కన్నా దారిలో ఇంకొందరు.. తెలుగుదేశంలోకి వలసల జోరు!
posted on Feb 25, 2023 @ 1:56PM
ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయం వేడెక్కుతుంది. అది సహజమే. రాజకీయ పార్టీలలో గెలుపు గుర్రాల వేట మొదలవుతుంది. అదీ సహజమే. రాజకీయ నాయకుల్లో టికెట్ల ఆరాటం ఆరంభమవుతుంది. రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమరుగైపోయిన నేపధ్యంలో అటు పార్టీలు, ఇటు నాయకులు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతారు. అది కూడా సహజమే. కానీ ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే గడువు ఉంది. కానీ అప్పుడే పార్టీల్లో.. నాయకుల్లో ఎన్నికల హడావుడి పెరిగిపోయింది. గెలుపు గుర్రాల వేట కూడా ఆరంభమైపోయింది. ఇటు పార్టీలు అటు నాయకులు ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయారు. ఓ వంక వడపోతలు మరోవంక గోడ దూకుడులు అప్పుడే జోరందుకున్నాయి.
ముఖ్యంగా ప్రధాన పార్టీలు అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించడంతో పోటీకి సిద్దమవుతున్ననేతలు, ఆశావహులు, స్థానిక సమీకరణాలు, పార్టీల బలాబలాలు, గెలుపు అవకాశాలు బేరీజు వేసుకుని, ఉన్న పార్టీలో ఉండడమా, గోడ దూకడమా అన్న లెక్కల్లో బిజీ అయిపోయారు. మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కమలం పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడంతో.. ఇప్పడు రాజకీయ వర్గాల్లో నెక్స్ట్ ఎవరు? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా బీజేపీ నుంచి బయటపడేది ఎవరన్న చర్చ స్పీడప్ అయ్యింది. నిజానికి కన్నా వెంట ఆయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలోనే తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. కేవలం అనుచరులు మాత్రమే కాదు, సహచరులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు చాలా మంది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, ఇతర పార్టీల లోకి సర్దుకున్నారు. ఇప్పడు బీజేపీ విషయంలోనూ బీజేపీ నాయకులు అదే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. నిజానికి అప్పట్లో టీడీపీ వైసేపీలలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఏదో విధమైన రాజకీయ ఫలాలను ఎంతో కొంత మేర అందుకున్నారు. కొందరు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలలో మంత్రులయ్యారు. మరి కొందరు ఇతర అధికార పదవులు అందుకున్నారు. రాజకీయంగా నిలదొక్కుకున్నారు. కానీ కమలం గూటికి చేరిన కీలక నేతలు ఎవరికీ కూడా ఎలాంటి పదవువులూ దక్కలేదు. రాష్ట్రంలో ఆ అవకాశమే లేదు. కేంద్రంలో అవకాశం ఉన్నా బీజేపీ నాయకత్వం బయటి వారిని బయటనే ఉంచేసింది.
దీంతో సహజంగానే, బీజేపీలోని మాజీ కాంగ్రెస్ నాయకులు ఏదో ఆశించిన బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు తీవ్రమైన ఉక్క పోతకు గురి అవుతున్నారు. ఇప్పుడు అలాంటి వారంతా, కన్నా .. బాటలో కొత్త దారులు వెతుక్కుక్కుంటున్నారు.
ఈ నేపధ్యంలో టీడీపీలో చేరిన వెంటనే పని ప్రారంభించిన కన్నా లక్ష్మినారాయణ చాలా మంది మాజీ మిత్రులు, బీజేపీ నాయకులు తనతో టచ్ లో ఉన్నారని చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నా ఎవరి పేర్లూ చెప్పక పోయినా కొందరు బీజేపీ సీనియర్లు తనతో టచ్‌లో ఉన్నారన్నారని.. వారంతా త్వరలోనే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని.. ఇప్పటికే అనుచరులతో మాట్లాడుతున్నారని.. అన్నీ త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. అయితే, కన్నా తనతో టచ్ లో ఉన్నవారిలో, దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అయితే, నిజానికి కన్నా టీడీపీలో చేరతారనే ప్రచారానికి ముందు నుంచే, టీడీపీలో చేరే వారిలో పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది.
సుదీర్ఘ కాలం తరువాత ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వర రావు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమైనప్పటి నుంచి, ఈ ప్రచారం జరుగుతూనే వుంది. అయితే పురందేశ్వరి ప్రస్తుతం తనతో పాటు టీడీపీలో చేరడం లేదని చెప్పిన కన్నా, ఆమె భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉందని అన్నారు, అంటే ఆమె కూడా తెలుగు దేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారని అనుకోవచ్చుననే సంకేతం కన్నాలక్ష్మీనారాయణ ఇచ్చారు.
పురందేశ్వరి విషయం ఎలా ఉన్నా కన్నా... మాజీ కాంగ్రెస్, బీజేపీ మిత్రులకు టీడీపీ ఎంట్రీకి రోడ్డు మ్యాప్ క్లియర్ చేసినట్లేనని, ఇప్పటికిప్పుడు కాకపోయినా, ముందుముందు టీడీపీలోకి వలసలు జోరందుకుంటాయని అందరూ అంగీకరిస్తున్నారు. అందుకే ముందు ముందు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తధ్యమని అంటున్నారు.