పలుకే బంగారమాయెనా.. అనుమానాలకు తావిస్తున్న కేసీఆర్ మౌనం
posted on Dec 21, 2022 @ 12:26PM
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ పలుకే బంగారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మౌనం పలు అనుమానాలకు తావిస్తున్నదన్నచర్చరాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ప్రస్తావిస్తూ కేసీఆర్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును ఈడీ చార్జి షీట్ లో 18 సార్లు ప్రస్తావించిందనీ, అసలు హస్తినలోని ఒబెరాయ్ హోటల్ లో కవిత మీటింగ్ ల మతలబు ఏమిటో బయటపెట్టాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.
ఈ కేసులో నిందితుడు సమీర్ మహేంద్రుతో కవిత లావాదేవీలేమిటన్నవీ వెలుగులోకి రావాలన్నారు. తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల కుటుంబం అవినీతి హస్తన వరకూ విస్తరించిందనడానికి డిల్లీ కుంభకోణంలో కవిత ప్రమేయంపై బయటపడుతున్న వాస్తవాలే నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ పై దర్యాప్తు తరహాలో తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైనా దర్యాప్తు జరగాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.
కవిత ఎందుకు అన్ని ఫోన్లు ధ్వంసం చేశారన్న ప్రశ్నా తలెత్తుతోంది. మాఫియా తరహాలో ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయానికి తిరుగులేని నిదర్శనం అన్న నమ్మకం అందరిలోనూ బలపడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.