మంత్రి తలసాని సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు

చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు దర్యాప్తు మొత్తం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేస్తున్న వారు, విచారణకు పిలుస్తున్న వారిలో అత్యధికులు తలసాని సంబంధీకులే కావడంతో ఈ అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. ఇప్పటి వరకూ చీకోటి ప్రవీణ్ కేసుకు సంబంధించి తెలంగాణలో ఈడీ నోటీసులు అందుకున్న వారు కానీ, విచారణకు హాజరైన వారు కానీ చాలా వరకూ తలసాని సంబధీకులు, ఆయన ఆర్థిక వ్యవహారాలుచూసే వారే కావడం గమనార్హం. ఈడీ ఇప్పటి వరకూ ఆయనకు నోటీసులు ఇవ్వలేదన్నమాటే కానీ ఆయన ఇద్దరు సోదరులు, వ్యక్తిగత కార్యదర్శిలను ఈడీ నోటీసులు జారీ చేసి పిలిపించుకుని మరీ ప్రశ్నించింది. ఒక దశలో తలసాని కుమారుడికీ ఈడీ నోటీసులు జారీ చేసినట్లు విస్తృతంగా ప్రచారమైంది. అయితే.. అది వాస్తవం కాదనీ, ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ రాలేదనీ తలసాని కుమారుడు స్పష్ట చేశారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న తనను బదనాం చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు నోటీసులు వచ్చాయా? లేదా అన్నసంగతి పక్కన పెడితే.. చీకోటి ప్రవీణ్ తో తలసానికి సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ గట్టిగా నమ్ముతోంది. అంతెందుకు చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెరాస వర్గాలలోనే చర్చ జరుగుతోంది. అయితే తలసానికి నేరుగా ఈ కేసులో సంబధాలు ఉన్నట్లు రుజువు అయ్యే అవకాశాలు లేవన్న చర్చా సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తలసాని ఆర్థిక వ్యవహారాలన్నీ తన సన్నిహితుల పేరు మీదే ఉంటాయనీ అంటున్నారు. ఆ కారణంగానే ఇప్పటి వరకూ తలసానికి ఈడీ నోటీసులు జారీ చేయలేదని చెబుతున్నారు. కానీ క్యాసినో కేసులో తలసాని సన్నిహితులకు ఉచ్చు బిగిసిందనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ సాగిస్తున్న వారంద గురించీ చీకోటి ప్రవీణ్ విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగానే ఈడీ ప్రశ్నిస్తోందని అంటున్నారు. చీకోటి ప్రవీణ్   కస్టమర్ల ఖాతాలను బయటకు తీసి.. వారి ఆర్థిక లావాదేవీలపైనే విచారణ కేంద్రీకృతమై ఉండటంతో ఈడీ నోటీసులు అందుకున్న వారంతా ఆందోళనలో ఉన్నారంటున్నారు.

చిరుకు పురస్కారం.. బీజేపీ వ్యూహమేనా?

మెగాస్టార్ చిరంజీవి.. నటుడిగా ఆయనకు పురస్కారాలు దక్కడం ఎవరూ అభ్యంతర పెట్టరు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయనను వరించడం ఆయన నటనా కిరిటంలో మరో కలికితురాయి అనడంలో సందేహం లేదు. కానీ ఆ తరువాత మోడీ ఇత్యాదుల అభినందనలతోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ పురస్కారం విషయంలో కూడా రాజకీయ లెక్కలు వేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ప్రతి ఏటా ఇచ్చే ఒక అవార్డు చిరంజీవికి దక్కడం వల్ల ఆయనకు కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఆయన నటనా వైదుష్యానికి ఇలాంటి పురస్కారాలతో మెరుగులు అద్దినట్లు కావు. పద్మ విభూషన్ చిరంజీవి నటుడిగా తన ప్రతిభ, ఘనత ఏమిటన్నది ఇప్పటికే రుజువు చేసుకున్నారు. అయితే చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం తరువాత బీజేపీ నేతలు చేస్తున్న హంగామా, హడావుడే.. దీని వెనుక ఆ పార్టీ ఏదైనా రాజకీయ ప్రయోజనం ఆశిస్తోందా అన్న అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా చిరంజీవిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ కూడా అభినందనలు తెలిపింది. ఈ పురస్కారం ద్వారా చిరంజీవిని ‘తమ’ వాడు చేసేసుకున్నామని బీజేపీ బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందా అనిపించక మానదు. ఇక ఒక్క సారి వెనక్కు వెళ్లి చూస్తే.. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మోడీ భీమవరం వచ్చినప్పుడు ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించి.. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీ తో  మైత్రిలో ఉన్నారు.   ఈ నేపథ్యంలోనే చిరంజీవిని బీజేపీ ప్రత్యేక ప్రాముఖ్యతతో చూస్తోందని అంటున్నారు. చిరంజీవి కూడా ఇటీవలి కాలంలో తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లుగా చెప్పకపోయినా.. రాజకీయ ఆసక్తి మాత్రం కనబరుస్తున్నారు. తన కంటే రాజకీయాలలో తన సోదరుడు మెరుగ్గా రాణిస్తారనీ, ఆయన గొప్ప స్థానానికి వెళతారనీ ఇటీవలే చెప్పారు.  భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో మోడీ చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రత్యేకంగా ఉంది. చిరంజీవి తనకు ఎంతో ఆప్తమిత్రుడన్నట్లుగా మీడీ తీరు ప్రస్ఫుటమైంది. తర్వాత కూడా ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండేలా బీజేపీ వ్యవహరిస్తోంది.   చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా ఆయన కరిష్మాను బీజేపీ పూర్తిగా ఉపయోగించుకునేందకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తులో ఉండి కూడా.. సినీ గ్లామర్ మరింత ఎక్కువగా వచ్చే ఎన్నికలలో తమకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అందరివాడు చిరంజీవిని తమ వాడుగా ప్రొజెక్ట్ చేసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలలో పవన్ కల్యాణ్ ఒక్కడే కాకుండా చిరంజీవిని కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. మరి ఆ వ్యూహాలు ఫలిస్తాయా? లేదా అన్నది రానున్న రోజులలో తేలుతుంది. ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూనే చిరంజీవి పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ భేషుగ్గా ఉంటుందంటూ జోస్యాలు చెబుతున్నారు. 

సిరీస్ పై టీమ్ ఇండియా కన్ను.. న్యూజిలాండ్ తో చివరి టి20 నేడే

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టి20ల సిరీస్ లో ఇప్పటికే భారత్ 1-0 ఆధిక్యతతో ఉంది. చివరిదైన మూడో వన్డే మంగళవారం (నవంబర్ 21)న జరగనుంది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి విదితమే. రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పై సునాయాస విజయం సాధించింది. సూర్యకుమార్ ఆకాసమే హద్దుగా చెలరేగి అజేయ శతకం చేయడంతో టీమ్ ఇండియా 65 ప‌రుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. ఇక చివరిదైన మూడో టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. మరో వైపు న్యూజిలాండ్ ఎలాగైనా సిరీస్‌ను స‌మం చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. అయితే.. ఆ జ‌ట్టు.. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్   వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటంలేదు. దీంతో  సౌథీ సారథ్యంతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది. భారత్ విజయం సాధించిన మ్యాచ్ లో న్యూజిలాండ్ కు, భారత్ కు ఉన్న ఒకే ఒక తేడా సూర్య కుమార్ యాదవ్. సూర్యకుమార్ యదవ్ విజృంభణే మ్యాచ్ ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా వచ్చేలా చేసింది.  సూర్యకుమార్ యాదవ్ ను మినహాయిస్తే మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. మంగళవారం (నవంబర్ 21) జరిగే మ్యాచ్ లో కూడా సూర్య కుమార్ యాదవ్   మ్యాజిక్ రిపీట్ చేస్తే టీమ్ ఇండియాకు తిరుగే ఉండదు. అయితే మిగిలిన బ్యాటర్లు కూడా ఫామ్ అందిపుచ్చుకోవాలని టీమ్ ఇండియా ఆశిస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పామ్ అందిపుచ్చుకుని రాణించాల్సి ఉంది. రెండో మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ భార‌త్ బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.  అదే జ‌రిగితే మ‌రోసారి సంజు శాంస‌న్‌, ఉమ్రాన్ మాలిక్‌, శుభ్‌మ‌న్ గిల్‌లు బెంచీకే ప‌రిమితం కాక‌త‌ప్ప‌దు. మార్పులు చేయాల‌ని భావిస్తే శ్రేయాస్ స్థానంలో సంజుకు అవ‌కాశం ఇవ్వొచ్చు. కెప్టెన్‌గా త‌న‌దైన ముద్ర వేయాల‌ని భావిస్తున్న హార్ధిక్ తుది జ‌ట్టులో ఎవ‌రికి చోటు ఇస్తాడో చూడాల్సిందే. 

మంగ్లికీ ఓ సలహాదారు పదవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలహాదారుల పదవుల నియామక మేళా జరుగుతోంది. వారానికి ఇద్దరు చొప్పున సలహాదారు పదవులలో నియమితులౌతున్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. అంతా నా యిష్టం అన్న రీతిలో విమర్శలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వ సలహాదారుల నియామకాల జోరు పెంచేస్తున్నారు.  తాజాగా ప్రముఖ గాయని మంగ్లీని ఏపీ ప్రభుత్వం ఓ సలహాదారు పదలో నియమించింది. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి పదవులిస్తూ ప్రోత్సహిస్తున్నారు సీఎం జగన్. అలీ, పోసాని మురళిలక సలహాదారు పదవులు ఇచ్చిన జగన్ తాజాగా   మంగ్లీకి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా మంగ్లీని నియమించారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే మంగ్లిని సలహాదారుగా నియమిస్తూ ఎస్వీబీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వీబీసీ అనగానే ధర్టీ ఇండస్ట్రీస్ పృధ్వికి జరిగిన మర్యాద గుర్తొచ్చిందో ఏమో ఉత్తర్వులు వెలువడినా మంగ్లీ మాత్రం ఇంత వరకూ బాధ్యతలు చేపట్ట లేదు. చివరకు సమాధానపడి, నాలుగు రోజుల క్రితమే ఆమె ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మంగ్లీకి లక్ష రూపాయల జీతం ఫిక్స్ చేసింది జగన్ సర్కార్. ఇవి కాకుండా ఇతర ఫెసిలిటీస్ అదనం. ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారు పదవిలో మంగ్లీ రెండేళ్లపాటు  కొనసాగుతారు. ఆమె తిరుపతికి వచ్చే సమయంలో వాహన సౌకర్యం, వసతి సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ నియామకంపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. అటు మంగ్లీ కూడా తనకు పదవి వచ్చిన విషయంపై కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన విషయంపై కానీ స్పందించలేదు. ఈనెల 17న తిరుమలకు వచ్చి రెండురోజులపాటు అక్కడే ఉండి శ్రీవారిని దర్శించుకున్నారు గాయని మంగ్లీ. అదే సమయంలో ఆమె ఎస్వీబీసీ బోర్డ్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా అలీని ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళిని నియమించిన సంగతి విదితమే. కాగా ఎస్వీబీసీ బోర్డు సలహాదారులగా మంగ్లి నియామకం పట్ల మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందిస్తూ రోజా తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తనదైన ప్రత్యేకత చాటుకుంటూ గాయనిగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న గాయని మంగ్లిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ )కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా(ఎస్వీబీసీ) ఏపీ ప్రభుత్వం నియమించడం చాలా ఆనందంగా ఉంది. మంగ్లి తన సాంగ్స్ తో  స్వామిని స్మరిస్తూ మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నా.. ఆల్ ది బెస్ట్ మంగ్లీ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.

రాహుల్ వెడ్స్ అతియా షెట్టి వెరీ సూన్

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అతియా షెట్టిని త్వరలో మనువాడ బోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్, అతియా జంట స్వయంగా చెప్పారు. దీనినే అతియా షెట్టి తండ్రి, నటుడు సునీల్ షెట్టి ధృవీకరించాడు.   అయితే వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పాడు. తరచుగా క్రికెట్ సిరీస్ లతో రాహుల్ ఎక్కవగా విదేశీ పర్యటనల్లో ఉన్నందున, అతడికి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటారని సునీల్ షెట్టి  క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హేరా ఫేరీ 3తో బిజీగా ఉన్న సునీల్ షెట్టీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నాడు కానీ అతియా షెట్టి మాత్రం 2019 తరువాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం అతియా షెట్టి, కేఎల్ రాహుల్ లు లివిన్ రిలేషన్ లో ఉన్నారు. గత మూడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆ విషయాన్ని వీరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ రిలేషన్ ను వివాహ బంధంతో మరింత పటిష్టం చేసుకోనున్నారు.  

తెలుగు కెనడా 2022 మెగా వేడుకలు

టొరంటో: తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో (TCAGT) దీపావళి వేడుకలను కెనడా దేశం లోని అంటారియో రాష్ట్రం లోగల ఎటోబికో నగరంలోని డాంటే అలిగిరీ అకాడమీ పాఠశాలలో విజయవంతంగా నిర్వహించింది. మిసిసాగా, బ్రాంప్టన్, స్కార్బరో, కిచెనర్, వాటర్లూ, కేంబ్రిడ్జ్, హామిల్టన్, మిల్టన్, మార్కమ్, రిచ్మండ్ హిల్, లండన్, నయాగరా ఫాల్స్ మరియు ఇతర గ్రేటర్ టొరంటో ప్రాంతాల నుండి అనేక వందల మంది తెలుగు ప్రవాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తమను తాము అభినందించుకోవడం మరియు మొదటిసారిగా చేరిన కొత్త వ్యక్తులను స్వాగతించడంతో ఈవెంట్ ప్రారంభమైంది. ఈ ఈవెంట్లో పాల్గొనడం వల్ల అందరి నుండి సంతోషం మరియు ఆనందం యొక్క మెరుపులతో విశేషమైన స్పందనలు వచ్చాయి. దీపావళి స్పెషల్ తెలుగు ఫుడ్ డిలైట్స్ యొక్క గొప్ప వెరైటీలను అందరూ ఆస్వాదించారు.   తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో (TCAGT) అతిథులు, స్పాన్సర్లు, సభ్యులు, కుటుంబాలు మరియు స్నేహితులకు స్వాగతం పలికే రంగురంగుల పూల డిజైన్లతో వేదికను పద్మిని కంటాబత్తిన వాలంటీర్ల సహాయంతో అలంకరించారు. డైరెక్టర్ మైత్రి కల్లూరి మరియు కిరణ్మయి బృందం హాజరైన వారికి గులాబీలు మరియు పన్నీరు చల్లుతూ స్వాగతం పలికారు. అనేక కుటుంబాలు TCAGT ఫోటో బూత్లో సాంప్రదాయకంగా మరియు రంగురంగులలో అధిక నాణ్యత గల వస్తువులతో అలంకరించబడిన మరియు అనుకూలీకరించిన చిత్రాలను తీసుకున్నారు.  దీపావళి పండుగ వేడుకలు "దీపారాధన" మరియు కెనడియన్, భారత జాతీయ గీతాలతో ప్రారంభమయ్యాయి. కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు భారతీయ సంప్రదాయ జ్యోతిప్రజ్వలన చేశారు.   TCAGT సెక్రటరీ శివప్రసాద్ యెల్లాల ప్రారంభోపన్యాసం చేసి కార్యక్రమాన్ని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మాస్టర్ ఆఫ్ సెర్మనీస్గా టాలీవుడ్ సినీ నటి శ్రీమతి జయలక్ష్మి హరిదాసు, విశాల్ బెజవాడలను ఆయన ఆహ్వానించారు. ట్రస్టీ జగన్ పైడిపర్తి, మాజీ కార్యదర్శి శైలజ శుభాకాంక్షలు అందించారు. జగన్ మరియు శైలజ గారు రాజేశ్వరరావు వీరల్లా (బంజారా ఇండియన్ రెస్టారెంట్ యజమాని) ని పూల బొకేతో సత్కరించారు. కెనడాలో వందలాది కొత్త కుటుంబాలు మరియు వారి విజయవంతమైన కెరీర్లను చూడటం పట్ల రాజేశ్వరరావు గారు తన సందేశంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. TCAGT ప్రెసిడెంట్ శ్రీమతి దేవి చౌదరి తన శుభాకాంక్షలు అందించారు. ఆమె స్వాగత ప్రసంగంలో అసోసియేషన్లో తన ప్రమేయం మరియు భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె అద్భుతమైన వృద్ధిని మరియు భారతీయ సంస్కృతి మరియు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని చూసింది. గత 34 సంవత్సరాలుగా, TCAGT తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని కలుసుకోవడానికి, నెట్వర్క్ చేయడానికి మరియు వాటిని తరువాతి తరాలకు అందించడానికి వేదికను అందించింది. ఈవెంట్లో భాగమైనందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్టీలు, సలహాదారులు, స్పాన్సర్లు మరియు స్నేహితులను ఆమె గుర్తించి, ఈవెంట్ను గ్రాండ్గా విజయవంతం చేయడం కోసం బృందంగా సహకరించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు నాట్యం గ్రూప్ డ్యాన్స్ వర్క్షాప్ సహాయంతో ప్రొఫెషనల్ టాలీవుడ్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ మరియు కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్ జయలక్ష్మి గారు కొరియోగ్రాఫ్ చేసిన అద్భుతమైన నృత్య ప్రదర్శనలు కూడా ఉన్నాయి. కపుల్స్ ఫ్యాషన్ షో పోటీలు, జుగల్బంధీ గ్రూప్ టాలీవుడ్ డ్యాన్స్ అంశాలు మరియు ఇతర డ్యాన్స్ మెలోడీలు కమ్యూనిటీ సభ్యులందరినీ ఉర్రూతలూగించాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ మరియు TCAGT మాజీ చైర్మన్ అయిన సూర్య బెజవాడ శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో, TCAGT అన్ని తెలుగు కుటుంబాలకు వారి పిల్లల ప్రతిభను, యువశక్తిని మరియు తల్లిదండ్రుల కనెక్షన్లను, నెట్వర్క్ను మెరుగుపరచడానికి మరియు వివిధ రంగాలలో ఆసక్తిని కలిగించే అవకాశాలను అన్వేషించడానికి ఒక వేదికగా ఉందని హైలైట్ చేశారు. TCAGT అవసరమైన కుటుంబాలకు గొప్ప సహాయాన్ని అందించింది, కేవలం రెండు వారాల వ్యవధిలో జీవించి ఉన్న యువ జీవిత భాగస్వామికి సహాయం చేయడానికి సంస్థ అరవై-ఐదు వేల డాలర్లకు పైగా సేకరించిన సంఘటనలను పేర్కొంది. రాబోయే అన్ని TCAGT ఈవెంట్లు మరియు కార్యకలాపాల్లో చేరాలని మరియు పాల్గొనాలని కొత్త సభ్యులను ఆయన ఆహ్వానించారు. సూర్య బెజవాడ TCAGT నాయకత్వాన్ని తనతో కలిసి గౌరవ కాన్సుల్ జనరల్ శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ భారత కాన్సులేట్ జనరల్ శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ గారిని ఆయన పరిచయం చేశారు. తన శుభాకాంక్షలలో, ఆమె తెలుగు కమ్యూనిటీ యొక్క శక్తిని ప్రస్తావించింది మరియు ఈ ఈవెంట్ వేడుకలలో ఇండో-కెనడియన్ యువత పాల్గొనడం ద్వారా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని మరియు భారతీయ సంప్రదాయాలను కాపాడుతున్నందుకు TCAGT కమిటీని ప్రశంసించారు. ఆమె స్పాన్సర్ వ్యాపార స్టాల్స్ను సందర్శించి, కెనడాలో దిగుమతి చేసుకున్న మరియు పంపిణీ చేయబడిన భారతీయ ఉత్పత్తుల మూలాన్ని అడిగి తెలుసుకున్నారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)కి ప్రత్యేక అతిథిగా భారతీయ చలనచిత్ర దిగ్గజాలను ఆహ్వానించడానికి అనేక ఎంపికలు ఉన్నప్పుడు, చివరికి అది విజయవంతమైన తెలుగు చలనచిత్ర పాన్ ఇండియా అత్యధిక పారితోషికం పొందిన దర్శకుడు, RRR మరియు బాహుబలి ఆర్కిటెక్ట్ S. S. రాజమౌళికి వెళ్లిందని ఆమె గుర్తుచేసుకుంది. ప్రత్యేక అతిథిగా అతని హాజరు TIFFలో చరిత్ర సృష్టించింది. గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ అంతా టాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్స్ను ఆదరించడం గర్వించదగ్గ క్షణం. ఎవర్ ఎనర్జిటిక్ సింగర్స్ శ్రీకాంత్ సండుగు, శృతి నండూరి లచే నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో మెగా మ్యూజికల్ నైట్ జరిగింది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ జయలక్ష్మి హరిదాసు మరియు మాధవ్ బెజవాడ అందించిన కూచిపూడి డ్యాన్స్ బ్యాలెట్ వరూధిని ప్రవరాఖ్య ప్రదర్శన సాయంత్రం హైలైట్లలో ఒకటి మరియు అన్ని వయసుల వారు బాగా ఆస్వాదించారు మరియు ఇది తెలుగు వైభవాన్ని వేదికపైకి తీసుకువచ్చింది. భారతదేశానికి చెందిన కూచిపూడి క్లాసికల్ మాస్ట్రో కళారత్న డా.కె.వి.సత్యనారాయణ గారు ఈ ప్రత్యేక నృత్యానికి కొరియోగ్రఫీ, సంగీతం, శిక్షణ మరియు కంటెంట్ అందించారు. యష్ మరియు టీమ్ అందించిన ప్రత్యేక టాలీవుడ్ కలర్ఫుల్ ఎలక్ట్రిఫైయింగ్ మెడ్లీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఆడిటోరియం మొత్తాన్ని సూపర్ఛార్జ్ చేసింది మరియు ప్రతి ఒక్కరికి కాలు కదపడానికి మరియు సరిపోయేలా కొన్ని క్రేజీ డ్యాన్స్ మూవ్లను చూపించింది. కపుల్స్ ఫ్యాషన్ షో పోటీలకు అధ్యక్షురాలు దేవి చౌదరి నగదు పురస్కారాలను అందజేశారు. మొదటి బహుమతిని సింహకృష్ణ మరియు తేజస్విని దంపతులు, రెండవ బహుమతిని కోటి అవారి మరియు హేమ అవారి గెలుచుకున్నారు. ట్రస్టీ చైర్మన్ కోటేశ్వరరావు, ప్రియా పోలవరపు, రావు వఝా, విజయలక్ష్మి, మాజీ అధ్యక్షుడు రాజేష్ విస్సా, శ్రీవాణితో పాటు పలువురు ముఖ్య నాయకులు అబ్బురపరిచే వేడుకల్లో పాల్గొన్నారు. రాజేష్ విస్సా ధన్యవాదాలు తెలిపారు. నిజానికి, ఈవెంట్ అన్ని రంగాలలో వినోదం, ఉత్సాహం మరియు శక్తిని తీసుకువచ్చింది. శైలజ పైడిపార్టీ, శ్రీవాణి, పద్మిని మరియు అనిత బెజవాడ ఇతర వాలంటీర్లతో కలిసి తాజాగా తయారు చేసిన ఆహారపు ప్రామాణికమైన రుచుల కోసం ఆయన ఫుడ్ టీమ్ను అభినందించారు. నోరూరించే పండుగ ఆహారాన్ని ప్రజలు ఆస్వాదించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్, కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, యాంకర్ జయలక్ష్మి హరిదాసు మరియు స్టైలిష్ TCAGT యూత్ మెంబర్ విశాల్ బెజవాడ వారి అద్భుతమైన, ఇంటరాక్టివ్, ప్రేమగల, ఆకర్షణీయమైన ప్రతిభ మెగా ఈవెంట్కు హాజరైన ప్రేక్షకులను మరింత మంత్రముగ్ధులను చేసి చిరస్మరణీయంగా మార్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్నింటికంటే మించి, శ్రీకాంత్ మరియు శ్రుతి గాన ద్వయం వారి ఉత్తమ టాలీవుడ్ పాటలతో సాయంత్రాన్ని కదిలించారు. మెగా ఈవెంట్ను నిర్వహించడంలో విశేష కృషి చేసినందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్టీలు, స్పాన్సర్లు మరియు వాలంటీర్లను ఆయన అభినందించారు. సభ్యత్వాలు మరియు స్పాన్సర్ల సహాయం లేకుండా, TCAGT ఈ సంఘం ద్వారా తెలుగు కమ్యూనిటీకి అసాధారణమైన సేవను అందించలేదు. సంస్థాగత వృద్ధి, స్వయంసేవకంగా మరియు సంఖ్యాపరంగా మరింత మెరుగుపరచడానికి TCAGT బృందంలో చేరాలని అతను ప్రేక్షకులను ఆహ్వానించాడు. వీడియో, ఫోటోగ్రఫీ, డిజిటల్ కంటెంట్, సౌండ్, లైటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ బెజ్ప్రొడక్షన్స్ మీడియా, కెనడా చేత బాగా నిర్వహించబడ్డాయి. మరిన్ని వివరాలు మరియు నవీకరణల కోసం మా వెబ్సైట్ www.telugutoronto.com ని సందర్శించండి. ఈవెంట్ చిత్రాల కోసం క్రింది లింక్పై క్లిక్ చేయండి: Toronto Telugu Celebrations - Telugu Canada 2022 Mega Celebrations

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు !

తెలంగాణలో తెరాస నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలేలక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలుదూకుడె పెంచాయి. ఒక వైపు మద్యం కుంభకోణంలో ఈడీ వేగంపెంచగా, మరో వైపు చీకోటి ప్రవీణ్ కేసీనో కేసులో కూడా ఈడీ దర్యాప్తులో దూకుడు చూపుతోంది. మరో వైపు ఐటీ కూడా వేగం పెంచింది. తాజాగా తెలంగాణ  మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ దాడులు చేసింది. మంగళవారం ఉదయం నుంచే మల్లారెడ్డి  నివాసం, కార్యాలయాలపై దాడులు ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి నివాసాలూ, కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. కుమారుడికి చెందిన సికింద్రాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలో ఐటీ సోదాలు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇంకా హైదరాబాద్‌లో మల్లారెడ్డికి చెందిన బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 50 బృందాలుగా వచ్చిన ఐటీశాఖ అధికారులు  ఏక కాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబంపైనే కాకుండా నగరంలోని పలువురి ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లా, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తెరాసలో కలకలం రేపుతున్నాయి.  ఇటీవలె కరీంనగర్‌లో మంత్రి గంగుల కమాలకర్  నివాసం, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారులు ఉమ్మడి సోదాలు నిర్వహించగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఇప్పుడు ఇలా మల్లారెడ్డి ఇంటిపై కూడా అటాక్ చేయడం తెరాసలో కలకలం రేపుతోంది. మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి కుమార్తె, కుమారుడు, అల్లుడి నివాసాలలో కూడా దాడులు జరుగుతున్నాయి.   ఇటీవల తెరాస విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఆ సందర్భంగా తెరాస నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలపై కూడా ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉన్నాయి. అయినా  ఎవరూ భయపడొద్దు అని చెప్పిన సంగతి తెలిసిందే. తెరాస నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ కక్షసాధింపునకు పాల్పడుతోందని కేసీఆర్ ఆ సందర్భంగా అన్నారు. ఇప్పుడు వరుసగా తెరాస నేతలు లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో కేసీఆర్ చెప్పిందే జరుగుతోందేని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

నివాస ప్రాంతంలో కుప్పకూలిన విమానం.. ఎనిమిది మంది మృతి

కొలంబియాలో ఓ హెలికాప్టర్ నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్నఎనిమిది మందీ దుర్మరణం పాలయ్యారు. కొలంబియాలోని అతి పెద్ద నగరాలలో ఒకటైన మెడెలిన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బెలెన్ రోసేల్స్ సెక్టార్‌లో ఈ విమాన ప్రమాదం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టారు.  ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్‌లో ఇంజిన్ వైఫల్యంతో ఒలాయా హెర్రెరా విమానాశ్రయానికి తిరిగి వెళ్లే సమయంలో కూలిపోయిందని చెబుతున్నారు.  సామాజిక మాధ్యమంలో ఈ ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను ఎమర్జెన్సీ సర్వీసెస్ షేర్ చేసింది.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు.   ఇళ్ళ పైన నల్లటి పొగ దట్టంగా కమ్ముకున్నట్లు చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది.

నేపాల్ తెల్ల రాబందును రక్షించిన భారత్

నేపాల్ కు చెందిన అత్యంత అరుదైన రాబందును భారత్ అధికారులు రక్షించి సంరక్షించారు. పర్యావరణ మార్పుల కారణంగా రాబందుల సంతతి అంతరిస్తున్నది. అందులోనూ అత్యంత అరుదైన తెల్ల రాబందుల మనుగడ ప్రమాదంలో పడింది.   దాదాపు అంతరించిపోయిందనుకున్న ఈ సంతతి రాబందు ఒకటి నేపాల్ లో   కనిపించింది. తిండి కరవై చిక్కి శల్యమైన స్థితిలో కనిపించిన ఈ తెల్ల రాబందును నేపాల్ అటవీ శాఖ అధికారులు సపర్యలు చేసి రక్షించారు. దాని సంరక్షణ బాధ్యతను అత్యంత శ్రద్ధగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాని కదలికలు తెలుసుకునేందుకు  డియో ట్యాగింగ్ కూడా చేశారు. అయితే  గత కొన్ని రోజులుగా  ఈ రాబందు రాడార్ దృష్టికి కూడా అందలేదు. దీని ఆచూకీ తెలియక నేపాల్ అధికారులు కంగారు పడుతుండగా దీని ఆచూకీ  బీహార్‌లో  పక్షుల సంరక్షణ కేంద్రం అధికారులు కనుగొన్నారు.  ప్రస్తుతం బీహార్‌లో కనుగొన్న రాబందును భగల్పూరులోని పక్షుల పర్యవేక్షణ కేంద్రం నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. దీనికి వైద్య పరీక్షలు జరిపారు. కొద్దిరోజుల తరువాత దీనిని విడిచిపెడతామని  అధికారులు తెలిపారు.   తమ దేశంలో తప్పిపోయిన రాబందు జాడ పట్టేసినందుకు నేపాల్ వన్యపరిరక్షణ అధికారులు భారత   అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.  

ఏనుగును పెంచుకుంటున్నారా అంటూ బీజేపీ ఎమ్మెల్యేపై దాడి

కర్నాటకలో జనం బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. దుస్తులు చిరిగిపోయి ఆయన అవమానభారంతో కుప్పకూలిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది   ఎమ్మెల్యేను జనం బారి నుంచి కాపాడి తీసుకువెళ్లారు. ఈ ఘటన చిక్కమగుళూరులో జరిగింది. కారణమేమిటంటే పొలంలో పనులు చేసుకోవడానికి వెళ్లిన ఒక మహిళ ఏనుగు దాడిలో చనిపోయింది. ఎన్ని సార్లు, ఎంత కాలంగా చెబుతున్నా ఏనుగుల బెడద నుంచి తమను కాపాడే విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జనం మృతదేహంలో  నిరసనకు దిగారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే కుమారస్వామి అక్కడకు వచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించబోయారు. అయితే జనం ఆయనను అడ్డుకున్నారు. మీరేమైనా ఏనుగును పెంచుకుంటున్నారా? ఎన్ని సార్లు అడిగినా ఏనుగుల బెడద నుంచి మాకు రక్షణ కల్పించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఆ దశలో ఆగ్రహంతో ఆయనపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే గాయపడ్డారు. ఆయన దుస్తులు చిరిగిపోయాయి. జనం బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఆయన పరుగులు పెట్టారు. ఆ దశలో పోలీసులు అతి కష్టం మీద జనం బారి నుంచి ఎమ్మెల్యేను కాపాడి అక్కడి నుంచి తీసుకుపోయారు.  కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఏనుగుల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ గజరాజులు జనవాస కేంద్రాలపై చేస్తున్న దాడుల్లో పలువురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు.   ఎనుగుల దాడుల నుంచి తమను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నో సార్లు  విజ్ఞప్తి చేశారు. అటు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఏనుగు దాడిలో మరో మహిళ మరణించడంతో గ్రామస్తులు ఆగ్రహం పట్టలేక ఎమ్మెల్యేపై దాడికి దిగారు.

రస్నా ఫౌండర్ కన్నుమూత

ఐలవ్యూ రస్నా.. ఈ ప్రకటన ఎంత ప్రాచుర్యం పొదిందంటే.. అప్పట్లో చిన్నారులందరి నోటా ఇదే వినిపించేది. మండు వేసవిలో చల్లటి పానియం అంటే అప్పట్లో ఏకైక ఆప్షన్ రస్నానే. అప్పట్లో రస్నా సాఫ్ట్ డ్రింక్ కి ఉన్నడిమాండ్, ఫేమే వేరప్పా అన్నట్లుండేది. అలాంటి రస్నాఫౌండర్ అరీజ్ ఫిరోజ్ షా శనివారం (నవంబర్ 19) కన్నుమూశారు. రస్నా కంపెనీ ఈ విషయాన్ని ఆదివారం (నవంబర్ 20) ఒక ప్రకటనలో పేర్కొంది.  మండు వేసవిలో చల్లని పానియాన్ని తాగాలనుకునే మధ్య తరగతి జీవులకు రస్నా ఏకైక ఆప్షన్ గా మారింది. తక్కువ ధరకే మంచి మంచి ఫ్లేవర్లతో ఇంటిల్లిపాదీ చల్లని సాఫ్ట్ డ్రింక్ తాగేందుకు అవకాశం కల్పించింది రస్నా. అప్పట్లో ఇళ్లల్లో కాఫీ టీలు మానేసి రస్నా వైపే మొగ్గు చూపేవారంటే అతి శయోక్తి కాదు. తొలుత ఆరెంజ్ ఫ్లేవర్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సాఫ్ట్ డ్రింక్.. క్రమంగా రకరకాల ఫ్లేవర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తరువాత తరువాత సాఫ్ట్ డ్రింక్స్ లో ఎన్నిరకాల కంపెనీలు వచ్చినా రస్నా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అరీజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

జారుడు బండపై కాంగ్రెస్.. రేవంత్ గట్టెక్కించగలరా?

తెలంగాణలో కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి దిగజారుతోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి కానీ.. అదే రాష్ట్ర ఆవిర్బావం నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారంది.  తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయని పైకి కనిపిస్తున్నా, ఇప్పటికిప్పుడు తెరాసకు వచ్చిన ఇబ్బందేమీ లేని పరిస్ధితే ఉంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలని   ప్రయత్నాలు చేస్తున్నా అధికారం దక్కించుకునే స్థాయికి ఇప్పట్లో వచ్చే పరిస్థితి అయితే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడమే గగనమన్న పరిస్థితే ఇప్పటికీ ఉంది. పట్టణ ప్రాంతాల్లో బాగానే పుంజుకున్నా.. అధి వచ్చే ఎన్నికలలో అధికారాంలోకి తీసుకువస్తుందా అన్న ప్రశ్నకు లేదనే జవాబే వస్తుందని కమలం వర్గాలే అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో విజయం సాధించినా, మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు దీటుగా పోటీ ఇచ్చినా అది బీజేపీ బలం అని ఆ పార్టీ నాయకత్వమే ధీమాగా చెప్పలేని పరిస్థితి. అయితే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అంటే బీజేపీయే అనే పరిస్థితి అయతే వచ్చింది. అందుకు కాంగ్రెస్ బలహీనతలు, వైఫల్యాలే కారణం. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం, బలగం ఉండి కూడా ఎన్నికలలో చతికిల బడుతున్న కాంగ్రెస్ రాష్ట్రంలో సమీప భవిష్యత్ లో పుంజుకుంటుందా అంటే కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తు్నారు. అన్నిటికీ మించి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం కాంగ్రెస్ ను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కుదేలును చేసేస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కార్యకర్తలలో జోష్ పెరిగిందనడంలో సందేహం లేదు. అయితే దానిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని.. ప్రజలకు చేరవ కావడానికి మార్గదర్శనం చేయాల్సిన నాయకత్వం విఫలమౌతోంది. నిజానికి రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో పుంజుకోవడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకుని బలోపేతం కావడంలో ఆ పార్టీ వైఫల్యానికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే.  కాంగ్రెస్ గురించి తరచూ పెద్దలు చెప్పే మాట ఒకటి ఉంది. ఆ పార్టీని ఎవరూ ఓడించలేరు.. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని. రాష్ట్రంలో సరిగ్గా అదే జరుగుతోంది.    ఆ గొడవలే తెలంగాణలో ప్రజలకు పార్టీని దూరం చేస్తుంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ క్యాడర్ లో కాస్త జోష్ కనిపించినా, సీనియర్ నేతలు తమ వైఖరితో ఆ జోష్ ను బలవంతంగా అణిచేస్తున్నారు.  దానికి ఉదాహరణే తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలలో ఘోర ఓటమి. ఇప్పటికే పలుమార్లు యాత్రలు, పోరులు తలపెట్టిన అధ్యక్షుడు రేవంత్ కొంతవరకు ప్రజలలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. ఆ పార్టీ నేతలు సహాయ నిరాకరణతో ఫలితం ఉండటం లేదు.  ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలలోకి వెళ్లాలని రేవంత్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ విఫలం చేయడానికే అన్నట్లుగా సీనియర్లు వ్యవహరిస్తున్నారు. వీహెచ్, జగ్గారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కాంగ్రెస్ లోని ప్రతి సీనియర్ పేరూ చెప్పాల్సి ఉంటుంది. సీనియర్లు సహకరించకున్నా  రేవంత్ ఇప్పుడు మరో పోరుకు రెడీ అయ్యారు. ఈసారి రైతు సమస్యలపై   ఫోకస్ పెట్టారు. ధరణి పోర్టల్, ధాన్యం కొనుగోలు, పోడు భూముల సమస్యలపైన కార్యాచరణ సిద్ధం చేస్తూ పార్టీ నేతలను కలుపుకుపోవాలని సంకల్పించారు.  ముందుగా ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిరసన దీక్ష చేపట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాలలో ప్రజల సమస్యలపైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తర్వాత గవర్నర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కార్యాచరణ ఓకే కానీ.. ఇది ఎంతవరకు సక్సస్ అవుతుంది? సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారు అన్న సందేహాలు పార్టీ క్యాడర్ లోనే వ్యక్తమౌతున్నాయంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పకోనవరం లేదు. రైతు సమస్యలపై కార్యాచరణపై చర్చించేందుకు గాంధీ భవన్ లో సమావేశం కోసం  రేవంత్ పార్టీలో సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపిస్తేనే.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు  మాత్రమే హాజరయ్యారు. జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సమన్వయ లోపమే కాంగ్రెస్ పార్టీకి పుంజుకోవడానికి అవరోధంగా మారింది. దీనిని అధిగమించి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని ఏకతాటిపైకి రేవంత్ తీసుకురాగలరా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి నడిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ జారుడు బండపై ఉంది. రేవంత్ గట్టెక్కించగలరా అన్నది చూడాలి.

తుమ్మల దారెటు?

 తెరాసలో ఇప్పుడు ఎవరికీ పట్టని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే. తుమ్మల అంటే ఆషామాషీ వ్యక్తేం కాదు. సీఎం కేసీఆర్ తనంత తానుగా స్వయంగా టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. గత ఎన్నికల నాటి వరకూ తుమ్మల మాటే ఖమ్మం వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేది. అయితే 2018 ఎన్నికలలో తుమ్మల పాలేరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దాంతో ఆయన హవా పార్టీలో బాగా తగ్గింది.  కందాల ఉపేంద‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అనంత‌రం ఆయన కేసీఆర్ స‌మ‌క్షంలో అధికార పార్టీలో చేరారు. అప్ప‌టి నుంచి పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో తుమ్మ‌ల వ‌ర్సెస్ కందాల అన్న‌ట్లుగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.  కందాలకు ఉమ్మ‌డి జిల్లాలోని మిగిలిన అధికార పార్టీ నాయ‌కుల మ‌ద్ద‌తు ఉండ‌టంతో తుమ్మ‌ల‌ ఏకాకిగా మిగిలిపోయారు. ఖ‌మ్మం జిల్లా నుంచి మంత్రి హోదాలో పువ్వాడ‌, పార్ల‌మెంట‌రీ నేత‌గా నామా, ఎమ్మెల్యేలు రేగా, సండ్ర‌ల‌తో పాటు అంద‌రికీ ట‌చ్‌లో ఉంటున్న కేసీఆర్‌.. తుమ్మ‌ల‌ను దూరం పెట్టారు. రెండేళ్ల క్రితం వ‌ర‌కు జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పిన తుమ్మల ప్ర‌స్తుతం పార్టీలో ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్నేళ్లుగా జిల్లా రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం గ‌డ్డుకాలం ఎదుర్కొంటున్నారు. టీఆర్ ఎస్‌లో ఉన్న తుమ్మ‌లను జిల్లాలో ఏకాకిని చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిద‌ర్శనం ఇటీవ‌ల స‌త్తుప‌ల్లిలో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుల స‌న్మాన స‌భ జ‌రిగింది. ఈ స‌న్మాన స‌భ‌కు తుమ్మ‌ల మిన‌హా అధికార పార్టీలోని అన్ని ప్రాంతాల నేత‌లు పాల్గొన్నారు. తుమ్మ‌ల‌కు క‌నీసం ఆహ్వానం కూడా అంద‌లేద‌ని తెలుస్తోంది. ఇందుకు కార‌ణం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డేన‌న్న చ‌ర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల తుమ్మల ఆత్మీయ సమ్మేళనం అంటూ హడావుడి చేసినా మళ్లీ ఎందుకో సైలంట్ అయిపోయారు. అయితే తుమ్మల త్వరలో కారు దిగిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కమలం గూటికి చేరుతారా.. సైకిలెక్కుతారా అన్న చర్చ అయితే నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

వచ్చే ఏడాది డిసెంబర్ లోనే ఏపీ ఎన్నికలు!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు కొంతకాలంగా వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తు వచ్చే ఏడాది  డిసెంబర్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.  తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే  2023 డిసెంబర్ లోనే ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారంటూ, అందుకు పలు అంశాలు తెరమీదకు తెస్తున్నారు. రెండోసారి కూడా ఏపీ అధికారపీఠంపై తానే కూర్చోవాలని సీఎం జగన్ గట్టిగానే వ్యూహాలు రచిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నేతలు, బాధ్యులు, జిల్లాల ఇన్ చార్జులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో వారికి జగన్ నేరుగానే ఆదేశాలు జారీచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ‘175 అవుటాఫ్ 175 వైనాట్?’ అంటూ వారిని ఊదరగొడుతున్నారు. అంటే.. ఆ ఎన్నికల తర్వాత ఏపీలో ప్రతిపక్షం అనే మాటే లేకుండా చేయాలని, ఏకపక్షంగా రాష్ట్రాన్ని ఏలాలనే గట్టి పట్టుదలతో జగన్ ఉన్నారంటున్నారు. అంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉనికే లేకుండా చేయాలనేది జగన్ మిషన్ అంటున్నారు. పరిపాలనలో అనుభవ రాహిత్యంతో ఏపీని ‘అప్పుల ఆంధ్ర’గా మార్చేసిన జగన్, అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు అనుభవంలోకి రాకుండా చేసిన జగన్, విధ్వంసంతో ఏలుబడి ప్రారంభించి, ఈ మూడున్నరేళ్లుగా అదే పంథాలో కొనసాగుతున్న జగన్ పట్ల, వైసీపీ నేతల తీరుపట్ల విపక్షాల్లో, రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పూర్తికాలం కొనసాగాక ఎన్నికలకు వెళ్లే.. వ్యతిరేకత మరింత పెరిగిపోయి, కొంప కొల్లేరవుతుందని, పార్టీకి పుట్టగతులు ఉండవని, రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు తానే ఏలాలనే ఆశ ఆడియాస అయిపోతుందనే భయం జగన్ లో గూడుకట్టుకుందంటున్నారు. అందుకే  ముందస్తు ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు  సంకేతాలు వస్తున్నాయంటున్నారు. ఏపీలో ఇప్పటికే జనసేన- బీజేపీ పొత్తులో ఉన్నాయి. మరో పక్కన వైసీపీ సర్కార్ వైఫల్యాలు, జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక తీరుతెన్నులపై తెలుగుదేశం అధినేత,   నాయకులు నిత్యం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైజాగ్ సంఘటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై నేరుగా యుద్ధం ప్రకటించి, రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. రోజులు గడిచే కొద్దీ జనసేన- బీజేపీ కూటమికి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే పోలింగ్ నిర్వహిస్తే.. అది జగన్ కోరికకు, ఆశకు గండి పడే ప్రమాదం ఉందంటున్నారు. అడగకుండా ప్రతిసారీ తనకు మద్దతు ఇస్తున్న వైసీపీ పట్ల బీజేపీ అగ్రనేతలు మోడీ-షా జోడీకి ఎక్కడో ఏదో ఆగ్రహం ఉన్న ఛాయలే కనిపిన్నాయి. అందుకే విశాఖలో ఇటీవలి మోడీ పర్యటన, బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు వైసీపీ అధినేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతగా పాటుబడినా పెద్దగా గుర్తించలేదంటారు. పైగా వైసీపీపై యుద్ధం ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని అరగంటకు పైగా మోడీ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.  దీంతో వైసీపీ పెద్దల కన్నా జనసేనానికే మోడీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టం అయిందంటున్నారు. 2024 మేనెలలో సాధారణ ఎన్నికల సమయంలోనే ఏపీ ఎన్నికలు కూడా జరిగితే.. అప్పుడు మోడీ ఫీవర్ గట్టిగా ఉంటే.. తనకు ఇబ్బంది తప్పదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు కూడా జరిగితే.. మోడీ- షా ద్వయం రాష్ట్రంలో ఉధృతంగా పర్యటిస్తే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాలుగు దిక్కులా విపరీతంగా ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంటుందంటున్నారు.  అందుకే.. 2023 డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సమయంలో ఏపీలో ముందస్తుకు వెళ్తే.. ప్రయోజనం ఉండొచ్చనే నిర్ణయానికి జగన్ వచ్చారని తెలుస్తోంది. అలా ఎన్నికలు జరిపితే.. తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ నేతలు, అధినేతలు అక్కడే ఎక్కువగా ఫోకస్ పెడతారని, తద్వారా ఏపీపై అంతగా వారి ప్రభావం ఉండదని జగన్ బేరీజు వేసుకుంటున్నారంటున్నారు. తెలంగాణలో టీడీపీ మద్దతును బీజేపీ కచ్చితంగా తీసుకుంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అందుకు ప్రతిగా ఏపీలో టీడీపీకి బీజేపీ పొత్తు కుదురుతుందన్న అంచనాలు ఉన్నాయి. దాంతో టీడీపీ, బీజేపీ, జనసేనల నుంచి గట్టి పోటీనే వైసీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జరిగితే తన ముప్పై ఏళ్ల అధికారం కల కలగానే మిగిలిపోతుందనే భయం జగన్ లో నెలకొందని  అంటున్నారు. ఏపీలో ముందే ఎన్నికలు నిర్వహించి, అధికారం మళ్లీ చేజిక్కించుకుంటే.. పార్లమెంట్ ఎన్నికలపై ఆ ఫలితాల ప్రభావం ఉంటుందనేది వైసీపీ అధినేత అభిప్రాయం అంటున్నారు. అప్పుడు మరిన్ని ఎక్కువ లోక్ సభా స్థానాలు తాము గెలుచుకోవచ్చనేది జగన్ వ్యూహం అని చెబుతున్నారు. ఇలాంటి కారణాలతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

చిరంజీవికి ప్రధాని మోడీ ప్రశంసలు

సినీ రంగానికి చేసిన సేవలకు గాను మెగాస్టార్ చిరంజీవిని అరుదైన ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్- 2022’ అవార్డు వరించింది. గోవాలో జరుగుతున్న 53వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకల్లో 2022కి   చిరంజీవికి ఈ అవార్డును కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ప్రకటించారు. దీంతో ప్రధాని మోడీ సహా పలువురు చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా తెలుగులో ట్వీట్ చేసిన మోడీ.. చిరంజీవి వ్యక్తిత్వాన్ని, నటనా సామర్ధ్యాలను అభినందించారు. ‘చిరంజీవి   విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణనూ చూరగొన్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనకు అభినందనలు’ అంటూ చిరంజీవిని ట్యాగ్ చేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్ చేసిన కాసేపటికే చిరంజీవి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇలాంటి మంచి మాటలు చెప్పిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి   నరేంద్ర మోడీ   కృతజ్ఞతలు’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇంతకు ముందే ఈ అవార్డు విషయం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కి ధన్యవాదాలు చెబుతూ చిరంజీవి మరో ట్వీట్చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఇక చిరంజీవి సోదరుడు, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి అవార్డు పట్ల స్పందించారు. ‘నాలుగు దశాబ్దాలు పైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలుచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం  తనతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తికిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చిరంజీవిపై తన భక్తిని చాటుకున్నారు. ‘ధర్మం తెలిసిన ధర్మాత్ముడు, న్యాయం తెలిసిన న్యాయకోవిదుడు, మంచితనానికి మారుపేరు, మానవత్వం ఇంటిపేరు, అందరికీ నేనున్నా అనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. తండ్రి చిరంజీవికి దక్కిన ఈ అరుదైన గౌరవానికి ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే.. మరింతగా మురిసిపోయారు. ‘53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’గా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అప్పా- నిజంగా ఎంతో గర్వంగా ఉంది. మీరు ఎప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమే’ అంటూ రామ్ చరణ్ ఆనందంతో సంబరపడిపోయారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్ కు గాడ్ ఫాదర్ గా గౌరవం పొందుతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి ఇప్పటికి ఇంకా వెండితెరపై తన హవా కొనసాగిస్తున్నారు. గతంలో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని చిత్రరంగం నుంచి అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం, వహీదా రెహమాన్, సలీమ్ ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్ జోషి లాంటి ప్రముఖులు అందుకున్నారు.

భూకంపం.. ఇండోనేసియాలో పాతిక మంది మృతి

ఇండోనేసియాను భూకంపం వణికించింది. సోమవారం (నవంబర్ 21) మధ్యాహ్నం 5.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రతకు పలు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో కనీసం పాతిక మంది మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. వెస్ట్ జావాలో సంభవించిన ఈ భూ కంప తీవ్రత దృష్ట్యా మరణాల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్త మౌతోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల క్రిత  ఇండోనేషియా  సుమత్రా దీవుల్లో నైరుతి దిశలో  భూమి కంపించిన సంగతి విదితమే. రిక్టర్ స్కేల్ మీద ఆ భూకంప తీవ్రత 6గా నమోదయ్యింది. అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే  సోమవారం సంభవించిన భూకంపం నివాస ప్రాంతాలలో సంభవించడంతో .   ప్రాణ, ఆస్థి నష్టం సంభవించింది.

కడప గడపలో మసకబారుతున్న వైఎస్ కుటుంబ ప్రతిష్ఠ

కడప జిల్లా అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది వైయస్ ఫ్యామిలీ.. అలాంటి జిల్లాలో ఆ కుటుంబం తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చేశాయా? అంటే సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు అవునని స్పష్టం చేస్తున్నారు. కడప లోక్‌సభ సభ్యుడు వైయస్ ఆవినాశ్ రెడ్డి.. పర్యటన సందర్బంగా ఓ మహిళ చేసిన వ్యాఖ్యల తాలూకూ  ఓ వీడియో.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైయస్ ఫ్యామిలీకి కొత్త చిక్కులు మొదలైనాయంటూ సామాజిక మాధ్యమం వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి 2019 ఎన్నికలు అయిన కొంత కాలం వరకు ఉమ్మడి కడప జిల్లా... వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగానే ఉండేది.. అయితే  వైఎస్ తనయుడు,  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత..   జిల్లాలో వైఎస్ కుటుంబంపై వ్యతిరేకత ప్రబలుతోందని నెటిజన్లు అంటున్నారు.     ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు.. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య...  అంతకు కొద్ది రోజుల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో  అప్పటి విపక్ష నేత జగన్‌పై కొడి కత్తి దాడి.. అలాగే  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి  విజయమ్మ..  సోదరి షర్మిలలు.. పక్క రాష్ట్రానికి పరుగులు తీయడం.. అదే విధంగా వివేకా కుమార్తె సునీత  తన సోదరుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా  తన తండ్రి  హత్య కేసులో తనకు న్యాయం జరగడం లేదు, ప్రభుత్వమే ఈ హత్య కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకుంటోందంటూ సుప్రీంకోర్టు మెట్లక్కడం.. వంటి సంఘటనలతో పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ప్రభ మసకబారుతోందని అంటున్నారు.  వివేకా హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. ఈ అత్యంత కిరాతక హత్య ఇంటి దొంగల పనేనంటూ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడంతో జిల్లాలో వైఎస్ కుటుంబ అభిమానులు ఒక్క సారిగా ఆ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఇక  జిల్లాల విభజనలో భాగంగా.. అన్నమయ్య జిల్లా ముఖ్య కేంద్రం రాజంపేట కాకుండా  రాయచోటిని ఎంపిక చేయడంపై కూడా జగన్ పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  అలాగే సొంత బాబాయి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకే కాదు.. కోడికత్తి కేసును విచారిస్తున్న ఎన్ఐఏకు సైతం..   జగన్ ప్రభుత్వం సహకరించకపోవడంతో వీటి వెనుక ఉన్నది ఎవరో చూచాయిగానైనా అర్ధం చేసుకున్న కడప జిల్లా వాసులు జగన్ విశ్వసనీయత పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.    అదీకాక.. ఉమ్మడి కడప జిల్లాలోని పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని ఇప్పటికే ఓ నివేదిక జగన్ కు అందిందని చెబుతున్నారు.  ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో 175కి 175  అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సొంత జిల్లా లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని నెటిజన్లు అంటున్నారు.

మైండ్ గేమ్ రాజకీయాలు... నాయకులను మించి ఓటర్లు!

తెలంగాణలో మైండ్ గేమ్ రాజకీయాలు జోరందుకున్నాయి. అయితే ఈ గేమ్ లో రాజకీయ నాయకులను మించి ఓటర్లు రాటుదేలిపోయారు. అంతే కాదు.. రాష్ట్రంలో నిత్యం రాజకీయ హీట్ కొనసాగాలని భావిస్తున్నారు.  రోగీ వైద్యుడూ ఒకటే కోరారన్న సామెతలా.. తెలంగాణలో ఏదో ఒక అంశంతో  రాజకీయాల వేడిని తగ్గకుండా రాజకీయ పార్టీలు రగిలిస్తూనే ఉన్నాయి. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తి, బీఆర్ఎస్ పార్టీ ప్రకటన,ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు, నేతల మధ్య మాటల తూటాలు, ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులు... నిరసనలు... ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఇలా రాష్ట్రంలో రాజకీయ హీట్ ను పెంచే సంఘటనలు ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడుతూనే ఉన్నాయి.  ఇది   వచ్చే  అసెంబ్లీ ఎన్నికల వరకు  నిరంతరాయంగా కొనసాగే వాతావరణమే కనపడుతోంది. దీని వల్ల పాలన కుంటుపడటం తప్ప  రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ ఇసుమంతైనా ప్రయోజనం ఉండదు.   పోనీ.. రాజకీయ పార్టీలకైనా ప్రయోజనం ఉందా అంటే అదీ శూన్యమే. ఎందుకంటే రాజకీయ  హీట్ కాదు ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, రాష్ట్రాభిభివృద్దితోనే  మేలు జరుగుతుంది. రాజకీయాల్లో ఏ పార్టీ గెలిస్తే.. ఏముంది... షరా మామూలే. మాకేం జరుగుతుంది....? ఈ పార్టీ కాకపోతే.. ఆ పార్టీ..? ఆ పార్టీ కాకపోతే మరో పార్టీ...? ఏ పార్టీ గెలిచినా..   సమస్యలు తీరుతాయా..?   కష్టాలు గట్టెక్కుతాయా..? ఇన్నేండ్ల నుంచి చూస్తూనే ఉన్నాం... నాయకులు మారారే తప్ప... సమస్యలు పరిష్కారమైన సందర్భం లేదు.. సంపన్నులున్న ప్రాంతాల్లో రోడ్లు, పార్కులు అందంగా వస్తాయి.. కానీ బస్తీల్లో.. మాటలు ప్రకటనలు తప్ప పురోగతి ఉండదు. అన్న నిర్ణయానికి  జనం వచ్చేశారు. అందుకే అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకుల మధ్య రాజకీయాలు రుగులుతూ ఉంటేనే ప్రయోజనం అన్న భావనకు వచ్చేశారు. పోటీ ఎంత ఎక్కువగా ఉంటే.. ఎన్నికలు అంత ఖరీదుగా   మారుతాయని జనం అంటున్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలే జనం ఈ మైండ్ సెట్ లోకి వచ్చినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మారడం, ఆ నియోజకవర్గంలో ఉపఎన్నిక రావడం.. ప్రధానంగా రెండు రాజకీయ పార్టీల నేతలకు అక్కడ గెలుపు ప్రతిష్టాత్మకం కావడం. ఫలితంగా ఉప ఎన్నిక అత్యంత ఖరీదుగా మారడంతో... ఈ నియోజకవర్గాల ఉపఎన్నికను గమనిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రజలు ప్రతినియోజకవర్గంలోనూ అలాగే జరగాలనే యోచన చేస్తున్నారని అంటున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గం ఒక మునుగోడులా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు.

లెఫ్ట్, కారు బంధం ఇలాగే కొనసాగేనా? సీట్ల సర్దుబాటు సజావుగా ముగిసేనా?

 మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర సమితి, లెఫ్ట్ పార్టీల మధ్య చిగురించిన స్నేహం ఇలాగే కొనసాగనుందా? అంటే ఇరు పార్టీల నేతలూ కూడా ఔను ఇలాగే కొనసాగుతుందంటున్నారు.  ఇరు పక్షాల మధ్య పొత్తు ఇప్పుడు ఆ రెండు పార్టీలకూ కూడా అవసరం అని పరిశీలకులు అంటున్నారు. పైగా ఒక ఉప ఎన్నికలో విజయం కోసం కేసీఆర్ తన అవసరం కొద్దీ వామపక్షాలకు స్నేహహస్తం అందిస్తే.. అంతకంటే ఆత్రంగా వామపక్షాలు గతంలో తెరాస అధినేత తమను ఉద్దేశించి గతంలో చేసిన అవమానకర వ్యాఖ్యలను కూడా విస్మరించి అందుకున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వామపక్షాలు మరో అడుగు ముందుకేసి వచ్చే ఏడాది జరుగనున్న శాసన సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తాము పోటీచేసే సీట్లపై ఇప్పటికే దృష్టి సారించి.. ఆ దిశగా టీఆర్ఎస్ తో చర్చలకు సమాయత్తమౌతున్నట్లు చెబుతున్నారు.  అయితే, మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా గులాబీ దళానికి,  ఎర్ర సైన్యానికి మధ్య చిగురించిన స్నేహం..  పొత్తుగా మార్చుకునేందుకు వామపక్ష నేతలే కాకుండా, తెరాస అధినేత కూడా ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నారు. ఒంటరి పోరుకు దిగితే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే పాటి బలం లేని పార్టీలు వామపక్షాలైతే... తమ కొత్త పార్టీ బీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో ఇంతో కొంతో ఇమేజ్ ఉన్న (ఓట్లూ, సీట్లూ లేకపోయినా) వామపక్షాల అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే వామపక్షాలతో లైన్ క్లియర్ చేసుకునే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఒక పొత్తులో భాగంగా సీపీఐ రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ సీట్లపై గురి పట్టినట్లు తెలుస్తోంది. ఆ సీట్లు తమకు ఇస్తేనే టీఆర్ఎస్‌తో  పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ఇప్పటికే కేసీఆర్ కు సూచన ప్రాయంగా తెలియజేసిందని లెప్ట్ పార్టీల కార్యకర్తలే చర్చించు కుంటున్నారు. ముఖ్యంగా హుస్నాబాద్ సీటును తమకే కేటాయించాలని తెలంగాణ సీపీఐ గట్టిగా కోరుతోందని అందుకు కారణం అది సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం కావడమేనని అంటున్నారు. అయితే అంత తేలికగా టీఆర్ఎస్ కూడా ఆ సీటును మిత్రపక్షానికి ఒదులుకోవడానికి అంగీకరించదని అంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా తెరాస హుస్నాబాద్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించింది. ఆ కారణంగానే ఇప్పుడు కూడా హుస్నాబాద్ లో  తెరాస అభ్యర్థినే రంగంలోకి దించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. హుస్నాబాద్ కు ప్రత్యామ్నాయంగా సీపీఐ సీనియర్ నేత చాడకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నట్లు తెరాస వర్గాలలో వినిపిస్తోంది. చాడ వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ కేటాయిస్తే..   ఆయన హుస్నాబాద్‌ సీటును టీఆర్ఎస్‌కి వదలిపెడతారని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి.   తెలంగాణలో వచ్చే ఏడాది ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు మేలో రెండు  గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మూడు స్థానాలు మే 29న ఖాళీ అవుతాయి.  వీటిలో ఒక స్థానాన్నిసీపీఐకి కేటాయించే అవకాశముందని తెరాస వర్గాల్లో ప్రచారం అవుతోంది.  2004 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. 2018లో మళ్లీ పోటీ చేసినా.. గెలవలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితెల సతీష్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే అక్కడ సీపీఐకి బలమైన కేడర్ ఉందని.. టీఆర్ఎస్-సీపీఐ పొత్తులో భాగంగా.. ఈసారి చాడ వెంకటరెడ్డిని బరిలోకి దింపాలని సీపీఐ భావిస్తోంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సీపీఐకి ఎమ్మెల్సీ ఇచ్చి.. హుస్నాబాద్ నుంచి తామే బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 25 స్థానాలపై సీపీఐ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.  ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో  పొత్తు కుదరకపోతే.. ఆయా స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తోంది.  ఇరు పార్టీల మధ్య పొత్తు బలపడితే... సాధ్యమైనంత ఎక్కువ సీట్లు అడగాలనే యోచనలో వామపక్షాల నాయకులు ఉన్నారనేది ప్రచారంలోకి వచ్చింది. ఇదే జరిగితే... టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాలను కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. మరి ఏ సీట్లను సిపిఐ కోరుతుందో...? ఏ సీట్లను టిఆర్ఎస్ వదులుకుంటుందో వేచి చూడాలి.