగన్ పార్టీ  మద్దతు తెలిపితే ఒక తంటా, తెలపకపోతే మరో తంటా అన్న పరిస్థితిలో ఉన్నారు.  అయితే.. వ్యవసాయ  మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే ఏమవుతుంది? ఆ బిల్లులు తామే చెల్లిస్తామంటూ రైతుల చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టే యత్నం వైసీపీ పెద్దలు చేస్తుండటం ప్రస్తావించాల్సిన అంశం. ఎందుకంటే.. ఇప్పటికే ఏపీని అప్పుల ఊబిలో దింపేసి, ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో  ఏపీ ఆర్థిక వ్యవస్థ ఉంది. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. సంక్షేమ పథకాలు కూడా సజావుగా కొనసాగే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో కొత్తగా రైతుల విద్యుత్ మోటార్లకు బిల్లుకు తామే కడతామంటే ఎలా నమ్మాలని రైతులు ఇప్పటికే ప్రభుత్వాన్ని సూటిగా  నిలదీస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ బిల్లుల డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెబుతున్నారు. వారి మాటల్ని నమ్మి రైతులు ప్రభుత్వం డబ్బులు వేసే దాకా ఊరుకుంటే.. విద్యుత్ కనెక్షన్లను  కట్ చేసే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. విద్యుత్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తే.. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు.. పోనీ మద్దతు ఇవ్వకుంటే.. డబుల్ ఇంజిన్ మోడీ షా జోడీ ఈడీ, అక్రమాస్తుల కేసు, బెయిల్ రద్దు అంశాలతో ఎక్కడ ప్రమాదం తెచ్చిపెడుతుందో అనే ఆందోళన జగన్ లో పెరిగిపోతోందంటున్నారు. అందుకే అనుకుంటా.. ఇటీవలి వైజాగ్ సభలో ప్రధాని మోడీకి సీఎం జగన్ పలుమార్లు రెండు చేతులూ ఎత్తి నమస్కారాలు చేశారన్న విషయాన్ని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

త్రిముఖ పోరు అంచనాలతో ఏపీలో రాజకీయ హీట్

 ఆంధ్ర  ప్రదేశ్ లో పొత్తుపొడుపుల ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. మోడీతో భేటీ తరువాత జనసేనాని ఒంటరి పోరువైపే మొగ్గు చూపుతున్నారని పించేలా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రసంగాలు ఉంటున్నాయి. అశేష సినీ ప్రేక్షక అభిమానుల దన్ను, జనాకర్షణ శక్తి ఉందేమో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఉన్న రాజకీయ అనుభవం, కార్యదక్షత మాత్రం లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. అయితే ఈ మూడున్నరేళ్ల పాలనలో జగన్ ప్రజాకర్షణ శక్తిని పూర్తిగా కోల్పోయాడని, వారసత్వ బలం ఆయనకు అండగా నిలిచే అవకాశమే లేదని కూడా పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో   ప్రజలను కూడగట్టుకోవడానికి, ప్రజాభిమానాన్ని తనకు రాజకీయపరంగా అనుకూలంగా చేసుకోవడానికి పవన్ కల్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమం రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయంటున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్రంలో రాజకీయ హీట్ పీక్స్ కు వెళ్లిపోవడానికి ఇది కూడా ఒక కారణమేనంటున్నారు. అయితే తన సినీ గ్లామర్ ను నమ్ముకుని పవన్ కల్యాణ్ విజయంపై ధీమా పెంచుకోవడం అత్యాశే అవుతుందన్నది పరిశీలకల విశ్లేషణ.  ఎన్టీఆర్ సినిమాల నుంచి నేరుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి కనీ వినీ ఎరుగని రీతిలో దశాబ్దాల కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టిన మాట వాస్తవమే కానీ, ఎన్టీఆర్ కరిష్మాకు ఏ విధంగా చూసినా పవన్ కల్యాణ్ సరితూగడని పవన్ కల్యాణ్ అభిమానులే చెబుతారు.   అన్నిటికీ మించి మారిన రాజకీయ పరిస్థితులలో సినీ  అభిమానం, ఆదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారే అవకాశం ఎంత మాత్రం లేదని చెబుతున్నారు. ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవిని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అలాగే 2019 ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి ఏం సాధించగలిగారని ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఒంటరి పోరు నిర్ణయం వైసీపీలో ఒకింత ఉత్సాహాన్నీ ఆనందాన్ని నింపుతున్న మాట వాస్తవమేనని చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుంటే మాత్రం వైసీపీకి చుక్కలేనని ఆ పార్టీ నేతలే అంటున్నారు. రాజకీయ విశ్లేషణలు సైతం ఆ దారిలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సారి తమిళనాడు రాజకీయాలలో గతంలో సంభవించిన పరిణామాలను గమనిస్తే.. పవన్ ఒంటరి పోరు నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను పెద్దగా ప్రభావితం చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. తమిళనాడులో ప్రధానంగా డీఎంకే.. అన్నాడీఎంకేల మధ్యే అధికారం మారుతుంటుంది. ఆ పరిస్థితుల్లో  సినీ రంగంలో విశేషంగా ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న విజయకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన ప్రవేశంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని అప్పట్లో రాజకీయ పండితులు పలు విశ్లేషణలు చేశారు. కానీ అవేమీ కరెక్ట్ కాదని ఆ తరువాత ఫలితాలు రుజువు చేశాయి. తమిళనాట రాజకీయ ముఖచిత్రం ఏమీ మారిపోలేదు. అలాగే ఆ తరువాతి కాలంలో ప్రసిద్ధ నటుడు కమల్ హసన్ రాజకీయం కూడా తమిళనాట రాజకీయ సంచలనాలేమీ సృష్టించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఒంటరి పోరు నిర్ణయంతో కూడా పెద్దగా అద్భుతాలేవీ జరిగే అవకాశాలు లేవు. 2019 ఎన్నికలలో జనసేన ఒంటరి పోరు వల్ల అప్పటి విపక్ష పార్టీ  వైసీపీ లబ్ధి పొందింది. 2019లో పవన్ ఒంటరి పోరు ఎలా అయితే అప్పటి అధికార పక్షానికి నష్టం చేకూర్చిందో... 2024లో ఒక వేళ జనసేన ఒంటరిగానే బరిలోకి దిగితే..త్రిముఖ పోరులో అధికార వైసీపీ నష్టపోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే జనసేనాని కార్యక్రమాలకు జనాదరణ పెరుగుతున్న కొద్దీ అధికార వైసీపీలో కలవరం పెరిగిపోతోందంటున్నారు. ఆ కారణంగానే అడుగడుగునా జనసేనాని పర్యటనలను, కార్యక్రమాలను జగన్ సర్కార్ అడ్డుకుంటోందనీ, వాటిని నిలువరించడానికి నిషేధాజ్ణలు విధిస్తోందనీ చెబుతున్నారు.  2019 ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానం మాత్రమే గెలుచుకున్న సంగతిని ఈ సందర్భంగా పరిశీలకలు ప్రస్తావిస్తున్నారు. ఈనేపథ్యంలో పవన్ ఒంటరి పోరు పై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. 

పాపం బ్రేకప్ చెప్దామనుకునేలోగా చంపేశాడు!

శ్రద్ధా వాకర్ దారుణ హత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. శ్రద్ధా వాకర్ ను మతం మారమని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ చేష్టలను శ్రద్ధావాకర్ సహించ లేకపోయారనీ, ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నదని తెలియవచ్చింది. అఫ్తాబ్ తనను చిత్ర హింసలు పెడుతున్నారని ప్రెండ్స్ కు చెప్పుకుని ఏడ్చిన సందర్బాలున్నాయని కూడా ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. ఇక అఫ్తాబ్ తో సహజీవనం తన వల్ల కాదన్న నిర్ణయానికి వచ్చిన శ్రద్ధావాకర్..అతనితో బ్రేకప్ కు సిద్ధపడిందనీ. ఆమె అఫ్తాబ్ కు బ్రేకప్ చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేసిందనీ, ఒకటి రెండు రోజులలో ఆమే అఫ్తాబ్ తో సహజీవనానికి గుడ బై చెప్పి బయటకు వచ్చేస్తుందనగా, విషయం గ్రహించిన అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. బ్రేకప్ చెప్పి శ్రద్ధా వాకర్ బయటకు వెడితే తన వికృత చేష్టలు బయటకు వచ్చి పరువు మంటకలుస్తుందన్న భయంతోనే ఆఫ్తాబ్ ఈ దారుణానికి ఒడిగట్టారని అంటున్నారు. అంతే కాకుండా డ్రగ్స్ మత్తులోనే శ్రద్ధాను చిత్ర హింసలకు గురి చేసి హత్య చేయడమే కాకుండా ఆమె శరీరాన్ని  ముక్క ముక్కలుగా కోసేసినట్లు చెబుతున్నారు. గతంలో చాలా సార్లు శ్రద్ధా అఫ్తాబ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయబోయినా ఆత్మహత్య చేసుకుంటానని బెదరించి ఆమెను నిలువరించాడని శ్రద్ధా స్నేహితులు చెబుతున్నారు.  

గుడివాడ బరిలో ఎన్టీఆర్.... కొడాలి నానికి చెక్!

కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా  గెలుస్తూ వస్తున్న మాజీ మంత్రి కొడాలి నానికి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే చెక్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు.  నోటికి హద్దు, అదుపూ లేకుండా బూతుల పురాణంతో  తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని విరుచుకు పడే కొడాలి నాని మళ్లీ అసెంబ్లీ ముఖంగా చూడకుండా చేయాలన్న లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొడాలి నానికి చెక్ పట్టేందుకు ఆయన ఈ సారి   ‘నందమూరి అస్త్రాన్ని’ సంధించనున్నారని తెలుగుదేశం వర్గాల్లో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంత కాలం కొడాలి నాని విజయాలకు వెనుక నందమూరి హరికృష్ణ,  జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పాత్ర భారీగా ఉంటూ వస్తోందనేది కాదనలేని సత్యం.  కొడాలి నానికి ఓట్లు వేయడంలో గానీ, వేలాది మంది చేత ఓట్లు వేయించడంలో గానీ   హరికృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా కృషి చేశారని  చెబుతారు.  కొడాలి నానికి కలిసివస్తున్న ఈ పాయింట్ నే బ్రేక్ చేయాలని టీడీపీ  అధినేత వ్యూహాలు రచిస్తున్నారని  అంటున్నారు.   నందమూరి హరికృష్ణ కుమార్తె, జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసినిని వచ్చే ఎన్నికలలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపితే కొడాలి నాని హవాకు ఫుల్ స్టాప్ పడటం ఖాయమని ఆయన భావిస్తున్నారంటున్నారు.   కొడాలి నాని చాలా కాలం పాటు చంద్రబాబు వద్దే ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరిన తర్వాత అంతటి సుదీర్ఘ రాజీకీయ అనుభవం ఉండి, సీఎంగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబుపై కొడాలి నాని ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు. అలాంటి కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో గుడివాడలో గెలవనివ్వకూడదని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. పలుమార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నానిని ఓడించాలంటే ఈసారి బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి అయితే వచ్చేశారు. ఆ క్రమంలో తొలుత హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కుమారుడు, తనకు స్వయానా బావమరిది, వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణను పోటీలో పెడితే ఎలా ఉంటుందని యోచించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే   ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమతో కొడాలికి చెక్ పెట్టాలని కూడా యోచించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.   అంతకు ముందు గత ఎన్నికల్లో కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన రావి వెంకటేశ్వరరావునే బరిలో దింపాలని చంద్రబాబు యోచించారని,  అయితే.. కొడాలి నానిని ఢీకొట్టాలంటే.. వెంకటేశ్వరరావు బలం, బలగం సరితూగకపోవచ్చన్న అనుమానం వ్యక్తం కావడంతో మరో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే పలు ఆప్షన్స్ ను యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మథనంలో, ఆ యోచనలో నుంచే నందమూరి సుహాసిన పేరు బయటకు వచ్చిందంటున్నారు.   కొడాలి నానిపై నందమూరి సుహాసినిని బరిలో దింపాలనే నిర్ణయానికి చంద్రబాబు దాదాపు వచ్చేశారనీ, దీని వెనుక  పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరు గుడివాడ నియోజవర్గంలోనే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ అంటే ప్రాణాలు ఇచ్చే కేడర్ కు కొదవలేదు. పైగా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణకు కూడా గుడివాడ నియోజకవర్గంలో మంచి పట్టు ఉండేది. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఇప్పుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలో దిగితే.. అటు హరికృష్ణ మీద ఉన్న సానుభూతి, ఇటు ఎన్టీఆర్ అభిమానుల మద్దతు  ఆమెకు పుష్కలంగా ఉంటాయన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు కొడాలి గెలుపుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్, హరికృష్ణ అభిమానుల ఓట్లు కొడాలి నానికి కాకుండా సుహాసినికి పడే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేస్తున్నారు.  తమ అభిమాన నేతలు హరికృష్ణ కుమార్తె, ఎన్టీఆర్ మనవరాలు అయిన సుహాసినికే వారంతా మద్దతుగా నిలిచే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇంకో పక్కన కొడాలి నాని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉంటారని చెబుతారు. ఇప్పడు స్వయంగా ఆయన   సోదరి సుహాసినే   పోటీకి దిగితే.. జూనియర్ కచ్చితంగా ఆమె పక్కనే నిలబడతారనే అంచనా ఉంది. నందమూరి మరో హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా సుహాసినికి తోడ బుట్టిన సోదరుడు. దాంతో కళ్యాణ్ రామ్ మద్దతు కూడా కచ్చితంగా సోదరి సుహాసినికే ఉంటుందని అంటున్నారు. ఇంతకాలంగా కొడాలికి దక్కుతున్న నందమూరి అభిమాన ఓట్లకు గండికొట్టి, ఆయనను ఓటమిపాలు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నందమూరి సుహాసినిని గుడివాడ నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.కొడాలి నాని గుడివాడలో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంటే ‘నందమూరి అస్త్రాన్ని‘ సంధించడమే ఉత్తమం అని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

పాపం వసుంధరారాజె.. మొదటికే మోసం

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేస్తే ఏమౌతుంది.. ఏమౌతుందో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరరాజెను చేస్తే అర్ధమౌతుంది. రాజస్థాన్ సీఎం అభ్యర్థిగా తననే ప్రకటించాలని పట్టుబట్టిన వసుంధరరాజేకు మోడీషా ద్వయం గట్టి షాక్ ఇచ్చింది. రాజస్థాన్ సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలంటూ పట్టుబడుతూ వస్తున్నా మోడీ షా పట్టించుకోకపోవడంతో.. తన సత్తా చాటాలంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేసి సత్ఫలితాలను చూపాలని ఆమె భావించారు. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె ప్రచార రంగంలోకి దూకేందుకు రెడీ అయిపోయారు. సరిగ్గా ఇక్కడే మోడీషా ద్వయం ఆమెకు ఆమె స్థానం ఏమిటన్నది దిమ్మదిరిగేలా తెలియ చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో వసుంధరరాజేకు స్థానం కల్పించలేదు. దీంతో ఆమెకు గుజరాత్ లో ప్రచారం చేసే అవకాశమే లేదన్నది స్పష్టమైపోయింది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే.. వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఆమెకు బీజేపీ మొండి చెయ్యి చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీలో ఆమె రాజకీయ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనని అంటున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయ సంప్రదాయం ప్రకారం ప్రతి 5 ఏళ్లకోమారు సర్కారు మారుతుంది, ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నెక్ట్స్ గవర్నమెంట్ బీజేపీదే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్న కమల నాథులు గెహ్లాట్ వర్గంతో కుమ్మక్కై వసుంధరా రాజే  రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు చెక్ పెట్టడానికే బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చేసిదనడానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడమే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

భార్య కిడ్నీ అమ్మేశాడు!

ఆరోగ్యం బాలేదు.. ఆస్పత్రికి తీసుకెళ్లమని అడిగిన భార్య కిడ్నీని అమ్మేశాడో ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని మల్కాన్ గిరిలో జరిగింది. కథామేట గ్రామానికి చెందిన ప్రశాంత్ తన భార్య కిడ్నీని ఆమెకే తెలియకుండా ఆమ్మేశాడు. ఆ సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు జరిగిందేమిటంటే.. తనకు ఒకింత అస్వస్థతగా ఉందనీ, ఆసుపత్రికి తీసుకెళ్లమనీ భార్య రంజిత కుండు భర్తను అడిగింది. దీంతో ప్రశాంత్ భువనేశ్వర్ లోని ఒక ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడి వైద్యులతో ఏం చెప్పాడో ఏమో.. ఆమె కిడ్నీని తీయిచేసి అమ్మేసుకున్నాడు. ఇందుకోసం ప్రశాంత్ తనను తాను రంజిత తండ్రిగా చెప్పుకుని అవసరమైన సంతకాలు చేశాడు. తడపాల్సిన వారి చేతులు తడిపాడు. ఇదంతా నాలుగేళ్ల కిందట 2018లో జరిగింది. విషయం తెలుసుకున్న రంజితా కుండు ఇంత కాలం ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. అయితే ఇటీవల ప్రశాంత్ రంజితాకుండు తనను నిర్లక్ష్యం చేస్తూ వేరే మహిళతో చనువుగా ఉండటంతో సహించలేకపోయింది. దీంతో రంజిత తన కిడ్నీని భర్త అమ్మేసిన విషయాన్ని మల్కాన్ గిరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విషయం వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో కిడ్నీ విక్రయం విషయంలో ప్రశాంత్ కు సహకరించిన అధికారులను అరెస్టు చేశారు. ప్రశాంత్ పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నారు.  

సానుభూతి కోసమే ఉత్తుత్తి ఆరోపణలా?

ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని మించి ఎమ్మెల్సీ కవితను  చేర్చుకోవడానికి బీజేపీ పెద్దలు ఆమెను సంప్రదించారన్న ఆరోపణలు దుమారం లేపుతున్నాయి. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే ఈ ఆరోపణలు చేయడం, తండ్రి మాటలు వాస్తవమేనని కవిత ధృవీకరించడంతో ఇప్పుడీ వ్యవహారం రాజకీయంగా పెను సంచలనానికి కారణమైంది.  ఇంతకాలం తెరాసలో షిండేలు అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కవితను ఉద్దేశించి చేస్తున్నవేనా అన్న చర్చ ఒక్క సారిగా రాజకీయ వర్గాలలో జోరందుకుంది. ఎందుకంటే .  ఎందుకంటే షిండే మోడల్ రాజకీయం అంటే.. పార్టీలో ఉంటేనే దానిని చీల్చి.. పార్టీని సొంతం చేసుకోవడం. సరిగ్గా కవితను కూడా అలా షిండే తరహాలో రాజకీయం చేయాలని బీజేపీ నేతలు తనతో చెప్పారని కవిత అన్నారు. ఈ ఆరోపణలన్నీ ఒకెత్తు అయితే.. బీజేపీపై ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసిన తండ్రీ తనయలు (కేసీఆర్, కవిత) కవితను సంప్రదించింది ఎవరు? ఎలా సంప్రదించారు? ఫోన్ లో మాట్లాడారా? స్వయంగా కలిసి చర్చించారా? చర్చలు జరిగాయా? ఎలాంటి ఆఫర్ ఇచ్చారు? ఇత్యాది వివరాలను బయట పెట్టలేదు. వాటిని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో పకడ్బందీ స్టింగ్ ఆపరేషన్ ను నిర్వహించిన కేసీఆర్ కవిత విషయంలో అలా ఎందుకు వ్యవహరించలేదన్న ప్రశ్న కూడా ఎదురౌతోంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలను బయటపెట్టాల్సిన బాధ్యత కేసీఆర్, కవితల మీద ఉందని, లేకుంటే వాటిని ఎవరూ పట్టించుకోరనీ, రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణలుగానే భావిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే  ఫామ్ హౌస్ కేసులో విచారణ జరుపుతున్న సిట్  కవితస్టేట్ మెంట్ రికార్డు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  ఆమెను సంప్రదించిందెవరో తెలుసుకుని వారి పేర్లు బయటపెట్టి కేసులు నమోదు చేయాలని అంటున్నారు.  అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. లేకుండా ఇదంతా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమే అనుకోవలసి ఉంటుందని రేవంత్ అంటున్నారు. తన బిడ్డను కమలం గూటికి చేరాల్సిందిగా బీజేపీ వారు కోరారని కేసీఆర్ ఆరోపించారు సరే.. కవిత స్వయంగా వారు తనను సంప్రదించారని చెబుతున్నప్పుడు ఆ మేరకు ఇప్పటి వరకూ ఫిర్యాదు ఎందుకు చేయలేదని విపక్షాలు నిలదీస్తున్నాయి.  ఫామ్ హౌస్ వ్యవహారంలో సీరియస్ యాక్షన్ తీసుకున్న కేసీఆర్ తన కుమార్తె విషయంలో అలా ఎందుకు వ్యవహరించలేదని ప్రశ్నిస్తున్నాయి. రాజకీయంగా లబ్ధి కోసం, లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితపై సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరోకు సుప్రీంలో చుక్కెదురు!

జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరోకు సుప్రీంలో చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసులో తమపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ హెటిరో సుప్రీంలో దాఖలు చేసిన పిటిష్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. హెటిరోపై దాఖలైన కేసులో దాచేయాలని ప్రయత్నించినా దాగని వాస్తవాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కేసులో హెటిరో విచారణను ఎదుర్కొని తీరాల్సిందేనని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు హెటిరో గ్రూప్‌ను కేసు నుంచి తొలగించేందుకు నిరాకరిస్తూ గత ఏడాది నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు  తీర్పు ఇచ్చింది. అయితే హెటిరో  సుప్రీంకోర్టులో  సవాల్ చేసింది. అరబిందో, హెటిరో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూ కేటాయింపుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీనివాస్‌రెడ్డిని, హెటిరో సంస్థను సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. జగతిలో జగన్ ఒక్క రూపాయి కూడా పెట్టబడి పెట్టకుండానే ఇతరులతో రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారని సీబీఐ  చార్జిషీటు దాఖలుచేసింది. జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది. హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే! జగన్‌ కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్‌ ఏసియా, సండూర్‌ పవర్‌ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు. అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్‌ రాబట్టారు. అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం.. అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయని సీబీఐ వాదించింది. ఇప్పుడు ఆ చార్జిషీట్ లోని అంశాలనే  దాచేస్తే దాగని సత్యాలుగా  సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా కొంతమందిని చేరిస్తే పర్వాలేదు కానీ.. మొత్త కంపెనీని చేర్చడమేమిటని హెటిరో తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

హమ్మయ్య బయటకొచ్చారు!

23 రోజులు.. ఇల్లూ వాకిలీ వదిలేసి.. పెళ్లాం బిడ్డలను కూడా చూడకుండా, కనీసం ఫోన్ లోకి కూడా అందుబాటులోకి రాకుండా ప్రగతి భవన్ కే పరిమితమైన ఫామ్ హౌస్ ట్రాప్ ఎమ్మెల్యేలు నలుగురూ శనివారం (నవంబర్ 19)బయటకు వచ్చారు. తాము ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తున్నామని ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్వయంగా శుక్రవారం (నవంబర్ 18) ప్రకటించారు.  బీజేపీ తమను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని, ఇందుకోసం ముగ్గురు వ్యక్తులు మధ్యవర్తులుగా వచ్చారంటూ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్‌ ఫాంహౌస్ లో పోలీసులు  ఆ మధ్యవర్తులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  కాగా, అదే రోజు ఫాంహౌస్‌ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు అప్పటి నుంచీ గత 23 రోజులుగా  అక్కడే ఉంటున్నారు. మధ్యలో ఒకసారి  అవును ఒకే ఒక్క సారి మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభకు హాజరయ్యారు. అయితే వారంతట వారుగా ఆ సభకు వెళ్లలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వారిని తనతో తీసుకెళ్లి.. అక్కడి ప్రజలకు వారి మోహం చూపించి  మళ్లీ తనతో పాటే తీసుకువచ్చేశారు. ఇన్ని రోజులుగా వారు  ప్రగతిభవన్‌లోనే ఉంటుండడంపై   విమర్శలు వెల్లువెత్తుతుంటే మరో వైపు వారు  ఇ వారి నియోజకవర్గాల్లో  పోలీసులకు ఫిర్యాదులు సైతం అందాయి. అయితే ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ తాము రక్షణ కోసమే ప్రగతి భవన్ లో తలదాచుకున్నారని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇక వారు బయటకు రావడానికి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నారనడం కంటే కేసీఆర్ వారికి అనుమతి ఇచ్చారని చెప్పడం సబబుగా ఉంటుంది. ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తామని వారీ సందర్భంగా చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై విలేకరుల ప్రశ్నలకు వారు సమాధాానం చెప్పడానికి నిరాకరించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము దానిపై మాట్లాడబోమని స్పష్టం చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి అయితే ఈ రోజు అయ్యప్పమాల ధరించనున్నారు. ఎమ్మెల్యేల కోనుగోలు బేరసారాల వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో... ఆ వ్యవహారంలో ఇన్ వాల్వ్ అయి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలూ అప్పటి నుంచీ ప్రగతి భవన్ లోనే బస చేయడం అంతకు మించి విమర్శలకు, అనుమానాలకూ తావిచ్చింది.  ఎమ్మెల్యేలు కనిపించడ లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. ప్రగతి భవన్ లో వారు బందీలు గా ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్కడి నుంచి వారికి విముక్తి కలిగించాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు వారు బయటకు వచ్చారు. అయినంత మాత్రాన ఈ వివాదం సద్దుమణిగినట్లు కాదు. ఏకంగా 23 రోజుల పాటు ఇల్లూ వాకిలీ వదిలేసి, పెళ్లాం బిడ్డలకు మొహం చూపకుండా, నియోజకవర్గం గురించి పట్టించుకోకుండా, కనీసం ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకుండా ప్రగతి భవన్ లో వారేం చేశారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు కాకుంటే తరువాతైనా ఈ ప్రశ్నలకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

లిక్కర్ స్కాం నుంచి కవితను రక్షించుకునే వ్యూహమేనా?

తన కుమార్తెను కూడా బీజేపీలో చేరమని అడిగారని, అంత కంటే దారుణం ఉంటుందా అంటూ  కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశంలో అన్నారు. తన తండ్రి మాటలు అక్షర సత్యాలనీ, బీజేపీనుంచి తనకు ఆఫర్  వచ్చిందనీ, తెలంగాణలో షిండే మోడల్ అమలు చేయడం పై మాట్లాడానీ కవిత చెప్పారు. షిండే మోడల్ అంటే.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను చీల్చి ఆ తరువాత  తనదే శివసేన అని ప్రకటిం కోవడంఅన్నమాట. ఆ తరహా రాజకీయం చేయాలని తనకు ఆఫర్ వచ్చిందని కవిత చెబుతూ తన తండ్రి మాటలకు వత్తాసు పలుకుతున్నారు. ఇక్కడే రాజకీయ వర్గాలలో పలు ప్రశ్నలు వినవస్తున్నాయి. ఇదే కేసీఆర్ తన పార్టీకి చెందిన ఓ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసి, కొనుగోలుకు బేరసారాలు చేసిందని ఆరోపిస్తూ ఊరూ వాడా ఏకం చేశారు. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా.. తెరాస ఎమ్మెల్యే పటేల్ రోహిత్ రెడ్డి పామ్ హౌస్ లో బీజేపీ దూతలు తెరాస ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారంటూ అందుకు సంబంధించి ఆడియోలు, వీడియోలూ విడుదల చేశారు. అంతటితో ఊరుకోకుండా మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు గుప్పించారు. ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలనే కాదు.. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడానికి కమలనాథులు భారీ కుట్ర చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులందరికీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించి తమ స్టింగ్ ఆపరేషన్ తాలూకా ఆడియోలూ, వీడియోలు పంపించారు. అక్కడితో ఆగకుండా దర్యాప్తునకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బీజేపీని ఇరికించడానికి అంత ట్రాప్ చేసిన ముఖ్యమంత్రి, తన కుమార్తె విషయానికి వచ్చేసరికి కేవలం బీజేపీ తన కుమార్తెను పార్టీలో చేరాల్సిందిగా కోరిందన్న ఆరోపణలకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు. ఆమెతో మాట్లాడిన బీజేపీ పెద్దల మాటలను, వారి సంప్రదింపులను ఎందుకు ఆడియో, వీడియో లలో నిక్షిప్తం చేసి రచ్చ చేయలేదు? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ వర్గాలు కేసీఆర్ ఒక అంశంలో అంటే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో ఒకలా.. తన కుమార్తె విషయంలో మరోలా ఎందుకు వ్యవహరించారని నిలదీస్తున్నాయి. అలాగే బీజేపీ ఎంపీ అర్వింద్ కూడా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడారు అని ఆరోపించారు. అందుకే తెరాస శ్రేణులు భగ్గుమన్నాయి. హైదరాబాద్ లోని అరవింద్ నివాసంపై దాడికి దిగాయి. స్వయంగా కవిత నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ తన కుమార్తెను పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వారు కోరారు అన్న కేసీఆర్ మాటలకు, కవిత ఖర్గేతో చర్చించారన్న ఆర్వింద్ ఆరోపణకూ తేడా ఏముందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కేసీఆర్ చేసినదీ, ఇటు అర్వింద్ అన్నదీ కూడా కేవలం నోటి మాటేననీ, ఆరోపణేననీ అంటున్నారు. కేసీఆర్ తనకు తెలిసింది చెప్పినట్లుగానే అరవింద్ తన దృష్టికి వచ్చింది వెల్లడించారని తేడా ఎముంది అంటున్నారు. అదే ఫామ్ హౌస్ వ్యవహారంలో అయితే.. కేసీఆర్ బీజేపీని ఇరికించడానికి పకడ్బందీగా వ్యవహరించారు. మరి తన కుమార్తె విషయంలో ఎందుకు అలా చేయలేదు? బట్ట కాల్చి మొహాన వేసిన చందంగా కేవలం ఆరోపణలకే ఎందుకు పరిమితమయ్యారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఇంతకీ కేసీఆర్ తన కుమార్తెను ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నించారని అంటున్నారే కానీ.. కవితతో ఎవరు సంప్రదించారు, ఎం చర్చించారు వంటి వివరాలను అటు కేసీఆర్ కానీ, ఇటు తండ్రి మాటలు అక్షర సత్యాలన్న కవిత కానీ వెల్లడించడం లేదు. ఆ వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఫామ్ హౌస్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ముందుగా కవితను విచారించి స్టేట్ మెంట్ ఎందుకు తీసుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. వేర్వేరు ఘటనలైనా ఫామ్ హౌస్ ప్రలోభాలూ, కవితకు ఆఫర్ ఒకే కోవకు చెందుతాయని అంటున్నారు. రెండు సంఘటనలనూ వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదంటున్నారు. అక్కడా బీజేపీయే ఫామ్ హౌస్ వేదికగా తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కారు దించేసి గులాబీగూటికి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇక్కడ కవితను కూడా బీజేపీ దాదాపు అదే విధంగా ఆఫర్లు ఇచ్చిందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే చెబుతున్నారు కదా. మరి ఈ విషయంలో సిట్ ఎందుకు కవితను ప్రశ్నించడం లేదనీ, నోటీసు ఇచ్చి ఎందుకు స్టేట్ మెంట్ తీసుకోవడం లేదనీ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు రావడానికి ఆమె బీజేపీ ఆఫర్ ను తిరస్కరించడమే కారణమన్నది ఎస్టాబ్లిష్ చేసి ఆమెను రక్షించుకోవాలన్న ప్రయత్నంలోనే కేసీఆర్ ఈ ఆరోపణలు చేసి ఉంటారని, అదే సమయంలో ఈడీ, సీబీఐ,ఐటీ దాడుల వెనుక బీజేపీ విస్తరణ కాంక్ష మాత్రమే ఉందని చాటాలన్నది కేసీఆర్ లక్ష్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యేల ట్రాప్ చేసు దర్యాప్తు చేస్తున్నసిట్ కవితకు నోటీసులు ఇచ్చి ఆమె స్టేట్ మెంట్ తీసుకోవాలని, ఆమెను సంప్రదించినదెవరో వెల్లడించి వారిపై కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచి వస్తున్నది. ఒక వేళ అలా జరగకపోతే ఇదంతా కూతురిని రక్షంచుకోవడం కోసం కేసీఆర్ ఆడుతున్న నాటకమే అనుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.