అవినాష్ సమక్షంలోనే వివేకా హత్య కేసులో సాక్ష్యాల నాశనం!
posted on Apr 8, 2024 @ 9:44AM
ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకా దారుణ హత్యకు గురై ఐదేళ్లు దాటి పోయింది. ఆ హత్య గత ఎన్నికలలో అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పట్ల జనంలో సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైంది. ఆ హత్య వెనుక ఉన్నది తెలుగుదేశమేననీ, నారాసుర రక్త చరిత్ర అనీ పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం చేసుకుని జగన్ అధికార పగ్గాలు అందుకున్నారు. అయితే జగన్ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో వివేకా హత్య కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా, దర్యాప్తులో భాగంగా నిందితులుగా తెరపైకి వచ్చిన వాళ్లను కాపాడేందుకు జగన్ ఎంత కష్టపడ్డారో, తన అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు. తన తండ్రి హత్య కేసులో దోషులకు శిక్ష పడాలంటూ డాక్టర్ సునీత చేస్తున్న న్యాయపోరాటమూ అందరికీ తెలిసిందే.
గత ఏడాది జూలై నెలాఖరులోగా వివేకా హత్య కేసు విచారణను పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గడువు విధించినా.. ఇంకా కేసు దర్యాప్తు సాగుతూనే ఉంది. వివేకా హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారుల విషయంలో ఇప్పటికే జనం ఒక అంచనాకు వచ్చేశారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సీబీఐ ఛేజ్ చేసి కూడా అరెైస్టు చేయలేకపోయింది. ఇప్పటి వరకూ వైఎస్ వివేకా హత్య కేసులో దోషులెవరన్నది కోర్టులు తేల్చలేదు. కేసు విచారణ జరుగుతూనే ఉ:ది. అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ సొంత మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి బహిరంగంగా అవినాష్ ను పక్కన పెట్టుకునే... పలు వాస్తవాలు వెల్లడించేశారు. ఐదేళ్ళుగా విచారణ జరుపుతున్నా సీబీఐ పరిష్కరించలేకపోయిన ఈ కేసులో నిజాలను రవీద్రనాథ్ రెడ్డి పూసగుచ్చినట్లు చెప్పేశారు.
వైఎస్ వివేకా హత్య విషయంలో ఇప్పటి వరకూ జగన్ చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి అవినాష్ రెడ్డినే వేలెత్తిచూపుతూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వారి ఆరోపణలపై వైసీపీ నేతలు స్పందించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. జగన్ సహా ఆ పార్టీ నేతలంతా కూడా వైఎస్ వివేకా హత్య.. అవినాష్ రెడ్డిపై ఆరోపణలపై స్పందిస్తూనే ఉన్నారు. అయితే వారి స్పందనలు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అన్నట్లు ఉన్నాయి. జగన్ అయితే వైఎస్ వివేకా హత్య ఎవరు చేశారో జిల్లా ప్రజలకు, దేవుడికి తెలుసునని ముక్తాయించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు అయితే షర్మిల, సునీతలపై ఎదురు దాడికి దిగారు.
కానీ జగన్ సొంత మేనమామ, కమలాపురం వైసీపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డిని పక్కన వివేకా హత్య తరువాత జరిగిన సంఘటనలను పూసగుచ్చినట్లు చెప్పారు. కడప జిల్లా, మొయిళ్ళకాల్వ వద్ద ఎన్నికల ప్రచారంలో రవీద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆరోజు వివేకా హత్య జరిగిన తర్వాత సమాచారం తెలిసి అక్కడకు అవినాష్ వెళ్లాడు, అయితే అప్పటికే గంగిరెడ్డి వైఎస్ వివేకా మృతదేహానికి కుట్లు వేయిస్తూ ఏదో చేస్తున్నాడు అని రవీంధ్రనాథ్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక అవినాష్ రెడ్డి అలా చూస్తూ ఉండిపోయాడని చెప్పారు. అలా ఉండిపోవడానికి కారణం గంగిరెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరూ ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకునేంత మంచి స్నేహితులు. దీంతో అవినాష్ రెడ్డి గంగిరెడ్డి వివేకా హత్య సాక్ష్యాలను తుడిచేస్తున్నా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయాడని, అవినాష్ చాలా అమాయకుడని చెప్పుకొచ్చారు రవీంద్రనాథ్ రెడ్డి.
రవీంద్రనాథ్ రెడ్డి ఈ మాటలు చెబుతున్నప్పుడు వేదికపై అవినాష్ రెడ్డి కూడా ఉణ్నారు. తన మాటల ద్వారా రవీంద్రనాథ్ రెడ్డి అవినాష్ ను ఎంతగా వెనకేసుకు వచ్చారో తెలియదు కానీ, సీబీఐ చార్జ్ షీట్ లో ఏం చెప్పిందో అదే జరిగిందని అంగీకరించేశారు. సీబీఐ చార్జ్ షీటులో పేర్కొన్నట్లే గంగిరెడ్డి సాక్ష్యాధారాలు నాశనం చేశాడని రవీంద్రనాధ్ రెడ్డి ఒప్పేసుకున్నారు. అంతే కాదు గంగిరెడ్డి సాక్ష్యాలను నాశనం చేస్తుంటే అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారని చెప్పారు. వివేకా హత్య కేసులో సీబీఐ కూడా అవినాష్ సమక్షంలోనే హత్య సాక్ష్యాల నాశనం జరిగిందని చార్జ్ షీట్ లో పేర్కొంది. అదే విధంగా వివేకా హత్య కేసులో వివేకా కుమార్తె సునీత, జగన్ సొంత చెల్లెలు షర్మిల చేస్తున్న ఆరోపణలను రవీంద్రనాథ్ రెడ్డి థృవీకరించేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది.