తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8  స్థానాలు ఖరారు

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి, జనసేన కల్సి పోటీ చేస్తున్నాయి. పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చి జన సేనకు 8 సీట్లు కేటాయించాలని బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు ఇవే కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్,  తాండూరు - నేమూరి శంకర్ గౌడ్,  కోదాడ - మేకల సతీష్ రెడ్డి,  నాగర్ కర్నూలు - వంగ లక్ష్మణ్ గౌడ్,  ఖమ్మం - మిర్యాల రామకృష్ణ,  కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు,  వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్,  అశ్వారావుపేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.

మోడీ సభకు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు... రాజాసింగ్ ఆసక్తికర ట్వీట్ 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రధాని సభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. బిజెపి టికెట్ ఇచ్చినప్పటికీ అధికారికంగా సస్పెన్షన్ ఎత్తి వేయకపోవడంతో రాజాసింగ్ అలకపాన్పు ఎక్కారని ప్రచారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొనకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసినా ఆయన ఎందుకు హాజరుకాలేదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. మోదీ సభ  గోషామహాల్ అసెంబ్లీ పరిధిలో వస్తుంది. గోషామహల్ ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కూడా రాజాసింగ్.అయినప్పటికీ ప్రధాని సభకు రాజాసింగ్ హాజరు కాలేదు. అంతే కాదు పలు బీజేపీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు ఎమ్మెల్యే రాజా సింగ్ ముగింపు పలుకుతూ ఒక వీడియోను విడుదల చేశారు.పాత కేసులు తిరగదోడి తనను ఏ క్షణాన అయినా అరెస్ట్ చేయవచ్చన్నారు. తనకు ప్రాణహాని ఉందని గన్ పెట్టి కాల్చేసినా బాధపడనని హిందూ మతం కోసం ప్రాణాలర్పిస్తానంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఇగోకు పోయి తనను అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నినట్లు రాజాసింగ్ ఆరోపించారు. తన నియోజక వర్గంలో ఎల్బీ స్టేడియం ఉంది కాబట్టి ఆ ఖర్చంతా తనపై వేస్తారని రాజాసింగ్ అంటున్నారని వార్తలు వస్తున్నాయి. మోడీ సభకు వస్తే కెసీఆర్ అరెస్ట్ చేయిస్తాడని ఆయన ఆరోపించారు. 

ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిమ్మగడ్డ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎంత అడ్డగోలుగా ఉందో అంతకు మించి ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. జగన్ మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్న జగన్ సర్కార్ వారి ద్వారా ప్రజల పర్సనల్ డేటాను సేకరించడంతో పాటు.. తమకు వ్యతిరేకులు ఎవరన్నది గుర్తించి వారి ఓట్ల తొలగింపు.. పెద్ద ఎత్తున దొంగ ఓట్ల చేర్పే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  పయ్యావుల వంటి వారు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల పుణ్యమా అని ఓటర్ల జాబితాలో అక్రమాలు వాస్తవమేనని తెలింది. కొందరు అధికారులపై వేటు కూడా పడింది. అయితే నిండా మునిగిన వాడికి చలేమిటన్న చందంగా ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా, ఫిర్యాదులు చేసిన కేంద్రఎన్నికల సంఘం కొరడా ఝుళిపించినా.. లెక్కేమిటన్న చందంగా జగన్ సర్కార్ అదికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. దొంగ ఓట్ల నమోదు.. ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియా కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో దొంగ ఓట్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అన్న సంస్థను స్థాపించి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతంలో తనకు ఓటు హక్కు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లి మరీ ఓటు హక్కు పొందారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఓటు నమోదు చేయకతప్పని పరిస్థితిని ఎన్నికల సంఘం ఎదుర్కొంది.  ఇప్పుడు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై న్యాయపోరాటానికి దిగారు.  ఏపీలో ఓట్ల అక్రమాలపై నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ గవాయి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చినా,  జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నాట్ బిఫోర్  అనడంతో విచారణ వాయిదా పడింది.  ఏపీలో ఓటర్ల జాబితాలన్నీ పూర్తిగా వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల మీదుగా  జరుగుతున్నాయనీ, వీరంతా  వైసీపీ కార్యకర్తలేనని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయించారని.. దీనిపై ఏపీ ప్రభుత్వ జోక్యం విపరీతంగా ఉందనీ నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు.  ఐప్యాక్ మాజీ ఉద్యోగులతో దొంగ ఓట్లు భారీగా చేరుస్తున్నారంటూ నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీలో ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకించిన డేటాను ప్రొఫైలింగ్ చేస్తున్నాయని నిమ్మగడ్డ ఆరోపించారు. ఓటర్ల జాబితాల అక్రమాల కోసం   రూ.68 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని కూడా నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఓటర్ల నమోదులోగ్రామ, వార్డు వలంటీర్లను, కార్యదర్శులను భాగస్వామ్యం చేయడంపై సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.  సీజేఐ ఆదేశాలతో పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి కేటాయించాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. మొత్తం మీద ఓటర్ల జాబితాలో అక్రమాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టీ పడేలా చేయడంలో నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ అయ్యారు. 

జగనన్న వదిలిన బాణం రివర్స్!?

మనం వదిలిన బాణం.. మళ్లీ మనకే వచ్చి తగిలితే ఏమౌతుంది. ఇప్పుడు ఆదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీలో. సోమవారం (నవంబర్ 6) వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైయస్ షర్మిల.. హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో..  అన్ని పార్టీల్లో దొంగలు ఉన్నారని.. కానీ వారు ముఖ్యమంత్రులు కాకూడనీ వ్యాఖ్యానించారు. అలాగే వైయస్ ఫ్యామిలీని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌పై ఆమె తనదైన శైలిలో స్పందించారు. నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి రోజే.. సంబంధం లేదు అన్న  సజ్జల రామకృష్ణారెడ్డి  ఈ రోజు ఏ సంబంధముందని నా గురించి మాట్లాడుతున్నారు..మేము అయితే సంబంధం లేదనే అనుకుంటున్నాం. కానీ వాళ్లు మాట్లాడుతున్నారంటే... మళ్లీ సంబంధం కలుపుకోవాలనుకొంటున్నారా?.. సంబంధముందనా? ఏమనుకోవాలి?   సజ్జల గారే సమాధానం చెప్పాలి.. అసలు కేసీఆర్  బహిరంగంగానే సింగిల్ రోడ్డు అయితే ఆంధ్ర, డబుల్ రోడ్డు అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్రా.. వెలుగు అయితే తెలంగాణ అని చెబుతున్నారు.. దానికి ఏం సమాధానం చెబుతారు సజ్జలగారు.. ముందు మీ కథ మీరు చూసుకోండి సార్ అంటూ సాక్షాత్తూ సజ్జలకే వైయస్ షర్మిల తనదైన శైలిలో చురకలంటించారు. సజ్జల మాట్లాడితే.. జగన్ మాట్లాడినట్లే కదా అన్న విలేకరుల ప్రశ్నకు   ఎవరికైనా ఇదే సమాధానం అంటూ వైయస్ షర్మిల చాలా ఘాటుగా స్పందించారు. దీంతో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో   వైరల్ అవుతున్నాయి. గాభరా పెడుతున్నాయి.   నాడు వైయస్ షర్మిల.. జగనన్న వదిలిన బాణాన్నంటూ  సోదరుడు   జగన్ కోసం పాదయాత్ర చేశారు.. ఆ తర్వాత  జగన్ అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆమె  అలుపెరగని పోరాటమే చేశారు.  జగన్ ముఖ్యమంత్రి కాగానే ..  సోదరిని   పక్కన పెట్టేశారని.. దీంతో ఆమె తన తల్లితో కలిసి పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోయి... వైయస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించి.. తన రాజకీయం తాను చేసుకొంటున్న సంగతి తెలిసిందే.  అయితే 2024, మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయని.. ఈ ఎన్నికల వేళ  జగన్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేసే వారు ఎవరనే ఓ సందేహం అయితే వైసీపీలో బలంగా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ పార్టీకి 151 సీట్లు వచ్చాయంటే.. అందులో తల్లి విజయమ్మ,  సోదరి షర్మిల కష్టంతోపాటు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ మంత్రాంగం ఉందనీ.. అయితే ఇప్పుడు జగన్ కు  తల్లి  విజయమ్మ కానీ..  సోదరి  షర్మిల కానీ ఆయన వెంట లేరని పార్టీ వర్గాలే అంటున్నాయి. అదే సమయంలో  ఎన్నికల్లో  వైసీపీ  తరపున ప్రచారానికి జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రులు వెళ్లితే.. పార్టీకి పడేవి ఓట్లు కావు.. రాళ్లు అనే  చర్చ కూడా వైసీపీలోనే మొదలైందని అంటున్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఎలాంటి స్కెచ్ గీసినా.. ఇప్పటికే కోడి కత్తి గాటు, బాబాయి గోడ్డలి పోటు వ్యవహారం పార్టీ అధినేత  జగన్ ఫ్యామిలీకి చుట్టుకోవడంతో.. లేని నొప్పులన్నీ లేచి వచ్చినట్లు అయిందంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో నమ్మకం కలిగించడానికి  విజయమ్మ,   షర్మిలల ఆవశ్యకత ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ తాజాగా సీఎం   జగన్‌పైన, ప్రభుత్వ సలహాదారు సజ్జలపైన వైయస్ షర్మిల చేసిన కామెంట్స్‌తో.. పార్టీ విజయం తర్వాత సంగతి.. అసలు పార్టీ కోసం ప్రచారం చేసేవారెవరన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతోందంటున్నారు. పైపెచ్చు షర్మిల ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ తరఫున రంగంలోకి దిగినా, ప్రచారం చేసినా మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన కూడా వైసీపీలో కనిపిస్తోంది. 

జగన్ అవే మాటలు.. జనం అదే పరుగులు?!

‘నాకు మీడియా సంస్థలు లేవు.. ఎల్లో మీడియా సపోర్ట్ లేదు. నాకెవరితో పొత్తు లేదు. మీ అందరి దీవెనలు.. ఆ దేవుని దయ చాలు.. నేనెవరినీ సపోర్ట్ చేయమని అడగను. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని మాత్రమే.. మీ బిడ్డకు మీరు ఉన్నారు.. మీ సపోర్టు ఉంది.’ ఈ ప్రసంగం ఎవరిదో మళ్ళీ విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా మైకు దొరికితే సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుండి వచ్చేమాటలివే. తాజాగా పుట్ట‌ప‌ర్తిలో వైఎస్సార్ రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. అదే ఊకదంపుడు స్పీచ్ ఇచ్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకమేమీ కొత్తది కాదు. అది కూడా ఎన్నికలకు ముందు చెప్పేది ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట. కేంద్రం కిసాన్ యోజన పథకాన్ని కూడా ఇందులో కలుపుకొని పథకాన్ని అమలు చేస్తున్నారు. సరిగ్గా ప్రతిసారి కేంద్రం నిధులు విడుదల చేసే సమయంలో ఇక్కడ జగన్ ఏదో ఒక జిల్లాలో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి భారీ బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేసి బటన్ నొక్కుతారు. పీఎం కిసాన్ నిధులైతే జమవుతాయి కానీ.. వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు.  ఒక్క రైతు భరోసా కార్యక్రమం మాత్రమే కాదు..  ప్రతి కార్యక్రమాన్నీ అలాగే అమలు చేస్తారు. ప్రతి పథకాన్ని విడతల వారీగా ఇవ్వడం, ప్రతి విడతకి కోటాను కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మంగళవారం పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమం కూడా అంతే. రైతు భరోసా ఈ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ బటన్ నొక్కి చెప్పారు. రైతుల ఖాతాలలో నగదు జమ చేసినట్లు చెప్పారు. కానీ, పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలలోకి వచ్చాయి తప్ప భరోసా డబ్బు ఇంకా రాలేదు. రోజు వారీ పన్నుల వసూళ్లలో కొంత భాగాన్ని ఈ రైతు భరోసాకు విడతల వారీగా ఖాతాలలో చెల్లించనున్నారు. అంత దానికి ఓ బహిరంగ కార్యక్రమం.. అందులో మళ్ళీ అదే విమక్షంపై విమర్శలు. దీనిని చూస్తే పార్టీ ప్రచారం కోసం వైసీపీ సర్కార్ ఎంతగా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వాడేస్తోందో అర్ధమవుతుంది.  ఇక ఇక్కడ జగన్ ప్రసంగం విషయానికి వస్తే  చంద్రబాబు హయంలో స్కాంలే తప్ప స్కీమ్‌లు లేవు. బాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నీ స్కామ్‌లే. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. ఏపీని దోచుకునేందుకు చంద్రబాబుకు పదవి కావాలి అంటూ ఆరోపించారు. ఇక, త‌న‌కు అసలు అబద్ధాలు చెప్పడం రాదని.. అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుస‌ని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. గెలవడానికి దత్తపుత్రుడి సాయం, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదు.. పైన దేవుడు, మీ అందరి ఆశీస్సులు మీ బిడ్డ నమ్ముకుంది. మీ బిడ్డకు మీరు ఉన్నారు. మీ సపోర్టు ఉందంటూ ఎమోషనల్ బాండింగ్ కలర్ ఇచ్చారు. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయని.. వాటిని నమ్మకండి. బంగారం, కార్లు ఇస్తామన్నా అబద్దాలేన‌ని చెప్పుకొచ్చారు.   అయితే, కొత్తగా జగన్ స్పీచ్ వస్తే సోషల్ మీడియాలో పండగే అవుతుంది. జగన్ మాట్లాడిన ప్రతి మాటను అటు ప్రతిపక్షాలు, మీమర్లు ఏకిపారేస్తుంటారు. ఈ పుట్టపర్తిలో స్పీచ్ కూడా అంతే. మీడియా సపోర్ట్ లేదంటూ జగన్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్న నెటిజన్లు మీ ఆవిడ భారతీ ఎండీగా ఉన్న మీడియా సంస్థ ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక, చంద్రబాబుపై అన్నీ స్కాంలే అని మాట్లాడిన జగన్ ఒక్కదానికి సంబంధించైనా ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని, అసలు 3041 సార్లు అక్రమ కేసులలో కోర్టు వాయిదాలకు హాజరు కాని జగన్.. చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందంటూ నెటిజన్లు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. మీ బిడ్డకు అందరి దీవెనలు అంటూ.. మా బిడ్డలను పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లేలా చేసిన సీఎం జగన్ అంటూ కొందరు, ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయని.. బంగారం, కార్లు ఇస్తామన్నా నమ్మొద్దని కోరడం చూస్తుంటే తన గురించి తానే ప్రజలకు హింట్ ఇచ్చినట్లుగా ఉందని మండిపడుతున్నారు. ఇక జనం కూడా జగన్ ప్రసంగం ప్రారంభించగానే.. ఇదెక్కడి గొడవరా బాబూ అన్నట్లుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. పోలీసులు అడ్డుకున్నా వారు ఖాతరు చేయలేదు. జగన్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ సగానికి పైగా ఖాళీ అయిపోయింది. జగన్ స్పీచ్ అంటేనే జనం పరార్ అన్న సెటైర్లు సామాజిక మాధ్యమంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. 

బీఆర్ఎస్ గూటికి దత్తన్న కుమార్తె?!

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ బీఆర్ఎస్ గూటికి చేరనున్నారనీ, ఇందుకు ముహూర్తం కూడా ఖరారు అయిందన్న ప్రచారం  తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో  జోరుగా సాగుతోంది.  సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి అనుకొని ఉన్న ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆమె ప్రయత్నించినా..  పార్టీ అధిష్టానం మాత్రం.. మరోకరికి టికెట్ కేటాయించడంతో.. దత్తన్న కుమార్తె విజయలక్ష్మీ అలిగి  గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకొన్నారనే చర్చ అయితే ఆ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తోంది.  అయితే ప్రస్తుత హర్యానా గవర్నర్‌ బండారు దత్త్రాత్రేయకు బీజేపీతోనే కాకుండా.. దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్‌తో కూడా దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది. అంతే కాకుండా బీజేపీలో దత్తాత్రేయకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మంచి పేరు ప్రఖ్యాతలు సైతం ఉన్నాయని.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. గతంలో  వాజపేయ్ కేబినెట్‌లో   కేంద్ర మంత్రిగా దత్తన్న పని చేశారని.. అలాగే   మోదీ  సైతం ఆయనను గతంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా...  ప్రస్తుతం హర్యానాకు గవర్నర్‌గా అవకాశం ఇచ్చారనీ అంటున్నారు.  అటు వాజపేయ్ హయాంలో.. ఇటు మోదీ హాయాంలో కీలక పదవులు పొందిన వారు బీజేపీలో  చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారని.. అటువంటి వారిలో బండారు దత్తత్రేయ ముందు వరుసలో ఉంటారని  అంటున్నారు. అలాంటి పార్టీలో తండ్రి ఉంటే.. జస్ట్ ఎమ్మెల్యే టికెట్ రాలేదంటూ.. ఆయన కుమార్తె ఇలా పార్టీ మారడం సరైన చర్య కాదనే ఓ అభిప్రాయం బీజేపీ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. అంతేకాదు దత్తన్న పదవిలో ఉన్నా లేకున్నా.. ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా భాగ్యనగరం వేదికగా ప్రతీ ఏడాది అలాయ్ బలాయ్ నిర్వహిస్తారని.. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె విజయలక్ష్మీ కూడా చేరుగ్గా పాల్గొంటున్నారని.. ఇంకా చెప్పాలంటే ఈ కార్యక్రమ పర్యవేక్షణంతా ఆమే చేస్తారనే ఓ చర్చ సైతం రాజకీయవర్గాలలో కొనసాగుతోంది. అలాంటి వేళ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో.. పార్టీ మార్పుపై కారు పార్టీ అగ్రనేతలతో విజయలక్ష్మి ముచ్చటించడం..  గులాబీ అగ్రనేత ఆమెకు నామినేటెడ్ పోస్ట్  ఆఫర్ చేయడం... అందుకు విజయలక్ష్మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. చకచకా జరిగిపోయాయనే ఓ ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.     మరోవైపు గతంలో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా బండారు దత్తాత్రేయ గెలుపొందారు. ఆ క్రమంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పక్కనే ఉన్న ముషీరాబాద్‌పై   మంచి పట్టు సంపాదించడమే కాకుండా.. ఆ నియోజకవర్గ ప్రజల తలలో నాలుకలాగా దత్తన్నతోపాటు ఆయన కుమార్తె విజయలక్ష్మీ వ్యవహరిస్తూ  వస్తున్నారని.. దీంతో సదరు నియోజకవర్గం టికెట్ దత్తన్న కుమార్తెకు కేటాయిస్తే.. వారు ఎన్నికల ప్రచారం చేయకపోయినా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం స్థానికంగా వైరల్ అవుతోంది. అయితే 2018 ఎన్నికల వేళ ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం విజయలక్ష్మీ ప్రయత్నించారని.. కానీ ఆ సమయంలో టికెట్ దక్కలేదని.. దాంతో ఈ సారి ఆశించినా.. టికెట్ దక్కకపోవడంతో.. కినుక వహించిన ఆమె పార్టీ మార్పుపై ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారనే ఓ చర్చ జరుగుతోంది. ఇంకోవైపు గతంలో ముషీరాబాద్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రొ.కె. లక్ష్మణ్... ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన కూడా ఎన్నికల బరిలో లేకపోవడంతో.. తనకు ముషీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ పక్కా అనుకొంటున్న తరుణంలో చివరి నిమిషంలో.. తనకు ఇలా మొండి చేయి చూపించారంటూ విజయలక్ష్మీ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ఓ చర్చ అయితే స్థానికంగా వైరల్ అవుతోంది. అదీకాక.. బీజేపీలోని పలువురు అత్యంత కీలక నేతలు.. భవష్యత్తులో తమకు పోటీ వస్తుందనే విజయలక్ష్మీకి టికెట్ కేటాయించలేదనే ఓ ప్రచారం సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.     అయినా.. దశాబ్దాలుగా ఒకే పార్టీని అంటి పెట్టుకొని ఉన్న దత్తన్నకు కమలంపార్టీలో సరైన సమయంలో సరైన గౌరవం ఇచ్చిందని.. అలాంటి పార్టీ.. తనకు టికెట్ ఇవ్వలేదంటూ దత్తన్న కుమార్తె విజయలక్ష్మీ మరోపార్టీలోకి వెళ్లిపోతే.. కన్నతల్లి లాంటి బీజేపీకే కాకుండా.. ఆమె తండ్రి బండారు దత్తాత్రేయను సైతం అవమానించినట్లేనని అవుతుందని.. అలాగే ఓ వేళ విజయలక్ష్మీ గులాబీ గుటికి చేరితే.. కాషాయం పార్టీకి గట్టి దెబ్బేననే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో కొనసాగుతోంది. ఇక పార్టీ మార్పుపై దత్తన్న కుమార్తె విజయలక్ష్మీ అవునడం కానీ.. లేదనడం కానీ చెప్పడం లేదు.. అలాగే బీజేపీ నేతలు సైతం మౌనంగానే ఉంటున్నారు. అలాంటి వేళ... విజయలక్ష్మీ పార్టీ మార్పు ఉంటుందా లేదా అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

కోటబొమ్మలి పీఎస్ లో పొటిటికల్ టచ్.. ఎవరూ భుజాలు తడుముకోవద్దు.. నిర్మాత బన్నీ వాసు

సినిమాలకూ రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. గతంలో కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాల ప్రచారాల కోసం సినీ మాధ్యమాన్ని ఉపయోగించుకున్నారు. యు. విశ్వేశ్వరరావు, మాదాల రంగారావు, టి.కృష్ణ, దుక్కిపాటి మధుసూదనరావు వంటి వారు ఈ కోవలోకి వస్తారు. ఆ తరువాత రాజకీయ పార్టీల పక్షాన కొందరు సినిమాలు తీయడం మొదలైంది. ఆర్జీవీ వంటి వారు ఈ కోవకు వస్తారు. అయితే ఇవేమీ కాకుండా రాజకీయా అంశాలను స్పృశిస్తూ కమర్షియల్ గా ప్రయోజనం పొందే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇటీవల విడుదలైన బ్రో వంటి సినిమాలు ఆ కోవలోకి వస్తాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ అంశాలను కమర్షియల్ హిట్ కొట్టేందుకు సినిమాలలో ఉపయోగించుకోవడం సాధారణమే. ఇప్పుడు కూడా తెలుగురాష్ట్రాలలో ఎన్నికల హీట్ పీక్స్ లో ఉంది.  ఇప్పటికే  తెలంగాణాలో  ఎలక్షన్స్  నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మరో ఐదు నెలల్లో ఏపీ ఎన్నికలు జరగనున్నాయి.  దీంతో సినిమాలలో కూడా ఆ హీట్ కు తగినట్లుగా  పొలిటికల్ యాంగిల్ కలిపి వదులుతున్నారు. కొందరు చెప్పి చేస్తున్నారు. మరికొందరు సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో ఫలానా పొలిటికల్ డైలాగు ..ఫలానా పార్టీని ఉద్దేసించిందే అనే టాక్ మొదలవుతోంది. ఒక్కోసారి...ఈ టాక్  సినిమాకు ప్లస్ అవుతోంది అది వేరే సంగతి.   రీసెంట్ గా  పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో పృధ్వీ ట్రాక్...డైరక్ట్ గా ఏపీ మినిస్టర్  అంబటి రాంబాబు ని ఉద్దేశించిందే నంటూ పెద్ద రచ్చ జరిగి.. ఓ రకంగా అది సినిమా కలెక్షన్స్ పెరిగేందుకు దోహదపడింది. అలాగే ఇప్పుడు  అదే తరహాలో కోట బొమ్మాళి పిఎస్  సినిమా కు  జరగబోతోందా అనిపిస్తోంది ఆ చిత్ర నిర్మాత బన్నీ వాసు మాటలు వింటూంటే.. గీతా ఆర్ట్స్ 2  సంస్థ అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తూ వస్తోంది    తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయాట్టు   అనే సినిమాని తెలుగులో  కోట బొమ్మాళి పిఎస్  పేరుతో రీమేక్ తీసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.   ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాసు  , విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లొ భాగంగా  బన్నీ వాసు మాట్లాడుతూ.... ఈ సినిమా ఓవరాల్ గా ఉండే పొలిటికల్ సిస్టమ్ ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పారు. ఇందులోని సన్నివేశాలు చూసి ఎవరైనా భుజాలు తడుముకుంటే తనకు సంభందం లేదనీ,   ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తమకు చెందినవిగా  ఉన్నాయని ఎవరైనా ఫీల్ అయితే వాళ్లు రియాక్ట్ అయితే అవ్వొచ్చని అన్నారు.  మేము ఓ సింగిల్ పార్టీని టార్గెట్ చేయటం లేదు, ఇందులో కొన్ని సీన్స్.. కొంతమంది పొలిటీషన్స్ కు  తగలచ్చు. అది చాలా పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్స్ ని ఇన్స్పైర్ అయ్యి రాసిన డైలాగుల కారణంగా అవ్వొచ్చు..  అలాగే కొంతమందికి అవి ఫట్ అని కొట్టినట్లుండొచ్చి అని   బన్నీ వాసు అన్నారు.  రాబోయే ఎన్నికల్లో జనసేన తరఫున రంగంలోకి దిగుతారా అనే  ప్రశ్నకి   పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్‌ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని సమాధానమిచ్చారు.  మరి ఈ  సినిమాలో  రాసిన డై లాగ్స్ ఏ పార్టీని ..ఎవరిని ఉదేశించి రాసివుంటారన్న విషయంలో  అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  జరుగుతోంది.

రికార్డులను తిరగరాయనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఎందులోనంటే..?

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ రికార్డు మెజారిటీలలోనో, జయాపజయాలలోనో కాదు.. మెజారిటీ స్థానాలు, మెజారిటీ ఓట్ల విషయంలోనూ కాదు.. పోలింగ్ శాతం విషయంలోనూ కాదు. ఓటరు చైతన్యం విషయంలో  అస్సలు కాదు.  మరి దేంట్లో అంటే ఎన్నికల వ్యయం విషయంలో. ఔను ఎన్నికల వ్యయంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పాత రికార్డులన్నిటినీ తిరగరాస్తాయని పరిశీలకులు, రాజకీయ పార్టీలే కాదు.. సామాన్య ప్రజలకు కూడా అంటున్నారు. ఉప ఎన్నికల విషయంలోనే రికార్డులను తిరగరాసిన చరిత్ర ఉన్న తెలంగాణలో  అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డును సృష్టించకపోతేనే ఆశ్చర్యం  అని  అంటున్నారు. ఉప ఎన్నికలలో ధన ప్రవాహాన్ని చూసిన  జనం అప్పట్లో తమతమ నియోజకవర్గాలలో కూడా  ఉప ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఉప ఎన్నిక కోసం తమ నియోజకవర్గ ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని జనం డిమాండ్ చేయడం బహుశా అంతకు దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరిగి ఉండదు.  అటువంటిది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ ఒకే సారి ఎన్నికలు జరుగుతుంటే.. ధన ప్రవాహం విషయంలో గత రికార్డులు తుడిచిపెట్టుకు పోవడం ఖామయని అంటున్నారు.   2012 అక్టోబర్ లో హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక అప్పటికి ఒక రికార్డు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డును తిరగరాసింది. ఇప్పడు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.  ఎన్నికల ఖర్చు విషయంలో  ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు.   తెలంగాణలో 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎప్పటికీ చెరగని మరకగా మిగిలిపోయిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో జరిగిన మునుగోడు ఉన ఎన్నిక  హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరకను మరిచిపోయేలా అంత కంటే పెద్ద మరకను మిగిల్చింది.  హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాలా ఇన్ని కోట్లని ఎవరూ లెక్కకట్టలేదు కానీ.. అయిన ఖర్చు మాత్రం  చెప్పలేము. తక్కువలో తక్కువ   వెయ్యి కోట్ల పైమాటగానే అప్పట్లో చెప్పుకున్నారు. కానీ శ్రీ సర్కార్ వారు ఆ మూడు నాలుగు నెలల్లో  నియోజకవర్గంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసమే, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని  అధికారిక గణాంకాలే  తేల్చి చెప్పాయి.  ఇక అధికార పార్టీ ఖర్చుచేసిన కోట్ల రూపాయల   గురించి ఎంత చెప్పినా తక్కువే అనే విశ్లేషణలు అప్పట్లో వెల్లువెత్తాయి.  అధికార పార్టీకి సమతూకంగా కాకపోయినా, అందుకు దీటుగానే బీజేపీ (ఈటల) కూడా కోట్లు ఖర్చు చేసిందని అప్పట్లో సామాన్య జనమే నెలల తరబడి చెప్పుకున్నారు. అలా ఓ వంక ప్రభుత్వం, మరో వంక అధికార, ప్రత్యర్ధి పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కోట్లలో సోమ్ము కుమ్మరించారు, ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.  హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే,  అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అప్పట్లో చరిత్ర  సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన  కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు  అప్పట్లో తెరాస నాయకులను బహిరంగంగా నిలదీశారు. ధర్నాలు చేశారు. అదీ  హుజురాబాద్ ఉప ఎన్నిక అప్పట్లో  సృష్టించిన చరిత్ర. వాస్తవానికి  హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత  రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన  భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అప్పట్లో అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు డిమాండ్ చేశారు.  అంతలా రికార్డులు సృష్టించిన ఉప ఎన్నిక తరువాత మునుగోడు నియోజకవర్గానికి గత ఏడాది నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది.  ఆ ఉప ఎన్నిక హుజూరాబాద్ రికార్డులను తిరగరాసింది.  అధికార బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్), ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ఖర్చు విషయంలో పోటీలు పడ్డాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఓటర్ల డిమాండ్ కారణంగా పార్టీలు పోటీలు పడక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో  ఓటర్ల అంచనాలను రీచ్ కావడానికి మూడు ప్రధాన పార్టీలూ వ్యయం విషయంలో ఆకాశాన్నే హద్దుగా పెట్టుకున్నాయి.   మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల చొప్పున ఇచ్చాయన్న ప్రచారం జరిగింది.  అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకూ ఒక్కో ఓటుకు పందేరం చేశాయన్న మాట.  ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల వ్యయం విషయంలో గత రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం ఎంత తక్కువగా చూసుకున్నా వంద కోట్లకు పైమాటేనని అంటున్నారు. వాస్తవంగా ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం నిబంధనల ప్రకారం 40లక్షల రూపాయలకు మించకూడదు.  కానీ అనధికారికంగా అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేస్తున్నారన్నది, చేస్తా రన్నది బహిరంగ రహస్యమే.  ఇప్పటికే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచీ కోట్లలో పట్టుబడుతున్న నగదే.. తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలలో ధన ప్రభావం అంతులేకుండా ఉంటుందన్నడానికి  ఉదాహరణగా చెబుతున్నారు. 

 చిత్రం భళారే విచిత్రం... మహిళ ఫోటో కు బదులు ముఖ్యమంత్రి ఫోటో 

ఆంధ్ర ప్రదేశ్ వోటర్ల జాబితా తప్పుల తడక అని మరో మారు రుజువయ్యింది.  ఓటర్ జాబితా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం ఈ ఆరోపణలకు ఊతమిచ్చే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.  ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్ జాబితాలో  ఈ దాష్టీకం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో దర్శనమిచ్చింది. అది కూడా ఓ మహిళ ఫొటో ఉండాల్సిన చోట సీఎం జగన్ ఫొటో ఉంది. ఫొటో స్పష్టంగా కనిపిస్తున్నా సరే పోలింగ్ సిబ్బంది పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.  వారి నిర్లక్ష్యానికి  ఇది అద్దం పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. ఇలా తప్పుల తడకతో ఉన్న వోటర్ల జాబితా చూస్తే ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించే విధంగా ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ జాబితాలో సవరణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామ ఓటర్ జాబితాలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన గురవమ్మ అనే మహిళ ఫొటో స్థానంలో సీఎం ఫొటోను ఉంది . దీన్ని ఎవరు అప్ లోడ్ చేశారో వేయి డాలర్ల ప్రశ్న. బీఎల్ వో లో కంప్యూటర్ ఆపరేటర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకుందని వినిపిస్తుంది.  అయితే, ఓటర్ జాబితాను సిద్ధం చేశాక ప్రింటింగ్ కు ఇచ్చే ముందు బీఎల్ వో తో పాటు రెవెన్యూ అధికారులు కూడా చెక్ చేస్తారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. ఈ ఘటనపై తీవ్రంగా విరుచుకు పడుతున్నాయి.

12 మంది అభ్యర్థులతో  బిజెపి నాలుగో జాబితా విడుదల 

నామినేషన్లకు గడువు మరో మూడు రోజులు ఉండటంతో  బిజెపి నాలుగో జాబితాను విడుదల చేసింది.  మరో 19 స్థానాలను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది. జన సేనకు 7 సీట్లు ఖరారయ్యాయి.  భారతీయ జనతా పార్టీ  12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ప్రకటించిన మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించింది.  బీజేపీ నాలుగో జాబితా అభ్యర్థులు వీరే... చెన్నూరు- దుర్గం అశోక్‌ ఎల్లారెడ్డి- వీ. సుభాష్‌ రెడ్డి వేములవాడ- తుల ఉమా హుస్నాబాద్- బొమ్మ శ్రీరామ చక్రవర్తి సిద్దిపేట- దూడి శ్రీకాంత్ వికారాబాద్- పెద్దింటి నవీన్ కుమార్ కొడంగల్- బంటు రమేష్ కుమార్ గద్వాల- బోయ శివ మిర్యాలగూడ- సాదినేని శ్రీనివాస్ మునుగోడు- చెలమల్ల కృష్ణారెడ్డి నకిరేకల్- నకరకంటి మొగులయ్య ములుగు- అజ్మీరా ప్రహ్లాద నాయక్

ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో  కొనసాగుతున్న పోలింగ్ 

ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం(నవంబర్ 7) ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌లకు వచ్చే వోటర్లు పెరుగుతున్నారు. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే పెద్ద సంఖ్యలో బారులు తీరారు.  చత్తీస్ గడ్ లో మొత్తం 223 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో 25 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.  ఈ ఫేజ్ లో  13 స్థానాలు ఎస్సీ, ఎస్టి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఫేజ్ లో కాంగ్రెస్ పార్టీ 6గురు సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం కల్పించారు. రాజ్ నందగాన్  నుంచి మాజీ ముఖ్యమంత్రి రామన్ సింగ్ కాంగ్రెస్ నేత గిరిస్ దేవాన్ గన్ పై పోటీ చేస్తున్నారు. కొంట స్థానం నుంచి చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి కవాసి లక్మా పోటీ చేస్తున్నారు. ఆయన 2018, 2013 ఎన్నికల్లో కొంటా స్థానం నుంచి గెలుపొందారు. కొండగాన్ నుంచి కాంగ్రెస్  మాజీ అధ్యక్షుడు మోహన్ మార్కం పోటీ చేస్తున్నారు. నారాయణ్ పూర్ నుంచి  మాజీ మంత్రి కేడర్ కాశ్యప్ బిజెపి తరపున  పోటీ చేస్తున్నారు. కేశ్ కల్ నుంచి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. కవర్ధ స్థానం నుంచి 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  ఛత్తీస్‌గఢ్‌లో భారీ భద్రత  ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోని తెలంగాణలో నక్సలైట్ల సమస్య ఉండేది . ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించాయి మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్‌లకు  ఎక్కువగా చేరుకుంటున్నారు. కాగా మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పెద్ద సంఖ్యలో పోలీసు, ప్రత్యేక బలగాలను మోహరించింది. నక్సల్స్ ఇటీవలే బీజేపీ నేతను హత్య చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కొనసాగుతున్న 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఒక్క బస్తర్ జిల్లాలో ఏకంగా 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా కూడా పెట్టారు.  మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895గా ఉంది. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, 1 ట్రాన్స్‌జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు మాత్రం డిసెంబర్ మూడో తేదీ వెల్లడవుతాయి.

మా పథకాలకు మీ బొమ్మలా? నిధులు నిలిపేసి జగన్ సర్కార్ కు కేంద్రం షాక్!

అసలు ఈ రంగులు, బొమ్మల పిచ్చేంటో కానీ తొలి రోజు నుండే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఈ అంశంలో విమర్శలపాలవుతూనే ఉంది. అయినా, ఆ విమర్శలను ఖాతరు చేయకుండా ప్రతి దానిలో వైఎస్ జగన్ బొమ్మలు, వైఎస్ఆర్ పేర్లు ఉండేలా చూసుకుంటోంది. ప్రభుత్వ భవనాలకు కూడా వైసీపీ రంగులను పూస్తున్నారు. పలుమార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా మారలేదు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నా జగన్ సర్కార్ కు పట్టలేదు. చివరికి రాష్ట్ర పథకాలతో పాటు కేంద్ర పథకాలకు కూడా ఈ పేర్లు, బొమ్మలను తగిలించి ఆ పథకాల క్రెడిట్ కూడా మనదే అనేలా కలరింగ్ ఇస్తున్నారు. అయితే  అన్ని రోజులు మనవే కాదు కదా. ఈ మధ్య కాలంలో కేంద్రం కాస్త ఏపీ ప్రభుత్వంపై దృష్టి పెట్టింది. తమ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందనేది నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్ర నిధులను దారి మళ్లించడాన్ని గుర్తించి ఆ మధ్య పలుమార్లు సమాధానం చెప్పాలని కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది. లెక్కా పత్రం లేకుండా ఇలా కేంద్ర నిధులను ఇష్టారాజ్యంగా వాడుకోవడం ఏంటని  తీవ్రంగా మండిపడింది. అదలా ఉండగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను  నిలిపివేసింది. మా నిధులను మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం ఏంటని ఏకంగా రూ.4 వేల కోట్ల రూపాయలను నిలిపివేసింది. కేంద్ర పథకాల పేర్లు మార్చి  మీ బొమ్మలేసుకొని అమలు చేయడం ఏంటంటూ నిధులను నిలిపివేసింది. అసలే తీవ్ర ఆర్ధిక ఇక్కట్లతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల వేళ కేంద్రం షాక్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర నిధులతో చేపడుతున్న పథకాలకు.. కేంద్రం పేరే ఉండాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం తమ పథకాలపై నవరత్నాల లోగోలు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ బొమ్మలు ఉంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఆ బొమ్మలు పెడితే నిధులు ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ముంగిట జగన్ సర్కార్ కు కేంద్రం షాక్ ఇచ్చినట్లు అయ్యింది.  నిజానికి ఏపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో చాలా పథకాలలో సింహభాగం కేంద్ర నిధులే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కేంద్రం పథకాలను పేర్లు మార్చేసి, వైసీపీ రంగులు, జగన్ బొమ్మలేసుకొని కొంత భాగం రాష్ట్ర నిధులను కలిపి అమలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఇదే. అయితే, వాటికి అట్టహాసంగా బటన్ నొక్కుడు కార్యక్రమాలు నిర్వహించి తమ సొంత పథకాలుగా జగన్ సర్కార్ ఆర్భాటం చేస్తూ వచ్చింది. ఉదాహరణకు గృహల నిర్మాణం విషయానికి వస్తే ఈ నిధులలో కేంద్రానిదే సింహభాగం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు సమకూరుస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు చాలా తక్కువ. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు వైయస్సార్ పేరుని జోడించి పీఎంఏవై- వైయస్సార్ బీఎల్సీ పథకంగా మార్చింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ లోగోతో పాటు సీఎం జగన్ బొమ్మతో కూడిన నవరత్నాల లోగో  కూడా పెట్టింది.   ఈ ఒక్క గృహ నిర్మాణాలే కాదు.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్, వాసన పథకాలకు కేంద్రం భారీగా సహకరిస్తోంది. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలు కేంద్ర సహకారంతోనే నడుస్తున్నాయి. రైతు భరోసాలో కూడా కేంద్ర నిధులున్నాయి. కానీ  గర్భిణీలకు, పిల్లలకు ఇచ్చే గుడ్లపై కూడా వైఎస్ఆర్ పేరు ఉండగా.. పాల ప్యాకెట్లపై జగన్, నవరత్నాల లోగోలున్నాయి. కేంద్ర నిధులున్నా యథేచ్ఛగా వైఎస్ఆర్ రైతు భరోసాగా పేరు పెట్టుకున్నారు. ఇలా కేంద్ర నిధుల అంశాన్ని దాచి పెట్టి తమ సొంత నిధులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వాన్ని మభ్య పెడుతూ వచ్చింది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రానికి ఫిర్యాదులు చేయడంతో కేంద్రం బృందాన్ని పంపించి విచారణ చేపట్టగా బండారం బయటపడింది. దీంతో కేంద్రం నిధులు నిలిపివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ జీవో జారీ చేస్తూ నవరత్నాల లోగో కూడా తొలగించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు కూడా బోర్డులు మారుస్తామని కేంద్రానికి నివేదించింది. మిగతా పథకాలలో కూడా మార్పులు చేస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పగా.. ఎన్నికల వేళ జగన్ కు ఇది  షాకేనని పరిశీలకులు భావిస్తున్నారు.

హస్తినలో గాలి విషం!

దేశ రాజధాని నగరం హస్తినలో  మనిషికి ప్రాణాధారమైన గాలే విషంగా మారిపోయిన పరిస్థితి. హస్తినలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. హస్తినలో వాయు కాలుష్యం అన్నది కొత్తేమీ కాకపోయినా.. ఈ సారి అది ప్రమాద స్థాయిని దాటిపోయింది. వాయునాణ్యతా  సూచీ ఇంతగా పడిపోవడమన్నది ఇటీవలి కాలంలో ఇదే  ప్రథమం. హస్తినలో వాయికాలుష్యం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకోవడానికి కారణంగా ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాలలో పంట వ్యర్థాలను ఇష్టానుసారం దగ్ధం చేయడమే కారణమని అంటున్నారు.  ముఖ్యంగా హర్యానా, పంజాబ్ లలో శీతాకాలంలో పంట వ్యర్థాలను దగ్ధం చేయడం ద్వారా వచ్చే పొగ కారణంగా వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి  చేరుకుంటోందని అంటున్నారు. సాక్షాత్తూ ఢిల్లీ హైకోర్టు ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్ లో ఉన్నట్లేనని వ్యాఖ్యనించడమే హస్తినలో వాయు కాలుష్యం తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.  అయితే పర్యావరణవేత్తలు చెబుతున్నట్లుగా పంట వ్యర్థాల దగ్థం ఒక్కటే వాయు కాలుష్యం పెరిగిపోవడానికి కారణం కాదని చెప్పాలి. గ్రీన్ హౌస్ ఉద్గారాలు కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.  వాయుకాలుష్యం బెడద ఒక్క ఢిల్లీకి మాత్రమే పరిమితమైందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా భారత్ లోని ఇతర నగరాలు, పట్టణాలు సురక్షితంగా ఉన్నాయని నమ్మించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని దాదాపు ప్రతి నగరంలోనూ వాయుకాలుష్యం తీవ్రంగానే ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. వాయు కాలుష్యం మానవుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై అది చూపే ప్రతికూల ప్రభావం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   వాయుకాలుష్యం కారణంగా హస్తినలో సగటు ఆయుర్ధాయం పది సంవత్సరాలు తగ్గుతున్నదని ఒక  అధ్యయనం ఇటీవల వెల్లడించిందంటే  హస్తినలో  వాయు కాలుష్య తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది.  వాయు కాలుష్యాన్ని తగ్గించడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఒక సమష్టి కృషి. ముందుగా  పర్యావరణ పరిరక్షణపై ఒక అవగాహన ఉండాలి. వాయుకాలుష్యం మానవ మనుగడకు ఎంత హానికరమన్న విషయంపై ప్రజలలో చైతన్యం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సరి బేసి వంటివి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే అవుతాయని గుర్తించాలి.   ప్రజా రవాణాను ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంతగా కాలుష్యానికి చెక్ పెట్టడానికి వీలు అవుతుంది.  అలాగే పెద్ద ఎత్తున చెట్లు నాటడం కూడా వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయి. అభివృద్ధి ముసుగులో సాగుతున్నపర్యావరణ విధ్వంసాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అడవుల నరికివేతకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అడవుల సంరక్షణకు చట్టాలు ఉన్నా వాటిని   పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పేర పర్యావరణ విధ్వంసం పెను ముప్పునకు కారణమౌతుంది. అయినా పర్యావరణం, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తించాలి.  ప్రగతి ముసుగులో దీర్ఘకాలంలో వినాశనానికి దారితీసే అభివృద్ధి ఎంత మాత్రం సమర్థనీయం కాదు. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టిపెట్టడం ద్వారా మాత్రమే వాయు కాలుష్యం అరికట్టేందుకు వీలవుతుందన్న విషయాన్ని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. 

ఈసారీ తెలంగాణ వాదాన్నే నమ్ముకున్న కేసీఆర్!

బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్సే అని కేసీఆర్ ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ తీసుకువస్తామంటూ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేసిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ముందు.. తన జాతీయ రాజకీయ ఆకాంక్షల గురించి ఎక్కడా  మాట్లాడటంలేదు. తెలంగాణ వాదాన్నే నమ్ముకున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.  తన ఎన్నికల ప్రచార సభలలో కూడా ఎక్కడా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించకుండా... తెలంగాణ సాధించిన పార్టీగా మరో సారి ఎన్నుకోండంటూ వేడుకుంటున్నారు.  ఇదే కేసీఆర్ కొంత కాలం కిందట పిడుక్కి బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లు కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దింపే సత్తా తనకు మాత్రమే ఉందని గల్లీ మీటింగులలో కూడా ఊదరగొట్టారు. ఇప్పుడిక తెరాస కేవలం తెలంగాణకు చెందిన పార్టీ మాత్రమే కాదనీ, బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది జాతీయ పార్టీ అయ్యిందనీ, ఇక తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతాననీ చెప్పుకునే వారు.  అయితే అదంతా గతం.. ఆయన జాతీయ అడుగులు తడబడ్డాయి. ఆ దిశగా ఆయన వేసిన ప్రతి అడుగులోనూ అడ్డంకులూ, అవాంతరాలూ ఎదురయ్యాయి. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఆయనకు స్థానమే లేకుండా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ జాతీయ స్థాయిలో ఏక తాటిపైకి వస్తుంటే.. అదే బీజేపీని గట్టిగా వ్యతిరేకించిన  బీఆర్ఎస్ ను మాత్రం ఆ పార్టీలేవీ నమ్మడం లేదు. ఇక  ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ ప్రకటనలు గుప్పించడంతో.. తెలంగాణ సెంటిమెంటు మాయమైంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలలాగే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ. తెలంగాణ  ప్రజల సెంటిమెంటుతో పెనవేసుకున్న టీఆర్ఎస్ కాదు.  విషయం ఆలస్యంగా గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల ఊసెత్తడం లేదు. ఇప్పుడున్న  పార్టీ పేరుకు బీఆర్ఎస్ అయినా పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలు, ఆకాంక్షల కోసమే పని చేస్తుందని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాలకు బలం ప్రాంతీయ పార్టీలేనని నమ్మబలుకుతున్నారు.  అయినా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తరువాత కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో చేసిన రాజకీయం.. ఇక్కడ సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోయినా.. ఇతర రాష్ట్రాలలో బాధితులకు నష్టపరిహారం పందేరం చేయడానికి ఆర్భాటంగా చేసిన యాత్రలు, ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయడం.. మహా  స్థానిక ఎన్నికలలో పోటీ, ఆయా రాష్ట్రాలలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరికలకు ప్రోత్సహించడం తదితర సంఘటలను గుర్తు తెచ్చుకుంటూ... ఇంతలో కేసీఆర్ మాట ఎందుకు మారిందంటూ జనం ఆలోచిస్తున్నారు.  చర్చించుకుంటున్నారు.  ఇక కేసీఆర్ గత రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ తనను గెలిపించిన తెలంగాణ వాదాన్ని వదులుకుంటే రాష్ట్రంలో అధికారం జారిపోతుందన్న విషయాన్ని గ్రహించారా అన్నట్లుగా జాతీయ రాజకీయాల ఊసు వదిలేసి పూర్తిగా తెలంగాణ వాదాన్నే నమ్ముకున్నారు. తనకు జాతీయ అంశాలు కాదు, తెలంగాణ సమాజమే ముఖ్యమని పదేపదే చెబుతున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా తమనే గెలిపించాలని చెప్పుకుంటున్నారు. సావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించుకువచ్చానని పదేపదే చెప్పుకుంటున్నారు.  మరి మారిన కేసీఆర్ ధోరణిని తెలంగాణ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుం టారన్నది చూడాల్సిందే. 

బీజేపీ హైకమాండ్ బండినే శరణుజొచ్చిందా?

తెలంగాణ బీజేపీలో అంతర్మథనం మొదలైందా? తెలంగాణలో అధికారం అందని ద్రాక్ష అన్న అనుమానం మొదలైందా? తెలంగాణలో బీజేపీ ఫేస్ బండి సంజయ్ మాత్రమేనని ఆలస్యంగా గుర్తించిందా? అంటే పార్టీ శ్రేణులు మాత్రం ఔననే అంటున్నాయి. పరిశీలకుల విశ్లేషణలు సైతం అదే దిశలో సాగుతున్నాయి. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీజేపీ రాష్ట్రంలో రేసుగుర్రంలా ఉరకలెత్తింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అంటే బీజేపీయే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పుంజుకుంటున్నదని ఎవరైనా చెప్పినా జనం కూడా నమ్మే పరిస్థితి లేదన్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే.. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు  అప్పగించారో ఆ క్షణం నుంచీ బీజేపీ అనూహ్యంగా వెనుకబడింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన సభ మొత్తం బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది.  ఇక అక్కడ నుంచి తెలంగాణలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్లు నాగంభోట్టు అన్నట్లుగా మారింది. అధికారమే తరువాయి నుంచి అసలు సింగిల్ డిజిట్ స్థానాలనైనా గెలుచుకుంటుందా అన్న పరిస్థితికి దిగజారింది. ఇందుకు రాష్ట్ర బీజేపీ నేతల కంటే పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అటువంటి వేళ రాష్ట్రంలో  బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించేందుకు నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇంతకు ముందే అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా  ప్రధాని మోడీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అయితే మోడీ ఆ ప్రకటన చేస్తూ రాష్ట్రంలో బీజేపీలో మరిన్ని వికెట్లు పడిపోయే అవకాశం ఉందనీ విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కమలం రేకులు ఒక్కటొక్కటిగా రాలిపోతున్నాయి. పార్టీ క్యాడర్ అభీష్ఠానికి వ్యతిరేకంగా కొన్ని స్థానాలను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంపై కూడా బీజేపీలో నిరసనలు వెల్లువెత్తాయి. గతంలోనే.. అంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన తెలంగాణలో పొత్తుల ప్రశక్తే లేదు..ఒంటరిగానే అధికారంలోకి వస్తామని విస్పష్టంగా ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కారు. అంతే కాకుండా గతంలోలా అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమా కాగడా పెట్టి వెతికినా పార్టీ నేతల్లో, కార్యకర్తలలో కనిపించడం లేదు.   పార్టీకి అత్యంత విధేయుడైన బండి సంజయ్ తాజాగా తాను పార్టీ రాష్ట్ర సారథిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పార్టీ పరుగులెత్తిందనీ, ఇప్పుడు చతికిల పడిందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. అధిష్ఠానం కూడా బండి సంజయ్ దూకుడును గుర్తించి ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది. హెలికాప్టర్ కూడా కేటాయించింది.  పార్టీలో జోష్ నింపాలంటే బండి సంజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే బండి సంజయ్ కు ఈటల, అలాగే వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన నేతలతో పెద్దగా పొసగడం లేదన్న విషయం తెలిసిందే. ఆ కారణంగా ఎన్నికల ముందు అభ్యర్థి ప్రకటన మొదటికే మోసం తెస్తుందా అన్న ఆలోచన కూడా బీజేపీ హై కమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద మోడీ సభ తరువాత బీజేపీలో ఇప్పుడు నెలకొన్న గందరగోళ పరిస్థితికి చుక్కపడుతుందేమో చూడాలి.   

దళితులపై వరస దాడులు.. జగన్ పాలనలో పరాకాష్టకు పైశాచికత్వం!

ఏపీలో మరో అరాచక, పైశాచిక ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. ఆరుగురు వ్యక్తులు దళితుడిపై దాడి చేసి మంచినీళ్లు అడిగితే మూత్ర విసర్జన చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని శ్యామ్‌ కుమార్‌గా గుర్తించగా.. నిందితులు ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు నిందితులు దళిత వ్యక్తిని వాహనంలో ఎక్కించుకొని వెళ్లి నాలుగు గంటలపాటు ఇష్టారాజ్యంగా చితకబాదారు. అనంతరం బాధితుడు తీవ్ర గాయాలపాలవడంతో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసేందుకు తీసుకెళ్తుండగా అతను నీళ్లు కావాలని అడిగాడు. దీంతో అతన్ని వాహనం నుండి దించి కూర్చోబెట్టి నిందితులు ఆరుగురు అతని చుట్టూ తిరుగుతూ అతనిపై మూత్ర విసర్జన చేశారని అధికారులు తెలిపారు. బాధితుడు శ్యామ్ కుమార్ పై నిందితుడు దాడి చేసే సమయంలో ఇప్పుడు మాదే అధికారం, మేమేం చేసినా చెల్లుతుందంటూ చితకబాదారు. మేము అధికారంలో ఉన్నంత కాలం మీరు మమ్మల్ని ఏం చేయలేరంటూ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడినట్లు పోలీసులే తెలిపారు. అయితే  వైసీపీ ప్రభుత్వానికి ఈ నిందితులకు ఎలాంటి సంబంధం లేకపోయినా నిందితులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. స్థానిక వైసీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని ఎవరూ అడగకుండానే  పోలీసులు సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే  ఈ ఆరుగురు రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారేనని తెలుస్తుండగా.. నిందితులు వైసీపీ కార్యకర్తలా కదా అన్న అంశంపై మాత్రం పోలీసులు స్పందించలేదు.  ఈ సంఘటన తెరపైకి వచ్చిన తర్వాత టీడీపీ ఎస్సీ సెల్ నిరసన చేపట్టి  రోడ్లను దిగ్బంధించింది. కంచికచర్ల సమీపంలో హైవేను దిగ్బంధించి టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎంఎస్ రాజు ఆధ్వర్యంలో హైవేకు ఇరువైపులా నిరసన ధర్నా నిర్వహించారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో  ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.   అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దళితులపై ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయన్నది చర్చకు వస్తున్నది. గతంలో కరోనా సమయంలో విశాఖ జిల్లాలో దళిత వైద్యుడు మాస్కులపై ప్రశ్నించగా.. అతన్ని పిచ్చి వాడిగా ముద్రవేసి గుండు కొట్టించి చేతులు విరిచి కట్టేసి పోలీసులతో చితకబాదించారు. అతన్ని ఉద్యోగం నుండి కూడా తొలగించడంతో మానసికంగా కృంగిపోయి అతను మరణించాడు. చీరాలలో కిరణ్ అనే దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర పనిచేసే దళిత డ్రైవరును చంపేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీని వైసీపీ పెద్దలు సమావేశాలలో పక్కనే కూర్చోబెట్టుకొని ఫోజులిస్తున్నారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత యువకుడు ఇండుగుమిల్లి వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై అక్రమ కేసులు బనాయించి వేధించారు. అదే జిల్లాకు చెందిన వైద్యురాలు అనితారాణిని కూడా అసభ్యంగా దూషిస్తూ సోషల్ మీడియాలో  పోస్టులు పెట్టి  వేధించారు. పోలీసులు వేధించడంతో కాకినాడ జిల్లాకు చెందిన ఆలపు గిరీష్ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఇవి కాకుండా వేధింపులు భరించలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడగా  వాటిని అనుమానాస్పద కేసులుగా మూసేసినట్లు ఆరోపణలున్నాయి. ఆస్తుల ధ్వంసం, ఇళ్లపై దాడులు చేసిన సంఘటనలు, దళిత బాలికలు, యువతులు, మహిళపై అత్యాచారాలకు దిగిన ఘటనలు ఎన్నో ఉండగా.. ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ జిల్లాలో అవమానవీయ ఘటన చోటు చేసుకుంది. దీంతో అసలు వైసీపీ ప్రభుత్వానికి దళితులంటే ఎందుకింత చులకనని దళిత సోదరులు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిజానికి వైసీపీ అధికారంలోకి రావడంలో దళితులే కీలకంగా వ్యవహరించారు. కానీ  వారిపై చిన్నచూపో.. ఏం చేసినా భరిస్తారనే నమ్మకమో.. అధికారం మాదే కనుక అడిగేవారు లేరన్న అహంభావమో..  రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు భయాందోళనలు కలిగిస్తున్న మాట వాస్తవం.

 ఢిల్లీలో భూకంపం... రిక్టర్ స్కేల్ పై 5.6 గా నమోదు

ఢిల్లీలో సోమవారం (నవంబర్ 6) భూమి కంపించింది. రిక్టర్  స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.6గా  నమోదైంది. వరుస భూకంపాలు ఢిల్లీ వాసులను వణికిస్తున్నాయి. మూడు రోజుల కిందట అంటే శుక్రవారం (నవంబర్ 3) నేపాల్ లో సంభవించిన భూకంప ప్రకంపనలు ఢిల్లీని కూడా తాకిన సంగతి తెలిసిందే. అప్పుడు హస్తినలో సంభవించిన భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నా మూడు రోజుల వ్యవధిలో ఢిల్లీలో మళ్లీ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   మూడు రోజుల్లో ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండో సారి.  అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం లేదు.