హోంమంత్రి కి అరెస్ట్ భయం!
posted on Apr 9, 2013 @ 11:45AM
జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు మోపుతూ సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపధ్యంలో హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. తన రాజీనామా విషయాన్ని సీఎం కు తెలిజేయగా, తొందరపడి రాజీనామా చేయవద్దని, మంత్రి ధర్మానపై కూడా సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఆయన కేసు కోర్టులో నడుస్తోంది గనుక, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొందామని చెప్పినట్లు వార్త వచ్చింది. ఇప్పటికే ధర్మానపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం, కోర్టులో కేసు నడుస్తుండటం తమ ప్రభుత్వానికి ప్రతికూలాంశమని ముఖ్యమంత్రి భావించకపోగా, దానినే ఆధారం చేసుకొని ఇప్పుడు సబితాఇంద్రారెడ్డిని కూడా వెనకేసుకురావడానికి ఉపయోగించుకోవడం మన రాజకీయ వ్యవస్థలో వచ్చిన పరిణతికి అద్దం పడుతోంది.
ఏది ఏమయినప్పటికీ, రాష్ట్రంలో నేరాలు అరికట్టవలసిన హోం మంత్రిపైనే నేరారోపణ జరిగినప్పుడు, పదవిలో కొనసాగేందుకు మార్గాలు వెతుకుతూ, ప్రజలకు ప్రతిపక్షాలకు సంజాయిషీలు ఇచ్చుకొంటూ అవమానకర పరిస్థితులు ఎదుర్కొనేబదులు ఆమె స్వయంగా రాజీనామా చేసి ఉండి ఉంటె బాగుండేది. కానీ, ఆవిధంగా చేస్తే హోంమంత్రిగా ఆమెకిప్పుడున్న రక్షణ కవచం తొలగిపోతుంది గనుక, మరుక్షణం సీబీఐ ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది గనుక ఆమె రాజీనామా చేయకపోవచ్చును.
ఆమె రాజీనామా చేయకుండా మరికొంత కాలం తనని తానూ కాపాడుకోవచ్చునేమో గానీ, ఒకసారి సీబీఐ చార్జ్ షీటులో పేరు కూడా ఎక్కిన తరువాత ఎంతో కాలం కాపాడుకోలేక పోవచ్చును. కనీసం కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇక ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీకి కక్కలేని మింగలేని పరిస్థితి సృష్టించిందని చెప్పవచ్చును.