తెలంగాణలో ఎవరి గోల ఏమిటో?
posted on Dec 13, 2022 @ 2:42PM
ఆంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోయి, ఎనిమిదేళ్లు నిండి పోయాయి, అయినా ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చాలా విషయాల్లో దాయాది తగవులు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. విభజన చట్టంలోని అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. విబేధాలు, విమర్శలు, కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. అయినా అక్కడ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసల మధ్య స్నేహ పూర్వక సంబంధాలే కొనసాగుతున్నాయి.
అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా మంచి మిత్రులుగానే మెలుగుతున్నారు. చిన్న చిన్న పొర పొచ్చాలు ఉన్నా రాజకీయ ,స్నేహ సంబంధాల విషయంలో మాత్రం ఇచ్చి పుచ్చుకునే ధోరణి కొనసాగుతోంది. భారాస కు వైకాపా రెడ్ కార్పెట్ స్వాగతం పలికిందంటే, ఇక ఆ రెండు పార్టీల మధ్య స్నేహ బంధంగా ఎంత పటిష్టంగా వుందోవేరే చెప్పనక్కరలేదు.
ఆలాగే, ఉభయ తెలుగు రాష్టాల రాజకీయాల విషయానికి వస్తే ఎవరిదారి వారిది, అన్నట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి పరిధికి వారు పరిమితమై రాజకీయం చేస్తున్నారు. అయితే, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పడు మరో లెక్క అన్నట్లుగా కథ మారింది. ముఖ్యంగా, తెలంగాణలో రాజకీయ ఈక్వేషన్స్ వేగంగా మారి పోతున్నాయి. అధికార తెరాసని వరసగా రెండు సార్లు గెలిపించిన తెలంగాణ సెంటిమెంట్, ఇప్పడు అంత వేడిగా లేదు. చాలా వరకు చల్లబడింది. అంతేకాదు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో తెలంగాణ సెంటిమెంట్ తిరగబడింది. మరో వంక తెరాస,భారాసగా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడంతో కొన ఊపిరితో మిగిలిన ఆ కాస్త సెంటిమెంట్ కూడా తుడిచి పెట్టుకు పోయింది.
ఈ నేపధ్యంలో తెలంగాణ రాజకీయాలలో ఏపీ పాలిటిక్స్ వచ్చి కలవడంతో తెలంగాణ రాజకీయ లెక్కలు మారుతున్నాయనే చర్చకు తెర లేచింది. నిజానికి తెలంగాణ రాజకీయాలు 2018 ఎన్నికల నుంచి చాలా దూరం వచ్చాయి. 2018లోనూ బీజేపీ బరిలో ఉన్నా, తెరాస,కాంగ్రెస్ పార్టీలను మాత్రమే ప్రజలు ప్రధాన ప్రత్యర్దులుగా గుర్తించారు. 2014లో తెలుగు దేశంతో పొత్తు జనసేన మద్దతుతో పోటీచేసి ఐదు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీ 2018లో నాలుగు సీట్లు కోల్పోయి, గోషామహల్ ( రాజా సింగ్) స్థానం ఒక్కటి మాత్రమే నిలబెట్టుకుంది. అయితే, ఆ తర్వాత ఆరు నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి మునుగోడు వరకు కథ మారుతూ వచ్చింది. తెరాసకు ప్రధాన ప్రత్యర్ధి స్థానం కోసం జరిగిన పోటీలో బీజేపీ కాంగ్రెస్ పై పైచేయి సాధించింది.
ఈ నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మరింతగా చీల్చేందుకు, తెరాస వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గురితప్పి తెలంగాణలో వాలిన జగనన్న విడిచిన బాణం, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇమేజ్ పెంచేందుకు, ఆమెను తెరాస ప్రత్యర్ధిగా చూపేందుకు, ఆమె పాదయాత్రను అడ్డుకోవడం, అరెస్ట్, గృహ నిర్భందం, రోడ్ (భైఠాయింపు) షో డ్రామాలతో రక్తి కట్టిస్తున్న తెరాస నాయకత్వం, ఇప్పడు ఏపీకి చెందిన మరో, ‘స్టార్’ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ను తెర మీదకు తెచ్చింది. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ తెర మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందనే సంకేతాలు ఇచ్చారు. జనసేన 32 స్థానల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అంతర్గత లెక్కల్లో, అదే విధంగా కేసీఆర్ సర్వేల్లో బీజేపీ 32 స్థానల్లో తెరాసకు గట్టి పోటీ ఇస్తుందని, ఆ 32 స్థానాల్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఇప్పడు పవన్ కళ్యాణ్ 32 సీట్లలో పోటీ చేస్తారని ప్రచరం జరగడంతో పవన్, కేసేఆర్ వదిలిన బాణం అనే అనుమానానికి బలం చేకురుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు.
అయితే ఇది నాణానికి ఒక వైపు, ఉహాగానం, అయితే, మరో వైపున షర్మిల బీజేపీ టచ్ లోకి వెళ్ళారని అందుకే ఆమె అరెస్ట్ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు ఆమెకు సంఘీభావం ప్రకటించారని తెరాస నాయకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై ఈడీ,సిబిఐలకు ఫిర్యాదు చేసిన షర్మిల త్వరలో ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం పైన మరిన్ని ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే కేసీఆర్ ఆమెను టార్గెట్ చేశారని మొదటి సారిగా పాద యాత్రను అడ్డుకుని అరెస్ట్ చేశారని అంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికే క్లారిటీతో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు షర్మిలతో సంబంధాల విషయంలో మౌనంగా ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. తెలంగాణలో జనసేనతో తమ పార్టీకి పొత్తు ఉండదని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నబీజేపీ నాయకులు షర్మిల విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. నిజానికి, బీజేపీ నాయకత్వం షర్మిలతోనే కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో ఉభయ తెలుగు రాష్ట్రాలలో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు, చెప్పారు. అయితే 2018 లో, కేసేఆర్, చంద్రబాబుబు బూచిగా చూపించి, తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కొంచెం అటూ ఇటవుతోందని అంటున్నారు.
అదలా ఉంటే ఉహా గానాలు, వ్యూహా గానాలు ఎలా ఉన్నా, ఇప్పటికిప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని, నిజానికి బీజేపీనే కాదు తెరాస సహా ఏ పార్టీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపించే వరకు ఆట ఆలా సాగుతూనే ఉంటుందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.అంతవరకు ఎవరి గోల వారిది ..చూసి, విని ఆనందించండి.