ఒడ్డున పడ్డ చేపలా చెవిరెడ్డి విలవిల?!
posted on Apr 8, 2024 @ 12:15PM
ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని పరిశీలకులు అంటున్నారు. వరుసగా రెండు సార్లు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన చెవిరెడ్డి సామర్థ్యాన్ని, బలాన్ని అతిగా అంచనా వేసిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆయనను ఈ సారి నియోజకవర్గం మార్చి ఒంగోలు లోక్ సభ స్థానంలో పోటీకి దింపారు. ఇందుకు ప్రతిగా ఆయనకు ఫ్యామిలీ ప్యాకేజీ కింద ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చారు. చెవిరెడ్డిని ఒంగోలు లోక్ సభ నియోజకవర్గానికి పంపడానికి కారణం అక్కడ మాగుంట ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న లక్ష్యమే అనడంలో సందేహం లేదు.
అయితే ఒంగోలులో చెవిరెడ్డికి పరిస్థితులు ఇసుమంతైనా సానుకూలంగా లేవు. ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం అభ్యర్థులు బలంగా దూసుకుపోతున్నారు. అక్కడ ప్రచారం సాగుతున్న తీరు చూస్తుంటే చెవిరెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ నియోజవర్గంలో లభించిన వరుస విజయాలకు స్థాన బలిమి తప్ప మరో కారణం లేదని విస్పష్టంగా తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో ఉంటంది. చంద్రగిరిలో విజయం కోసం చెవిరెడ్డి తమిళరాజకీయ సంస్కృతిని అక్కడకు దిగుమతి చేసుకున్నారు. తమిళనాడులో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పెద్ద ఎత్తున బహుమతులు గుప్పించే విధంగానే చెవిరెడ్డి కూడా గత రెండు ఎన్నికలలో చంద్రగిరి ఓటర్లను బహుమతులతో ముంచెత్తి విజయం సాధించారు.
అయితే ఆ పాచిక ఒంగోలు లోక్ సభ నియోజకవర్గంలో అంతగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. దీనికి తోడు ఆయన ఓటర్లకు పందేరం చేయడానికి పెద్ద ఎత్తున డంప్ చేసి పెట్టుకున్న సామగ్రిని ఇటీవల పోలీసులు సీజ్ చేశారు. దీంతో చెవిరెడ్డి కాళ్లూ చేతులూ కట్టేసినట్లైందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క దర్శి నియోజకవర్గంలో మాత్రమే వైసీపీకి కొద్దో గొప్పో సానుకూల వాతావరణం ఉందని అంటున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాన్ లోకల్ అంటే స్థానికేతరుడిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం తమకు కలిసి వస్తుందని వైసీపీ ఆశాభావంతో ఉంది.
ఆ నియోజకవర్గం వినా మిగిలిన ఆరు నియోజకవర్గాలలోనూ వైసీపీ అభ్యర్థులు ప్రచారం సహా అన్నిటిలోనూ వెనుకబడి ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇక దర్శిలో తెలుగుదేశం అభ్యర్థి స్థానికేతరుడు కావడం తమకు కలిసి వస్తుందని నమ్ముతున్న వైసీపీ ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి కూడా స్థానికేతరుడే అన్న విషయాన్ని ఎలా విస్మరించిందో అర్ధం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు.
దీంతో ఒంగోలులో సొంత బలం ఇసుమంతైనా లేని చెవిరెడ్డి తన విజయానికి పూర్తిగా పార్టీకి ఉన్న బలంపైనే ఆధారపడి ఉన్నారు. ఒంగోలు వైసీపీలో గ్రూపు తగాదాల కారణంగా చెవిరెడ్డికి గడ్డు పరిస్ధితులే ఎదురౌతున్నాయంటున్నారు. దీంతో స్థాన బలిమిని వదులుకుని ఒంగోలుకు వలస వచ్చిన చెవిరెడ్డి చెరువులోంచి గట్టున పడ్డ చేపలా గిలగిలలాడుతున్నారని అంటున్నారు.