ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఎప్పుడంటే..?
posted on Dec 20, 2022 @ 9:20PM
తెరాస స్థానంలో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అవతరించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కాలు మోపేందుకు బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయాన్నిఏర్పాటు చేయడంతో పాటు, పలు కమిటీలను సైతం నియమించారు. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సీఎం కేసీఆర్ కు మద్దతు లభించడంతో ఆ రాష్ట్రాల్లో మద్దతు ఇచ్చే పార్టీలతో కలిపి బీఆర్ఎస్‌ను బలోపేతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇక సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ త్వరలో బీఆర్ఎస్ కాలు మోపేందుకు సిద్ధమైంది. క్రిస్మస్ తరువాత ఏపీలో బీఆర్ ఎస్ కార్యకలాపాలను ప్రారంభించేలా కేసీఆర్ ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగంగానే బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించారు.
ఏపీలో ప్రస్తుతం అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేక వర్గాన్ని కలుపుకొని బీఆర్ఎస్‌ను ఏపీలో విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. క్రిస్మస్ తరువాత బీఆర్ఎస్ ఏపీ కిసాన్ సెల్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఉత్తరాంధ్రకు చెందిన రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు, వివిధ సంఘాల నేతలు మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు. వీరందరితో కలిపి కిసాన్ సెల్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఏపీలో అడుగు పెట్టాలని కేసీఆర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
కేసీఆర్ ఏపీలో ముఖ్యంగా తెలుగుదేశం ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీలోని కీలక నేతలతో కేసీఆర్‌కు ఎప్పటినుంచో మంచి సంబంధం ఉంది. ఈ క్రమంలో వారిలో కొందరిని బీఆర్ ఎస్‌లోకి తీసుకొస్తారన్న ప్రచారం తెలుగు రాష్ట్రాలలో గత కొంత కాలంగా జరుగుతోంది.
క్రిస్మస్ తరువాత కేసీఆర్ నేరుగా ఏపీకి వెళ్లి కిసాన్ సెల్ ను ఏర్పాటు చేస్తారా? లేదా అక్కడి నేతలే కిసాన్ సెల్ గా ఏర్పాటవుతారా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ కేసీఆర్ ఏపీకి వస్తే రాజధానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ ఏపీ రాజధానిపై ఓ స్పష్టతకు వచ్చారని అంటున్నారు. క్రిస్మస్ తరువాత కిసాన్ సెల్ ఏర్పాటుతో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్.. జనవరి తరువాత భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.