తెలంగాణ ఎన్నికల్లో ఎలక్షన్ కింగ్ పద్మ రాజన్
posted on Nov 13, 2023 @ 2:30PM
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా మై హుజూర్ అంటూ ప్రత్యక్షమవుతాడు.
ప్రత్యర్థి ఎవరైనా పట్టించుకోని తమిళనాడుకు చెందిన హోమియో డాక్టర్ పద్మరాజన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధమయ్యారు. 237వ సారి నామినేషన్ వేశారు. 1986 నుంచి ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు 20 లక్షలకుపైగా ఖర్చు చేశారు పద్మరాజన్. అయితే.. కేవలం నామినేషన్ దాఖలు చేసేందుకు చెల్లించాల్సిన రుసుముగానే ఖర్చు చేశారు తప్ప ఏనాడు ఎన్నికల ప్రచారం కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు పద్మరాజన్. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నామినేషన్ వేయడంతో పద్మరాజన్‌ను ముద్దుగా ఎలక్షన్ కింగ్‌గా పిలుచుకుంటారు.
కరుణానిధి, జయలలిత, రాహుల్‌గాంధీ, స్టాలిన్, పళనిస్వామి, యడ్యూరప్పపై పోటి చేసిన డాక్టర్ పద్మరాజన్ ఈ సారి కేసీఆర్‌తో తలపడనున్నారు. 237వ సారి నామినేషన్ వేసిన ఆయన తెలంగాణ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతున్నారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎన్నిక ఏదైనా సరే.. బరిలో ఉండాల్సిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రముఖలకు ప్రత్యర్థిగా నిలవాల్సిందే. ముఖ్యమంత్రి, ప్రధాని, చివరకు రాష్ట్రపతి ఎన్నికలైనా వెనకడుగు వేయడం తెలియని వ్యక్తి ఆయన.
డాక్టర్ పద్మరాజన్ దేశ రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్లకు ఆయన సుపరిచితుడే. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు. తమిళనాడు సేలంకు చెందిన 66 ఏళ్ల పద్మరాజన్ హోమియోపతి వైద్యుడు. అయితే.. ఈయనకు మరో పేరు కూడా ఉంది. అదే ఎలక్షన్ కింగ్. ఈ పేరు ఎందుకొచ్చిందంటే.. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా అందులో పోటీ చేస్తుంటారు పద్మరాజన్. దేశంలోనే అత్యధిక సార్లు పోటీకి దిగిన అభ్యర్థిగా.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నారు. అయితే.. ఎక్కువ సార్లు పోటీలో నిలబడటమే కాదు.. అత్యధికసార్లు ఓడిపోయిన వ్యక్తిగానూ రికార్డుల్లోకి ఎక్కారు పద్మరాజన్.
మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావుకు ప్రత్యర్థిగా నామినేషన్ వేశారు. 1991లో పీవీ నరసింహారావుపై పోటీ చేసిన పద్మరాజన్‌పై అప్పట్లో దాడి కూడా జరిగింది.