జనసేన బంధిత పార్టీయా.. బీజేపీ చెప్పినట్లే నడుచుకుంటుందా?
జనసేన ఇప్పుడు ఒక బంధిత పార్టీగా మారిపోయిందా? బీజేపీ బంధనాలలో చిక్కుకు పోయిందా? ప్రధాని మోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకులు మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు, మాటలు చూస్తుంటే ఔననక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నరకు పైగా గడువు ఉంది. అయినా ఇప్పుడో, అప్పుడో ఎన్నికలు వచ్చేస్తున్నాయన్నంతగా రాష్ట్రంలో రాజకీయ హీట్ పీక్స్ కు చేరిపోయింది. ఇటువంటి వాతావరణంలో సహజంగానే అధికార, విపక్షాల మధ్య విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అయితే ఏపీలో మాత్రం అధికారపక్షంపై తెలుగుదేశం మాత్రమే కాకుండా, జనసేన, బీజేపీలు కూడా ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తు పొడుపులపై విశ్లేషణలు, వ్యాఖ్యలు, ఊగాహనాలు జోరుగా సాగుతున్నాయి.
విశాఖలో జనవాణి కార్యక్రమం సందర్భంగా జరిగిన సంఘటనల అనంతర పరిణామాలు ఏపీలో జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదిరిపోయినట్లేనన్నంతగా వార్తలు వచ్చాయి. విశ్లేషణలు సైతం అదే దారిలో సాగాయి. అంత కంటే చాలా ముందే జనసేనాని ఏపీలో వైసీసీని గద్దె దంచడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలాగే తమ నిర్ణయాలు, విధానాలు ఉంటాయని జనసేనాని ప్రకటించి రాష్ట్రంలో పొత్తుపొడుపులపై చర్చకు తెరతీశారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు అవసరమైతే తానో మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఆయన ప్రకటన తరువాత రాష్ట్రంలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు పొడిచేసినట్లేనని అంతా భావించారు. అందుకు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో జనసేన,టీడీపీ శ్రేణులు కలిసి కార్యక్రమాలు నిర్వహించారు.
అయితే అప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. మరి దాని సంగతేమిటన్న ప్రశ్రకు విశ్లేషకులు 2014 ఎన్నికలలోలా మూడు పార్టీల మధ్యా పొత్తు ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తా అలాంటిదేమీ లేదని చెప్పుకుంటూ వస్తోంది. టీడీపీ, వైసీపీలకు సమదూరం పాటిస్తామని పదే పదే ఉద్ఘాటిస్తోంది. ఆ పార్టీ నేతలు ఆ దిశగా పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నా తెలుగుదేశం స్పందించడం లేదు. అలాగని జనసేనానితో అవగాహన విషయంలో మాత్రం సానుకూల సంకేతాలే ఇస్తూ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే విశాఖ ఘటనల తరువాత తెలుగుదేశం అధినేత స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. పరామర్శించారు. అండగా ఉంటామని ధీమా సైతం ఇచ్చారు. ఆ సదర్బంగా ఇరువురూ కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంగా పొత్తుల గురించి ఇరువురూ ప్రస్తావించలేదు. కానీ అదే సమయంలో బీజేపీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో ఆయన దూరం జరుగుతున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. అందుకే బీజేపీ ముందుకు రాకపోతే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకునైనా సరే తెలుగుదేశం, జనసేనలు కలిసే ఎన్నికలకు వెళతాయన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి.
కానీ ఆ తరువాత ఎప్పుడైతే మోడీ, పవన్ కల్యాణ్ ల భేటీ జరిగిందో అప్పటి నుంచీ పరిస్థితి మారిపోయింది. పవన్ కల్యాణ్, మోడీల భేటీ తరువాత జనసేన, బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతుందన్న సంకేతాలు బీజేపీ నేతల నుంచి స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం (నవంబర్ 20)న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీజేపీ తెలుగుదేశంతో కలిసి నడిచే ప్రశక్తే లేదని చెప్పడమే కాకుండా, జనసేన, తెలుగుదేశం పొత్తు కూడా ఉండదని విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు.. బీజేపీ అధిష్ఠానం ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు కూడా చెప్పిందని ఆయన అంటున్నారు. అంటే మోడీ, పవన్ భేటీ సారాంశమిదేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలు చెప్పినట్లే నడుచుకోవాలనీ, ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే ప్రశ్నే లేదని సోము వీర్రాజు అన్నారు.
అందుకే తాను తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని వివరించారు. దీంతొ ఏపీ రాజకీయాలలో మళ్లీ పొత్తలు చర్చ మొదలైంది. అయితే ఈ సారి ఏ పార్టీ ఏపార్టీ కలుస్తాయి.. అనే చర్చ కాకుండా.. అసలు జనసేన పార్టీకి స్వతంత్రం లేదా? హస్తినలో బీజేపీ పెద్దలు ఏం చేబితే అది ఫాలో కావాల్సిందేనా? అన్న దారిలో చర్చలు జోరందుకున్నాయి. నెటిజన్లైతే జనసేన పార్టీని బీజేపీ బంధిత పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అందరి కంటే ముందు పొత్తు చర్చలకు తెరతీసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వనని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే ధ్యేయమన్నుట్లుగా వ్యవహరిస్తున్నారని జనసేన శ్రేణులే అంటున్నాయి. ఇటీవల తరచుగా ఆయన ఒంటరి పోరు అంటుండటంతో ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
బీజేపీ చేతుల్లో బందీగా మారి పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవన్ ఏ పార్టీతో వెళ్ళాలో.. ఎవరిని కలవాలో కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలే చెప్తారా? అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలవరనీ, ఎందుకుంటే బీజేపీ పెద్దలు ఆయనకు ఆమెరకు దిశానిర్దేశం చేయడమేనని అంటున్నారు. పవన్ బీజేపీని పదే పదే కోరిన రోడ్ మ్యాప్ ఇదేనా? అని రాజకీయ వర్గాలలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ చెప్తుంటే.. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి జనసేనను దూరం చేసి వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేలా బీజేపీ ప్రయత్నిస్తుందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. సోము వీర్రాజు మాటల వెనుక అర్ధం, అంతరార్ధం ఇదేనా అని సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. పొత్తుల కోసం తాము ఒక మెట్టు తగ్గేందుకు కూడా సిద్ధమని పవన్.. టీడీపీకి ఆఫర్లు ఇస్తుంటే.. పవన్ మాతోనే ఉండాలని.. మేము ఏం చెబితే అదే పవన్ చేయాలన్న అర్ధం వచ్చేలా సోము మాట్లాడటం వెనుక ఉన్న వ్యూహమేమిటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా సోము వీర్రాజు వ్యాఖ్యలపై తెలుగుదేశం, జనసేనలు ఎలా స్పందిస్తాయో చూడాలి.