నూతన సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 14న
posted on Feb 25, 2023 @ 1:25PM
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఏపీల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తన జన్మదినం అయిన ఫిబ్రవరి 7 ముహూర్తంగా నిర్ణయించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో ఆ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు.
తాజాగా ఏప్రిల్ 14న అంబేడ్కర్ రోజున సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించాలనీ, అదే రోజున సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు.
ఈ సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఒకే వేదికపై నలుగురైదుగురు ముఖ్యమంత్రులు కూర్చుంటే.. బీఆర్ఎస్ సభపై దేశ వ్యాప్త చర్చ జరుగుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సభకు పశ్చిమ బెంగాల్, కర్నాటక, బీహార్, కేరళ, పంజాబ్, డిల్లీ ముఖ్యమంత్రులతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కూడా ఆహ్వానించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.