ఎర్రబెల్లి, ఉత్తమ్ రహస్య భేటీ మర్మమేమిటి?
posted on Dec 21, 2022 @ 1:20PM
తెలంగాణ రాజకీయాలలో తెరవెనుక డీల్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షొభం తారస్థాయిలో ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత, మంత్రిఎర్రబెల్లి దయాకరరావుతో రహస్యంగా భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల కిందట మునుగోడులో ఓ వివాహ వేడుకకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ఏకాంతంగా దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు.
ఈ విషయాన్ని గమనించిన కొందరికి వారు తమ భేటీ గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని గట్టిగా హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇంత రహస్యంగా అన్ని గంటల పాటు భేటీ అవ్వడం వెనుక మతలబేంటన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా.. ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా వివాహ వేడుకకు హాజరై, అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో భేటీ అయ్యారు. భేటీ పూర్తి కాగానే నేరుగా హస్తినకు బయలుదేరి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి, ఉత్తమ భేటీ జరుగుతున్న సమయంలోనే టీపీసీసీ భేటీ జరుగుతుండటం గమనార్హం.
ఈ రహస్య భేటీ నేపథ్యంలోనే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరి స్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనే ఉత్తమ్ కుమార్ పై కేసీఆర్ కోవర్ట్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఉత్తమ్ కుమార్ రహస్యంగా భేటీ అయిన ఎర్రబెల్లి దయాకరరావుపై కూడా గతంలో అంటే ఆయన తెలుగుదేశం తెలంగాణ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ కోవర్ట్ గా పని చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే.
ఆయన టీడీఎల్పీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే2014 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలు మిత్ర పక్షాలుగా పోటీలోకి దిగాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి పరాజయం పాలైంది. గెలవాల్సిన స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అయితే ఇందుకు పొత్తలో భాగంగా సీట్ల పంపకాలలో జరిగిన పొరపాట్లే ఆ ఓటమికి కారణమని అప్పట్లో తెలుగుదుశం, బీజేపీలు భావించాయి. అయితే టీడీఎల్పీ నేతగా అప్పట్లో ఎర్రబెల్లి ఇరు పార్టీలనూ మిస్ గైడ్ చేసి బీజేపీకి బలం ఉన్న స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశానికి బలం ఉన్న స్థానాలలో బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపేలా చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎర్రబెల్లి కేసీఆర్ కోవర్టుగా పని చేశారని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఎర్రబెల్లి తెలుగుదేశంను వీడి.. గులాబి గూటికి చేరడం.. కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే. ఆ విధంగా కేసీఆర్ ఎర్రబెల్లి చేసిన ఉపకారానికి మంత్రిపదవితో బదులు తీర్చుకున్నారన్నమాట. ఇప్పుడు ఎర్రబెల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్య భేటీతో నాడు ఇరువురూ కేసీఆర్ కు కోవర్ట్ లుగా పని చేశారన్న విషయాలను గుర్తు చేస్తూ ఈ భేటీ వెనక మర్మమేమిటన్న చర్చ జరోందుకుంది. కాంగ్రెస్ సంక్షోభ సమయంలో అదును చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది.