వైసీపీ నేతలకు అదే పని.. వాళ్ళని సాగనంపటమే ప్రజల పని!

మొదట లోకేష్.. ఆ తర్వాత చంద్రబాబు.. కాస్త గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్, ఇప్పుడు పురంధేశ్వరి. ఏంటిది అనుకుంటున్నారా?. ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు చేసిన పని. ఒకరిని టార్గెట్ చేయడం.. వారిపై మాటల దాడి చేయడం.. సినీ పరిశమ్ర నుండి ఓ ఇద్దరికి వీరి తాము టార్గెట్ చేసిన వారిపై  అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా విమర్శలు చేయాలని చేయాలని ఆదేశించడం, వారు ఆ పనిని తు.చ. తప్పకుండా అమలు చేసేలా పర్యవేక్షించడం, సొంత మీడియాలో రాతలు, ప్రసారాలు, తమ సామాజిక మాధ్యమంలో పోస్టులు ఈ నాలుగున్నరేళ్లలో   జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ప్రభుత్వం , మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన పని ఇదేనని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  ముందుగా   నారా లోకేష్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఆయన ఆహారం నుండి ఆహార్యం వరకూ.. తన నడక నుంచి నడవడిక వరకూ దేనినీ వదలకుండా విమర్శలు చేయడం, హేళన చేయడమే లక్ష్యంగా  వైసీపీ పని చేసింది. అయితే అన్నిటినీ దీటుగా ఎదుర్కొన్న లోకేష్ ఈ నాలుగేళ్ళలో  పరిణితి చెందిన నేతగా ఎదిగారు. తనపై ఒక విమర్శ చేయాలంటే ప్రత్యర్థులు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితికి వారిని తీసుకు వచ్చారు.  ఆ తరువాత వైసీపీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తన  టార్గెట్ ను షిఫ్ట్ చేసింది.  చంద్రబాబును అసెంబ్లీలోకి కూడా అడుగు పెట్టనివ్వకుండా చేసేందుకు కుట్రలు పన్ని మంచీ, చెడూ, ఉచ్ఛం, నీచం తెలియని, నోరు విప్పితే బూతుపురాణం తప్ప ఓ మంచి మాట మాట్లాడటం రాని మంత్రులు, మాజీ మంత్రులు,  ఎమ్మెల్యేల చేత అవాకులూ, చవాకులూ మాట్లాడించింది.  అప్పటికీ చంద్రబాబు చలించకపోవడంతో కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేయించింది.  ఆ తరువాత తెలుగుదేశంతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. మళ్లీ అదే పాత కథ.. ముందు వెనుకలు, పర్యవశానాల గురించి ఆలోచించకుండా జగన్ చెప్పినది తు.చ. తప్పకుండా చేసే ఆస్థాన విద్వాంసుల వంటి నాయకులతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మొదలు.. పొత్తు వరకూ, సినీ పరిశ్రమలో ఆయన నైజం నుండి కుటుంబంలో వివాదాల వరకూ దేన్నీ వదలకుండా ఆగమాగం చేశారు. కానీ, పవన్ కళ్యాణ్ దేనికీ లొంగలేదు. ఒక దశలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తన హోదా,  స్థాయి మరచి పవన్ క ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే వీటిని వేటినీ పవన్ కల్యాణ్ లెక్క చేయలేదు.  దీంతొ ఇప్పుడు తమ ఆర్థిక అవకతవకలపై, ముఖ్యంగా మద్యం మాఫియాపై గణాంకాలు, ఆధారాలతో సహా విమర్శిస్తున్న, గుట్టు బయట పెడుతున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని టార్గెట్ చేసింది వైసీపీ.  ముందుగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి,  ఆ తర్వాత మంత్రి రోజా, నటుడు పోసాని మురళీకృష్ణలు పురంధేశ్వరి టార్గెట్ గా వారికి మాత్రమే చేతనైన భాషలో విమర్శలు చేశారు. ఇక తరువాత వంతుగా  నేడో రేపో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి వాళ్ళు,  ఆ వెనుక సామాజిక  మాధ్యమంలో తప్ప మరెక్కడా నోరెత్తని దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు రంగంలోకి దిగే అవకాశం ఉంది.  మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేయాల్సిన పనులేవీ ఈ నాలుగున్నరేళ్లలో చేయని వారు.. కేవలం ప్రతిపక్ష నాయకులను  టార్గెట్ చేసి విమర్శల దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారా అనిపించక మానదు.  జగన్ సర్కార్ లో ఏ మంత్రీ కూడా  ఇప్పటి వరకూ తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల గురించి కానీ,  తన శాఖపై వచ్చిన ఆరోపణల గురించి కానీ మీడియా సమావేశం నిర్వహించి వివరించిన సందర్భం ఒక్కటి కూడా కనిపించదు..   ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించడానికి మాత్రమే వారు మీడియాకు ముఖం చూపించారని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదనిపించేలా వారి వ్యవహారశైలి ఉంది.  ఇక, వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించి ఏం పనులు చేస్తున్నారో తెలియదు కానీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించిన వారిపై దాడి చేయడమే వీరి పని అన్నట్లుగా వీరి తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక జనం వీళ్లు మారరన్న నిర్ణయానికి వచ్చేసి, వీళ్లనే మార్చేద్దామని ఫిక్సైపోయినట్లుగా కనిపిస్తోందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

తెలంగాణ ఎన్నికల్లో ఎలక్షన్ కింగ్ పద్మ రాజన్ 

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా మై హుజూర్ అంటూ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యర్థి ఎవరైనా పట్టించుకోని  తమిళనాడుకు చెందిన హోమియో డాక్టర్ పద్మరాజన్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో   సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధమయ్యారు. 237వ సారి నామినేషన్‌ వేశారు. 1986 నుంచి ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు 20 లక్షలకుపైగా ఖర్చు చేశారు పద్మరాజన్‌. అయితే.. కేవలం నామినేషన్‌ దాఖలు చేసేందుకు చెల్లించాల్సిన రుసుముగానే ఖర్చు చేశారు తప్ప ఏనాడు ఎన్నికల ప్రచారం కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు పద్మరాజన్‌. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నామినేషన్‌ వేయడంతో పద్మరాజన్‌ను ముద్దుగా ఎలక్షన్‌ కింగ్‌గా పిలుచుకుంటారు. కరుణానిధి, జయలలిత, రాహుల్‌గాంధీ, స్టాలిన్‌, పళనిస్వామి, యడ్యూరప్పపై పోటి చేసిన డాక్టర్‌ పద్మరాజన్‌ ఈ సారి కేసీఆర్‌తో తలపడనున్నారు. 237వ సారి నామినేషన్‌ వేసిన ఆయన తెలంగాణ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎన్నిక ఏదైనా సరే.. బరిలో ఉండాల్సిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రముఖలకు ప్రత్యర్థిగా నిలవాల్సిందే. ముఖ్యమంత్రి, ప్రధాని, చివరకు రాష్ట్రపతి ఎన్నికలైనా వెనకడుగు వేయడం తెలియని వ్యక్తి ఆయన.  డాక్టర్‌ పద్మరాజన్‌ దేశ రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్లకు ఆయన  సుపరిచితుడే. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు. తమిళనాడు సేలంకు చెందిన 66 ఏళ్ల పద్మరాజన్‌ హోమియోపతి వైద్యుడు. అయితే.. ఈయనకు మరో పేరు కూడా ఉంది. అదే ఎలక్షన్‌ కింగ్‌. ఈ పేరు ఎందుకొచ్చిందంటే.. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా అందులో పోటీ చేస్తుంటారు పద్మరాజన్‌. దేశంలోనే అత్యధిక సార్లు పోటీకి దిగిన అభ్యర్థిగా.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో  పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నారు. అయితే.. ఎక్కువ సార్లు పోటీలో నిలబడటమే కాదు.. అత్యధికసార్లు ఓడిపోయిన వ్యక్తిగానూ రికార్డుల్లోకి ఎక్కారు పద్మరాజన్. మాజీ ప్రధానులు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావుకు ప్రత్యర్థిగా నామినేషన్‌ వేశారు. 1991లో పీవీ నరసింహారావుపై పోటీ చేసిన పద్మరాజన్‌పై అప్పట్లో దాడి కూడా జరిగింది.   

ఏపీ మద్యం ముందు.. ఉగ్రవాదం, ప్రపంచయుద్ధాలూ బలాదూర్!

 జగన్ సర్కార్ చీప్ లిక్కర్  రాష్ట్రంలో మరణమృదంగం మోగిస్తోంది. సర్కార్ అండతో  సర్కార్ వల్ల, సర్కార్ చేత, జగన్ కోసం సాగుతున్న ఈ మాఫియా కారణంగా ఉగ్రవాదులు ప్రపంచమంతా కలిపి సృష్టించే మారణహోమం కంటే  ఏపీలో ఎక్కువ వరణాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గణాంకాలతో సహా వెల్లడించారు.  బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏపీలో జగన్ సర్కార్ మద్యం మాఫియాపై ఎప్పటికప్పుడు లెక్కలతో సహా  వివరిస్తూ ఎండగడుతున్నారు.  ఏపీలో లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను మద్యం షాపులలో అమ్మకాలకు నియమించి.. ప్రభుత్వ డీస్లరీల నుండే సరుకుని సరఫరా చేస్తున్నారు. దీంతో  రాష్ట్రంలో మద్యం నాణ్యతా ప్రమాణాల విషయంలో అధమస్థానంలో నిలుస్తున్నది.  మద్యం తయారీ కంపెనీలకు సకాలంలో చెల్లింపులు వెళ్లక ప్రీమియం మద్యం తయారీ దారులు ప్రభుత్వ డీస్లరీలకు మద్యం సరఫరా చేయడం లేదు. కానీ రకరకాల పేర్లతో కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొచ్చి నాణ్యత లేని లిక్కర్ ను యథేచ్ఛగా భారీ ధరలకు అమ్ముతూ  ప్రజారోగ్యానికి చెల్లు చీటీ రాసేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ప్రభుత్వమేనని పురంధేశ్వరి ఆరోపిస్తూ, ఏపీ మద్యం విధానానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.  కనీస పరీక్షలు కూడా చేయని మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి అమ్మేస్తూ ప్రజల ఉసురుతీసేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   అయితే, విపక్షాలు ఎన్ని ఆరోపించినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండడం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే కొత్త పేర్లతో పుట్టుకొచ్చిన కంపెనీలకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని ఎదురుదాడికి దిగుతోంది. అయితే అసలు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్  ప్రభుత్వం ఆ కంపెనీలపై దాడులు చేసి నాణ్యత ప్రమాణాలు, తయారీ విధానంలో లోపాలుంటే చర్చలు తీసుకొనే అవకాశం ఉంది. కానీ, జగన్ సర్కార్ ఆ చర్యలు తీసుకోకుండా గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎదురుదాడి చేసి  చేతులు దులిపేసుకుంటోంది.  కనీస పరీక్షలు కూడా చేయకుండా మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి ప్రభుత్వ దుకాణాలకు అందిస్తుండతో తెలిసిన కంపెనీ మద్యం ఒక్కటీ లేకపోవడంతో ప్రజలు ఉన్న దాన్నే తాగేసి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.  ఏపీలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో సగం మంది అనారోగ్యానికి ఏపీ ప్రభుత్వ మందు దుకాణాలు సరఫరా చేసిన మద్యం సేవించడమే కారణం. ఈ విషయాన్ని  బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పుంరంధేశ్వరి సాధికారికంగా, గణాంకాలు, ఆధారాలతో సహా తేల్చిన వాస్తవం.   తాజాగా పురంధేశ్వరి ఏపీలో చీప్ లిక్కర్ వలన ఏకంగా 5 లక్షల మంది చనిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల కారణంగా పాకిస్థాన్‌లో ఏటా వెయ్యి మంది మృతి చెందుతుండగా.. ఇజ్రాయెల్‌-గాజా మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు అసువులు బాసిన వారి సంఖ్య పన్నెండు వేల లోపే.  అయితే  ఏపీలో జగన్‌ సర్కారు మందు ఇంత వరకూ   ఐదులక్షల మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని.. ఇక అనధికారికంగా లెక్క వేసుకున్నా మొత్తం ఆరు లక్షల మంది జగన్‌ మందు తాగి చనిపోయానట్లు అధికారిక లెక్కలనే సాక్ష్యంగా చూపుతూ పురంధేశ్వరి సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇటీవల కడపలో సభలో మాట్లాడిన పురందేశ్వరి రాష్ట్రంలో జగన్‌ మద్యం తాగి రోజుకు 700 మంది చనిపోతున్నారని ఆరోపించారు. దీంతో మరోసారి పురంధేశ్వరి వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కానీ.. సీఎం కానీ దీనిపై ఇప్పటి వరకూ స్పందించిన దాఖలాలు లేవు కానీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం పురందేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.   ఏపీలో మద్యం నాణ్యత లేదన్న మాట వాస్తవం. ఇది ఏపీ ప్రజలకే కాదు.. పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో ఈ అంశంపై భారీ స్థాయిలో పోస్టులు వస్తున్నాయి.  ఇక ఈ చీప్ లిక్కర్ ను ప్రీమియం బ్రాండ్ల పేర్లతో కలిసి అమ్ముతూ జగన్ సొమ్ము చేసుకుంటున్నది కూడా వాస్తవమే. ఇలాంటి లిక్కర్ వలన ప్రజల ఆరోగ్యం పాడై ఆసుపత్రుల పాలవుతున్నారన్నదీ వైద్యులు, నివేదికలు రుజువు చేసిన నిదర్శనం. ఇదే విషయాన్ని పురంధేశ్వరి లెక్కలతో సహా చెప్తున్నారు. కానీ, దర్యాప్తు చేయాల్సిన ప్రభుత్వం, ఆ శాఖ మంత్రి మాత్రం స్పందించడమే లేదు. ఒకరకంగా ప్రభుత్వం ఈ ఆరోపణలన్నీ నిజమని ధృవీకరించినట్లే భావించాల్సి వస్తుంది. పైగా రివర్స్ లో గత ప్రభుత్వం మద్యం పాలసీ తప్పంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద మద్యం కేసు నమోదు చేసింది. అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు.. రాష్ట్ర ప్రజలకు అదే మద్యంతో మరణశాసనం లిఖించాడని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కాంగ్రెస్ తో కలిసి కదం తొక్కిన తెలుగుదేశం.. బీఆర్ఎస్ పనైపోయినట్లేనా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం శ్రేణులు మద్దతు పలకడం ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నది. బోనకల్ మండలం మోటమర్రిలో మల్లు భట్టి విక్రమార్కకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  దీంతో మోటమర్రి గ్రామం అంతటా కాంగ్రెస్, తెలుగుదేశం శ్రేణుల సమష్టి ప్రచారంతో దద్దరిల్లిపోయింది.  బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం శ్రేణులు భుజం భుజం కలిపి పని చేయడం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క మరో సారి విజయం సాధించాల్సిందేనని తెలుగుదేశం, కాంగ్రెస్ శ్రేణులు పట్టుదలతో పని చేస్తున్నాయనడానికి మోటమర్రి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు.    అసలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని పరిశీలకులు గత రెండు నెలలుగా విశ్లేషిస్తున్న సంగతి విదితమే. అధికారికంగా తెలుగుదేశం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించకపోయినా.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కు అండగా నిలిచిన తెలుగుతమ్ముళ్లు, బాబు అరెస్టు తరువాత ఒక్కసారిగా  పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం స్పందించకపోవడం, స్పందించిన కేటీఆర్ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో నిరసన ప్రదర్శనలేంటంటూ రుసరుసలాడటంతో తెలంగాణలో తెలుగుతమ్ముళ్లు ఒక్కసారిగా బీఆర్ఎస్ కు రివర్స్ అయిపోయారు. ఒకింత ఆలస్యంగా తన వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని గుర్తించిన కేటీఆర్ ఆ తరువాత నష్ట నివారణ కోసం ఎంతగా తాపత్రేయపడినా ఫలితం దక్కలేదని తాజాగా మోటమర్రిలో తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ తో కలిసి భట్టివిక్రమార్కకు మద్దతుగా కదం తొక్కడంతో నిర్ద్వంద్వంగా రూఢీ అయిపోయింది. పరిశీలకులు ఈ పరిస్థితిఒక్క మధిర నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా  ఉందని విశ్లేషిస్తున్నారు. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండటం వెనుక సెటిలర్ల ఒత్తిడీ, తెలుగుతమ్ముళ్ల అభీష్టం కలిసే ఉన్నాయని అంటున్నారు. ఈ సారికి తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటే బీఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుందన్న సెటిలర్ల భావనే తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కారణమైందని అంటున్నారు. మొత్తం మీద మోటమర్రిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా భట్టి కోసం ప్రచారం చేయడంతో తెలంగాణలో తెలుగుదేశం ఎటువైపు అన్న అనుమానానికి తెరపడినట్లునని చెబుతున్నారు. 

కారు సీన్ రివర్స్.. మౌత్ పబ్లిసిటీతో బీఆర్ఎస్ బెంబేలు!

సినిమాల విజయంలో  మౌత్ పబ్లిసిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే విషయంలో కూడా మౌత్ పబ్లిసిటీ కీలక పాత్ర పోషిస్తుందనీ, గతంలో సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో  మౌత్ పబ్లిసిటీ ప్రాథాన్యత మరింత పెరిగిందనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు మీడియా అంతా ఏకపక్షంగా మారిపోయిన పరిస్థితులలో మౌత్ పబ్లిసిటీ ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న విషయంపై పరిశీలకులే కాదు పార్టీలు కూడా మౌత్ పబ్లిసిటీ మీదే ఆధారపడుతున్నాయి.  మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంతగా ప్రతి ఇంటికీ చేరువైన ఈ రోజులలో కూడా ఎన్నికలు, ఫలితాలు మౌత్ పబ్లిసిటీ మీద ఆధారపడి ఉండటం ఏమిటి వింతగా ఉందే అనిపించక మానదు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు.  స్వాతంత్రోద్యమ సమయంలో  ఇప్పటిలా మీడియా పెద్దగా ప్రజలకు చేరువగాని సమయంలో ప్రజా ఉద్యమాల నిర్మాణంలో మౌత్ పబ్లిసిటీదే ప్రధాన పాత్రగా ఉండేది. మహాత్మాగాంధీ సహాయనిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, దండి  సత్యాగ్రహం వంటి ఉద్యమాలకు ఇచ్చిన పిలుపు ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారానే జనాలకు చేరిందని చెబుతారు. అప్పట్లో మీడియా పాత్ర పరిమితం. అలాగే అక్షరాస్యత కూడా స్వల్పమే. చదువుకున్న కొద్ది మంది అందుబాటులో ఉన్న వార్తాపత్రికలను చదివి, ఆ విశేషాలను జనాలకు వివరించి చెప్పేవారు. అలా విన్న వారు మరి కొందరికి... విషయం ప్రజలందరికీ చేరేది. ఇందుకు అప్పట్లో వారం నుంచి పది రోజల సమయం పట్టేదని ఒక  అంచనా. అయితే ఇప్పడు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అక్షరాస్యులు కూడా గణనీయంగా పెరిగారు. అయితే మీడియాపై విశ్వసనీయత మాత్రం ఏదో ఒక మేరకు సన్నగిల్లింది. అందులో సందేహం లేదు. తెలంగాణ విషయమే తీసుకుంటే..  రాష్ట్రంలో దాదాపు మీడియా అంతా అధికార పార్టీ ప్రచారానికే ఎక్కువ సమయం, స్థలం కేటాయిస్తున్న పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత  ఇంచుమించు ప్రతి రోజూ మూడు బహిరంగ సభలలో ప్రసంగిస్తుండటంతో ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ.. ఆయన ప్రసంగానికి సంబంధించిన వార్తే హైలైట్ అవుతోంది. ఇతర పార్టీల ప్రచార కార్యక్రమాలకు కేటాయించే సమయం, స్థలం కూడా తక్కువ అయిపోతోంది. ఈ పరిస్థితుల్లో గ్రౌండ్ రియాలటీపై వాస్తవాలు జనాలకు ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారానే తెలుస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన సందర్భాలలో మీడియాలో ప్రచారం కంటే మౌత్ పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతారు. మీడియా కంటే మౌత్ పబ్లిసిటీ చాలా బలంగా ప్రజలలోకి వెడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేసేవారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన ఏపీలో వైసీపీ తరఫున పని చేసిన సంగతి విదితమే. అప్పట్లో పింక్ డైమండ్ మాయం, వివేకా హత్య, కోడికత్తి దాడి వంటి అంశాలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచడంలో ఆయన మీడియా కంటే మౌత్ టాక్ ద్వారా వచ్చే ప్రచారంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అప్పట్లో అది సత్ఫలితాలను ఇచ్చింది కూడా.    ఇక ప్రస్తుతానికి వస్తే తెలంగాణలో  వాస్తవ ప్రజాభిప్రాయం అంతా మౌత్ టాక్  ద్వారానే వెలుగులోనికి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక మాధ్యమం, మౌత్ టాక్ విపక్షాలకు ఒకింత మేలు చేస్తున్నాయనీ, అదే సమయంలో  ఎలక్ట్రానిక్ మీడియాలో సింహ బాగం అధికార పార్టీ వార్తల ప్రసారం, ప్రచారానికే పరిమితమైందన్న అభిప్రాయం బలంగా ఉందని చెబుతున్నారు.  ఆటో, క్యాబ్ డ్రైవర్లు, జనం తరచుగా వెళ్లే బార్బర్ షాపులు, టీ స్టాల్స్, సామాన్యులు ప్రయాణించే సిటీ బస్సులు, మెట్రో రైళ్ల ద్వారా జనాభిప్రాయం ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఒక బలమైన మాధ్యమంగా మౌత్ టాక్ మారిపోయిందని అంటున్నారు. ఈఈ ప్రదేశాలలో అత్యధికంగా బీఆర్ఎస్ అవినీతి, పోలవరం ప్రాజెక్టు లోపాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వంటి విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నదనీ, అంతిమంగా ఈ చర్చ అధికార పార్టీకి వ్యతిరేక అభిప్రాయంగా బలపడుతున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బిగ్ బాస్ బ్యూటీ సొంత విల్లాలో రేవ్ పార్టీ.. 11 మంది అరెస్ట్?

బిగ్ బాస్ ఫేమ్ హిమజకు సంబంధించిన ఒక న్యూస్ రీసెంట్ గా  టాప్ హెడ్ లైన్స్ లో వచ్చిన విషయం తెలిసిందే.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తన సొంత విల్లాలో రేవ్ పార్టీ చేసుకున్నట్లు, ఈ పార్టీపై పోలీసులు దాడి చేసి హిమజ సహా 11 మందిని అరెస్ట్ చేసినట్లు ఓ వార్త అయితే తెగ హల్ చల్ చేస్తోంది. అయితే ఆ వార్త పూర్తిగా అవాస్తవమంటూ  హిమాజ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో తాను  దీపావళి పండుగను కొత్త ఇంటిలో ఘనంగా జరుపుకుంటుంటే  కొన్ని ఛానల్స్,   ఫేక్ యాప్ లు తనపై  తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు.  అటువంటి వార్తల్ని నమ్మొద్దంటూ హితవు పలికారు. తన  ఇంట్లో పార్టీ జరిగిన మాట వాస్తవమేననీ, ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో  పోలీసులు   తన ఇంట్లో  సోదాలు  చేశారని  తెలిపిన ఆమె.. పోలీసులకు తాను    సహాకరించానన్నారు.  తనపైన తన పార్టీకి వచ్చిన వారి పైన కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటివేవీ జరగలేదని స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో దీపావళి వేడుకల కోసం సన్నిహితులను పిలిచానని, పూజా కార్యక్రమాలు నిర్వహించానని హిమజ వెల్లడించారు.  తాను అరెస్ట్ అయ్యానన్న వార్తలతో తనకు  ఫోన్లు వస్తున్నాయని వాటన్నిటికీ చెక్ పెట్టడానికీ,  అందరికీ వాస్తవం ఏంటో తెలియాలనే ఉద్దేశంతోనే  ఇలా లైవ్ లోకి వచ్చినట్లు హిమజ తెలిపారు.  బిగ్ బాస్ 3 వ సీజన్ లోకి ఎంట్రీ తో హిమజ  బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందూ, ఆ తరువాత కూడా అడపాదడపా కొన్ని సినిమాలలో నటించినా  బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ మాత్రమే హిమజను ప్రజలలో గుర్తుండిపోయేలా చేసింది.  అయితే తాజాగా తన నివాసంలో రేవ్ పార్టీ వార్తలను ఖండిస్తూ  రిలీజ్ చేసిన ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ ని హిమజ క్లోజ్ చేసేశారు. 

తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ సోదాల కలకలం 

తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం  కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి సుధాకర్ రెడ్డి  నివాసంపై ఐటీ దాడులు జరిగాయి. ఓ వైపు  కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలోనే ఐటీ దాడులు జరిగాయి.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. కేవలం 17  రోజుల్లో పోలింగ్ ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతల ఇళ్లపై మాత్రమే ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ నేతల  మీద బిఆర్ఎస్ , బిజెపి కక్ష్య కట్టాయని ఈ కారణంగా వారి  ఇళ్లపై దాడులు జరుగుతున్నట్టు పరిశీలకులు ఆరోపిస్తున్నారు. సోమవారం తెల్లవారు జాము నుంచే నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. గచ్చి బౌలి, అమీన్ పూర్, పటేల్ గుడా, ఆర్ సీ పురం , నాగుల పల్లి ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గచ్చి బౌలిలోని ప్రముఖ ఫార్మా కంపెనీ మై హోమ్ భూజ టాప్ ఎగ్జిక్యూటివ్ ల ఇళ్లలో దాడులు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సారి దాడుల్లో ఫార్మా కంపెనీలను ఐటీ అధికారులు టార్గెట్ చేశారు.  వారం క్రితం తుమ్మల నాగేశ్వరరావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, కేఎల్ఆర్ నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. తాజాగా సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతున్నాయి.  ఫార్మా కంపెనీ యజమాని ఇల్లుతోపాటు కార్యాలయాలు సిబ్బంది ఇళ్లల్లో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ బీటీం బిజెపి కాదు అనే అపవాదు తొలగించుకోవడానికే  ఈ దాడులు జరుగుతున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. 

హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం

దీపావళి వేడుకల్లో అపశ‌ృతి చోటు చేసుకుంది. నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బజార్ ఘాట్ లో ఉన్న ఓ గోడౌన్ లో సోమవారం మంటలు ఎగసిపడ్డాయి. ఐదు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వర్కర్లు మంటల్లో చిక్కుకున్నారు. ఏడుగురు వర్కర్లు సజీవదహనమయ్యారని సమాచారం.  అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.  నాలుగు ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. వాటితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గోడౌన్ ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్ లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. గోడౌన్ లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడినట్లు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నిప్పంటుకుందని వివరించారు.ఆదివారం రాత్రి టపాసుల మిరుగులు గౌడౌన్ లో పడినట్లు పోలీసులు గుర్తించారు.  ఈ మిరుగులే అగ్ని ప్రమాదానికి కారణమైంది. 

తుమ్మలకు అనుకూలంగా మారుతున్న ప్రభుత్వ వ్యతిరేకత!

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగురాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు దీటుగా ఖమ్మం అసెంబ్లీ స్థానం కూడా పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. విశేషమేమిటంటే.. తుమ్మలతో విభేదించే వారు, రాజకీయాలకు సంబంధం లేని ప్రొఫెషనల్స్, అసలు కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీల పడే గిట్టని వామపక్ష తీవ్రవాద పార్టీలు కూడా ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా తుమ్మలకు మద్దతుగా నిలుస్తామనీ, నిలుస్తున్నామనీ బాహాటంగా చెబుతున్నారు. అందుకు ఎవరికి వారికి వేరువేరు కారణాలుండచ్చు. కానీ లక్ష్యం మాత్రం బీఆర్ఎస్ ఓటమి మాత్రమే అని చెబుతున్నారు. అలా చెబుతున్న వారిలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలూ లేని వారూ, రాజకీయాలతో సంబంధం లేకుండా తమతమ వృత్తులకే ఇంత వరకూ పరిమితమైన వారూ కూడా ఉన్నారు. వీరంతా మొదటి సారిగా బయటకు వచ్చి.. తుమ్మలకు  ప్రజామద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వచ్ఛందంగా ఆ పనిలో నిమగ్నమయ్యారు.   అలా పని చేస్తున్న వారిలో వైద్యలు ఉన్నారు. టీచర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, రిటైర్డ్ ఇంజనీర్లు, మాజీ ఐఏఎస్ లూ కూడా ఉన్నారు. ఇలా అన్ని వర్గాల వారూ, అన్ని వృత్తుల వారూ ఉన్నారు. వీళ్లలో ఎవరూ ఇప్పటి వరకూ రాజకీయాలతో ప్రత్యక్ష  సంబంధాలు ఉన్నవారు కాదు. అయినా బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతో ఎవరికి వారుగా ముందుకు వచ్చి పని చేస్తున్నారు. మాజీ ఉగ్రవాదులు, వామపక్ష  తీవ్రవాద  పార్టీలూ కూడా తుమ్మలకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. వీరంతా బీఆర్ఎస్ ను వ్యతిరేకించడానికి వేరువేరు కారణాలు ఉండోచ్చు. అన్నిటికీ ఉన్న సారూప్యత మాత్రం బీఆర్ఎస్ వ్యతిరేకతే కావడం విశేషం.  గతంలో వామపక్ష తీవ్రవాద పార్టీలలో పని చేసి వేరు వేరు కారణాలతో బయటకు వచ్చి.. ఎవరికి వారుగా తమతమ వృత్తులలో ఉన్న వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి తుమ్మలకు మద్దతుగా వారంతట వారుగా  ప్రచారం చేస్తున్నారు. ప్రజల మద్దతును కూడగడుతున్నారు.  ప్రజలతో మమేకమౌతూ.. బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రచారం  చేస్తున్నారు.  ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే సీపీఐఎంల్ పార్టీలు కూడా ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న సీతక్క, బీఆర్ఎస్ తరఫున రంగంలో  ఉన్న బడే జ్యోతి వంటి మాజీ వామపక్ష తీవ్రవాదులతో కలిసి  పని చేసిన వారికి మద్దతు ప్రకటించే విషయంలో  ఏ నిర్ణయం తీసుకోలేదు.. కానీ వామపక్ష సిద్ధాంతాలతో కానీ, పార్టీలతో కానీ సంబంధం లేని తుమ్మల విషయంలో మాత్రం అంతా ఒకే మాట చెబుతున్నాయి. వీరే కాదు.. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా, కీలకంగా పని చేసిన ఉద్యమ కారులు కూడా  బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేయడానికి ముందుకు వస్తున్నారు. వీరంతా ఇక చాలు బీఆర్ఎస్ టైం అయిపోయింది.  బీజేపీతో రహస్య మైత్రితో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని బాహాటంగా చెబుతూ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి.  ఒక ఆంగ్ల వెబ్ సైట్ ఖమ్మం నియోజకవర్గంలో ప్రజానాడి తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో తుమ్మలకు భిన్న భావజాలాలు, బిన్న వృత్తులలో ఉన్నవారంతా బేషరతు మద్దతు ప్రకటిస్తున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అధికార అహంకారంతో  స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించేశారనీ, కుటుంబపాలన, అవినీతి తెలంగాణలో పెచ్చరిల్లాయనీ విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రభుత్వ ఉద్యోగులలో కూడా కేసీఆర్ పట్ల, బీఆర్ఎస్ సర్కార్ పట్ల విముఖత కనిపిస్తున్నది. తమ పేర్లు బయటపెట్టడానికి ఇష్టపడని పలువురు ఉద్యోగులు కేసీఆర్ సర్కార్ పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ సారి తమ మద్దతు తుమ్మలకేనని కుండబద్దలు కొట్టారు.  మొత్తంగా తోమ్మిదేళ్ల కేసీఆర్ పాలన పట్ల తెలంగాణలో ప్రజా వ్యతిరేకత ఓ స్థాయిలో ఉందని పరిశీలకులు చెబుతున్నారు. 

కేసీఆర్‌కు కొత్త చిక్కులు.. ప్రచారం తరువాత.. ముందు బుజ్జగింపులు!

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చందాన సాగుతోంది. ఊరికి ముందర అన్న చందంగా షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించేసి.. విపక్షాలపై పైచేయి సాధించేశాం అని జబ్బలు చరుచుకున్న బీఆర్ఎస్ కు ఆ తరువాత ఏదీ అంతగా కలిసి రావడం లేదు. అసంతృప్తులు, అసమ్మతులు అలా ఉంచితే.. స్వయంగా కేటీఆర్ పోటీ చేసే రెండు స్థానాలలోనూ గెలుపు అంత సులువుగా రాదని పరిస్థితులు గమనించిన ఎవరికైనా ఇట్లే అవగతమౌతుంది. అదే విషయం అర్థమై ఇప్పుడు గులాబి పార్టీలో గుబులు మొదలైంది. విషయానికి వస్తే.. తెలంగాణఅసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. సోమవారం (నవంబర్ 13) నామినేషన్లను పరిశీలన,   15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇప్పుడు ఈ తేదీయే కేసీఆర్ అండ్ కోను భయపెడుతోంది. ఎందుకంటే..  తెలంగాణ సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో   154 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కామారెడ్డిలోనూ పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి.  అయితే గజ్వేల్‌లో నామినేషన్లతో బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్ కు కంగారు మొదలైంది. ఇప్పుడు అలా దాఖలైన నామినేషన్ల ఉపసంహరణ విషయంలో బుజ్జగింపులకు, అలవికాని హామీలనైనా ఇచ్చేందుకు కేసీఆర్, బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాయి.    సీఎం కేసీఆర్‌పై నామినేషన్లు వేసిన బాధితులను, నేతలు బుజ్జగించేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది.  నామినేషన్లు ఉపసంహరించుకోవాలనీ, ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌  అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని బీఆర్ఎస్ నేతలు నమ్మబలుకుతూ నామినేషన్లు దాఖలు చేసిన వారి చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు.  ఇక  నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్‌ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో, రంగంలోకి దిగిన గులాబీ పార్టీ నేతలు వారిని విత్‌డ్రా చేసుకోవాలని బుజ్జగిస్తున్నారు. అదలా ఉంటే..  తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే నాటికి  రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి   5,716 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేయగా,  116 నామినేషన్లతో మేడ్చల్  రెండో స్థానంలో,    104 నామినేషన్లతో కామారెడ్డి మూడో స్థానంలో ఉన్నాయి.  నారాయణపేట 13 నామినేషన్లతో చివరి స్థానంలో ఉంది.   వైరా, మక్తల్‌లో కూడా 13 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద ఎన్నికల ప్రచారంపై పూర్తిగా దృష్టి పెట్టాల్సిన సమయంలో అధికార పార్టీ నేతలంతా.. తమ అధినేతకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించో, బతిమలాడో వాటిని ఉపసంహరింప చేసే పనిలోనే పూర్తిగా నిమగ్నం కావాల్సి వస్తోంది. 

జనాలకు బెదరింపులు.. వాలంటీర్లకు ఆదేశాలు!

2024 ఎన్నికల ఫలితం ఏమిటన్నది వైసీపీ నేతలకు ఎప్పుడో  క్లియర్ కట్ గా అర్ధమైపోయింది. ప్రజలలో స్పందన కావచ్చు.. ఇప్పటికే వచ్చిన సర్వేల ఫలితాలు కావచ్చు.. ఇక తాము కుర్చీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని ఫిక్సయిపోయారు. ఎలాగూ పోతున్నాం కదా చివరిగా బెదిరించి ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నారో ఏమో కానీ ప్రజలను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. కుదిరితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లేకపోతే  నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు. ఈసారి జగన్ మోహన్ రెడ్డికి ఓట్లేయకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడంటూ శాపనార్ధాలు కూడా పెడుతున్నారు. సాక్షాత్తు మంత్రులే ఈ తరహా వ్యాఖ్యలకు దిగుతున్నారంటే వైసీపీ నేతలలో ఓటమి భయం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు గురించి రాజకీయాలపై అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. గతంలో అమరావతి రైతుల మీద కూడా నోరు పారేసుకున్న ఈ మంత్రి గారి బూతు పురాణం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బట్టబయలౌతోంది.  మంత్రి ధర్మాన ఇప్పుడు ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ వైసీపీ ఓట్లేయాలని కోరుతున్నారు. ఈ మధ్యనే వైసీపీ సామజిక బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన శ్రీకాకుళం నియోజకవర్గంలో బస్సు యాత్రలో పాల్గొన్న ధర్మాన ఓ గ్రామానికి వెళ్లారు. మంత్రి వచ్చారన్న కనీస స్పందన కూడా ప్రజలలో లేకపోవడంతో ధర్మాన ప్రజలను ఉద్దేశించి మిమ్మల్ని ఓట్లు అడగను.. నా పని తీరు నచ్చితే ఓట్లు వేయండి అంటూ వ్యాఖ్యానించారు. మీ వరకు మీకు మంత్రిగా ఉంటా.. ఏ పనైనా చేయిస్తా. కాకపోతే మళ్ళీ నేను మళ్ళీ రావాలన్నా.. మంత్రి కావాలన్నా ఓటు వేయండి. అలాకాకుండా టీడీపీకి ఓటు వేస్తే మాత్రం మీ ఇంటి వద్దకు వాలంటీర్ రాడు.. పింఛన్ ఉండదు. చంద్రబాబు వస్తే పథకాలన్నీ ఆపేస్తారు అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించకపోవడంతో  అర్బన్ ఓటర్లు బహిరంగంగానే ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. దీంతో ధర్మాన ఇలా హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలకు దిగుతున్నారు.  అదే సమయంలో వాలంటీర్లను ఉద్దేశించి మీరు వైసీపీ కార్యకర్తలేనని..  వైసీపీని మరోమారు అధికారంలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత మీదేనని పరోక్షంగా  ఏమిటి ప్రత్యక్షంగానే బెదిరిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.   అసలే ప్రజలలో బాగా మసకబారిన వైసీపీ ప్రతిష్టను ధర్మాన బ్లాక్ మెయిల్ వ్యాఖ్యలతో  మరింత  దిగజార్చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇదే ధర్మాన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలూ చేస్తున్నారు. పార్వతీపురంలో జరిగిన బస్సు యాత్రలో పాల్గొన్న ధర్మాన మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది వాస్తవమని అంగీకరించేశారు. విద్యుత్ వినియోగం రాష్ట్రంలో బాగా పెరగడంతో ప్రభుత్వం అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్ సంస్థల నుంచి కొనడంతో అదనపు భారం పడుతున్నదని,  అలాగే మూడు రాజధానుల అంశాన్ని కూడా గుర్తు చేసిన ధర్మాన.. జగన్ సర్కార్ విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా చేస్తుందని, అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదించిందని.. అయితే పేరుకు మూడు రాజధానులని అంటున్నా అసలైన రాజధాని మాత్రం విశాఖ మాత్రమేనని  సెలవిచ్చారు. ఇప్పుడు ఈ రెండు వ్యాఖ్యలూ  ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పెంపుపై ప్రతిపక్షాలు ఎప్పటి నుండో తీవ్రంగా విమర్శలకు దిగుతున్నాయి. విద్యుత్ బిల్లుల మోతతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అయితే విద్యుత్ చార్జీల పెంపు  వాస్తవమేనని..  ప్రజలు భరించితీరాల్సిదేననీ చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు.  గతంలో వైసీపీ నేతలు బాదుడే బాదుడు అంటూ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయగా ఇప్పుడు వైసీపీ అంతకు మించి బాదేస్తున్న విషయాన్ని స్వయంగా మంత్రి ధర్మానే  ఒప్పేసుకున్నారు. అసలే మూడు రాజధానుల అంశం మాటలకే తప్ప ఆచరణలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల లోపు అది న్యాయస్థానాలలో తేలేలా కనిపించడం లేదు. కానీ, ధర్మాన మాత్రం అసలు రాజధాని నకిలీ రాజధానులు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజలలో కంపరం పుట్టిస్తుంటే..  ప్రతిపక్షాలకు లడ్డు చేతికి ఇచ్చినట్లుగా మారింది. కర్నూల్ రాజధాని ఊసే ప్రభుత్వం వద్ద లేకపోగా ధర్మాన దాన్ని కెలికి మరీ  సీమలో పార్టీకి దాదాపు పాతర వేసేశారని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  ఒకవైపు ప్రజలకు బెదిరింపులు, మరొక వైపు ఇలా ప్రభుత్వానికి తిప్పలు తెచ్చే వ్యాఖ్యలతో ధర్మాన బస్సు యాత్రను వైసీపీని ఓటమికి  మరింత దగ్గర చేసేలా మార్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ పొమ్మంటే.. మేము రమ్మన్నాం..జగన్ పాలనపై కేటీఆర్ మరో బాంబ్!

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీలో బూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి అన్నది కానరావడం లేదు. నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, మేధావులు మొత్తుకున్నా వైసీపీ నేతలు మాటలతోనే అందరినీ బెదరగొట్టేస్తూ పబ్బం గడుపుకున్నారు. పైగా రాష్ట్రంలో ఉన్న పాత కంపెనీలను రకరకాల వేధింపులతో రాష్ట్రం నుండి వెళ్లగొట్టారు. ఫలితంగా నిరుద్యోగం పెరిగి యువత వలస బాట పట్టారు. పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలు దివాళా తీసి రాష్ట్రం ఆర్ధికంగా దిగజారి, దివాళా స్థాయికి చేరుకుంది. కానీ, ఇవేవీ పట్టని ప్రభుత్వం తలకి ఇంత ఇచ్చాం రోడ్లు, కంపెనీలు, అభివృద్ధి లాంటివి ఎందుకు అడుగుతున్నారంటూ ప్రజలనే ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం కావడంతో పక్క రాష్ట్రాల నేతలు కూడా ఏపీ అభివృద్ధి గురించి.. జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పరువు గంగలో కలిపేస్తున్నారు. అయినా వైసీపీ నేతల నుండి మాత్రం ఉలుకూ పలుకూ ఉండటం లేదు.  ఇప్పటికే ఏపీపై తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నేతలు రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రోడ్లెక్కితే మంచాన పడుడే, తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చు, పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారు, తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైంది, ఏపీలో పనితనం లేదు, పగతనం ఉంది అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ నుండి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సమయం సందర్భంతో పని లేకుండా  సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనను అవహేళన   చేస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి  ఏపీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి పాలన, ఏపీలో పరిస్థితుల గురించి పూసగుచ్చినట్లు వివరించారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీలో ఉండ‌లేమ‌ని భావిస్తున్న‌వారికి తెలంగాణ ఫ‌స్ట్ ఎట్రాక్ష‌న్ గా మారింది. ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా అంతేనని.. ఏపీలో ఉండలేక పరిశ్రమలు కూడా తెలంగాణకి వచ్చేస్తున్నాయని  వ్యాఖ్యానించారు.  అమర్ రాజా బ్యాటరీస్ ఎంతటి ప్రతిష్టాత్మక సంస్థనో అందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండే ఈ సంస్థ దశాబ్దాలుగా ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధినిస్తున్నది. సంస్థకు వచ్చే లాభాలలో కూడా ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేపడుతుంది. పూర్తిగా విదేశీ టెక్నాలజీలోకి రూపాంతరం చెందిన ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి. అలాంటి కంపెనీని వైసీపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురి చేసింది. దీంతో ఈ కంపెనీ ఇక రాష్ట్రంలో ఉండలేమని పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం వారికి సాదరంగా ఆహ్వానం పలికింది. 9500 కోట్ల రూపాయ‌ల ద‌శ‌ల‌వారీ పెట్టుబ‌డితో తెలంగాణలో సంస్థ‌ను ఏర్పాటు చేసింది. ఈ విష‌యం అప్ప‌ట్లోనే సంచ‌ల‌నంగా మారి.. రాజ‌కీయ దుమారానికి కూడా దారి తీసింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కు తాజాగా ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఏపీలో పెట్టుబ‌డి దారుల‌కు స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయ‌ని.. అక్క‌డ ఉండ‌లేని ప‌రిస్థితిలో.. తొలి గ‌మ్య‌స్థానం తెలంగాణగా మారిందని చెప్పారు. అలాగే అమ‌ర‌రాజా కంపెనీ కూడా తెలంగాణ‌కు మార్చుకున్నారని చెప్పుకొచ్చారు.  అంతేకాదు, ఏపీ వద్దంది.. మేము రమ్మన్నాం.. మేం కూడా వ‌దిలేస్తే.. ఆయ‌న‌ బెంగ‌ళూరుకో.. చెన్నైకో వెళ్లిపోతారు. అందుకే మేం ఆహ్వానించాం.. ఇందులో త‌ప్పేంటి? అని కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలు చాలు అమర్ రాజా సంస్థను వైసీపీ ఎంతగా వేధించి వెళ్లగొట్టిందో. చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగిన  తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి ఆ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్ లో కూడా కీలక పాత్ర పోషించిన ఈ కుటుంబం ఇప్పుడు తెలుగుదేశంతో ఉంది. అంతమాత్రాన రాజకీయ కారణాలతో వాళ్ళని రాష్ట్రం నుండి తరిమేయాల్సిన అవసరం లేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం వ్యాపారాన్ని దెబ్బతీసి ఆ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని చూసింది. అయితే  తెలంగాణ వారికి రెడ్ కార్పెట్ పరిచి   ఆ రాష్ట్ర యువతకి ఉపాధి పెంచుకొని తద్వారా ఆదాయాన్ని పెంచుకుంది. ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

వైసీపీకి కొత్త తిప్పలు!

ఏపీలో ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి. ఎప్పటి నుండో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి వైసీపీకి అధికారం దక్కనివ్వమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అనుకున్నట్లే జనసేన తెలుగుదేశంలో కలిసి ఎన్నికలకు వెడుతున్నదని తేలిపోయింది.  ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను కూడా నియమించుకొని సమష్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలోనే రెండు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ప్రకటించనున్నారు. ఇక వామపక్షాలు కూడా వీళ్ళతో కలిసిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ ఒంటరిగా మిగలనుంది. మాకెవరితో పొత్తులు ఉండవని వైసీపీ నేతల ప్రకటనలు కోటలు దాటుతున్నా.. అసలు వైసీపీతో కలిసి వెళ్లే సాహసం ఏ పార్టీ  చేసే పరిస్థితి లేదని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు వైసీపీకి ఖచ్చితంగా నష్టం చేకూర్చేదేనని ముందు నుండి తెలిసిందే కనుక వైసీపీ నేతలు.. దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవారు. కానీ  తెలుగుదేశం, జనసేన వాటన్నిటికీ దీటుగా బదులిచ్చాయి.   క‌లివిడిగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ నుండి అనంత‌పురం, క‌ర్నూలు వంటి జిల్లాల్లో , ఉత్తరాంధ్ర నుండి విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జ‌న‌సేన‌ నేతలు తెలుగుదేశం కార్యక్రమాలకు హాజరవుతున్నారు. త్వరలోనే మిగతా ప్రాంతాలలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పని చేసేలా  కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. కాగా, ఇప్పుడు తెలుగుదేశం,జనసేన పార్టీల పొత్తుతో వైసీపీకి కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఈసారి అదే పార్టీ నుండి, అదే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత తమపై కనిపించకుండా కుదిరితే పార్టీ నుండి జంప్ చేయాలనీ.. లేకపోతే కనీసం నియోజకవర్గం అయినా మారాలని ఆశపడుతున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన వేరువేరుగా ఉంటే ఇలాంటి జంపింగులకు భారీ ఛాన్స్ దక్కేది. కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటి కావడంతో ఆ పార్టీలలో నేతలకే స్థానాల కేటాయింపులో సర్దుబాటు చేయాల్సి వస్తుంది. దీంతో కొత్తగా ఈ పార్టీలలోకి వచ్చే నేతలకు టికెట్ హామీ  కష్టమే. ఒకవేళ అలాంటి హామీలు ఇస్తే అది ఈ పార్టీలకు నష్టమే అవుతుంది కనుక ఆయా పార్టీలు కూడా జంపింగులను ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఎక్కడో కొన్ని కీలక నియోజకవర్గాలలో మినహా జంపింగులకు అవకాశం దక్కడం అసంభవమే అవుతుంది. అలాంటి స్థానాలలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా చోట్ల జంపింగుకు అవకాశం లేని క్రమంలో వైసీపీలోనే ఉంటూ తమ నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గానికి మారేందుకు   వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. కానీ ఆయా స్థానాలలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గం మారేందుకు ఇష్టపడకపోవడంతో వైసీపీ అధిష్టానం ఇప్పుడు తలలు పట్టుకొనే పరిస్థితికి వచ్చిందపి చెబుతున్నారు. నిజానికి వైసీపీ అధిష్టానం కూడా అసంతృప్తిని తగ్గించుకొనేందుకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను వారి  నియోజకవర్గాల నుంచి పోటీకి దించకుండా మార్పు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, కీలక స్థానాల మార్పు తప్పదన్న చోట సిట్టింగులు ససేమీరా అంటున్నారు. కావాలంటే ఈసారికి పోటీకి దూరం అవుతాం తప్ప మరోచోటకి వెళ్ళేది లేదని ఖరాకండీగా చెప్పేస్తున్నారు. దీంతో వారిని ఒప్పించడం కష్టతరంగా మారిందట. ఇక అసంతృప్తి స్థాయి ఎక్కువ ఉన్న వారికి టికెట్లు కేటాయించడం కష్టమేనని జగన్ ఇప్పటికే ప్రకటించగా.. ఈ నాయకులందరూ టికెట్ల హామీలు లేకపోయినా ప్రతిపక్ష పార్టీలలో చేరి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కూడా వెనుకాడేది లేదని బెదిరింపులకు దిగుతున్నట్లు పార్టీ వర్గాలలోనే ఓ టాక్ జోరుగా వినిపిస్తున్నది.  ఒకవైపు టికెట్లు దక్కకపోతే రెబల్స్ పెరిగే ప్రమాదం.. మరోవైపు గెలుపు అవకాశాలు సన్నగిల్లడంతో  వైసీపీలో గందరగోళ పరిస్థితి కనిపిస్తున్నది. ఇష్టం లేకపోయినా పలువురు ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉంటూ పార్టీ పెద్దలకు తలపోటు తెప్పిస్తున్నారని అంటున్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుందామంటే వారు రెబల్స్ గా మారితే మరింత ముప్పు అన్న అభిప్రాయంతో వైసీపీ అగ్రనాయకత్వం మింగలేక కక్కలేక సతమతమవుతోందని పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకుంటున్నాయి. 

జగన్ పాలనపై పీకే రివర్స్.. ఆ కాస్త అండా పాయె

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నికల వ్యూహకర్త.  2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిందంటే అది పీకే చలవేనని అందరికీ తెలిసిందే. పశ్చిమబెంగాల్ లో మమత సర్కార్ మళ్లీ కొలువుదీరిందన్నా, 2014 ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి అడుగుపెట్టిందన్నా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజీలే కారణం. ఇక  ఏపీ విషయానికి వస్తే.. గత ఎన్నికలలో వైసీపీ విజయం పీకే వల్లే  సాధ్యమైందంటూ జగన్  ఫుల్ క్రెడిట్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో మనల్ని గెలిపిస్తున్నారంటూ గత ఎన్నికలకు ముందు తన పార్టీ క్యాడర్ కు పరిచయం చేసిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ కు సరైన గౌరవం, సముచిత స్థానం కల్పించి ఆయన  టీం ఐ ప్యాక్ ఆదేశాలకు అనుగుణంగానే పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.  అయితే, కొన్నాళ్ళుగా రాజకీయ బాట పట్టిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్నారు. తన టీం పనిచేస్తుంది కానీ తాను ఆ పనికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.పీకే టీం మాత్రం ఏపీలో వైసీపీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది. అయితే, ఐ ప్యాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తున్నా ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇప్పుడు జగన్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.  ఇటీవల ఓ డిబేట్లో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. ప్రభుత్వాల పనికిమాలిన విధానాలు, రాష్ట్రాలను దివాలా తీసే పథకాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆంధ్రప్రదేశ్ ను ఉదహరించి వైసీపీకి పీకే షాక్ ఇచ్చారు. పంచిపెట్టుకుంటూ పోతే ఏ రాష్ట్రమైనా ఏపీలా అయిపోతుందని.. జగన్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపేలా పీకే కామెంట్స్ చేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి. దీంతో పీకే ఏంటి జగన్ పాలనపై ఇలా మాట్లాడం ఏంటని రాజకీయ వర్గాలలో చర్చగా మారింది. ఉన్నట్లుండి పీకే ఇలా ప్లేట్ ఫిరాయించడంపై ప్రధానంగా రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఇప్పుడు వైసీపీకి ప్రతికూల గాలి వీస్తున్న సంగతి తెలిసిందే. జగన్  ఓటమి ఖరారు కావడంతో ఐ ప్యాక్ పనితీరు విషయంలో జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే జగన్ పలుమార్లు ఐ ప్యాక్ తో పాటు పీకేకు హెచ్చరిక సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఐప్యాక్ చేయాల్సిందంతా చేసినా జగన్ తప్పిదాల వలనే ఈ స్థాయి అసంతృప్తికి కారణమని ఐ ప్యాక్ అభిప్రాయం. అదే విషయాన్ని పలుమార్లు ఐ ప్యాక్ హెచ్చరించినా వైసీపీ పెద్దలు పెడచెవిన పెట్టారు. చివరికి పరిస్థితి ఇక్కడకి చేరింది. ముఖ్యంగా ఉచిత పథకాల విషయంలో పీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇలా ఉచిత పథకాలతో రాష్ట్రం దివాళా తీస్తే అధికారంలోకి తెచ్చిన తనను నిందిస్తున్నారని పీకే మధనపడుతున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఇలా జగన్ పాలనపై పీకే రివర్స్ అటాక్ ఇచ్చినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  కాగా, ఇప్పటికే ఏపీలో వైసీపీపై అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఈ అసంతృప్తిని అంతో ఇంతో మాఫీ చేసే మార్గం చెప్పాల్సిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ పాలనపై అంతకు మించిన అసంతృతప్తితో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే విఫల పాలనకు ఉదాహరణగా  ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉదాహరణగా చూపెడుతున్నారు. వైసీపీ లాంటి పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ప్రజలు తనను తిడుతున్నారని పీకే భావిస్తున్నారు.   పీకే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా స్పందించలేదు. ఏపీని జగన్ దివాళా తీయించారన్న తీవ్రమైన వ్యాఖ్యలకు కూడా వైసీపీలో ఎలాంటి కదలిక లేదు. జగన్ విఫల సీఎం అంటూ పీకే తీవ్ర వ్యాఖ్యలు చేసినా వైసీపీలో ఎవరూ స్పందించడం లేదంటే.. ఆయన వ్యాఖ్యలతో పార్టీ నాయకులు కూడా ఏకీభవిస్తున్నట్లే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా జగన్ కు పీకే రూపంలో ఉన్న ఆ కాస్త అండా కూడా పోయిందని అంటున్నారు.

పోలీసుల సెటిల్మెంట్.. ఏపీ మంత్రికి వాటాలు!

అడ్డగోలు అక్రమాలు, దందాలు, అవినీతి, అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లు మారిపోయింది ఏపీలో వైసీపీ నేతల అరాచకం. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటంటే చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటి లేకపోయినా.. చేసిన అవినీతి, అక్రమాలు, భూదందాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, వేధింపుల ఉదంతాలు మాత్రం ఎంతని, ఎన్నని చెప్పినా తరగవన్నట్లు తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. వాళ్లలో వాళ్ళే పొత్తులు కుదరక బయటపడినవి కొన్నైతే  బాధితులు లబోదిబోమంటూ గోడు వెళ్లబోసుకున్నవి మరెన్నో. ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా అక్రమ రిజిస్ట్రేషన్ల దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టు అయినది అసలు సూత్రధారులా.. కొసరు అనుచరులా అన్నది పక్కన పెడితే ఓ పది పది మందిని అరెస్ట్ చేశారు. ఇక విశాఖలో భూదందాల వ్యవహారం గురించి ఎంత చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏకంగా వైసీపీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగారంటే విశాఖ కేంద్రంగా ఈ రియల్ మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మధ్య చిత్తూరు జిల్లాకి చెందిన మంత్రి కూడా ఇష్టారాజ్యంగా వాటాల దందా నడిపిస్తున్నారన్న ఫోన్ కాల్ రికార్డింగ్స్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరో మంత్రి పోలీసులతో సెటిల్మెంట్స్ చేస్తూ వాటాలు వెనకేసుకుంటున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇది ఒక రకంగా మొత్తం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మచ్చగా మారడంతో ఆత్మ రక్షణలో పడిన పెద్దలు పోలీసులపై సస్పెన్స్ వేటు వేసి చేతులు దులిపేసుకున్నట్లు సమాచారం. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో కూర్చుని సబ్ ఇన్స్పెక్టర్ మంత్రితో ఫోన్ లో మాట్లాడి సెటిల్మెంట్ చేసినట్లు బాధితుడు ఒకరు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా చుండూరు ఎస్ఐ భరత్ కుమార్ పై బాధితుడు బత్తుల గోవింద్ ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఎస్ఐ తనను  5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అందులో రెండు లక్షలు మంత్రి మెరుగు నాగార్జునకి ఇవ్వాలని ఎస్ఐ తనకు వివరించినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఎస్ఐ బాధితుడిని ఐదు లక్షలు డిమాండ్ చేసే సమయంలో మంత్రి పేరును ప్రస్తావించడమే కాకుండా తన ముందే మంత్రి మేరుగ నాగార్జునతో మాట్లాడి సెటిల్ చేసినట్లు బాధితుడు వాపోతున్నాడు.  బాధితుడి మాటలలో చెప్పాలంటే.. బాపట్లకు చెందిన బత్తుల గోవింద్ అనే వ్యక్తి మట్టి తరలించాడన్న ఆరోపణల మీద  చుండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై భరత్ కుమార్ పిలిపించారు. స్టేషన్ లోనే బాధితుడితో బేరసారాలాడిన ఎస్ఐ ముందు బాధితుడి కారుని స్టేషన్ లోనే వదిలిపెట్టి వెళ్ళమని తాను తర్వాత ఈ విషయంపై మాట్లాడతానని కానిస్టేబుళ్లను పురమాయించి ఆ రోజు అక్కడ నుండి వెళ్ళిపోయారట. చేసేదేమీ లేక బాధితుడు కారుని స్టేషన్లో వదిలి వెళ్ళాడు. ఆ తర్వాత బాధితుడికి ఫోన్ చేసిన ఎస్సై కారు గురించి మాట్లాడాలని స్టేషన్ కు పిలిపించారు. బాధితుడు కారు కోసం స్టేషన్ కి వెళితే మట్టి తరలించిన ఫిర్యాదు మాఫీ చేసి నీ కారు నీకు ఇవ్వాలంటే 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. అందులో మంత్రి మేరుగ నాగార్జున గారికి రూ.2 లక్షలు ముట్టజెప్పాలని ఎస్ఐ బాధితుడితో చెప్పారట. అంతేకాదు బాధితుడు అక్కడ ఉండగానే ఎస్ఐ మంత్రి మేరుగ నాగార్జునకి ఫోన్ చేసి మట్టి తరలించిన ఫిర్యాదును రూ.5 లక్షలతో మాఫీ చేస్తున్నట్లు వివరించారట.  ఆ తర్వాత ఎస్ఐ మంత్రిగారు నీ వద్ద ఐదు లక్షలు తీసుకోమంటున్నారని చెప్పాడట. దీంతో బాధితుడు తాను అంత ఇచ్చుకోలేనని బతిమిలాడితే చివరకు రూ.2 లక్షల 40 వేలకు బేరం తెగ్గొట్టారట. బాధితుడు ఆరోజు రూ.2 లక్షలు ఎంఆర్ఓ, వీఆర్ఓ సమక్షంలోనే ఎస్ఐకి ముట్టజెప్పి కారును తీసుకొచ్చేశాడట. ఇక మిగిలిన 40 వేల కోసం మరోసారి ఫోన్ చేసిన ఎస్ఐ మరో ఐదు వేలు కలిపి 45 వేలు తీసుకు రావాలని చెప్పాడట. దీంతో బాధితుడు రూ.45 వేలు తీసుకొని వెళ్తూ ఏసీబీ వారికి సమాచారం అందిచడంతో ఏసీబీ వాళ్ళు ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. ఎస్ఐ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఇలా సెటిల్మెంట్లు చేయడం.. మంత్రికి వాటాలు వెళ్తాయని వివరించడం ఇప్పుడు ప్రభుత్వ వర్గాలలో సంచలనంగా మారింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంటుందా? మరింత ‘లోతుగా’దర్యాప్తునకు ఆదేశింస్తుందా చూడాల్సి ఉంది. 

లోకేష్ తమ్ముడు.. పవన్ అన్నయ్య..కేటీఆర్ మళ్లీ మొదలెట్టేశారు!

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు మంచి మాటకారి. అందులో ఎలాంటి సందేహం లేదు. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడగల వక్తగా కూడా కేటీఆర్ కు మంచి పేరుంది. తండ్రి కేసీఆర్ ఓ స్థాయి వర్గాన్ని ఆకట్టుకోగల మాటకారి కాగా.. కుమారుడు కేటీఆర్ మరో స్థాయి వర్గాన్ని ఆకట్టుకోగల నేర్పరి. కానీ, ఎంతటి మేధావి అయినా ఒక్కోసారి తడబాటు తప్పదు.. ఎంత నేర్పరి అయినా ఒక్కోసారి మాట జారక తప్పదు. అలాగే కేటీఆర్ కూడా పరిస్థితి ఏంటన్నది అంచనా వేయక పుసుక్కున నోరు జారేశారు. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకొనే క్రమంలో అదే మాటకు కట్టుబడి ఉన్నామనేలా మాట్లాడేశారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిలర్లు, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహించి మీ రాష్ట్రంలో నిరసనలు చేసుకోండని మాట్లాడారు. అది కాస్త ఆంధ్రా సెటిలర్లకు కోపం తెప్పించింది.  ఆ తర్వాత అప్పటికప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలపై దిద్దుకొనే అవకాశం ఉండగా పరిస్థితి అంత దూరం వెళ్తుందనే అంచనా లేకనో.. ఇంకా తెలంగాణలో చంద్రబాబు అవసరం ఏముందిలే అనుకున్నారో కానీ చంద్రబాబు అరెస్టును ఖండించాల్సిన సమయంలో ఆయన అభిమానుల నిరసనను తప్పుబట్టారు. దీంతో సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరులు, చంద్రబాబు అభిమానులలో కేసీఆర్ పైనా, బీఆర్ఎస్ పైనా ఆగ్రహం పెల్లుబికింది. ఆ తర్వాత పరిస్థితి అర్ధం చేసుకున్న కేటీఆర్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అసలే గత పదేళ్లుగా తెలుగుదేశంపై బీఆర్ఎస్ వైఖరి, గత ఎన్నికలలో జగన్ తో కలిసి తెలుగుదేశం ఓటమికి కారణమైందన్న భావనకు తోడు  ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు కలిసి ఆంధ్రా సెటిలర్లలో బీఆర్ఎస్ నూ నమ్మకం కోల్పోయేలా చేశాయి. కానీ, కేటీఆర్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఆ మధ్య చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ కు బదిలిస్తూ సానుభూతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్‌ ట్వీట్ నాకు చాలా బాధ కలిగించింది. ఓ కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్‌ ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ తాను అన్న మాటలను కవర్ చేసుకొనే ప్రయత్నం చేశారు.  ఆ తర్వాత మరోసారి కేటీఆర్ చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదంటూ  వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చూసినా 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, ఈ విషయం తెలిసిన ఎవరైనా అయ్యో పాపం అని అంటారని చెప్పారు. ఇక తెలుగుదేశంపై విమర్శలకు తావేలేదంటూ తెలంగాణలో సెటిలర్లకు, తెలుగుదేశం సానుభూతి పరులకు  దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ తనకు తమ్ముడని.. పవన్ కళ్యాణ్  అన్నయ్య అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న కేటీఆర్.. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కేసీఆర్ కు గానీ, తనకు గానీ ఎలాంటి కోపం లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా చంద్రబాబు ఆరోగ్యం గురించి లోకేష్ తో మాట్లాడానని కూడా కేటీఆర్ చెప్పారు. బాబుపై కక్ష సాధించే ఆలోచనే కేసీఆర్ కు లేదని అన్నారు. ప్రచార రథం మీద నుంచి తాను పడ్డ తర్వాత లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారని కేటీఆర్ వెల్లడించారు. ఇక పనిలో పనిగా లోకేష్ తనకు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య లాంటి వారంటూ ఇటు టీడీపీ, అటు జనసేనలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసే కేటీఆర్.. ఈ ఎన్నికలలో మాత్రం అంతా చేయి జారిపోయాక మేల్కొన్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు ఇక ఎంత సోప్ వేసినా ఆంధ్రా సెటిలర్లు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని.. ముఖ్యంగా  తెలుగుదేశం అభిమానులు బీఆర్ఎస్ కు దగ్గరవడం  అన్నది జరిగే పరికాదనీ  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

157  నామినేషన్ల దాఖలుతో గజ్వేల్ సరికొత్త రికార్డు 

తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది.  మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,355 నామినేషన్లు దాఖలు చేశారు.  ఇందులో  వరుసగా మూడు నియోజకవర్గాల్లో అత్యధిక నామినేషన్లు వచ్చాయి. రెండో స్థానంలో మేడ్చెల్ నియోజకవర్గం ఉంది. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ 127 నామినేషన్లు దాఖలు చేశారు. మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.  మూడోస్థానంలో కామారెడ్డి నియోజకవర్గానికి అత్యధిక నామినేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక నామినేషన్లు రావడం గమనార్హం. వరుసగా మూడోసారి గెలిచి  తమ పార్టీ హ్యట్రిక్ సాధిస్తుందని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి  సీఎం కేసీఆర్  మీదే ఎక్కువ మంది అభ్యర్థులు చేయడానికి సిద్దమయ్యారు. ఆయన వరుసగా రెండుసార్లు పోటీ చేసి గెలిచిన గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  గజ్వేల్ నియోజకవర్గం నుంచి అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడి నుంచి 127 మంది 157 నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు ఉన్నారు. జగిత్యాల చెరుకు రైతులు కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ధరణి సహా వివిధ బాధితులు ఉన్నారు. నిరసన తెలిపే ఉద్దేశంలో భాగంగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు. సుప్రీం కోర్టు తుది తీర్పు ప్రకారం నిజాంపేట, పేట్ బషీర్ బాద్ లలో జర్నలిస్టులు కొనుగోలు చేసిన 70 ఎకరాలు అప్పగించాలి. అయితే ఈ స్థలాలను ప్రభుత్వం ఇంకా స్వాధీనం చేయకపోవడంతో జవహార్ హౌసింగ్ సొసైటీ సభ్యులు కొందరు కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేశారని సమాచారం.  గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు, కామారెడ్డి నుంచి 102, మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి. బిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలన్న లక్ష్యంతో వివిధ వర్గాలకు చెందిన బాధితులు ఈ నామినేషన్లు దాఖలు చేశారు. 

అమరావతి.. పగ పట్టారు.. హస్తిన పొగ పెట్టారు..!

మనుషులు కనిపించడం లేదంటే అర్థముంది. కానీ.. అదే రాజధానులు కనిపించడం లేదంటే మాత్రం ఆలోచించాల్సిందే. తాజాగా దేశంలో రెండు రాజధానులు కనిపించడం లేదు.. వాటిలో ఒకటి పగ వల్ల.. మరోటి పొగ వల్ల కనిపించకుండా పోయాయి.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జగన్ పగపట్టడం వల్ల కనిపించకుండా పోతే,  దేశ రాజధాని ఢిల్లీ  పొగ వల్ల కనిపించడం లేదంటూ నెటిజన్లు  సెటైర్లు వేస్తున్నారు.  నవ్యాంధ్ర రాజధాని అమరావతి జగన్ కక్ష సాధింపు ధోరణి కారణంగా నాలుగున్నరేళ్ల క్రితం మాయమైంది.  ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. ప్రతిపక్షనేతగా  జగన్ .. రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ  మాట మార్చారు. అమరావతిని కనుమరుగు చేశారు.  రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల గుండెల్లో చిచ్చు పెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు నిరసన గళం విప్పితే.. ఓ సామాజిక వర్గానికి మాత్రమే ఈ రాజధాని ప్రాంతం కేంద్రీకృతమైందంటూ ఓ వితండ వాదాన్ని  జగన్ పార్టీ తెరపైకి తీసుకు వచ్చింది.  మరోవైపు తమ భూములు ఇచ్చి అన్నీ కోల్పోయామంటూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అటు తిరుమలలో కొలువైన ఆ దేవ దేవుడు వద్దకు, ఇటు అరసవల్లిలో కొలువు తీరిన ప్రత్యక్ష నారాయణుడు.. సూర్యభగవానుడి చెంతకు  పాదయాత్రలు చేపట్టినా..  జగన్ ప్రభుత్వంలో మాత్రం కదలిక అనేది లేదు.. రాలేదు.  జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిపై   పగ పట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని జనం నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు.  2014లో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో.. 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అయితే 10 ఏళ్ల పాటు ఈ ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని విభజన హామీల్లో స్పష్టం చేసినా.. నవ్యాంధ్రకు సొంత రాజధాని కోసం  అప్పటి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు.. 13 జిల్లాలకు సెంటర్ పాయింట్‌గా.. అంటే అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు కరెక్ట్ సెంటర్ పాయింట్ తుళ్లూరు గ్రామంగా గుర్తించి.. ఆ గ్రామానికి పరిసరాల్లో ఉన్న మొత్తం 29 గ్రామాల్లోని ప్రజలు, రైతులతో మాట్లాడి.. వారిని ఒప్పించడంతో.. రాజధానికి వారంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అలా రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబునాయుడు బీజం వేశారు.  రాజధాని అమరావతి శుంఖుస్థాపనకు దేశ ప్రధాని మోదీ,  పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభం అయ్యింది. భవనాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. అసెంబ్లీ, హైకోర్టులు కొలువుదీరాయి. ఆ  దశలో 2019 ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో  జగన్‌ పార్టీకి విజయం సాధించి అధికారం చేపట్టింది. అంతే అమరావతికి గ్రహణం పట్టింది.  మూడు రాజధానుల మూడుముక్కలాటకు తెర లేచింది.     మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో.. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. దీంతో గాలి నాణ్యత బాగా క్షీణించి.. ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దాంతో ఢిల్లీ అంతటా విషపూరిత పొగమంచు కమ్మేయడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు అక్కడి రాష్ట్ర  ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై సుప్రీంకోర్టు సైతం స్పందించింది. కాలుష్య నివారణ చర్యలు ఏం చేపట్టారంటూ.. ఢిల్లీతోపాటు పొరుగు రాష్ట్రాలను సూప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.  ఇటువంటి పరిస్థితుల్లో  ఏపీ రాజధాని  అమరావతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పగ వల్ల.. కనిపించకుండా పోతే..  దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పాలకుల నిర్లక్ష్యం కారణంగా వాయు కాలుష్యం కారణంగా పొగ కమ్మేసి  కనిపించకుండా పోయిందని అంటున్నారు.