బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి.. ఆగని వలసల ప్రవాహం!
posted on Apr 8, 2024 @ 2:41PM
లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔనేమో అనిపించక మానదు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ కష్టపడి అతి ప్రయత్నం మీద ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి చేసిన పని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎవరి ప్రమేయం లేకుండా చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విపక్షం అయిన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు ఇతర పార్టీలలోకి దూకేస్తున్నారంటే పార్టీ నాయకత్వంపై వారి విశ్వాసం ఎంత సన్నిగిల్లిందో అర్ధం చేసుకోవచ్చు. అధికారం ఉన్న పార్టీలో ఉంటేనే మనుగడ అన్న అభిప్రాయాన్ని తెలంగాణ రాజకీయాలలో కలిగించిన పార్టీ బీఆర్ఎస్. ఇప్పుడు ఆ పార్టీ అధికారం మారగానే ఆ పార్టీ నేతలూ జంపింగ్ ల బాట పట్టారు. ఈ వలసలు ఇప్పటిలో అగేలా కనిపించడం లేదు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ ఖాళీ అయిపోయినట్లే. ఎందుకంటే భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే వెంకట్రావు. భద్రాచలం వినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు.
ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్‌మోహన్, పట్నం సునీతా మహేందర్‌రెడ్డి వంటి పలువురు నేతలు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన సంగతి తెలిసిందే. ఇలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి మరో పాతిక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
అంటే రానున్న రోజులలో అసెంబ్లీలో బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ అనే మాటే వినిపించే అవకాశం ఉండదు. బీఆర్ఎస్ఎల్పీ నేతను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో విఫలమైనందునే కేసీఆర్ గత్యంతరం లేక ఆ పదవిని స్వీకరించారని పార్టీ శ్రేణులే అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి వలసలు ఇలాగే కొనసాగితే.. రానున్న రోజులలో కేసీఆర్ బీఆర్ఎస్పీ నేతగా కూడా మిగిలే అవకాశం ఉండదని అంటున్నారు.