రాజకీయాలకు సోనియా గుడ్ బై?
posted on Feb 26, 2023 6:47AM
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారా? చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం రెండో రోజున శనివారం (ఫిబ్రవరి 25) పొలిటికల్ రిటైర్మెంట్ గురించి ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు, ఈ ప్రశ్నను తెరపైకి తెచ్చాయి.
నిజానికి సోనియా గాంధీ తన ప్రసంగంలో రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నానని స్పస్తమైన ప్రకటన ఏదీ చేయలేదు. కానీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విషయాన్నిప్రస్తావిస్తూ.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తి కానుండటం సంతోషంగా ఉందని అన్నారు. దీంతో ఆమె రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే అలాంటిదేమీ లేదని ఆమె భారాత్ జోడో యాత్ర నేపధ్యంగా తానూ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పు కున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించారని, అలాగే మరో మరు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వేకరించనని మాత్రమే చెప్పారని పార్టీ స్పష్టం చేసింది.
సహజంగా, రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అనేది ఉండదు. అయితే వయసు మీద పడిన తర్వాత లేదా అనారోగ్య సమస్యల కారణంగా కొందరు రాజకీయ నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అయితే, ఇంచు మించుగా రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సోనియా గాంధీ మాత్రం కారణాలు ఏవైనా చాలా కాలంగా రాజకీయ ఒత్తిళ్ళ నుంచి విశ్రాంతి కోరుకుంటున్నారు. నిజానికి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశంతోనే 2018లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, గత్యంతరం లేని పరిస్థితిలో ఆమె మరో మారు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయినా,
ఎంత కాలమైనా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోకపోవడంతో గత సంవత్సరం అక్టోబర్ లో మల్లిఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అదలా ఉంటే భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కీలక మలుపు అన్న ఆమె ఆ యాత్ర కోసం రాహుల్ గాంధీ పట్టుదలతో పనిచేశారన్నారు. ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధాలను పునరుద్దరించేందుకు రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఎంతో దోహదపడిందని అన్నారు. రాహుల్ గాంధీకి అండగా నిలిచి జోడో యాత్రను సక్సెస్ చేసిన కార్యకర్తలందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. కార్యకర్తలు ఖర్గే నేతృత్వంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సోనియా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు దేశానికి ఇది ఎంతో కీలక సమయమని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలనలో కనికరం అనేది లేకుండా పోయిందని, ప్రతి సంస్థను అణచివేసి, స్వాధీనం చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. మోడీ నిర్ణయాలన్నీ కొద్ది మంది వ్యాపారులకు మాత్రమే అనుకూలంగా ఉంటున్నాయని సోనియా మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో.. బీజేపీని ఓడించాలని కార్యకర్తలకు సోనియా పిలుపునిచ్చారు.
అదలా ఉంటే సోనియా గాంధీ తమ ప్రసంగంలో రాజకీయ జీవితం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపు తిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ – ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని సోనియా తెలిపారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ కావడంతో పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు జరిగిన ప్లీనరీలో, పార్టీ టాప్ కౌన్సిల్ సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించాలని కమిటీ తీర్మానించింది. కాంగ్రెస్ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమంలో 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర పార్టీలతో పొత్తులతో సహా 2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్‌నకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ ప్లీనరీలో చర్చించారు.