ఏపీలో బీఆర్ఎస్ కు వైసీపీ స్వాగతం
posted on Dec 13, 2022 8:37AM
వైసీపీ కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు స్వాగతం పలుకుతోంది. ఇంకా ఏపీలో అడుగే పెట్టని బీఆర్ఎస్ కు వైసీపీ రెడ్ కార్పెట్ లో స్వాగతం పలకడానికి సిద్ధమౌతోంది. రాజకీయ లబ్ధి కోసం.. వైసీపీ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ తెలంగాణలో మైలేజ్ పెంచుకున్న టీఆర్ఎస్ పార్టీయే పేరు మార్చుకుని బీఆర్ఎస్ గా మారింది.
అటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలోకి ఆహ్వానిస్తే తనకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తోంది. బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడితే ఎవరికి రాజకీయంగా నష్టం జరుగుతుందన్న చర్చ తెరమీదకు వచ్చిన నేపథ్యంలో వైసీపీ కేసీఆర్ బీఆర్ఎస్ కోరితే ఆ పార్టీకి మద్దతు కూడా ఇస్తామని ప్రకటించింది. దీనిని బట్టే బీఆర్ఎస్ ఎంట్రీ తెలుగుదేశం కు రాజకీయంగా ఒకింత నష్టం చేస్తుందన్న భావన వైసీపీలో ఉందన్నది అవగతమౌతోంది. వైసీపీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అందుకే ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు ఏపీలో బీయారెస్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ మద్దతు కావాలని కోరితే ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.
ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీలో ఎంటర్ అయితే రాజకీయంగా వైసీపీకి లబ్ధి చేకూరుతుందన్న అంచనాలలో ఆ పార్టీ ఉంది. అందుకే తెలంగాణ సీఎం కోరితే జగన్ ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని సజ్జల చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్ని విధాలుగా వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది. వైసీపీకి అనుకూలంగా ఏ పార్టీ కూడా లేదు. పైపెచ్చు విపక్షాలన్నీ ముఖ్యంగా జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీకి దగ్గరౌతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలి అధికార పార్టీకి లబ్ధి చేకూరాలంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీయే మార్గమని వైసీపీ తలపోస్తున్నది. అయితే ఇరు రాష్ట్రాలూ మళ్లీ కలవాలన్న నోటితోనే సజ్జల బీఆర్ఎస్ కు మద్దతు అనడాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అనుమానాలు అయితే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.
ఇప్పటికే ఇరు రాష్ట్రాలూ మళ్లీ కలిసిపోతే స్వాగతించే విషయంలో వైసీపీ ముందుంటుంది అన్న వైసీపీ సీనియర్ నేత, రాజకీయ సలహాదారు సజ్జల మాటల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనన్న భావన కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఇందుకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య బహిరంగ రహస్య మైత్రి కూడా ఒక కారణమేనని చెప్పక తప్పదు. ఒకే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలుగు రాష్ట్రాల పున: విలీనం గురించి, బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తెరాసకు ఏపీలో స్వాగతం గురంచీ సజ్జల చెబుతున్న మాటల వెనుక ఉన్న వ్యూహమేమిటన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.