మోడీ కంటే ఘనుడు భూపేంద్ర పటేల్!
posted on Dec 14, 2022 4:05AM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరున చాలా రికార్డులే నమోదై ఉండవచ్చును. ఆయన, గుజరాత్ అసెంబ్లీ లో ముఖ్యమంత్రిగానే తొలి అడుగు, వేశారు. కనీసం ఎమ్మెల్యే అయినా కాకుండానే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే, మోడీ, పార్లమెంట్ ఎంట్రీ కూడా అంతే. ఆయన ప్రధానమంత్రిగానే లోక్ సభలో అడుగు పెట్టారు. అలాగే ఆయన ఇంతవరకు ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. ఆయన ఓడిపోక పోవడమే కాదు ఆయన సారధ్యంలో పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ అది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే అయినా పార్లమెంట్ ఎన్నికలే అయినా ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడి పోలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరసగా మూడు సార్లు ప్రభుత్వ వ్యతిరేకతను జయించిన మోడీ, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకతను జయించారు. ముందు (2014) కంటే 2019లో ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు.
మోడీ రికార్డులు ఇంకా చాలానే ఉంటాయి, అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్ (ఈయన కూడా అనుకోకుండా, అనుహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు) మోడీ సాధించలేని ఒక కొత్త రికార్డును సృష్టించారు. గుజరాత్ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పటేల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రికార్డునే బద్దలు కొట్టారు.అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి ఎమ్మెల్యేగా,ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. 2021 సెప్టెంబర్ లో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించి భూపేంద్ర పటేల్ కు అధిష్టానం పగ్గాలు అప్పగించింది.
రూపానీ రాజీనామా తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయినా మంత్రి అయినా కానీ, ఫస్ట్ టైం ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి, 2001లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఉహించలేదు. ఎవరో ఏమిటి, మోడీ కూడా ఉహించలేదు. పటేల్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే సమయానికి, కనీసం ఎమ్మెల్యే. మోడీ అది కూడా కాదు. అలాగే భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయనతో సహా ఎవరు ఉహించలేదు. ఎలాంటి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం లేకుండానే, పటేల్ గత ఏడాది తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయినా,అయన సారధ్యంలో బీజేపీ, చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. నరేంద్ర మోడి సారధ్యంలో 2014 ఎన్నికలలో బీజేపీ, మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాసింది.ఎన్డీఎ కూటమిగా పోటీ చేసిన, బీజేపీ, మూడు పదుల కాలంలో మొదటి సారిగా ఒంటరిగా ( సింగిల్ పార్టీ) మెజారిటీ సాధించి చరిత్రను సృష్టించింది. అలాగే గుజరాత్ లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇతవరకు ఆదుకోలేక పోయిన కాంగ్రెస్ రికార్డును భూపేంద్ర పటేల్ సారథ్యంలో బీజేపీ అందుకుంది. 1985లో ముఖ్యమంత్రి మాధవ సింగ్ సోలంకి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన, 149/182 సీట్ల రికార్డును, 2022 ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ 156/182 సీట్ల భారీ మెజారిటీతో బద్దలు కొట్టారు.
2002లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బిజెపి 127 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించింది.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఏకంగా 156 మంది ఎమ్మెల్యేల బలగంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అదొకటి అలా ఉంటే ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 2017 లో తొలిసారి పోటీ చేసి 1.17 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శక్తి కాంత్ పటేల్ పై విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పటేల్ అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1.92 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అందుకే, మోదీ కంటే ఘనుడు పటేల్ .. అంటున్నారు గుజరాత్ ప్రజలు. ఓటర్లు.