157 నామినేషన్ల దాఖలుతో గజ్వేల్ సరికొత్త రికార్డు
posted on Nov 11, 2023 @ 5:18PM
తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,355 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వరుసగా మూడు నియోజకవర్గాల్లో అత్యధిక నామినేషన్లు వచ్చాయి. రెండో స్థానంలో మేడ్చెల్ నియోజకవర్గం ఉంది. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ 127 నామినేషన్లు దాఖలు చేశారు. మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మూడోస్థానంలో కామారెడ్డి నియోజకవర్గానికి అత్యధిక నామినేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక నామినేషన్లు రావడం గమనార్హం. వరుసగా మూడోసారి గెలిచి తమ పార్టీ హ్యట్రిక్ సాధిస్తుందని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మీదే ఎక్కువ మంది అభ్యర్థులు చేయడానికి సిద్దమయ్యారు. ఆయన వరుసగా రెండుసార్లు పోటీ చేసి గెలిచిన గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడి నుంచి 127 మంది 157 నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు ఉన్నారు. జగిత్యాల చెరుకు రైతులు కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ధరణి సహా వివిధ బాధితులు ఉన్నారు. నిరసన తెలిపే ఉద్దేశంలో భాగంగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు. సుప్రీం కోర్టు తుది తీర్పు ప్రకారం నిజాంపేట, పేట్ బషీర్ బాద్ లలో జర్నలిస్టులు కొనుగోలు చేసిన 70 ఎకరాలు అప్పగించాలి. అయితే ఈ స్థలాలను ప్రభుత్వం ఇంకా స్వాధీనం చేయకపోవడంతో జవహార్ హౌసింగ్ సొసైటీ సభ్యులు కొందరు కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేశారని సమాచారం.
గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు, కామారెడ్డి నుంచి 102, మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి.
బిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలన్న లక్ష్యంతో వివిధ వర్గాలకు చెందిన బాధితులు ఈ నామినేషన్లు దాఖలు చేశారు.