రాజకీయాలలో దార్శనికుడి తొలి అడుగుకు నేటితో నాలుగున్నర దశాబ్దాలు
posted on Feb 25, 2023 @ 11:09AM
రాజకీయంగా ఆయనతో విభేదించే వారు కూడా ఆయన దార్శనికతను వేనోళ్ల పొగుడుతారు. అభివృద్ధి విషయంలో ఆయన ఎక్కడా, ఎవరితోనూ రాజీపడరు. ఆయనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. హైదరాబాద్ బిజినెస్ స్కూల్, హైటెక్ సిటీ, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రగతి దారిలోనూ తొలి అడుగు ఆయనదే. అటువంటి దార్శనికుడు రాజకీయ ప్రస్థానం నేటికి నాలుగున్నర దశాబ్దాల కిందట మొదలైంది. ఔను సరిగ్గా నాలుగున్నర దశాబ్దాల కిందట ఇదే రోజు (ఫిబ్రవరి 25, 1978) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు చంద్రబాబు తొలిసారి నామినేషన్ వేశారు. అప్పటి నుంచీ చంద్రబాబుది ఒకే దీక్ష, ఒకే లక్ష్యం, ఒకే సంకల్పం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేశంలో అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ నంబర్ వన్ గా చూడాలి. ఆయన రాజకీయ ప్రస్థానం అంతా.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగానే సాగింది.
అభివృద్ధి విషయంలో కానీ, ప్రజా సంక్షేమం విషయంలో కానీ ఎక్కడా ఎప్పుడూ చంద్రబాబు రాజీపడిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్న సమయంలోనూ.. లేని సమయంలోనూ కూడా ఆయన రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసమే తపించారు. సంపద సృష్టి జరగాలి.. ఆ పెరిగిన సంపద ఫలాలు పేదవాడికి చేరాలి. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన ఆలోచన, తపన, కృషి ఇందుకే. అడుగులూ ఆ లక్ష్య సాధనకే... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తొలి సారిగా ఎన్నికల బరిలో అడుగుపెట్టి నేటికి సరిగ్గా 45 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఈ నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మరెన్నో సంక్షోభాలను అధిగమించారు. ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అపనిందలు మోశారు. అన్నిటినీ ప్రజా జీవితంలో ప్రజల కోసం అడుగులు వేయడానికి లభించిన అవకాశాలుగానే భావించి ముందుకు సాగారు. దార్శనికత ఉన్న నేతగా.. దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పని చేసిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లు విపక్ష నేతగా క్రీయాశీలంగా వ్యవహరించిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగేళ్లుగా విపక్ష నేతగా జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారు. ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఇంతగా సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ మనగలిగిన నేత వర్తమాన రాజకీయాలలో మరోకరు కనిపించరు.
అతి పిన్న వయస్సులోనే చట్టసభకు ఎన్నికైన నాయకుడిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబుదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరిగి నెల రాజు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చంద్రబాబు ముందుండి నడిపించారు. 1985 ఎన్నికల్లో తెలుగుదేశం విజయంలో కీలక భూమిక పోషించారు. 1995 సెప్టెంబర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేశారు. ఆయన హయాంలోనే ఇప్పుటి ఐటీ హబ్ సైబరాబాద్ నిర్మాణమైంది. సాహసోపేతంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి దారిలో పరుగులు పెట్టించారు.
అందుకే తిరుగులేని మెజార్టీతో రెండవసారి అధికారంలోకి వచ్చారన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ సారధ్యంలో బీజేపీ, కమ్యూనిస్టులు సహా దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ ఏర్పాటు వెనుక క్రియాశీలంగా వ్యవహరించిందీ చంద్రబాబే. దేశ ప్రధాన మంత్రుల నియామకంలోనూ అప్పట్లో చంద్రబాబు నిర్ణయాన్నే మిగిలిన పార్టీలన్నీ శిరోధార్యంగా భావించాయి. ఇక రాష్టప్రతులుగా కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలామ్ ఎంపికలో కీలక భూమిక పోషించింది కూడా చంద్రబాబునాయుడే అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.
విపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం 208 రోజులు 2,817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్నిటా అగ్రస్థానంలో నిలబడాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని జనం నమ్మారు. అందుకే మళ్లీ పూర్వ వైభవం తీసుకురాగల నాయకుడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొట్టమొదట గుర్తుకొచ్చిన పేరు చంద్రబాబు నాయుడు కనుకనే 2014 ఎన్నికలలో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. సరే ఆ తరువాత 2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ అభ్యర్థనకు తోడు వివేకా హత్య, కోడి కత్తి కేసుల కారణంగా వచ్చిన సానుభూతి పవనాలతో వైసీపీ విజయం సాధించింది. కానీ విజయం సాధించిన స్వల్ప కాలంలోనే జనంలో ఆ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి జగన్ పట్ల భ్రమలు తొలగిపోయాయి.
వివేకా హత్య వెనుక ఉన్నదెవరు? కోడికత్తి సంఘటన డ్రామా ఎవరి వ్యూహం అన్నవి జనానికి అర్ధమౌతున్నాయి. దానికి తోడు రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు.. అప్పులే తప్ప అభివృద్ధి జాడ లేకపోవడంతో మళ్లీ జనం చంద్రబాబు వైపు చూస్తున్నారు. తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ప్రజల పక్షానే నిలిచారనడానికి ఇప్పుడు ఆయన సభలకు జనం బ్రహ్మరథం పట్టడమే నిదర్శనం అని చెప్పుకోవచ్చు.