లోకేష్ తమ్ముడు.. పవన్ అన్నయ్య..కేటీఆర్ మళ్లీ మొదలెట్టేశారు!
posted on Nov 12, 2023 6:15AM
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు మంచి మాటకారి. అందులో ఎలాంటి సందేహం లేదు. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడగల వక్తగా కూడా కేటీఆర్ కు మంచి పేరుంది. తండ్రి కేసీఆర్ ఓ స్థాయి వర్గాన్ని ఆకట్టుకోగల మాటకారి కాగా.. కుమారుడు కేటీఆర్ మరో స్థాయి వర్గాన్ని ఆకట్టుకోగల నేర్పరి. కానీ, ఎంతటి మేధావి అయినా ఒక్కోసారి తడబాటు తప్పదు.. ఎంత నేర్పరి అయినా ఒక్కోసారి మాట జారక తప్పదు. అలాగే కేటీఆర్ కూడా పరిస్థితి ఏంటన్నది అంచనా వేయక పుసుక్కున నోరు జారేశారు. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకొనే క్రమంలో అదే మాటకు కట్టుబడి ఉన్నామనేలా మాట్లాడేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిలర్లు, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహించి మీ రాష్ట్రంలో నిరసనలు చేసుకోండని మాట్లాడారు. అది కాస్త ఆంధ్రా సెటిలర్లకు కోపం తెప్పించింది.
ఆ తర్వాత అప్పటికప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలపై దిద్దుకొనే అవకాశం ఉండగా పరిస్థితి అంత దూరం వెళ్తుందనే అంచనా లేకనో.. ఇంకా తెలంగాణలో చంద్రబాబు అవసరం ఏముందిలే అనుకున్నారో కానీ చంద్రబాబు అరెస్టును ఖండించాల్సిన సమయంలో ఆయన అభిమానుల నిరసనను తప్పుబట్టారు. దీంతో సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరులు, చంద్రబాబు అభిమానులలో కేసీఆర్ పైనా, బీఆర్ఎస్ పైనా ఆగ్రహం పెల్లుబికింది. ఆ తర్వాత పరిస్థితి అర్ధం చేసుకున్న కేటీఆర్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అసలే గత పదేళ్లుగా తెలుగుదేశంపై బీఆర్ఎస్ వైఖరి, గత ఎన్నికలలో జగన్ తో కలిసి తెలుగుదేశం ఓటమికి కారణమైందన్న భావనకు తోడు ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు కలిసి ఆంధ్రా సెటిలర్లలో బీఆర్ఎస్ నూ నమ్మకం కోల్పోయేలా చేశాయి. కానీ, కేటీఆర్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఆ మధ్య చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ కు బదిలిస్తూ సానుభూతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్ ట్వీట్ నాకు చాలా బాధ కలిగించింది. ఓ కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్ ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ తాను అన్న మాటలను కవర్ చేసుకొనే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత మరోసారి కేటీఆర్ చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చూసినా 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, ఈ విషయం తెలిసిన ఎవరైనా అయ్యో పాపం అని అంటారని చెప్పారు. ఇక తెలుగుదేశంపై విమర్శలకు తావేలేదంటూ తెలంగాణలో సెటిలర్లకు, తెలుగుదేశం సానుభూతి పరులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ తనకు తమ్ముడని.. పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న కేటీఆర్.. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కేసీఆర్ కు గానీ, తనకు గానీ ఎలాంటి కోపం లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా చంద్రబాబు ఆరోగ్యం గురించి లోకేష్ తో మాట్లాడానని కూడా కేటీఆర్ చెప్పారు. బాబుపై కక్ష సాధించే ఆలోచనే కేసీఆర్ కు లేదని అన్నారు. ప్రచార రథం మీద నుంచి తాను పడ్డ తర్వాత లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారని కేటీఆర్ వెల్లడించారు.
ఇక పనిలో పనిగా లోకేష్ తనకు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య లాంటి వారంటూ ఇటు టీడీపీ, అటు జనసేనలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసే కేటీఆర్.. ఈ ఎన్నికలలో మాత్రం అంతా చేయి జారిపోయాక మేల్కొన్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు ఇక ఎంత సోప్ వేసినా ఆంధ్రా సెటిలర్లు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని.. ముఖ్యంగా తెలుగుదేశం అభిమానులు బీఆర్ఎస్ కు దగ్గరవడం అన్నది జరిగే పరికాదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.