దిగ్విజయ్ తో కేవీపీ భేటీ ..ఏంటి కథ?
తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభ పరిష్కారానికి పార్టీ కేంద్ర నాయకత్వం పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను దూతగా పంపింది. దిగ్విజయ్ హైదరాబాద్ వచ్చారు. రెండు రోజులు గాంధీ భవన్ లో కూర్చుని. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం నాయకులను, ఇటు రేవంత్ రెడ్డి వ్యతిరేక సీనియర్ నేతలను కలిశారు... అందరితోనూ మాట్లాడారు.అంతా బాగుంది.ఆల్ ఈజ్ వెల్.. టీ కాంగ్రెస్ సంక్షోభం టీ కప్పులో తుపానులా తేలిపోయిందని చెప్పేసి చక్కా పోయారు. పార్టీ అద్యక్షుదు మల్లికార్జున ఖర్గే కి కేంద్ర నాయకత్వానికి ఆయన ఏమి నివేదిక ఇస్తారు, ఏమి నివేదిస్తారు, కేంద్ర నాయకత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది అనేది, వేరే విషయం.
అదెలా ఉన్నా, ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ రాకతో టీ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం ఆయనే చెప్పినట్లుగా టీ కప్పులో తుపానులా తేలిపోయిందనే అనుకుందాం. నిజానికి దిగ్విజయ వచ్చి వెళ్ళిన తర్వాత, సమస్య మరింత జటిలం అయిందని, టీ కప్పులో తుపాను సునామీగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు అనుకోండి అదివేరే విషయం. అయినా, ఆవిషయాన్ని పక్కన పెట్టి, నిజంగానే దిగ్విజయ్ సింగ్ సమస్యను చక్కగా పరిష్కరించారనే కాసేపు అనుకుందాం. కానీ, తెలంగాణ కాంగ్రెస్’ లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్ర రావుతో రెండు గంటలకు పైగా, వన్ టూ వన్ మంతనాలు సాగించడంలో మతలబు ఏమిటి? ఇప్పడు కాంగ్రెస్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
నిజానికి కేవీపీ ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు అయినా రాష్ట్ర విభజన తర్వాత, 2020 వరకు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. అంతేకాదు,తెలంగాణలో సాగే, తెర వెనక రాజకీయాలు నడుపుతారనే పేరుంది. అంతే కాదు ఎంతవరకు నిజమో ఏమో కానీ కేవీపీకి కేసీఆర్ తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటారు. ఆయనకు వైఎస్సార్ తో ఒక విధమైన ‘ఆత్మ’ బంధం ఉంటే, కేసీఆర్ తో మరో విధమైన ‘కుల’ బంధం ఉందనీ అంటారు. అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని కడ తెర్చెందుకే, కేవీపీ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారనే అనుమానాలు లేక పోలేదు. అలాగే కాంగ్రెస్ కోవర్టులకు ఆయనే ఆది గురువనే ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయని అంటారు.
మరి అంతటి అనుమానస్పద వ్యక్తితో దిగ్విజయ్ అంత సేపు ఏకాంతంగా ఏమి చర్చించారు? ఈ భేటీ ద్వారా దిగ్విజయ్ సింగ్ పార్టీ నాయకులు, క్యాడర్ కు ఎలాంటి సకేతాలు ఇచ్చారు? అందుకే రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా, కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధిష్టానం దూతగా వస్తే, కేవీపీ... పార్టీ అసమ్మతి గళం వినిపిస్తున్నసీనియర్ల ( వీరిని కొందరు కోవర్టులనీ అంటున్నారు) తరపున కేసీఆర్ దూతగా దిగ్విజయ్ సింగ్ ను కలిశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నంత వరకు కేసీఆర్ కు కాంగ్రెస్ గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడ లేదు. అలాగే, ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్న సీనియర్లు ఎవరితోనూ కేసీఆర్ కు, లాలూచీ వుందో లేదో కానీ, ఎలాంటి పేచీ అయితే లేదు. మాజీ పీసీసీ చీఫ్ తోనే కాదు,మాజీ, తాజా సీఎల్పీ నాయకులు జానారెడ్డి, భట్టి విక్రమార్క తోనూ, కేసీఆర్ కు ఎలాంటి పేచీ, పంచాయతీ లేదు. సభ లోపల వెలుపల కూడా కేసీఆర్ వారితో సత్సంబంధాలు కొనసాగించడం తెలియంది కాదు.
ప్రధాని నరేంద్ర మోడీ సహా ఏ నాయకుడిని అయినా ఏ మాత్రం స్పేర్ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఏనాడు జానారెడ్డిని ఏకవచనంలో సంభోదించలేదు. చులకన చేసి మాట్లాడలేదు. గౌరవంగా ‘పెద్దలు’ జానా రెడ్డి గారనే సంభోదించారు. జానారెడ్డి కూడా అదే రీతిలో సభ లోపలా వెలుపలా ‘మర్యాద’ గీత దాట లేదు. అవసరం అయితే సర్కార్ కు అండగా నిలిచారే కానీ, ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏ నాడూ చేయలేదు. చేతి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను కళ్ళెదుటే కేసీఆర్ కారెక్కిస్తున్నా, జానా రెడ్డి, భట్టి ఏనాడు అభ్యంతరం చెప్పలేదు.
అంతే కాదు, తను ప్రతిపక్ష నేతను అనే విషయం మరిచి పోయారో ఏమో కానీ, ఒకానొక సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మధ్యలో విలేకరులతో కలిసి సీఎల్పీ నేత జానారెడ్డి ప్రత్యేకంగా అధికార పార్టీ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్న రూ.5 భోజనం తెప్పించుకుని, ఆహా .. ఓహో అంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు. అద్భుతం అమోఘం అంటూ కితాబు నిచ్చారు.ఆ విధంగా అధికార తెరాసకు ఉచిత ప్రచారం చేసి కేసీఆర్ పొగడ్తల ఋణం తీర్చుకున్నారు.
ఇక భట్టి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరికీ ప్రవేశం లేని రోజుల్లోనే భట్టికి ప్రగతి భవన్ రెడ్ కార్పెట్ పరిచింది. దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజక వర్గాన్ని చేర్చారు. అంతే కాదు ఇంకెవరో కాదు, స్వయంగా ముఖ్యమంత్రి సభలోనే, భట్టిని గులాబీ గూటికి ఆహ్వానించారు. ఇక కోమటి రెడ్డి తదితర నాయకుల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. (అవును దిగ్విజయ్ సింగ్, కోమటి రెడ్డి తోనూ సుదీర్ఘంగ ఏకాంత చర్చలు జరిపారు.) ఈ అందరిదీ ఒకటే నినాదం, భరాసతో దోస్తీకి అడ్డుగా ఉన్న రేవంత్ రెడ్డిని సాగ నంపి,గులాబీ బాస్ కేసేఆర్ తో చెలిమికి తలుపులు తీయడమే, ఈ నేతల లక్ష్యం. ఈ నేపథ్యాన్ని గమనిస్తే, దిగ్విజయ్ సింగ్ ను కేవీపీ ఎందుకు కలిశారో, ఏమి చర్చించారో వేరే చెప్పవలసిన అవసరం రాదు. అవును, కాంగ్రెస్, భరాసల స్నేహ బంధాన్ని పునరుద్ధరించడమే దిగ్విజయ్ .. కేవీపీ భేటీ సారాంశం.. అంటున్నారు. నిజానికి, రాష్ట్ర విభజన సమయంలో దిగ్విజయ్ సింగ్. రాష్ట్ర ఇంచార్జిగా ఉన్నారు. విభజన క్రెడిట్ ఏ మాత్రం కాంగ్రెస్ ఖాతాలో చేరకుండా గంప గుత్తగా కేసేఆర్ ఎకౌంటులో వేసిన ‘ఘనత’ కుడా దిగ్విజయ్ కే దక్కుతుందని అంటారు.