కూటమికి కోటగా మారిన కర్నూలు!
posted on Apr 7, 2024 @ 12:20PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే అధికారం అంటూ పలు సంస్థల సర్వేలు తేల్చేశాయి. కొన్ని సర్వే సంస్థలైతే వైసీపీకి ముప్పైకి మించి అసెంబ్లీ స్థానాలు రావని పేర్కొన్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. వైసీపీపై ప్రజలు ఆగ్రహంతో ఉండడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధిని మరిచి పాలన అంటే కేవలం కక్షపూరిత రాజకీయాలే అన్నట్లుగా వ్యవహరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. రాష్ట్రంలో పనులు చేసుకునేందుకు అవకాశాలు లేకపోవటంతో యవత పెద్ద సంఖ్యలో హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ విషయంలోనూ జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. ఫలితంగా ఏపీ ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు సిద్ధమయ్యారు. రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే జగన్ తీరు కారణంగా ఈసారి రాయలసీమ జిల్లాల్లోనూ వైసీపీకి గట్టి షాకిచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తాజా సర్వే పేర్కొంది
2019 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో వైసీపీ హవా సాగింది. ఆ ప్రాంతంలో మొత్తం 52 సీట్లలో కేవలం మూడు నియోజకవర్గాల్లోనే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందుకు ప్రధాన కారణం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్య వెనక ఉన్నది తెలుగుదేశం నేతలేనని జగన్, ఆయన వర్గీయులు విస్తృత ప్రచారం చేశారు. దీంతో ప్రజలుసైతం వైసీపీ నేతల ప్రచారాన్నినమ్మి వైసీపీకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జగన్ ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా.. కక్షపూరిత రాజకీయాలను ప్రోత్సహించడంతోపాటు.. వివేకా హత్య వెనుక ఉన్నది వైసీపీ నేతలేనని దర్యాప్తు సంస్థలు దాదాపు తేల్చేశాయి. ఫలితంగా రాయలసీమ ప్రాంత ప్రజల నుంనీ వైసీపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
దీంతో ఈసారి రాయలసీమ ప్రాంతంలోని 52నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ప్రముఖ సర్వేలుసైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూల్ జిల్లా రాజకీయాలు అన్ని పార్టీలకు కీలకం. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకుగాను 14 స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కానీ, ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. కర్నూల్ జిల్లాలో వైసీపీకి బిగ్‌షాక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తాజా సర్వే పేర్కొంది.
స్ట్రా పోల్ తాజాగా నిర్వహించిన సర్వేలో కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ గ్రాఫ్ భారీగా పడిపోయిందని తేలింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కర్నూలు, కొడుమూరు, పత్తికొండ, అదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూల్, ఆదోని నియోజకవర్గాల్లో స్ట్రా పోల్ ఆయా పార్టీల నేతలపై సర్వే నిర్వహించింది. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్ల మొబైల్ ఫోన్లకు స్ట్రా పోల్ లింకులు పంపి వాటి ద్వారా ఓటింగ్ నిర్వహించింది. తద్వారా నమోదైన ఓటింగ్ ఆధారంగా పోలింగ్ శాతాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ సర్వేలో కర్నూల్, ఆధోని నియోజకవర్గాల్లో తెలుగుదేశం, కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని తేలింది. ఆయా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేయకపోవడం ఒక కారణం అయితే.. ప్రస్తుతం పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వకుండా ఆ నెపాన్ని తెలుగుదేశంపై నెట్టడం వంటి వాటి గురించి ప్రజలు పూర్తి అవగాహనకు రావడంతో వైసీపీ పట్ల ప్రజల్లో అసహనం మరింతగా పెరిగడం కూడా ఒక కారణంగా సర్వే పేర్కొంది. కర్నూల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఏఎండీ ఇంతియాజ్, కాంగ్రెస్ కూటమి తరపున గౌస్ దేశాయ్ బరిలో నిలిచారు. వీరిపై సర్వే నిర్వహించగా.. టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని స్ట్రా పోల్ సర్వేలో తేలింది. భరత్ కు 50శాతం, వైసీపీకి 37.5శాతం ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ఆధోని నియోజకవర్గంలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ నిర్వహించిన స్ట్రా పోల్ సర్వేలో కూటమి అభ్యర్థి పార్ధసారథి విజయం సాధిస్తారని తేలింది. పార్థసారధికి 55.85 శాతం, వైసీపీకి అభ్యర్థికి 44.35శాతం ఓట్లు వచ్చాయి. కర్నూల్, ఆదోనితో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోకూడా కూటమి అభ్యర్థుల విజయానికే ఎక్కవ అవకాశాలు ఉన్నట్లు స్ట్రా పోల్ సర్వే స్పష్టం చేసింది. దీనికితోడు ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీ అభ్యర్థులు ఓటమి ఖాయమని పలు సర్వే సంస్థలు తేల్చడంతో మొత్తంగా రాయలసీమలోనే వైసీపీ గాలాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.