బాబూ మోహన్, పాల్.. నవ్వులు పూయించడంలో ఇద్దరూ ఇద్దరే!
posted on Mar 4, 2024 @ 2:07PM
రెండు వినోద సింహాలు ఒకే గూటికి చేరాయి. వారి వారి రంగాలలో ఇద్దరూ నిష్ణాతులే. వారిలో ఒకరు కేఏ పాల్ . క్రైస్తవ మతబోధకుడిగా గుర్తింపు పొంది ఆ తరువాత రాజకీయాలలోకి వచ్చిన పాల్. తన వాగ్ధాటితో ప్రజలకు చాలా తొందరగా చేరువైపోయారు. ఆగండి, చేరువైపోవడమంటే ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందేశారని అనుకోవద్దు. ఆయన ప్రసంగాలు ప్రజలకు వినోదం కలిగిస్తాయి. చెవులు రిక్కించుకుని మరీ ఆయన ప్రసంగాలు వినడానికి, విని నవ్వుకోవడానికి జనం తహతహలాడుతుంటారు.
దేశ విదేశాల అధినేతలంతా తనకు బాగా తెలుసునని చెప్పుకుంటుంటారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ అధికారం తనదేనని చాటుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకూ ఆయన స్వయంగా కూడా ఎక్కడా గెలవలేదు. అయినా ఆయన జనాలకు బాగా ఇష్టుడిగా మారిపోయారు. ఆయన ప్రసంగాలూ, వివిధ పార్టీల నేతలను ఉద్దేశించి ఆయన చేసే విమర్శలూ, వాళ్లకు ఇచ్చే సలహాలు నవ్వులు పూయిస్తుంటాయి. ప్రజలకు మాంచి వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే మీడియా, సోషల్ మీడియా కూడా ఆయన ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా మిస్ కాకుండా మంచి కవరేజ్ ఇస్తుంది. ఎందుకంటే ఆ కవరేజ్ తమ వ్యూయర్ షిప్ ను, టీఆర్పీ రేటింగ్ ను పెంచుతుందన్న నమ్మం.
ఇక రెండో వ్యక్తి బాబూ మోహన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. విలక్షణ కమేడియన్ గా వందల సినిమాలలో ప్రేక్షకులను అలరించిన బాబూ మోహన్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆ ఇమేజ్ తోనే, ఆ గుర్తింపుతోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే అదంతా గతం. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వీరాభిమాని అయిన బూబూ మోహన్ తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) పార్టీలోకి జంప్ కొట్టారు. 2014 నుంచి 2018 వరకూ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ తరువాత బీజేపీలోకి మారారు. 2108 ఎన్నికలలో బీజేపీ తరఫున అందోల్ నుంచి బరిలోకి దిగారు. పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీకీ దూరంగా ఉంటూ వచ్చారు.
ఇప్పుడు తాజాగా ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకుని వరంగల్ నుంచి లోక్ సభ కు పోటీ చేయనున్నారు. ప్రజాశాతి పార్టీ వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా బాబూమోహన్ పేరును కేఏ పాల్ అధికారికంగా ప్రకటిచారు.
దీంతో ఇద్దరు కమేడియన్లు ఓకే గూటిలో ( పార్టీలో) ఉన్నారంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. గెలుపు ఓటములతో పని లేకుండా వరంగల్ లోక్ సభ స్థానం రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిపోతుందంటూ పరిశీలకులు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. వరంగల్ లోక్ సభ స్థానంలో తమ ప్రచార కార్యక్రమాలకు జనాలను తరలించాల్సిన పని లేదనీ, స్వచ్ఛందంగా ప్రజలే పెద్ద సంఖ్యలో సభలకు వచ్చేస్తారనీ ప్రజాశాంతి వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికల హీట్ ఏ రేంజ్ లో ఉన్నా.. వరంగల్ లో మాత్రం ఓటర్లకు పాల్, బాబూ మోహన్ ల ప్రసంగాలు మండు వేసవిలో వినోదాల పన్నీటి జల్లుతో స్నానం చేయిస్తాయనడంలో మాత్రం సందేహం లేదు.