వాలంటీర్లకు జగన్ షాక్.. బాబు భరోసా!
posted on Apr 10, 2024 @ 9:56AM
వాలంటీర్లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి షాకిస్తే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ.. వారి సేవలను తప్పుడు పద్దతుల్లో వినియోగించుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. వాలంటీర్ల సహాయంతో ప్రజల వ్యక్తిగత డేటా సేకరిచడంతోపాటు, వారిని వైసీపీ కార్యకర్తలుగా జగన్ మార్చేశారు. ఎన్నికల సమయంలోనూ వారిని పార్టీ ప్రచారానికి ఉపయోగించుకొని లబ్ధిపొందాలని జగన్ కుట్ర చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ కుట్రలకు చెక్ పెట్టింది. వాలంటీర్ల సేవలను ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయంతో షాక్ కు గురైన వైసీపీ అధిష్టానం.. కొత్త కుట్రకు తెరలేపింది. వాలంటీర్లందరినీ రాజీనామా చేయించి పార్టీ ప్రచారంలో వాడుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నం చేశారు. కొందరు వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేయగా.. మెజార్టీ వాలంటీర్లు ఇదంతా వైసీపీ కుట్రలో భాగమని గుర్తించి రాజీనామాకు ససేమిరా అన్నారు. అయితే రాజీనామా చేయని వారిని మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్న బెదిరింపులకు వైసీపీ నేతలు దిగారు. దీంతో ఆందోళనలో ఉన్న వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. దీంతో వాలంటీర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పెద్దచర్చే జరుగుతుంది. ఇటీవల ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ కి దూరంగా ఉంచాలని ఆదేశించింది. వారికి ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ లు, సెల్ ఫోన్లు వెనక్కు తీసుకుంది. ఇతర మార్గాల ద్వారా వృద్ధులకు ఇంటివద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో వైసీపీ తప్పుడు ప్రచారంతో లబ్ధిపొందాలని చూసింది. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి పెన్షన్ల పంపిణీని అడ్డుకుందని తప్పుడు ప్రచారం చేసింది. వృద్ధులకు, నడవలేని వారికి ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినా.. ఆ ఆదేశాలను అధికారులు పక్కన పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారాన్నిచేశారు. దీనికితోడు.. చంద్రబాబు ఫిర్యాదుతోనే సచివాలయం వద్దనే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించిందంటూ వృద్ధులను మండుటెండలో మంచాలపై పెన్షన్ కోసం తీసుకెళ్లి, ఆ ఫొటోలను సోషల్ మీడియా, వైసీపీ అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. తద్వారా కూటమి అధికారంలోకి వస్తే వృద్ధులు, పెన్షన్ దారులకు ఇబ్బందులు తప్పవని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారం వల్ల పెన్షన్ కోసం మండుటెండ్లలో వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు మరణించారు. ఒకపక్క ఎన్నికల సంఘం వృద్ధులకు, నడవలేని వారికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఆదేశిలిచ్చినా, తప్పుడు ప్రచారంలో వైసీపీ లబ్ధిపొందాలని చూసింది. వైసీపీ కుట్రలు ప్రజలకు అర్ధంకావటంతో మొదటికే మోసం వస్తుందని భావించి వైసీపీ ఆ డ్రామాకు స్వస్తి చెప్పింది.
వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి తప్పుడు పనులకుకూడా ఉపయోగించుకుంది. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంతోపాటు, పెన్షన్ దారులుపై వైసీపీకే ఓటు వేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో వైసీపీ సానుభూతి పరులకు మాత్రమే పెన్షన్లు ఇస్తూ తెలుగుదేశం, జనసేన సానుభూతి పరులకు పెన్షన్లు రాకుండా ఇబ్బందులు పాలుచేశారు. ఆది నుంచి వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తల్లా ముద్రపడిపోయారు. దీంతో టీడీపీ, జనసేన పార్టీలు వాలంటీర్ల వ్యవస్థను తప్పుబడుతూ వచ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో వాలంటీర్లు రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామా చేయని వాలంటీర్లను మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా పక్కన పెట్టేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు రూ. 10వేలు వేతనం ఇస్తామని ఉగాది రోజున శుభవార్త చెప్పారు. వాలంటీర్లను మంచి పనులకు ఉపయోగిస్తామని, పార్టీ కార్యకర్తల్లా చూడబోమని, ప్రజలకు సేవచేసే వాలంటీర్లకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వైసీపీని మరోసారి గెలిపించుకుంటేనే వాలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతం రూ.10వేలకు పెంచుతామని చెప్పడం పట్ల వాలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజంలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు హామీతో మెజార్టీ శాతం వాలంటీర్లు ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు వైసీపీ నేతల పెత్తనంతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని, చంద్రబాబు హామీతో కూటమి అభ్యర్థుల విజయానికి తాము కృషిచేస్తామని పలువురు వాలంటీర్లు బహిరంగాంగా చెబుతున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లను అడ్డుపెట్టుకొని మళ్లీ అధికారంలోకి రావాలని భావించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు తనదైన శైలిలో గట్టి షాకిచ్చినట్లయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన హామీతో వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక విజయంపై తమలో దింపుడు కళ్లెం ఆశ కూడా మిగలలేదని పలువురు వైసీపీ అభ్యర్థులు ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.