వల్లభనేని వంశీకి చావో రేవో!?
posted on Apr 8, 2024 @ 11:38AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడకు ఆనుకుని ఉండే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై అత్యంత కీలకమైనది. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచీ ఇక్కడ నుంచి పలువురు ప్రభావమంతమైన నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం వంటి దిగ్గజాలను చట్ట సభకు పంపిన నియోజకవర్గం ఇది. గన్నవరం నియోజకవర్గం నుంచి పుచ్చల పల్లి సుందరయ్య మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికైనా 2009 నుంచి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేం పార్టీకి కంచుకోటగా మారింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే రెండో సారి విజయం సాధించిన తరువాత వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో కొద్ది కాలం పాటు తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. అయితే గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం గూటికి చేరి రానున్న ఎన్నికలలో వంశీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో యార్లగడ్డకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడిన తరువాత వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో ప్రతికూలత పెరిగింది.
ముఖ్యంగా వైసీపీ గూటికి చేరిన వంశీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయనకు స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు వైసీపీలో కూడా వంశీకి వ్యతిరేకంగా పలువురు గ్రూపు కట్టడంతో ఆ పార్టీలో కూడా ఆయన మాటకు చెల్లుబాటు లేకుండా పోయింది. ఒక దశలో రాజకీయ సన్యాసం అంటూ సెంటిమెంట్ రగల్చడానికి ప్రయత్నించిన వంశీ చివరకు గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయినా ఆయనకు వైసీపీ శ్రేణుల నుంచి సంపూర్ణ మద్దతు అయితే లభించడం లేదు. ఇందుకు విరుద్ధంగా గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు వెంట తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఏకతాటిపై నిలబడింది. తెలుగుదేశం నుంచి విజయం సాధించి వైసీపీలోకి జంప్ చేసిన వంశీని నియోజకవర్గంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గం ఆయనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. తాను చంద్రబాబు, ఆయన కుటుంబీకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వంశీ బహిరంగంగా క్షమాపణలు చెప్పినా ఫలితం లేకపోయింది. మరోవైపు యార్లగడ్డకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచీ మద్దతు కనిపిస్తోంది. మొత్తం మీద వల్లభనేని వంశీకి ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.