క్యాసినో కేసులో మంత్రి తలసాని సోదరులను విచారించిన ఈడీ
posted on Nov 16, 2022 @ 10:41PM
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం(నవంబర్15) తెరాస విస్తృత స్థాయి సమావేశంలో ఈడీ దాడుల విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే అలా ఆరోపించి ఊరుకోలేదు. మరిన్ని దాడులు జరుగుతాయనీ, ఎమ్మెల్యేలు, తెరాస నాయకుల నివాసాలలో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించే అవకాశాలున్నాయనీ, అయితే వాటికి ఎవరూ భయపడొద్దనీ అన్నారు.
అలా అని 24 గంటలు గడిచాయో లేదో ఇలా ఈడీ తెలంగాణ మంత్రి సోదరులను విచారణకు పిలిచింది. ఆ మంత్రి ఎవరో కాదు.. తలసాని శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ బుధవారం దాదాపు పది గంటల పాటు విచారించింది. క్యాసినో కింగ్ పిన్ చీకోటి ప్రవీణ్ యాదవ్ తో కలిసి వీరు కాసినో నిర్వహణలో పాలుపంచుకున్నారని దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. గతంలోనే ఈడదీ చీకోటి ప్రవీణ్ నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే చీకోటి ప్రవీణ్ ను రోజుల తరబడి విచారించి రాబ్టిన సమాచారం ఆధారంగానే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సోదరులను విచారించిందని చెబుతున్నారు.
ఐటీ , ఈడీ , సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందని ఎవరూ భయపడవద్దని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పిన గంటల వ్యవధిలోనే మంత్రి సోదరులను ఈడీ విచారించడంతో ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తమౌతోంది. ఇటీవలే టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించి అవకతవకలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తంచామని చెప్పారు. ఆ తరువాత ఇప్పుడు క్యాసినో కేసులో తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించింది. రాత్రి 9 గంటలకు ఈడీ విచారణ నుంచి తలసాని సోదరులు బయటకు వచ్చారు.
గురువారం (నవంబర్ 17)న మరో సారి వారిని ఈడీ విచారించనుంది. మంత్రి తలసాని సోదరులు ఇద్దరు మీడియా కంటపడకుండా వెళ్లిపోయారు. రేపు మరోసారి వారు విచారణ కోసం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. క్యాసినో వ్యవహారానికి సంబంధించి ఈడీ నజర్ లో సుమారు వంద మంది వరకూ ఉన్నట్లు చెబుతున్నారు. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి కాల్ డేటా ఆధారంగా ఈడీ వివరాలను సేకరించిందంటున్నారు. కాగా ఇదే కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈసీ బుధవారం (నవంబర్ 16) నోటీసులు ఇచ్చింది.