ఆదోనిలో బాబుకు బ్రహ్మరథం.. జన సంద్రంగా మారిన పట్టణం
posted on Nov 17, 2022 @ 3:42PM
చంద్రబాబు కర్నూలు పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. మూడు రోజుల పర్యటలో చంద్రబాబు మాటల పదును పెరిగింది. సుత్తి లేకుండా సూటిగా విషయాన్ని జనం హృదయాలకు హత్తుకునేలా చెప్పారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే.. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది స్పష్టంగా చెబుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు.
గతంలోలో జగన్ సర్కార్ పై విమర్శలకే పరిమితం కాకుండా...జగన్ పాలన వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. జగన్ పాలనా వైఫల్యాలతో రాష్ట్రానికి జరిగిన నష్టాలను చంద్రబాబు ఏకరవు పెడుతుంటే జనంలో మంచి స్పందన కనిపించింది. చంద్రబాబు పర్యటనకు జనం నుంచి వచ్చిన స్పందన తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపింది. జగన్ ను సాగనంపితే తప్ప రాష్ట్రానికి మోక్షం లేదు. ప్రజలకు సంతోషం లేదు అంటూ నిప్పులు చెరిగారు. గడపగడపకూ వస్తున్న వైసీపీ దొంగల్ని ఎక్కడికక్కడ నిలదీయండి అంటూ పిలుపు నిచ్చారు. నాలుగు సార్లు తిరిగితే అన్ని మర్చిపోయి ఓట్లేస్తారన్నది వారి ఆశ.. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మనం మరచిపోతామా? లక్షల రేషన్ కార్డులు తొలగించారు, పేదల పొట్టగొట్టిన ఘనడు జగన్.. పేదల ఆకలి మంటలే శాపంగా మారతాయి అవునా కాదా అంటూ జనాలను ప్రశ్నించి వారిలో ఆవేశాన్ని రగిలించారు.
తెలుగుదేశం అధికారంలోకివ వస్తే సంక్షేమం ఉండదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నదుష్ప్రచారాన్ని ఖండించారు. గతంలోనే తెలుగుదేశం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటి కంటే మెరుగైన సంక్షేమంఅందించి చూపుతానని వాగ్దానం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఆర్థిక దన్నుగా నిలిచి వారు ధనవంతులు కావడానికి ఉపయోగపడాలన్నారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంగా జగన్ వంటి అసమర్ధ సీఎంను చూడలేదన్నారు. జగన్ రాయలసీమ ద్రోహిగా అభివర్ణించిన చంద్రబాబు.. సీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అని ఉద్ఘాటించారు.
కడపలో స్టీల్ ప్లాంటు నిర్మించలేని ఈ పెద్ద మనిషి మూడు రాజధానులు నిర్మిస్తారంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టుకు నేను అడ్డుపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నేను అడ్డుపడడం లేదు. మీకు 151 సీట్లు ఇచ్చారు. ఎంపీలను ఇచ్చారు. నువ్వు చేసిందేమిటి?అని ప్రశ్నించారు. తన వయస్సుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కూడా చంద్రబాబు దీటుగా సమాధానం చెప్పారు. తనదీ ప్రధాని మోడీదీ ఒకటే వయస్సని గుర్తు చేశారు. 70 ఏళ్లకు బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. నేను శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నా. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్లకుఅప్పగిస్తాను తప్ప.. మీ పేటీఎం బ్యాచ్ కు వదిలిపెట్టనని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం భవిష్యత్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం ప్రజలారా నన్ను ఆశీర్వదించండి అని చంద్రబాబు విజ్ణప్తి చేశారు.
గతంలో వ్యవసాయ కూలీల పిలలు తాను అమలు చేసిన విద్యావిధానం వల్ల ఐటీ ఉద్యోగాలు సాధించారుచ అదే జగన్‌రెడ్డి అధ్వాన విధానాల కారణంగా మటన్ కొట్టులో ఉద్యోగాలకు పరిమితమై పోయారని విమర్శించారు. రాష్ట్ర సంపద పెంచే మార్గం నాకు తెలుసు.. ఆస్తులు తాకట్టు పెట్టడం మాత్రమే జగన్ కు తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ఓ పిల్ల కుంక. తెలివిగా ఆలోచిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. పేదవాడు పేదవాడుగా ఉండటానికి వీల్లేదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధం. నిండు మనసుతో ఆశీర్వాదించి అసెంబ్లీకి పంపండి. మీ రుణం తీర్చుకుంటాను’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆదోని పట్టణం పసుపువనంగా మారిపోయింది. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనసందోహాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వశం కాలేదు. ఆదోని పట్టణంలో చంద్రబాబు రోడ్ షోకు జనం పోటెత్తారు. రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. రోడ్డుకిరువైపులా జనం నిలబడి చంద్రబాబుకు అభివాదం చేశారు. భవనాలపై నుంచి పూలవర్షం కురిపించారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రోడ్ షో చాలా నెమ్మదిగా సాగింది. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపించింది. జనం స్పందనతో చంద్రబాబులో కూడా ఉత్సాహం కనిపించింది. జగన్ పాలనపై జనం ఎంతగా విసుగెత్తి ఉన్నారో చెప్పడానికి ఈ జనసందోహమే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.