రేవంత్ ‘రెడ్డి’ టీం రెడీ!
posted on Dec 13, 2022 @ 1:37PM
తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే స్వయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సమాజిక వర్గమే రక్ష అన్నఅభిప్రాయాన్ని గతంలోనే వ్యక్తం చేశారు. అప్పట్లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి పలువురు సీనియర్లకు మనస్తాపం కూడా కలిగించారు. ఆ తరువాత ఆ వివాదం ఎలాగో సద్దుమణిగింది. రేవంత్ రెడ్డి ఏదో వివరణ ఇచ్చారు. అదంతా వేరే సంగతి. గడిచిపోయిన గతం కూడా.
అయితే ఇప్పుడు నాడు రేవంత్ రెడ్డి ఆ మాటలు ఏదో యథాలాపంగా అనలేదని తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త కమిటీని చూస్తే అర్దమౌతుంది. రేవంత్ ‘రెడ్డి’ తన టీమ్ లో ఆ సామాజిక వర్గానికే పెద్ద పీట వేయించుకున్నారు. కీలకమైన ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల పదవులతోపాటు, జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ సింహభాగం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. సహజంగానే ఈ పరిణామం పట్ల పార్టీలోని ఇతర సామాజిక వర్గాలలో అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా బీసీ వర్గాలలో ఈ అసంతృప్తి మరింతగా వ్యక్తమౌతోంది. రాష్ట్ర జనాభాలో కనీసం నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో విజయం కోసం కాంగ్రెస్ ఎలా ప్రయత్నిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ కమిటీల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంపై పార్టీ అధ్యక్షుడు మల్టికార్జన్ ఖర్గేకు ఇక ఫిర్యాదులు వెల్లువెత్తనున్నాయి.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో బీసీలు ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు హస్తిన పయనమయ్యారు. వరుస ఓటములతో రాష్ట్రంలో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కులకలం రేగడం ఆ పార్టీ అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోందనడంలో సందేహం లేదు కాంగ్రెస్ కు ఉన్న . బడుగు బలహీన వర్గాల పార్టీ ముద్ర చెరిపివేసే కుట్ర జరుగుతోందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. తాజా కమిటీకీ, గతంలో రేవంత్ రెడ్డి చేసిన రెడ్డిసామాజికవర్గసుప్రిమసీ వ్యాఖ్యలకూ లింకు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.
పీసీసీ కమిటీలో అధిష్ఠానం ప్రకటించిన 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో 22 మంది, 24 మంది ఉపాధ్యక్షుల్లో 7, రాజకీయ వ్యవహారాల కమిటీలో 6గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, అలాగే డసీసీ కమిటీల్లోనూ పది మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం ఒకెత్తయితే.. వారంతా కూడా రేవంత్ వర్గీయులే కావడం పార్టీలోని ఆయన వ్యతిరేకులకు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కమిటీల విషయంలో రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
సాధారణంగా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కమిటీను ప్రకటిస్తారు. ఇప్పుడూ అలాగే చేశామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నప్పటికీ సీఎల్పీ నాయకుడినైన తనకే కమిటీల గురించి ఎలాంటి సమాచారం లేదని భట్టి విక్రమార్క ప్రకటించడమే పార్టీలో అసంతృప్తి ఏ స్థాయికి చేరుకుందో తెలియజేస్తోంది. రేవంత్‌రెడ్డి, మాణిక్యం ఠాగూర్ కలసి అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించి, కమిటీని తమ సొంత మనుషులతో నింపేసుకున్నారన్న విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలు, ఫిర్యాదులపై అధిష్ఠానం స్పందన ఎలా ఉంటుందన్నది చూడాలి.