సీఎం సతీమణికి ఆలయ ఛత్రం! వివాదంలో స్టాలిన్ కుటుంబం
posted on Dec 13, 2022 @ 10:37AM
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు కానీ, ఒక ముఖ్యమంత్రి తలచుకుంటే తన సతీమణికి దేవుడి కంటే ఎక్కువ ప్రాముఖ్యత దక్కుతుందని ఎవరూ అనలేదు. కానీ తమిళనాడులో మాత్రం ఆలయ అధికారులు అలా చేసి సీఎం సతీమణి సేవలో తరించిపోయారు.
విషయమేమిటంటే.. చెన్నై నగరంలోని ఓ ఆలయ వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆ ఆలయ గొడుగు వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. నిజానికి తమిళనాడు సీఎం అధికారిక దర్పాలకు దూరంగా చాలా సింపుల్ గా ఉంటారు. సామాన్యుడిలా జనంలో మమేకమౌతారు.
అయితే అధికారులు అత్యుత్సాహంతో చేసిన పని వల్ల ఆయన, ఆయనతో పాటు ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. సీఎం సతీమణి వర్షంలో తడవకుండా ఉండటం కోసం అత్యంత పవిత్రమైన ఆలయ ఛత్రాన్ని ఉపయోగించడం ఘోర తప్పిదమని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెన్నైలోని తిరువొత్తియూరులోని త్యాగరాజ స్వామివారి ఆలయ ఉత్సవమూర్తి ఊరేగింపు ఆలయ మాఢవీధిలో జరిగింది.
ఆలయ ప్రధాన అర్చకుడు విగ్రహాన్ని ఊరే గించేందుకు ఆలయ ప్రధాన ద్వారం వెలుపలకు వచ్చారు. ఆ ఉత్సవమూర్తి వానలో తడవకుండా ఉండేందుకు సిబ్బంది ఛత్రం పట్టారు. అదే సమయంలో దుర్గా స్టాలిన్ ఊరేగింపు వెనుక నడచి వస్తుండగా వర్షంలో ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పడుతూ అనుసరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.