ఏపీ మద్యం ముందు.. ఉగ్రవాదం, ప్రపంచయుద్ధాలూ బలాదూర్!
posted on Nov 13, 2023 @ 1:58PM
జగన్ సర్కార్ చీప్ లిక్కర్ రాష్ట్రంలో మరణమృదంగం మోగిస్తోంది. సర్కార్ అండతో సర్కార్ వల్ల, సర్కార్ చేత, జగన్ కోసం సాగుతున్న ఈ మాఫియా కారణంగా ఉగ్రవాదులు ప్రపంచమంతా కలిపి సృష్టించే మారణహోమం కంటే ఏపీలో ఎక్కువ వరణాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గణాంకాలతో సహా వెల్లడించారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏపీలో జగన్ సర్కార్ మద్యం మాఫియాపై ఎప్పటికప్పుడు లెక్కలతో సహా వివరిస్తూ ఎండగడుతున్నారు. ఏపీలో లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను మద్యం షాపులలో అమ్మకాలకు నియమించి.. ప్రభుత్వ డీస్లరీల నుండే సరుకుని సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మద్యం నాణ్యతా ప్రమాణాల విషయంలో అధమస్థానంలో నిలుస్తున్నది. మద్యం తయారీ కంపెనీలకు సకాలంలో చెల్లింపులు వెళ్లక ప్రీమియం మద్యం తయారీ దారులు ప్రభుత్వ డీస్లరీలకు మద్యం సరఫరా చేయడం లేదు. కానీ రకరకాల పేర్లతో కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొచ్చి నాణ్యత లేని లిక్కర్ ను యథేచ్ఛగా భారీ ధరలకు అమ్ముతూ ప్రజారోగ్యానికి చెల్లు చీటీ రాసేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ప్రభుత్వమేనని పురంధేశ్వరి ఆరోపిస్తూ, ఏపీ మద్యం విధానానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కనీస పరీక్షలు కూడా చేయని మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి అమ్మేస్తూ ప్రజల ఉసురుతీసేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, విపక్షాలు ఎన్ని ఆరోపించినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండడం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే కొత్త పేర్లతో పుట్టుకొచ్చిన కంపెనీలకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని ఎదురుదాడికి దిగుతోంది. అయితే అసలు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆ కంపెనీలపై దాడులు చేసి నాణ్యత ప్రమాణాలు, తయారీ విధానంలో లోపాలుంటే చర్చలు తీసుకొనే అవకాశం ఉంది. కానీ, జగన్ సర్కార్ ఆ చర్యలు తీసుకోకుండా గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎదురుదాడి చేసి చేతులు దులిపేసుకుంటోంది. కనీస పరీక్షలు కూడా చేయకుండా మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి ప్రభుత్వ దుకాణాలకు అందిస్తుండతో తెలిసిన కంపెనీ మద్యం ఒక్కటీ లేకపోవడంతో ప్రజలు ఉన్న దాన్నే తాగేసి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఏపీలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో సగం మంది అనారోగ్యానికి ఏపీ ప్రభుత్వ మందు దుకాణాలు సరఫరా చేసిన మద్యం సేవించడమే కారణం. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పుంరంధేశ్వరి సాధికారికంగా, గణాంకాలు, ఆధారాలతో సహా తేల్చిన వాస్తవం.
తాజాగా పురంధేశ్వరి ఏపీలో చీప్ లిక్కర్ వలన ఏకంగా 5 లక్షల మంది చనిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల కారణంగా పాకిస్థాన్‌లో ఏటా వెయ్యి మంది మృతి చెందుతుండగా.. ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు అసువులు బాసిన వారి సంఖ్య పన్నెండు వేల లోపే. అయితే ఏపీలో జగన్ సర్కారు మందు ఇంత వరకూ ఐదులక్షల మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని.. ఇక అనధికారికంగా లెక్క వేసుకున్నా మొత్తం ఆరు లక్షల మంది జగన్ మందు తాగి చనిపోయానట్లు అధికారిక లెక్కలనే సాక్ష్యంగా చూపుతూ పురంధేశ్వరి సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇటీవల కడపలో సభలో మాట్లాడిన పురందేశ్వరి రాష్ట్రంలో జగన్ మద్యం తాగి రోజుకు 700 మంది చనిపోతున్నారని ఆరోపించారు. దీంతో మరోసారి పురంధేశ్వరి వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కానీ.. సీఎం కానీ దీనిపై ఇప్పటి వరకూ స్పందించిన దాఖలాలు లేవు కానీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం పురందేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
ఏపీలో మద్యం నాణ్యత లేదన్న మాట వాస్తవం. ఇది ఏపీ ప్రజలకే కాదు.. పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో ఈ అంశంపై భారీ స్థాయిలో పోస్టులు వస్తున్నాయి. ఇక ఈ చీప్ లిక్కర్ ను ప్రీమియం బ్రాండ్ల పేర్లతో కలిసి అమ్ముతూ జగన్ సొమ్ము చేసుకుంటున్నది కూడా వాస్తవమే. ఇలాంటి లిక్కర్ వలన ప్రజల ఆరోగ్యం పాడై ఆసుపత్రుల పాలవుతున్నారన్నదీ వైద్యులు, నివేదికలు రుజువు చేసిన నిదర్శనం. ఇదే విషయాన్ని పురంధేశ్వరి లెక్కలతో సహా చెప్తున్నారు. కానీ, దర్యాప్తు చేయాల్సిన ప్రభుత్వం, ఆ శాఖ మంత్రి మాత్రం స్పందించడమే లేదు. ఒకరకంగా ప్రభుత్వం ఈ ఆరోపణలన్నీ నిజమని ధృవీకరించినట్లే భావించాల్సి వస్తుంది. పైగా రివర్స్ లో గత ప్రభుత్వం మద్యం పాలసీ తప్పంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద మద్యం కేసు నమోదు చేసింది. అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు.. రాష్ట్ర ప్రజలకు అదే మద్యంతో మరణశాసనం లిఖించాడని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.