ఫిఫా వరల్డ్ కప్ లో డ్రెస్ కోడ్.. ఎక్స్ పోజింగ్ చేస్తే చర్యలే
posted on Nov 17, 2022 6:48AM
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్ ఫిఫా వరల్డ్ కప్ 2022 నవంబర్ 29 నుంచి ఖతార్ వేదికగా ఆరంభం కానుంది. అయితే ఈ వరల్డ్ కప్ పోటీలను వీక్షించాలనుకునే మహిళా అభిమానులకు నిర్వాహకులు షాక్ ఇచ్చారు. స్టేడియంలకు వచ్చి పోటీలు వీక్షించాలంటే మాత్రం డ్రెస్ కోడ్ పాటించి తీరాలన్న కండీషన్ పెట్టారు. బిగుతుతుగా ఉండే దుస్తులు, ఎక్స్ పోజింగ్ డ్రెస్ లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. భుజాలు కప్పుతూ, మోకాళ్లకు దిగువగా ఉండే దుస్తులనే మహిళలు ధరించాలని, అలా అయితేనే మ్యాచ్ లు వీక్షించడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు.
ఫిఫా వరల్డ్ కప్ కే వేదివక అయిన ఖతార్ లో ఉండే చట్టాలను అనుగుణంగా ఈ నిబంధనలు విధించినట్లు చెప్పారు. నవంబర్ 20 నుంచి ప్రారంభం అయ్యే ఫిఫా వరల్డ్ కప్ 22 పోటీలను వీక్షించడానికి ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఖతార్ చేరుకున్నారు. ఈ వరల్డ్ కప్ లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చిన మహిళా అభిమానులు డ్రెస్ కోడ్ పై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖతార్ లో చట్టాలకు అనుగుణంగానే ఈ నిబంధన విధించామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఫిఫా వెబ్ సైట్ లో డ్రెస్ కోడ్ గురించి ఎలాంటి ఆంక్షలూ లేవని పేర్కొన్నప్పటికీ ఖతార్ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఖతార్ చట్టాల ప్రకారం ఎవరైనా తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు.. కానీ బహిరంగ ప్రదేశాలను సందర్శించేటప్పుడు మాత్రం భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఖతార్‌లో ప్రయాణించే మహిళలు బిగుతైన దుస్తులు ధరించడం నిషేధం. కాగా, డ్రెస్ కోడ్‌ను పాటించని వారికి కఠిన శిక్షలు ఉంటాయని, జైలుకి కూడా పంపొచ్చని స్థానిక అధికారులు హెచ్చరించారు.