వైసీపీ నేతలకు అదే పని.. వాళ్ళని సాగనంపటమే ప్రజల పని!
posted on Nov 13, 2023 @ 5:08PM
మొదట లోకేష్.. ఆ తర్వాత చంద్రబాబు.. కాస్త గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్, ఇప్పుడు పురంధేశ్వరి. ఏంటిది అనుకుంటున్నారా?. ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు చేసిన పని. ఒకరిని టార్గెట్ చేయడం.. వారిపై మాటల దాడి చేయడం.. సినీ పరిశమ్ర నుండి ఓ ఇద్దరికి వీరి తాము టార్గెట్ చేసిన వారిపై అడ్డగోలుగా, ఇష్టారాజ్యంగా విమర్శలు చేయాలని చేయాలని ఆదేశించడం, వారు ఆ పనిని తు.చ. తప్పకుండా అమలు చేసేలా పర్యవేక్షించడం, సొంత మీడియాలో రాతలు, ప్రసారాలు, తమ సామాజిక మాధ్యమంలో పోస్టులు ఈ నాలుగున్నరేళ్లలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ప్రభుత్వం , మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన పని ఇదేనని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ముందుగా నారా లోకేష్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఆయన ఆహారం నుండి ఆహార్యం వరకూ.. తన నడక నుంచి నడవడిక వరకూ దేనినీ వదలకుండా విమర్శలు చేయడం, హేళన చేయడమే లక్ష్యంగా వైసీపీ పని చేసింది. అయితే అన్నిటినీ దీటుగా ఎదుర్కొన్న లోకేష్ ఈ నాలుగేళ్ళలో పరిణితి చెందిన నేతగా ఎదిగారు. తనపై ఒక విమర్శ చేయాలంటే ప్రత్యర్థులు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితికి వారిని తీసుకు వచ్చారు.
ఆ తరువాత వైసీపీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తన టార్గెట్ ను షిఫ్ట్ చేసింది. చంద్రబాబును అసెంబ్లీలోకి కూడా అడుగు పెట్టనివ్వకుండా చేసేందుకు కుట్రలు పన్ని మంచీ, చెడూ, ఉచ్ఛం, నీచం తెలియని, నోరు విప్పితే బూతుపురాణం తప్ప ఓ మంచి మాట మాట్లాడటం రాని మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల చేత అవాకులూ, చవాకులూ మాట్లాడించింది. అప్పటికీ చంద్రబాబు చలించకపోవడంతో కుటుంబ సభ్యులపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేయించింది. ఆ తరువాత తెలుగుదేశంతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. మళ్లీ అదే పాత కథ.. ముందు వెనుకలు, పర్యవశానాల గురించి ఆలోచించకుండా జగన్ చెప్పినది తు.చ. తప్పకుండా చేసే ఆస్థాన విద్వాంసుల వంటి నాయకులతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మొదలు.. పొత్తు వరకూ, సినీ పరిశ్రమలో ఆయన నైజం నుండి కుటుంబంలో వివాదాల వరకూ దేన్నీ వదలకుండా ఆగమాగం చేశారు. కానీ, పవన్ కళ్యాణ్ దేనికీ లొంగలేదు. ఒక దశలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తన హోదా, స్థాయి మరచి పవన్ క ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే వీటిని వేటినీ పవన్ కల్యాణ్ లెక్క చేయలేదు.
దీంతొ ఇప్పుడు తమ ఆర్థిక అవకతవకలపై, ముఖ్యంగా మద్యం మాఫియాపై గణాంకాలు, ఆధారాలతో సహా విమర్శిస్తున్న, గుట్టు బయట పెడుతున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని టార్గెట్ చేసింది వైసీపీ. ముందుగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఆ తర్వాత మంత్రి రోజా, నటుడు పోసాని మురళీకృష్ణలు పురంధేశ్వరి టార్గెట్ గా వారికి మాత్రమే చేతనైన భాషలో విమర్శలు చేశారు. ఇక తరువాత వంతుగా నేడో రేపో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి వాళ్ళు, ఆ వెనుక సామాజిక మాధ్యమంలో తప్ప మరెక్కడా నోరెత్తని దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు రంగంలోకి దిగే అవకాశం ఉంది. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేయాల్సిన పనులేవీ ఈ నాలుగున్నరేళ్లలో చేయని వారు.. కేవలం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి విమర్శల దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారా అనిపించక మానదు. జగన్ సర్కార్ లో ఏ మంత్రీ కూడా ఇప్పటి వరకూ తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల గురించి కానీ, తన శాఖపై వచ్చిన ఆరోపణల గురించి కానీ మీడియా సమావేశం నిర్వహించి వివరించిన సందర్భం ఒక్కటి కూడా కనిపించదు.. ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించడానికి మాత్రమే వారు మీడియాకు ముఖం చూపించారని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదనిపించేలా వారి వ్యవహారశైలి ఉంది.
ఇక, వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించి ఏం పనులు చేస్తున్నారో తెలియదు కానీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించిన వారిపై దాడి చేయడమే వీరి పని అన్నట్లుగా వీరి తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జనం వీళ్లు మారరన్న నిర్ణయానికి వచ్చేసి, వీళ్లనే మార్చేద్దామని ఫిక్సైపోయినట్లుగా కనిపిస్తోందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.