ఈడీ చార్జి షీట్ లో 22 సార్లు కవిత పేరు
posted on Dec 21, 2022 @ 10:15AM
దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తాజా సమర్పించిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కనీసం 22 సార్లు ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. తొలుత ఈ లిక్కర్ స్కాం లో కవిత ప్రమేయంపై ఆరోపణలు మాత్రమే అనుకున్నారు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు దూకుడు పెంచిన తరువాత ఈ కేసులో కవిత పాత్ర కీలకమన్న విషయం వెలుగులోకి వస్తోంది. తొలుత ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎంత మాత్రం సంబంధం లేదంటూ బల్ల గుద్ది మరీ చెప్పిన కవిత.. దర్యాప్తు సాగుతున్నకొద్దీ ఆమె మాటల్లో మునుపటి ధీమా కనిపించడం లేదు.
చీటికీ మాటికీ ప్రగతి భవన్ కు వెళ్లి ఈ కేసు విషయంలో న్యాయనిపుణులతో సంప్రదించడం, తండ్రితో మంతనాలు జరపడంతో కేసు కవితకు ఉచ్చు బిగించిందన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఈడీ తాజా చార్జి షీట్ తో ఆ విషయం నిర్ధారణ అయినట్లేనని చెప్పవచ్చు. ఈ కేసులో ఈడీ తాజా ఛార్జిషీట్‌లో కీలక విషయాలను ప్రస్తావించింది. ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు కవిత, మాగుంట రాఘవ్ రెడ్డిలేనని , ఈడీ చార్జిషీట్లో పేర్కొంది.
దిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు అత్యధికంగా లబ్ధి పొందిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు అని ఈడీ పేర్కొంది. సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఈ ఛార్జి షీట్లో కవితతోపాటుగా వైసీపీ ఎంపీ మాగుంట శీనివాస్ రెడ్డి, అతడి కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పాత్రలను చెప్పింది. అయితే ఈ కేసులో బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపింది.
ఛార్జిషీట్ ప్రకారం.., కవిత నేరుగా దిల్లీలోని స్టార్ హోటళ్లలో, హైదరాబాద్‌లోని తన నివాసంలో లేదా కాల్స్ ద్వారా వారిని కలుసుకోవడం ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నారని ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను చెరిపేసేందుకు దాదాపు డజను మొబైల్ ఫోన్‌లను కవిత ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.