బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్.. జగన్ పరువు తీసిన షర్మిల
posted on Apr 9, 2024 @ 11:14AM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ నేతల ప్రచారం పీక్ కు చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కూటమి అభ్యర్థుల విజయంకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వారి సభలకు ప్రజాదరణ భారీగా లభిస్తోంది.
మరో వైపు పలు సర్వేలు కూటమిదే అధికారమని కుండబద్దలు కొట్టేస్తున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలను సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం గూడుకట్టుకుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రూపంలో భయం వెంటాడుతోందని ఆ పార్టీ వర్గాల్లో బాహాటంగానే చర్చ జరుగుతోంది. వివేకా హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అని వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలు చెబుతున్నారు. సీబీఐ విచారణలోనూ అవినాశ్ రెడ్డి ప్రధాన నిందితుడని తేలింది. అయినా అవినాశ్ అరెస్టు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగిస్తున్నాకని షర్మిల, సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అవినాశ్ కు మరోసారి కడప ఎంపీ టికెట్ ఇవ్వడంపై జగన్ చెల్లెళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలోకి దిగారు.
వైఎస్ షర్మిల ఈనెల 5 నుంచి కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. షర్మిలకు మద్దతుగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిద్దరూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వివేకా హత్య వ్యహారాన్ని ప్రస్తావిస్తూ జగన్, అవినాశ్ రెడ్డిలను ఏకిపారేస్తున్నారు. షర్మిల దూకుడుతో కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. షర్మిల పదునైన మాటలతో జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తుండటంతో షర్మిలను నిలువరించడం ఎలా అనే ఆలోచనలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పాల్గొనే సభలను అడ్డుకొనే ప్రయత్నాలను వైసీపీ ఆరంభించింది. ఇప్పటికే వివేకా హత్యకేసు విషయంలో కడపలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడగా, ఇప్పుడు షర్మిల సభలను అడ్డుకుంటే ప్రజల్లో సానుభూతి పెరిగి మరింత ఇబ్బంది ఎదురవుతుందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, షర్మిల దూకుడుకు కళ్లెం వేయడం ఎలా అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతుంది. ఈ క్రమంలోనే జగన్ వ్యూహాత్మకంగా షర్మిల సభలకు కొందరు వైసీపీ ద్వితీయ స్థాయి నేతలను పంపిస్తున్నారు. వారు షర్మిల మాట్లాడే సమయంలో జై జగన్, జైజై జగన్ అనే నినాదాలు చేస్తూ సభలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తేలా చేస్తున్నారు. దానిని తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో షర్మిల సభల్లో జై జగన్ నినాదాలు వినిపిస్తున్నాయి, షర్మిలకు కడప ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నదంటూ ప్రచారం చేసుకోవాలని ప్లాన్ చేశారు.
అయితే జగన్, వైసీపీ నేతల చిల్లర చేష్టలను పసిగట్టిన వైఎస్ షర్మిల వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. సోమవారం(ఏప్రిల్ 8) కడప జిల్లా దువ్వూరులో షర్మిల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతుండగా జై జగన్ అంటూ వైసీపీ కార్యకర్తలు కొందరు నినాదాలు చేశారు. వైసీపీ నేతల కుట్రలను ముందుగానే పసిగట్టిన షర్మిల వైసీపీ కార్యకర్తలను మాట్లాడేందుకు ఆహ్వానించారు. దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి.. మీ జగనన్న ప్రజలకు ఏం చేశారో చెప్పండి చూద్దాం అంటూ సూచించారు. వైసీపీ నేత షర్మిల వద్దకు వచ్చి మైక్ అందుకొని జగన్ గురించి మాట్లాడాడు. ఆయన ప్రసంగంలో జగన్ ఏం అభివృద్ధి చేశాడో చెప్పకుండా.. కేవలం జగనన్న అంటేమాకు అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం షర్మిల మైక్ అందుకొని.. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒకప్పుడు నేను జై జగన్ అన్నా.. ఆయన జైలుకెళ్తే 3,200 కిలో మీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తారని అనుకున్నా.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సొంత బాబాయ్ హత్యకు కారుకులను పక్కన పెట్టుకొని ఎంపీ టికెట్ ఇచ్చాడు.. అసలు జగన్ వైఎస్ వారసుడే కాదు, అసలైన వైఎస్ వారసురాలిని నేనే అంటూ వైసీపీ నేతలకు దిమ్మతిరిగే షాకిచ్చారు షర్మిల.
రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి బలం ఎక్కువ. ఆ ప్రాంతంలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో వైసీపీ హవా కొనసాగింది. కానీ, ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. కూటమి బలపడటంతోపాటు వైఎస్ షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వివేకా హత్యకేసులో నిందితుడుగా దర్యాప్తు సంస్థలు పేర్కొన్న అవినాశ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంపై షర్మిలతో పాటు ఉమ్మడి కడప జిల్లాలోని అధిక శాతం మంది ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తవుతుంది. షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తుండటంతో పాటు, అసలైన వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు తానేనని ఆమె ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలుగుతున్నారు. ఒక పక్క కూటమి దెబ్బతోపాటు షర్మిల ఎఫెక్ట్ కూడా రాయలసీమ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి ఉందని జగన్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీంతో వైఎస్ షర్మిల దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనలో వైసీపీ పెద్దలు తలమునకలవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ షర్మిల దూకుడుతో ఉమ్మడి కడప జిల్లాలోని వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.