ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులకు చెల్లు చీటీ!
posted on Dec 21, 2022 9:20AM
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం 1నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ లకు చెల్లు చీటీ పాడేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు ఇవ్వలేమని పేర్కొంటూ బడ్జెట్ లో ఆ మేరకు నిధుల కేటాయింపు నిలిపివేయాలని నిర్ణయించింది.
ఇంత వరకూ ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే వారు. ఇకపై ఇవి 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే పరిమితమౌతాయి.
విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్య అందిస్తోంది కాబట్టి, 8వ తరగతి వరకు స్కాలర్ షిప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయ, గిరిజన సంక్షేమ శాఖలు చెబుతున్నాయి విపక్షాలు అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వ్రాతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.