టికెట్ల కోసం ఎమ్మెల్యేల నుంచి జగన్ సొమ్ములు వసూలు!
posted on Dec 21, 2022 @ 9:55AM
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు అన్నారు . కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటు, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు.
2024 లో పార్లమెంట్ ఎన్నికల తో పాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు మృగ్యమన్నారు. . రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మూమూలుగా అయితే ఎంపీలను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్ చులకనగా చూస్తారనీ, వారికి ఇసుమంతైనా గౌరవం ఇవ్వరనీ, అయితే ముందస్తు ఎన్నికలు తరుముకు వస్తున్నాయి కనుక ఎమ్మెల్యేలకు ఇప్పుడు కాసింత గౌరవం ఇచ్చి సమీక్షలు నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణం రాజు అన్నారు. అంతే కాకుండా ఎన్నికల నిమిత్తం జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంత మొత్తం ఇవ్వాలని కోరుతున్నట్లు తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం జగన్ కోరిన విధంగా సొమ్ము ఇచ్చేందుకు సుముఖంగా లేరన్నారు.
సొమ్ము ముట్ట చెప్పి టికెట్లు తెచ్చుకున్నా గెలిచే అవకాశాలు లేవని ఎమ్మెల్యేలకు ఇప్పటికూ పూర్తిగా అర్ధం కావడమే కారణమన్నారు. జగన్ రెడ్డి గృహ సారథులు పేరిట గృహ హింసకులను రంగంలోకి దింపుతున్నారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించిన జగన్ సర్కార్ వారికి అదనంగా మరో ఇద్దరు గృహ సారథులను నియమిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను గుర్తించి వారి ఓటును తొలగించేలా చేయడమే వీరి పని అని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల నిర్వహణ కోసం ప్రజాధనం ఖర్చు చేయడం తగదని రఘురామ కృష్ణం రాజు అన్నారు. సొంత సొమ్ముతో జరుపుకోవలసిన జన్మదిన వేడుకలకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము కేటాయించడమేమిటని ప్రశ్నించారు.