టార్గెట్ 175 ఆఫ్ 175.. మరి అభ్యర్థులెవరు?
posted on Dec 13, 2022 @ 3:06PM
వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్... పక్కాగా ఫిక్స్ అయిపోయారు. అదీ కూడా మొత్తం 175కి 175 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ ఖాతాలో పడి పోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో పని చేసిన వారికే మళ్లీ టికెట్లు.. అంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షా సమావేశంలో సీఎం జగన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.
దీంతో తమకు మరో ఛాన్స్ లేదని ఇప్పటికే వైసీపీలోని పలువురు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. మరోవైపు.. పలువురు ఎంపీలను ఈ సారి అసెంబ్లీకి పంపాలని సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో విశాఖ ఎంపీ .వి.వి.సత్యనారాయణ, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, బాపట్ల ఎంపీ మార్గాని భరత్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ ఉన్నట్లు సమచారం.
విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ సంగతే తీసుకుంటే.. విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటిలో.. ఎంవీవీ సత్యనారాయణపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత పార్టీలోని నేతలు సైతం ఆయనపై అసంతృప్తితో రగలిపోతున్నారని.. ఈ విషయాన్ని పసిగట్టిన ఎంపీ సత్యనారాయణ.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగుతానంటూ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ తూర్పు లేదా ఉత్తరం నుంచి ఎంవీవీ సత్యనారాయణ రంగంలోకి దిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.
ఇక కాకినాడ లోక్‌సభ సభ్యురాలు వంగా గీత కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి.. మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో కాకినాడకు కూత వేటు దూరంలోని పిఠాపురం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఇక్కడున్న పెండెం దొరబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని జగన్ పక్కన పెట్టినట్లు చెబుతున్నారు... దీంతో వచ్చే ఎన్నికల్లో వంగా గీత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్ కూడా ఈ సారి అసెంబ్లీపై కన్ను వేసినట్లు సమాచారం. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. సొంత పార్టీలోని నేతల్లో ఆయనపై పీకల వరకు అసంతృప్తి ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తే.. సొంత పార్టీలోని వారే పనిగట్టుకొని మరీ తనను ఓడిస్తారని భరత్‌కు క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు భరత్.. తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఓ వేళ ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే.. బీసీ వర్గానికి చెందిన తనకు జగన్ కేబినెట్‌లో బెర్త్ గ్యారంటీ అని భరత్ పూర్తిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇక మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. నరసారావుపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బందరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి ఎంపీ బాలశౌరి మధ్య పచ్చగడ్గి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలశౌరిని బందరు లోక్‌సభ స్థానం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేయించేందుకు పేర్ని నాని కంకణం కట్టుకొని మరీ జగన్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు ఓ చర్చ అయితే బందరులో హల్‌చల్ చేస్తోంది. అదీకాక ప్రస్తుతం నరసారావుపేట ఎంపీ లావు కృష్ణాదేవరాయులు.. రాజధాని రైతులకు మద్దతు తెలపడంతో.. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణదేవరాయులు... సైకిల్ పార్టీలోకి జంప్ చేసేందుకు తన ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది.
బాపట్ల ఎంపి నందిగం సురేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. మంత్రి కావాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో ఎక్కడా అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఓ వేళ.. ఆమె పార్టీ మారితే.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుంచి నందిగం సురేష్‌ను నిలిపే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియోతో గట్టిగానే మకిలి అంటించుకొన్నారు. దీంతో పార్టీలోనే కాదు.. ప్రజల్లో సైతం ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓ వేళ ఆయనపై వేటు వేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆయన సామాజిక వర్గ ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉందని.. ఆ క్రమంలోనే జగన్ అండ్ కో.. గోరంట్ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిందనే ఓ టాక్ అయితే అప్పట్లో బాగానే నడిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశాన్ని జగన్ పార్టీ పరిశీలిస్తుంన్నదనే చర్చ ఫ్యాన్ పార్టీలో వాడి వేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ను పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కడప ఎంపి వైయస్ అవినాశ్ రెడ్డి.. వైయస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాదు.. సీఎం జగన్ ఫ్యామిలీ తప్ప..ఆ కుటుంబంలోని మరో ఫ్యామిలీ అవినాశ్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ అవినాశ్ రెడ్డిని రాజంపేట ఎమ్మెల్యేగా బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.. గతంలో టీడీపీలో ఉండి.. ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో చేరారు. ఆయనను ప్రస్తుతం పార్టీ అధిష్టానం సాధ్యమైనంత దూరం పెట్టింది. దీంతో ఆయన మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మరో వైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను కాదని రాయచోటిని చేయడంపై ప్రజల్లో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో ఈ స్థానం నుంచి ఆవినాశ్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ఓ టాక్ వైరల్ అవుతోంది.