జగన్ ముఖ్యమంత్రా మద్యం వ్యాపారా.. రాష్ట్రంలో డిస్టిలరీలు..ఆయనవే పంపిణీ ఆయనదే.. చంద్రబాబు
posted on Nov 17, 2022 7:37AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా మద్యం వ్యాపారంలో మునిగి తేలుతున్నారా? ఆయనకు పాలన చాత కాదా? నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారా? ఔను నిజమే అంటున్నారు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన పత్తి కొండలో బాదుడే బాదుడు సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. ఒర్వకల్లు విమానాశ్రం వద్ద ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అంతకు ముందు దేవనకొండ, కోడుమూరు లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అడుగడుగునా చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. జగన్ సర్కార్ పై ఆయన విమర్శలకు జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ అని దుయ్యబట్టారు. జగన్ అసమర్థ పాలనతో జనం అష్టకష్టాలూ పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం చేశారనీ, జనాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారనీ విమర్శలు గుప్పించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు జగన్ విధానాలే కారణమన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పత్రికల్లో వార్తలు రాసినా దాడులు, కేసులు ఇదా ప్రజాస్వామ్యమంటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సీఐడీ తాడేపల్లి ప్యాలెస్ తాబేదారుగా మారిపోయిందని చంద్రబాబు విమర్శించారు. జడ్జిలపై కూడా వదల్లేదు. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టి అవమానపరుస్తున్నారన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనీ, దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. తుగ్లక్ వ్యవహారం కాకపోతే దేశంలో ఏ రాష్ట్రానికైనా మూడు రాజధానులున్నాయా? అని ప్రశ్నించారు. అమరావతిలో ప్రభుత్వ, రైతులు ఇచ్చిన భూములు కలిపి 50వేల ఎకరాలు ఉన్నాయి. అన్ని నిర్మాణాలు పోనూ 10వేల ఎకరాలు మిగులుతాయి. ఎకరా రూ.10 కోట్లయినా లక్ష కోట్లు. రూ.30 కోట్లయితే.. మూడు లక్షల కోట్లు. ఈ ఆస్తిని జగన్ విధ్వంసం చేశారు. మీకు ముద్దులు పెట్టాడు..ఒక్క చాన్స్ అని జగన్ వచ్చాడు.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ప్రజల జీవితాలను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. రాయలసీమకు తుగ్లక్ సీఎం ఒక్క పరిశ్రమనైనా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు
తెలుగుదేశం హయాంలో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తెచ్చామని చెప్పారు.
జగన్ గొప్పగా చెప్పుకుంటున్న నవరత్నాలు నిజానికి నవమోసాలని చంద్రబాబు అన్నారు. నవరత్నాలు పేరిట గోరంత ఇచ్చి కొండంత దోచుకుంటున్నారని విమర్శించారు. నందిగామలో నాపై రాళ్లు వేస్తే.. సెక్యూరిటీ అధికారికి గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే... పూలలో రాయి వచ్చిందన్నారు. రేపు పూలలో బాంబు కూడా ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
ఆనాడు బాబాయిని చంపి, నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారు. ప్రభుత్వం వచ్చాక నిందితులను ఎందుకు పట్టుకోలేదు? తండ్రిని చంపిన హంతకులను శిక్ష పడాలని వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆమె చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలుద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
నేను సీనియర్ నాయకుడిని.. నన్ను అవమానించే సాహసం ఎవరూ చేయరు. అసెంబ్లీకి వెళ్లిన నన్నే కాదు.. నా భార్యను కూడా అవమానించారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని బయటకు వచ్చా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచి గౌరవ సభలో అడుగు పెడతా. నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. ఎన్నికల్లో మనమంతా కష్టపడి గెలవాలని చంద్రబాబు అన్నారు.
జగన్ మద్యం వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ జగన్ వే. పంపిణీ మొత్తం ఆయనదే. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లే అమ్ముతున్నారు. డబ్బులన్నీ ఆయనకే చేరిపోతాయి.. ఢిల్లీలో మద్యం స్కాం జరిగింది. ఈడీ, ఐటీ దర్యాప్తు చేస్తున్నాయి. ఏపీలో ఢిల్లీ మద్యం స్కాంను మించిన మద్యం స్కాం జరుగుతోంది. మరి నిఘా సంస్థలు ఈ వైపు దృష్టి సారించవా అని నిలదీశారు.