పీకే పంచాంగం.. జగన్ జాతకం!
posted on Apr 8, 2024 6:59AM
ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. రాజకీయ నాయకులు క్రోధి నామ సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉంటుందో ముందస్తుగానే తెలుసుకుంటున్నారు. అయితే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావడంతో ఉగాది పండుగపై పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. అయినా, క్రోధి నామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉంటుందో స్పష్టత వచ్చేసింది. జగన్ జాతకం చెప్పింది పంచాగ పండితులు కాదు.. ఎన్నికల వ్యూహకర్త. ఆయన ఆషామాషీ వ్యక్తికాదు.. దేశ రాజకీయాల్లో ఆయన సర్వే చేశాడంటే.. ఆ ఫలితాలు పక్కాగా దిగిపోవాల్సిందే.. అంతెందుకు, 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఆయన రాజకీయ వ్యూహాలతోనే గద్దెనెక్కాడు. ఆయన ఎవరో కాదు.. ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఓడిపోతాడని కుండబద్దలు కొట్టిన పీకే.. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించాడు. జగన్ మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. దీంతో ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్థులు ఓటమి భయంతో వణికిపోతున్నారు.
2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందనే విషయం ఏపీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. కోడికత్తి డ్రామాతోపాటు.. వివేకా హత్య ఘటన తరువాత జగన్ కు ప్రజల్లో సానుభూతి ఉప్పొంగేలా చేయడం వెనుక పీకే వ్యూహాలే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. కులం, మతం, ప్రాంతం ఇలా అన్ని అంశాల్లోనూ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా సీఎం జగన్‌కు ప్రశాంత్ కిశోర్ అధికారాన్ని కట్టబెట్టాడు. ఇటీవల కాలంలో జగన్ ఐదేళ్ల పాలనపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని కుండబద్దలు కొట్టేశాడు. మరోసారి అదే విషయాన్ని ప్రశాంత్ కిశోర్ చెప్పాడు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని, వైయస్ జగన్ ఓటమి తధ్యమని అన్నారు. ఓ వార్త సంస్థకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనకు తాను రాజాగా భావిస్తున్నారన్నారు. గతంలో రాజుల వలే.. తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఆయన ఏమీ చేయలేదు.. ప్రజలకు నగదు బదిలీ చేశారు తప్పితే.. ఉద్యోగాలు కల్పన, రాష్ట్రాభివృద్ధిపై ఆయన శ్రద్ద పెట్టలేదని పీకే వివరించాడు. ఎన్నికల వేళ పీకే వ్యాఖ్యలతో వైసీపీ అభ్యర్థులు ఓటమి భయంతో వణికిపోతున్నారన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షపూరిత రాజకీయాలకు మాత్రమే జగన్ ప్రాధాన్యతనిచ్చాడు. చిన్నచిన్న పనులు చేసుకుందుకుసైతం ఏపీలో అవకాశంలేక అక్కడి ప్రజలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లిపోతున్నారంటే ఏపీలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు రాజధానుల పేరుతో డ్రామాలు.. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంను పూర్తిగా నిలిపివేయడం వంటి రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా మారే పనులు చేయడం మినహా జగన్ ప్రజలకు ఉపయోగపడే ఒక్కపనిని కూడా చేయలేదని చెప్పడంలో ఎలాంటి సంశయం అవసరం లేదు. దీంతో, జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రచారానికి వెళ్లిన పలువురు వైసీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థల సర్వేలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నాయి. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చిచెప్పడంతో వైసీపీ అభ్యర్థులు ఓటమి భయంతో వణికిపోతున్నారు.
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు పైకి కొట్టిపారేస్తున్నప్పటికీ.. ఆయన గురించి తెలిసిన వైసీపీ నేతల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి కిందిస్థాయి నాయకుల వరకు ప్రతిఒక్కరి గురించి పీకేకు బాగా తెలుసు. అంతేకాదు జగన్ వ్యూహాలనుసైతం పీకే తేలిగ్గా పసిగట్టగలడు. ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పీకే కుండబద్దలు కొట్టేశాడు. ఇప్పటికే ఒక పక్క ఓటమి భయంతోనే ప్రజల్లోకి వెళ్తున్న వైసీపీ అభ్యర్థులకు పీకే తాజా వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లుగా మారాయని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.