మాస్కులతో ముఖాన్ని దాచుకోవలసిందేనా?
posted on Dec 21, 2022 @ 1:52PM
ప్రపంచ దేశాల్లో కరోనా విలవతాండవం మళ్లీ మొదలైంది. రెండున్నరేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండడం మిగతా దేశాల గుండెల్లో గుబులు రేపుతోంది.
మరోవైపు నిపుణులు.. కరోనా ఫోర్త్ వేవ్ కు ఇవి సంకేతాలంటున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు ఏ వేరియంట్ కు చెందినవో తెలుసుకోవాలని తెలిపింది. కరోనా పరీక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
తాజా నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతుండటం.. మాయదారి మహమ్మారి ముప్పు ఇంకా తొలపోలేదనేందుకు అద్దంపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. అందుకే కరోనా టెస్టుల శాంపిళ్లను ముందుగానే జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల కొత్త వేరియంట్ల ఉనికిని ప్రారంభంలోనే గుర్తించవచ్చని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.
కాగా.. ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న పరిస్థితులు భారత్ లో ఉండబోవని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఇలా ఉండగా ప్రపంచంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుక్ మాండవీయ బుధవారం (డిసెబర్21) దేశంలో కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో దేశంలో కోవిడ్ విజృంభించకుండా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. కొన్ని దేశాలలో కోవిడ్ వ్యాప్తి ఒక్క సరిగా పెరిగిన నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వారంతా మాస్కులు ధరించి హాజరు కావడం విశేషం. ఉన్నత స్థయి సమావేశంలో అందరూ మాస్కులు ధరించి ఉండటం చూస్తుంటే దేశం మరోసారి లాక్ డౌన్ కి సిద్ధపడాలా, లేక మళ్లీ మాస్కులు ధరించక తప్పని పరిస్థితులు ఎదురు కానున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.